
Will Smith Old Video: సోమవారం ఆస్కార్ అవార్డుల వేడుక ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. మామూలుగా అయితే ఫలానా సినిమాకి అవార్డు రావాల్సిందనో, ఫలానా స్టార్‌కి ఆస్కార్ రాకపోవడం అన్యాయమనో, ఫంక్షన్ బాగా జరిగిందనో... ఇలాంటి చర్చలు జరుగుతాయి. కానీ అలోపేసియా వ్యాధి కారణంగా జుత్తు కోల్పోయిన విల్ స్మిత్ భార్య జడా పింకెట్‌ను ఉద్దేశించి వ్యాఖ్యాత క్రిస్ రాక్ వేసిన జోక్ గురించి, విల్ స్మిత్ అతడి చెంప చెళ్లుమనిపించిన ఘటన గురించీ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దాదాపు 30 ఏళ్ల క్రితం అలోపేసియాతో బాధపడుతున్న జాన్ విల్లియమ్స్ బట్టతలపై ‘ది అర్సెనియా హాల్ షో’లో విల్ స్మిత్ వేసిన జోక్‌కి సంబంధించిన వీడియో అది. ‘అతనికో రూల్ ఉంది. అదేంటంటే అతను ప్రతి రోజూ తన తలను వ్యాక్స్ (కవర్ చేయాలనేది ఉద్దేశం) చేయాల్సిందే. అదే రూల్’ అంటూ జోక్ చేసి, ‘ఇది జస్ట్ జోక్’ అని కూడా అన్నాడు విల్ స్మిత్. ఆ వీడియోను ఇప్పుడు ఎవరో బయటపెట్టారు. మరి.. ఇప్పుడు క్రిస్ చేసింది కూడా జోక్‌లో భాగమే కదా అంటున్నారు నెటిజన్లు. ‘క్రిస్ చేస్తే తప్పు... నువ్వు చేస్తే ఒప్పా?’ అంటూ విల్ స్మిత్‌ని విమర్శిస్తున్నారు.
15 రోజుల్లోపు విల్ వివరణ ఇవ్వాలి
క్రిస్‌పై విల్ దాడి పట్ల ఆస్కార్ కమిటీ చాలా ఆగ్రహంగా ఉంది. అదే వేదిక సాక్షిగా కమిటీకి, వీక్షకులకు క్షమాపణలు చెప్పాడు విల్. అయితే క్రిస్‌కి చెప్పలేదు. కానీ మరుసటి రోజు ఇన్‌స్టాగ్రామ్ వేదికగా క్రిస్‌కి క్షమాపణలు చెప్పాడు విల్. తన భార్యపై జోకులు వేయడంతో ఆగ్రహం పట్టలేకే అలా చేశానని కూడా అన్నాడు. ఏది ఏమైనా ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డు వేడుకల్లో విల్ ఇలా దాడి చేయడంపై ఆస్కార్ కమిటీ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలనుకుంటోంది.
ఈ విషయంపై చర్చించడానికి కమిటీ సభ్యులు సమావేశం అయ్యారు కూడా. క్రిస్ పై దాడి చేశాక విల్ స్మిత్‌ని వేడుక నుంచి వెళ్లిపోవాల్సిందిగా కోరినా అతను వెళ్లకపోవడంపై కూడా కమిటీ తీవ్ర ఆగ్రహంగా ఉందట. అందుకే తన ప్రవర్తనపై విల్ 15 రోజుల్లోగా వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించిందట. అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయంపై ఏప్రిల్ 18న కమిటీ మరోసారి సమావేశం కానుందని సమాచారం.
“He gotta wax his head every morning.” Now this is a video of Will Smith saying a joke about someone with Alopecia.
— Peter O.K.H (@Peter_OKH) March 28, 2022
One reason I love the internet, it never forgets. pic.twitter.com/4OGlgSrcjA