ఆస్కార్‌ సంబరం ఆరంభం | Oscar nominations 2025: full list of nominees for 97th Academy Awards | Sakshi
Sakshi News home page

ఆస్కార్‌ సంబరం ఆరంభం

Published Fri, Jan 24 2025 3:17 AM | Last Updated on Fri, Jan 24 2025 3:17 AM

Oscar nominations 2025: full list of nominees for 97th Academy Awards

97వ ఆస్కార్‌ అవార్డ్‌ నామినేషన్స్‌ ప్రకటన

13 నామినేషన్లతో నాన్‌ ఇంగ్లిష్‌ మూవీ ‘ఎమిలియా పెరెజ్‌’ రికార్డ్‌ 

‘ది బ్రూటలిస్ట్, విక్డ్‌’ చిత్రాలకు 10 నామినేషన్స్‌  

ట్రాన్స్‌జెండర్‌కి దక్కిన తొలి నామినేషన్‌ 

ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌కి నామినేషన్‌

97వ ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం ఈ ఏడాది మార్చి 2న లాస్‌ ఏంజిల్స్‌లోని డాల్బీ థియేటర్‌లో ఘనంగా జరగనుంది. కాగా ఈ అవార్డులకు సంబంధించిన నామినేషన్లను గురువారం రాత్రి (భారతీయ కాలమానం ప్రకారం) ప్రకటించారు. అమెరికన్‌ నటుడు బోవెన్‌ యాంగ్, నటి రాచెల్‌ సెన్నాట్‌లు వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. అయితే ఈ నామినేషన్ల ప్రకటన ఈ నెల 17న జరగాల్సింది. కానీ అమెరికాలో చెలరేగిన కార్చిచ్చు కారణంగా 19కి వాయిదా వేశారు. ఫైనల్‌గా 23న ప్రకటించారు.

రికార్డ్‌ సాధించిన స్పానిష్‌ మ్యూజికల్‌ థ్రిల్లర్‌
ఈసారి స్పానిష్‌ మ్యూజికల్‌ థ్రిల్లర్‌ మూవీ ‘ఎమిలియా పెరెజ్‌’ నాన్‌–ఇంగ్లిష్‌ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని రికార్డ్‌ సాధించింది. గతంలో చైనా మూవీ ‘క్రౌచింగ్‌ టైగర్‌ హిడెన్‌ డ్రాగన్‌’, మెక్సికన్‌–అమెరికన్‌ డ్రామా ‘రోమా’... ఈ రెండు చిత్రాలు నాన్‌–ఇంగ్లిష్‌ విభాగంలో పది నామినేషన్లు దక్కించుకున్నాయి. ఇప్పుడు 13 నామినేషన్లతో ‘ఎమిలియా పెరెజ్‌’ వాటిని అధిగమించింది. అలాగే ఈ చిత్రంలో ఓ లీడ్‌ రోల్‌లో నటించిన స్పానిష్‌ నటి కార్లా సోఫియా గాస్కాన్‌ (బెస్ట్‌ యాక్ట్రస్‌ లీడ్‌ రోల్‌ నామినేషన్‌) చరిత్ర సృష్టించారు. ఆస్కార్‌ అవార్డుకు నామినేట్‌ అయిన తొలి ట్రాన్స్‌జెండర్‌ నటిగా నిలిచారామె. ఇంకా ‘ది బ్రూటలిస్ట్, విక్డ్‌’ చిత్రాలకు పది నామినేషన్ల చొప్పున దక్కాయి. అంతగా అంచనాలు లేని ‘కాన్‌క్లేవ్‌’ మూవీకి 8 నామినేషన్లు దక్కడం ఓ విశేషం.

ఒక్క నామినేషన్‌ తేడాతో... నాన్‌ ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ విభాగంలో 13 నామినేషన్లు దక్కించుకుని, రికార్డు సాధించిన ‘ఎమిలియా పెరెజా’కి ఇంకో నామినేషన్‌ దక్కి ఉంటే... ఇంగ్లిష్‌ ఫిల్మ్‌ల రికార్డుని కూడా అధిగమించి ఉండేది. ‘టైటానిక్, ఆన్‌ అబౌట్‌ ఈవ్, లా లా ల్యాండ్‌’ వంటి ఇంగ్లిష్‌ చిత్రాలు 14 నామినేషన్లు దక్కించుకున్నాయి.

తల్లి హిస్టరీ రిపీట్‌: ‘ఐయామ్‌ స్టిల్‌ హియర్‌’ చిత్రానికి గాను ఫెర్నాండా టోర్రెస్‌ ఉత్తమ నటి విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్నారు. ఇందులో విశేషం ఏంటంటే... ఆమె తల్లి ఫెర్నాండా మోంటెనెగ్రో 1991లో ‘సెంట్రల్‌ స్టేషన్‌’ చిత్రానికి గాను ఉత్తమ నటి విభాగంలో నామినేషన్‌ దక్కించుకున్న తొలి బ్రెజిలియన్‌ నటిగా రికార్డుని సాధించారు. ఇప్పుడు ఇన్నేళ్లకు మలి బ్రెజిలియన్‌ నటిగా టోర్రెస్‌ నామినేషన్‌ దక్కించుకుని తల్లి హిస్టరీని రిపీట్‌ చేశారు.  

బరిలో ఇండియన్‌ షార్ట్‌ ఫిల్మ్‌: ఆడమ్‌ జే గ్రేవ్స్‌ దర్శకత్వం వహించిన ‘అనూజ’ బెస్ట్‌ షార్ట్‌ ఫిల్మ్‌ (లైవ్‌ యాక్షన్‌) విభాగంలో నామినేషన్‌ దక్కించుకుంది. ఆల్రెడీ రెండు ఆస్కార్‌ అవార్డులు సాధించిన భారతీయ నిర్మాత గునీత్‌ మోంగా ఈ చిత్రానికి ఓ నిర్మాత కావడం విశేషం. అలాగే నటి ప్రియాంకా చోప్రా ఓ ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతగా వ్యవహరించారు. ఢిల్లీలోని ఓ గార్మెంట్‌ ఫ్యాక్టరీలో పని చేసే తొమ్మిదేళ్ల అనూజ స్కూల్‌కు వెళ్లాలనుకుంటుంది. ఆ నిర్ణయం ఆమె జీవితాన్ని, అనూజ సోదరి పాలక్‌ భవిష్యత్‌ను ఏ విధంగా ప్రభావితం చేసింది? అనే కోణంలో ఈ చిత్రం సాగుతుంది.

అనూజగా సజ్దా పఠాన్, పాలక్‌గా అనన్య షాన్‌భాగ్‌ నటించారు. ఇదిలా ఉంటే... గునీత్‌ మోంగా ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘ది ఎలిఫెంట్‌ విస్పరర్స్‌’కి గాను బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో 2023లో ఆస్కార్‌ దక్కింది. అంతకుముందు 2021లో గునీత్‌ ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన ‘పీరియడ్‌: ఎండ్‌ ఆఫ్‌ సెంటెన్స్‌’కిగాను బెస్ట్‌ డాక్యుమెంటరీ షార్ట్‌ ఫిల్మ్‌ విభాగంలో అవార్డు దక్కింది. ఇప్పుడు ఆమె ఓ నిర్మాతగా వ్యవహరించిన ‘అనూజ’కు కూడా ఆస్కార్‌ దక్కుతుందా? అనేది చూడాలి. 

భారతీయ సినిమాకి నిరాశ
ఆస్కార్‌ అవార్డ్స్‌ రిమైండర్‌ లిస్ట్‌లో నిలిచిన భారతీయ చిత్రాలు ‘కంగువ, ఆడు జీవితం (‘ది గోట్‌లైఫ్‌), సంతోష్, స్వతంత్రవీర్‌ సవార్కర్, ఆల్‌ ఉయ్‌ ఇమాజిన్‌ యాజ్‌ ఏ లైట్, గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్, పుతల్‌’ ఆస్కార్‌ నామినేషన్‌ను దక్కించుకోలేకపోయాయి. అలాగే ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేషన్‌ కోసం ఈ ఏడాది ఫిల్మ్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా పంపిన హిందీ చిత్రం ‘లాపతా లేడీస్‌’ ఆస్కార్‌ షార్ట్‌ లిస్ట్‌లోనూ చోటు దక్కించుకోలేకపోయిన విషయం తెలిసిందే.  ఇలా ఈసారి భారతీయ సినిమాకి నిరాశ ఎదురైంది.

ఉత్తమ చిత్రం: అనోరా, ది బ్రూటలిస్ట్, ఎ కంప్లీట్‌ అన్ నోన్ , కాన్ క్లేవ్, డ్యూన్ : పార్ట్‌ 2, ఎమిలియా పెరెజ్, ఐయామ్‌ స్టిల్‌ హియర్, నికెల్‌ బాయ్స్, ది సబ్‌స్టాన్స్, విక్డ్‌ 

ఉత్తమ దర్శకుడు: సీన్  బేకర్‌ (అనోరా), బ్రాడీ కార్బెట్‌ (ది బ్రూటలిస్ట్‌), జేమ్స్‌ మ్యాన్ గోల్డ్‌ (ది కంప్లీట్‌ అన్ నోన్ ), జాక్వెస్‌ ఆడియార్డ్‌ (ఎమిలియా పెరెజ్‌), కోరలీ ఫార్గేట్‌ (ది సబ్‌స్టాన్స్) 

ఉత్తమ నటుడు: అడ్రియాన్  బ్రాడీ (ది బ్రూటలిస్ట్‌), తిమోతీ చాలమెట్‌ (ది కంప్లీట్‌ అన్ నోన్ ), కోల్‌మెన్  డొమినింగో (సింగ్‌సింగ్‌), రే ఫియన్నెస్‌ (కాన్ క్లేవ్‌), సెబస్టియన్  స్టాన్  (ది అప్రెంటిస్‌) 

ఉత్తమ నటి: సింథియా ఎరివో (విక్డ్‌), కార్లా సోఫియా గాస్కన్  (ఎమిలియా పెరెజ్‌), మికే మాడిసన్  (అనోరా), డెమి మూర్‌  (ది సబ్‌స్టాన్స్), ఫెర్నాండా టోర్రెస్‌ (ఐ యామ్‌ స్టిల్‌ హియర్‌)

ఉత్తమ సహాయ నటుడు: యురా బోరిసోవ్‌ (అనోరా), కిరెన్  కల్కిన్  (ది రియల్‌ పెయిన్ ), ఎడ్వర్డ్‌ నార్తన్  (ది కంప్లీట్‌ అన్ నోన్ ), గాయ్‌ పియర్స్‌ (ది బ్రూటలిస్ట్‌),  జెరీమీ స్ట్రాంగ్‌ (ది అప్రెంటిస్‌) 

ఉత్తమ సహాయ నటి: మోనికా బార్బరో (ది కంప్లీట్‌ అన్ నోన్ ), అరియానా గ్రాండే (విక్డ్‌), ఫెసిలిటీ జోన్స్ (ది బ్రూటలిస్ట్‌), ఇసబెల్లా రోస్సెల్లిని (కాన్ క్లేవ్‌), జోయా సాల్దానా (ఎమిలియా పెరెజ్‌).

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement