బీజేపీ నేత ఎస్.వి.శేఖర్( ఫైల్ ఫోటో)
సాక్షి, చెన్నై: మహిళా జర్నలిస్టు పట్ల తమిళనాడు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ అనుచిత చర్య వివాదం ఇంకా ముగియకుండానే రాష్ట్రానికి చెందిన నటుడు, బీజేపీ నేత ఎస్వీ శేఖర్ (సత్తనాతపురం వరదరాజ శేఖర్) చిక్కుల్లో పడ్డారు. మహిళా పాత్రికేయులపై అసభ్య పదజాలంతో, అనుచిత వ్యాఖ్యలతో చెలరేగిపోయిన ఓ బీజేపీ అభిమాని ఫేస్‌బుక్ పోస్ట్‌ను షేర్ చేసి మరో వివాదానికి తెర తీశారు.
‘మదురై యూనివర్సిటీ, గవర్నర్ అండ్ ది వర్జిన్ చీక్స్ ఆఫ్ ఎ గర్ల్’ అనే పేరుతో తిరుమలై.ఎస్ అనే ఫేస్‌బుక్ యూజర్ ఈ పోస్ట్ పెట్టాడు. మహిళా జర‍్నలిస్టులపై చాలా అవమానకరమైన పదజాలంతో విరుచుకుపడిన ఫేస్‌బుక్ పోస్ట్‌ను బీజేపీ నేత షేర్ చేశారు. విశ్వవిద్యాలయాల కన్నా ఎక్కువ లైంగిక వేధింపులు మీడియా సంస్థల్లో ఉన్నాయని ఆ పోస్ట్‌లో ఆరోపించాడు. అంతేకాదు మీడియా పెద్దలతో పడుకోకుండా..ఏ మహిళ రిపోర్టర్ లేదా న్యూస్ రీడర్ కాలేదంటూ రెచ్చిపోయాడు. దీంతోపాటు తమిళనాడు మొత్తం మీడియాపై కూడా తన అక్కసును వెళ్లగక్కాడు. మీడియా మొత్తం నేరస్థులు, రాస్కల్స్, బ్లాక్‌మెయిలర్ల చేతిలో చిక్కి తిరోగమన మార్గంలో ఉందని వ్యాఖ్యానించాడు.
అయితే ఈ వివాదంపై స్పందించిన శేఖర్ తానా పోస్ట్‌ను పూర్తిగా చదవకుండానే పోస్ట్ చేశాననీ, ఎవర్నీ కించపరిచే ఉద్దేశం తనకు లేదంటూ శేఖర్ వివరణ ఇచ్చుకున్నారు. అమెరికాకు వెళ్ళినప్పుడు మోదీ అభిమానిగా తిరుమలై తనకు పరిచయమయ్యాడని చెప్పారు. ఇపుడు ఆ పోస్ట్‌ను తొలగించాలనుకున్నా.. ఫేస్‌బుక్ బ్లాక్ చేయడంతో అది సాధ్యం కావడంలేదని చెప్పొకొచ్చారు. (ప్రస్తుతం ఈ పోస్ట్ డిలీట్ అయింది) కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. కాగా బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్ రాజా పాత్రికేయులపై ఇటీవల చేసిన అనుచిత వ్యాఖ్యలు, తాజాగా శేఖర్ చర్యకు నిరసనగా మహిళా జర్నలిస్టులు, ఇతర మీడియా ప్రముఖులు చెన్నైలోని బీజీపీ కార్యాలయం ముందు నిరసనకు దిగనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment