భద్రత నడుమ కోర్టుకు ఎస్వీ శేఖర్
సాక్షి, చెన్నై : మహిళా జర్నలిస్టుల్ని కించపరిచిన కేసులో గట్టి భద్రత నడుమ సినీ నటుడు, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్ బుధవారం ఎగ్మూర్ కోర్టుకు హాజరు అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. మహిళా జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించిన ఎస్వీశేఖర్ మీద నాలుగు రకాల సెక్షన్లతో కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేసులు పెట్టి రెండు నెలలు అయినా, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిరాకరించడంతో డైలమాలో పడ్డారు. శేఖర్ అరెస్టుకు సర్వత్రా డిమాండ్ చేస్తూ వచ్చినా, ఆందోళనలు సాగినా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ బంధువు కావడంతోనే అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఎస్వీ శేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొంటూ వస్తున్నా, రెండురోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆయన భేటీ కావడం, మంత్రులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార అండదండలతో దర్జాగా తిరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 20వ తేదీలోపు హాజరు కావాల్సిందేనని ఎగ్మూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కన్నెర్ర చేయడంతో మెట్లు ఎక్కేందుకు బుధవారం ఉదయాన్నే ఎస్వీ శేఖర్ సిద్ధం అయ్యారు.
బెయిల్ మంజూరు
పది గంటల సమయంలో మైలాపూర్‌లోని ఇంటి నుంచి పోలీసు భద్రత నడుమ శేఖర్ ఎగ్మూర్ కోర్టుకు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏదేని ఆందోళనలు సాగవచ్చన్న సమాచారంతో పోలీసులు మరీ హడావుడి సృష్టించారు. కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. పోలీసుల హడావుడి అక్కడి న్యాయవాదుల్లో సైతం ఆగ్రహాన్ని తెప్పించాయి. శేఖర్ అక్కడికి వచ్చిన సమయంలో ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పలువురు న్యాయవాదులు నినాదాల్ని హోరెత్తించడం గమనార్హం. దీంతో శేఖర్ ముందు గేటు నుంచి కాకుండా వెనుక ఉన్న మరో గేటు ద్వారా భద్రత వలయం నడుమ కోర్టులోకి వెళ్లారు. పదిన్నర గంటలకు న్యాయమూర్తి సమక్షంలో హాజరయ్యారు. విచారణ తదుపరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అదే భద్రత నడుమ ఇంటి బాట పట్టారు.
Comments
Please login to add a commentAdd a comment