Protection Force
-
బచ్చన్ భవంతులకు భద్రత పెంపు
ముంబై: బాలీవుడ్ దిగ్గజం అమితాబ్ బచ్చన్, ఆయన భార్య, సమాజ్‌వాదీ ఎంపీ జయాబచ్చన్‌కు ముంబైలో ఉన్న బంగళాలకు పోలీసుల రక్షణ పెంచారు. సినీ పరిశ్రమపై బురద చల్లవద్దంటూ జయాబచ్చన్ పార్లమెంట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే. తన ప్రసంగంలో కంగన, రవికిషన్ను జయాబచ్చన్ పరోక్షంగా విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అమితాబ్ ఎక్స్ కేటగిరీ భద్రత పొందుతున్నారని, జయాబచ్చన్ ప్రసంగానంతరం జుహులో వారి భవంతుల బయట భద్రతను, పెట్రోలింగ్‌ను పెంచామని పోలీసు అధికారులు చెప్పారు. జుహులో బచ్చన్ కుటుంబానికి జల్సా, జనక్, ప్రతీక్ష పేరిట మూడు బంగ్లాలున్నాయి. వీటిలో జల్సా, ప్రతీక్షల్లో అమితాబ్ కుటుంబం నివశిస్తోంది. -
కోర్టుకు శేఖర్
సాక్షి, చెన్నై : మహిళా జర్నలిస్టుల్ని కించపరిచిన కేసులో గట్టి భద్రత నడుమ సినీ నటుడు, బీజేపీ నాయకుడు ఎస్వీ శేఖర్ బుధవారం ఎగ్మూర్ కోర్టుకు హాజరు అయ్యారు. కట్టుదిట్టమైన భద్రత నడుమ ఆయన్ను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. మహిళా జర్నలిస్టులను కించపరిచే విధంగా వ్యవహరించిన ఎస్వీశేఖర్ మీద నాలుగు రకాల సెక్షన్లతో కేసులు నమోదుచేసిన విషయం తెలిసిందే. కేసులు పెట్టి రెండు నెలలు అయినా, ఆయన మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ముందస్తు బెయిల్ కోసం ఆయన కోర్టును ఆశ్రయించారు. కోర్టు నిరాకరించడంతో డైలమాలో పడ్డారు. శేఖర్ అరెస్టుకు సర్వత్రా డిమాండ్ చేస్తూ వచ్చినా, ఆందోళనలు సాగినా పోలీసులు ఏ మాత్రం ఖాతరు చేయడం లేదు. ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ బంధువు కావడంతోనే అరెస్టు చేయడం లేదన్న ఆరోపణలు, విమర్శలు ఉన్నాయి. అదే సమయంలో వ్యవహారం కోర్టుకు సైతం చేరింది. ఎస్వీ శేఖర్ అజ్ఞాతంలో ఉన్నట్టుగా పోలీసులు పేర్కొంటూ వస్తున్నా, రెండురోజుల క్రితం కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్‌తో ఆయన భేటీ కావడం, మంత్రులు, ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటూ, అధికార అండదండలతో దర్జాగా తిరుగుతున్నా, పోలీసులు పట్టించుకోకపోవడంపై కోర్టు సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. 20వ తేదీలోపు హాజరు కావాల్సిందేనని ఎగ్మూర్ కోర్టు ఆదేశాలు జారీచేసింది. కోర్టు కన్నెర్ర చేయడంతో మెట్లు ఎక్కేందుకు బుధవారం ఉదయాన్నే ఎస్వీ శేఖర్ సిద్ధం అయ్యారు. బెయిల్ మంజూరు పది గంటల సమయంలో మైలాపూర్‌లోని ఇంటి నుంచి పోలీసు భద్రత నడుమ శేఖర్ ఎగ్మూర్ కోర్టుకు వచ్చారు. ఆయనకు వ్యతిరేకంగా ఏదేని ఆందోళనలు సాగవచ్చన్న సమాచారంతో పోలీసులు మరీ హడావుడి సృష్టించారు. కోర్టు పరిసరాల్లో గట్టి భద్రత కల్పించారు. పోలీసుల హడావుడి అక్కడి న్యాయవాదుల్లో సైతం ఆగ్రహాన్ని తెప్పించాయి. శేఖర్ అక్కడికి వచ్చిన సమయంలో ఆగ్రహాన్ని వ్యక్తంచేస్తూ పలువురు న్యాయవాదులు నినాదాల్ని హోరెత్తించడం గమనార్హం. దీంతో శేఖర్ ముందు గేటు నుంచి కాకుండా వెనుక ఉన్న మరో గేటు ద్వారా భద్రత వలయం నడుమ కోర్టులోకి వెళ్లారు. పదిన్నర గంటలకు న్యాయమూర్తి సమక్షంలో హాజరయ్యారు. విచారణ తదుపరి ఆయనకు బెయిల్ మంజూరు చేయడంతో అదే భద్రత నడుమ ఇంటి బాట పట్టారు. -
ఎన్టీటీపీఎస్లో భద్రత కట్టుదిట్టం
ఇబ్రహీంపట్నం, న్యూస్‌లైన్ : ఇబ్రహీంపట్నంలోని నార్ల తాతారావు థర్మల్ విద్యుత్ కేంద్రం(ఎన్టీటీపీఎస్)లో భద్రతా వ్యవస్థను కట్టుదిట్టం చేశారు. ఆది వారం నుంచి థర్మల్ కేంద్రం మూడు గేట్ల వద్ద స్పెషల్ ప్రొటెక్ష న్ ఫోర్స్ (ప్రత్యేక పోలీసు దళం)ను నియమించారు. ఎన్టీటీపీఎస్లో నిఘా వ్యవస్థను ముమ్మరం చేయాల్సిన అవసరాన్ని నగర పోలీసు కమిషనర్ గుర్తించి, ప్రభుత్వానికి నివేదిక పంపించారు. దీంతో ఇక్కడ భద్రత కోసం ఈ దళాన్ని ప్రభుత్వం నియమించింది. ఎన్టీటీపీఎస్కు నియమితులైన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ అధికారులు, సిబ్బంది ఆదివారం విద్యుత్ కేంద్రానికి వచ్చారు. వీరికోసం సెక్యూరిటీ విభాగంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఎన్టీటీపీఎస్ చీఫ్ ఇంజినీర్ జె.సమ్మయ్య ప్రారంభించారు. అంతకు ముందు ఆయన స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా సమ్మయ్య మాట్లాడుతూ ఎన్టీటీపీఎస్కు ప్రత్యేక రక్షణ కోసం మొత్తం 207 మంది సిబ్బంది నియమితులయ్యారన్నారు. అధిక విద్యుత్ ఉత్పత్తి చేస్తున్న ఈ థర్మల్ కేంద్రానికి భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని గుర్తించి, నిఘాను పెంచినట్లు చెప్పారు. డీఎస్పీ స్థాయి అధికారులు కమాండెంట్లుగా, సీఐలు, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు ఇందులో విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఎన్టీటీపీఎస్లోని మూడు గేట్ల వద్ద సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. కొద్ది రోజుల్లో కోల్ విభాగంలో కూడా సీసీ కెమెరాను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించే సిబ్బందిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్టీటీపీఎస్లో 3500 మంది ఉద్యోగులు, రెండు వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారని, ప్రతి ఒక్కరి వద్ద గేట్ పాస్‌లు, ఐడీ కార్డులు తనిఖీ చేసిన తర్వాతనే అనుమతించాలని సూచిం చారు. ప్రస్తుతం నియమితులైన 207 మంది సిబ్బందిలో కొందరికి మాత్రమే క్వార్టర్ సౌకర్యం కల్పించామని, మిగిలిన వారికి కూడా త్వరలోనే తగిన ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డీఎస్పీలు మాధవరావు, నాగమల్లేశ్వరరావు, పరిపాలనా విభాగం ఎస్ఈ రమేష్, ఎస్ఈ సుబ్రహ్మణ్యరాజు, ఫ్యాక్టరీ మేనేజర్ జీవకుమార్, పలువురు అధికారులు పాల్గొన్నారు.