సాక్షి, న్యూఢిల్లీ : ‘మన మిద్దరం మోటర్ బైక్ మీద అంతటా తిరిగినప్పుడు, మన సెల్ఫీలు ఫేస్‌బుక్‌లో షేర్ అయినప్పుడు మనచుట్టూ ఎన్నో వదంతులు వ్యాపించాయి. అయినప్పటికీ నేను నిన్ను నమ్మాను. కానీ నీవు చాలా దూరం వెళ్లావు. ఆ రోజే నేను లైంగిక దాడి గురించి పోలీసు స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేద్దామనుకున్నాను. అలా చేసి ఉంటే నీవు కొంతకాలమైనా జైల్లో గడిపే వాడివి. కానీ నా కెరీర్ మంటకలిసి పోయేది. నా పక్కన నిలబడేందుకు సహచరులుగానీ, కుటుంబ సభ్యులుగానీ ఎవరూ లేరు. అయినా నీవు నిష్కళంకుడిగా మిగిలావు. నాకు ఏమీ మిగలలేదు. నేనిప్పుడు నీకు ఓ వాట్సాప్ జోక్‌ను మాత్రమే......’
‘నీవెందుకు బ్యూటీ పార్లర్ బిజినెస్‌లోకి అడుగుపెట్టవు? కిరాణ కొట్టు ఎందుకు పెట్టుకోవు? నీకు ఏ టీచరో, నర్సు ఉద్యోగమో దొరకదా! నీవేమైనా కలెక్టర్ అవతాననుకుంటున్నావా? రోజంతా ఎండలో ఇలా తిరిగడం నీలాంటి మహిళకు మంచిదనుకుంటున్నావా? కట్టూబొట్టూ సరిగ్గా ఉండేలా చూస్కో! అవసరమైన చీరకట్టు సింధూరం పెట్టుకో.... నాలో నేను మదనపడ్డ రోజులవి. పొరపాటున మీకేమైనా బ్లూ ఫిల్మ్ పంపించానా? సారీ మేడమ్, గల్తీసే చలాగయా హోగా తోటి జర్నలిస్టుల మాటలు......’ (#మీటూ: బయోపిక్ నుంచి తప్పుకొన్న ఆమిర్)
‘దేశ రాజధాని ఢిల్లీలోని ఓ వార్తా పత్రిక నుంచి నాకు అప్పాయింట్‌మెంట్ లెటర్ వచ్చింది. దాన్ని తీసుకొని ఆ పత్రిక హెచ్‌ఆర్ విభాగానికి వెళ్లాను. అక్కడ నాకు కలిసిన వ్యక్తి హోటల్ గదిలో రూమ్ తీసుకోమన్నారు. ఆ రాత్రికి తానొచ్చి కలుస్తానని చెప్పారు. నేను అందుకు తిరస్కరించాను. ఓ పత్రికాఫీసులో పనిచేయాలంటే అన్నీ చేయాల్సి ఉంటుంది మేడమ్! కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. ఏం చేయమంటే అది చేయాలి అని చెప్పారు. నేను వెంటనే ఆ అప్పాయింట్ లెటర్‌ను నిలువునా చింపి ఆయన మొఖం మీదనే విసిరేసి వచ్చాను. నాకప్పుడు ఆ పత్రికా యజమాని ఎవరో తెలియదు. నాపై లైంగిక దాడికి సిద్ధపడిన వ్యక్తి సహచరులూ తెలియదు. తెలిసినా ఆయనపై నేను ఫిర్యాదు చేసుంటే నా పక్కన నిలబడే వారు తక్కువేనన్న సంగతి నాకు తెలుసు. ఆయనపై పోరాడి ఉద్యోగంలో చేరి ఉన్నట్లయితే గొడవలు రోజూ ఉండేవని నాకు తెలుసు......’ (మీటూ : మౌనం వీడిన అమితాబ్)
‘ఆమె నాకు పరిచయం. ఓ ప్రధాన జాతీయ దిన పత్రికలో ఆమెకు ఉద్యోగం వచ్చింది. ఆమె ఇంచార్జి ఆగ్రాలో ఉండేవారు. ఇప్పుడు ఆగ్రాతో ఆమెకేమి సంబంధం ఉందో, వారిద్దరి సంబంధం ఏమిటో కూడా నాకు తెలియదు. ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారని చెప్పి ఆ ఇంచార్జిని ఉద్యోగం నుంచి తొలగించారు. ఆమె, ఆయన అలా పడుకున్నారని, ఇలా పడుకున్నారని ఎన్నో పుకార్లు వచ్చాయి. ఆమెను మాత్రం తీసేయలేదు. అయినా ఆమె బాగా ఒత్తిడికి గురయ్యారు. కొత్తగా వచ్చిన ఇంచార్జి ఆమెను బాగా వేధించారని విన్నాను. చివరకు ఆమె మానసికంగా బాగా కృంగిపోయింది. ఆమెది ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్ నగరం......’ఈ కథనాలన్నీ వత్తిపరంగా అజ్ఞాత మహిళా జర్నలిస్టులు ఎదుర్కొన్న అనుభవాలు.
‘జిలే కి హల్‌చల్’ పేరిట 2014లో విమెన్ మీడియా అండ్ న్యూస్ ట్రస్ట్’ ఈ అనుభవాలను ప్రచురించింది. ‘మీటూ’ ఉద్యమం నేపథ్యంలో ఇలాంటి కథనాలన్నీ కావాలిప్పుడు అని మహిళా జర్నలిస్టులు కోరుతున్నారు. ‘మీటూ’ ఉద్యమం మగవారికి ఒక కుదుపు మాత్రమేనని, లైంగిక వేదనలు, బాధల నుంచి మహిళలకు శాశ్వత విముక్తి కల్పించే ఓ బలమైన వ్యవస్థ రావాలని, కావాలని వారు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment