సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్‌పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా కేంద్ర ప్రభుత్వం ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కుంటోంది. ఎంజే అక్బర్ గతంలో పలు పత్రికలకు సంపాదకుడిగా పనిచేస్తున్న కాలంలో తమను లైంగికంగా వేధించాడని పలువురు మహిళా విలేకరులు ఇటీవల ఆరోపించడం తెలిసిందే. అక్బర్‌పై ఈ ఆరోపణలు చేసిన జర్నలిస్టుల సంఖ్య తాజాగా ఎనిమిదికి పెరిగింది. అయినా అటు ఎంజే అక్బర్ కానీ, ఇటు కేంద్ర మంత్రులు లేదా అధికార బీజేపీ ప్రతినిధులు కానీ ఇప్పటివరకు ఈ ఆరోపణలపై తమ స్పందనను కూడా తెలియజేయకపోవడం పట్ల తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం మంత్రివర్గ సమావేశం అనంతరం ఆ వివరాలను కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ మీడియాకు వివరిస్తుండగా విలేకరులు అక్బర్‌పై వచ్చిన ఆరోపణలపై ప్రశ్నించారు. సమాధానం చెప్పేందుకు రవి శంకర్ కూడా నిరాకరించారు. ఈ ఆరోపణలు అక్బర్ మంత్రి పదవిలో ఉన్న కాలానికి సంబంధించినవి కాదు కాబట్టి అధికారికంగా స్పందించకూడదని బీజేపీ నిర్ణయించినట్లు సమాచారం. ఈ విషయంపై మీడియాతో మాట్లాడకూడదని బీజేపీ తన అధికార ప్రతినిధులకు సూచించినట్లు తెలిసింది.
రాజీనామా చేయాలి: కాంగ్రెస్
పలువురికి స్ఫూర్తినిచ్చే స్థానంలో ఉన్న సుష్మ, తన జూనియర్ మంత్రిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలపై స్పందించకపోవడం చాలా దురదృష్టకరమని కాంగ్రెస్ పేర్కొంది. ‘తనపై వచ్చిన ఆరోపణలపై అక్బర్ సంతృప్తికరమైన వివరణ అయినా ఇవ్వాలి లేదా మంత్రి పదవికి రాజీనామా చేయాలి’ అని పార్టీ అధికార ప్రతినిధి జైపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.
‘అక్బర్’పై స్పందించని కేంద్రం
Published Thu, Oct 11 2018 3:04 AM | Last Updated on Thu, Oct 11 2018 3:04 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment