న్యూఢిల్లీ/అగర్తలా: అసోం పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని తక్షణమే విడుదల చేయాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్(ఐడబ్ల్యూపీసీ) డిమాండ్ చేసింది. బాధిత జర్నలిస్టులు సమద్ధి సకునియా, స్వర్ణ ఝాకు సంఘీభావం ప్రకటించింది. హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న వీరిద్దరూ త్రిపురలో ఇటీవల చెలరేగిన మతపరమైన అల్లర్లను కవర్ చేశారు.
త్రిపురలో కేసు.. అసోంలో అరెస్ట్
అయితే త్రిపుర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలింగించారంటూ ఫాటిక్రోయ్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మత విద్వేషాల్ని ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కాంచన్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో ప్రార్థనా మందిరం ధ్వంసమయినట్టు అసత్య ప్రచారం చేశారని మహిళా జర్నలిస్టులపై వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. దీంతో వీరిని అసోంలోని కరీంగంజ్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. గోమతిలోని కక్రాబన్ పోలీస్ స్టేషన్‌లో మరో కేసు నమోదైనట్టు త్రిపుర డీజీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
వాస్తవాలను వక్రీకరించారు
త్రిపురలో జరిగిన మత పరమైన అల్లర్ల ప్రభావం మహారాష్ట్రపై పడి, నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే త్రిపురలో ప్రార్థనా మందిరం ధ్వంసం అయిందన్న ఆరోపణల్ని కేంద్ర హోంశాఖ తోసిపుచ్చింది. ‘త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో మసీదును ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నకిలీవి.. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించాయి’ అని స్పష్టం చేసింది.
చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారు
కాగా, సిల్చార్‌కు వెళ్లాల్సిన తమ జర్నలిస్టులను అసోం పోలీసులు చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారని హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్‌వర్క్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆరోపించింది. అసోంలో తమ సిబ్బందిపై ఎటువంటి కేసు లేనప్పటికీ త్రిపుర పోలీసుల ఆదేశాల మేరకు వారెంట్ లేకుండా స్వర్ణ, సమృద్ధిలను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. మీడియా గొంతు నొక్కేందుకు త్రిపుర ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిరస్తున్నారని విమర్శించింది. కాగా, మహిళా జర్నలిస్టుల అరెస్ట్‌ను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కాగా, గోమతి జిల్లాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు సోమవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. (చదవండి: ‘రజా అకాడమీ’ని నిషేధించాలి.. వీహెచ్‌పీ డిమాండ్)
Comments
Please login to add a commentAdd a comment