Editors guild
-
‘ఫ్యాక్ట్ చెకింగ్ యూనిట్’పై సుప్రీం స్టే
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) ఆధ్వర్యంలో ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేస్తూ కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్‌పై అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణకు సంబంధించిన అంశమని వెల్లడించింది. ప్రభుత్వంపై మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను, ఆన్లైన్లో నకిలీ కంటెంట్‌ను గుర్తించడానికి ఈ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్–2021లో సవరణలు చేసింది. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎడిటర్స్ గిల్డ్ ఇండియాతోపాటు పలువురు బాంబే హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ జరిపిన హైకోర్టు ఫ్యాక్ట్–చెకింగ్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంతర స్టే ఇచ్చేందుకు నిరాకరిస్తూ మార్చి 11న తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ జరిపింది. మార్చి 11 నాటి బాంబే హైకోర్టు తీర్పును తోసిపుచ్చింది. -
‘ఫ్యాక్ట్ చెక్ యూనిట్’ నోటిఫికేషన్‌పై సుప్రీం స్టే
ఢిల్లీ: కేంద్రం విడుదల చేసిన ‘ఫ్యాక్ట్ చెక్’ నోటిఫికేషన్‌పై సుప్రీం కోర్టు స్టే విధించింది. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు సంబంధించిన అంశమని అభిప్రాయపడింది. ఫేక్ న్యూస్‌ను అడ్డుకునేందుకు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (పీఐబీ) ఆధ్వర్యంలో ‘ఫ్యాక్ట్ చెక్ (నిజనిర్ధారణ)’ యూనిట్‌కు సంబంధించి కేంద్ర ఐటీ శాఖ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసిన తెలిసిందే. కాగా కేంద్ర ఐటీ శాఖ ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను నోటిఫై చేయగా.. ఇది భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకు విఘాతం కలిగించడమేనని ‘ద ఇండియన్ న్యూస్ పేపర్ సొసైటీ’ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ ఫ్యాక్ట్ చెక్ విభాగాన్ని నోటిఫై చేయకుండా ఆదేశాలివ్వాలంటూ ‘ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా’ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అయితే గురువారం దీనిపై సుప్రీం కోర్టు విచారణ జరిపి.. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ నోటిఫికేషన్‌పై స్టే విదిస్తున్నట్లు పేర్కొంది. ఆన్లైన్ కంటెంట్‌లో ఫేక్, తప్పుడు సమాచారాన్ని గుర్తించేందుకు ఫ్యాక్ట్ చెక్ యూనిట్‌ను తీసుకువస్తామని కేంద్రం గతేడాది ఏప్రిల్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే దీనికోసం ఐటీ రూల్స్-2021కి కూడా కేంద్రం సవరణలు చేసింది. ఈ కొత్త నిబంధనలు ఏకపక్షంగా, రాజ్యంగ విరుద్ధంగా ఉన్నాయిని పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. మరోవైపు.. స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా, ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ముంబై హైకోర్టును ఆశ్రయించారు. ఫ్యాక్ట్ చెక్ యూనిట్ ఏర్పాటుపై మధ్యంత స్టే ఇవ్వడానికి ముంబై హైకోర్టు నిరాకరించింది. ముంబై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయముర్తి డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం మార్చి 11 ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. అయితే బాంబే హైకోర్టు ముందుకు వచ్చిన ప్రశ్నలను పరిశీలించాల్సి అవసంరం ఉందని సుప్రీం కోర్టు తెలిపింది. ఇక.. అంతవరకు మార్చి 20 (బుధవారం) కేంద్రం జారీ చేసిన నోటిఫికేష్‌పై స్టే విధిస్తున్నామని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నివేదిక ఇవ్వడం నేరం కాదు
న్యూఢిల్లీ: మణిపూర్ హింసపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా(ఈజీఐ) సభ్యులిచి్చన నివేదికలోని అంశాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ నివేదికలో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించే అంశం ఏమీ కనిపించడం లేదని పేర్కొంది. ఒక తప్పుడు ప్రకటన రాజ్యాంగంలో 153ఏ ప్రకారం నేరం కాదని స్పష్టం చేసింది. అది భావ ప్రకటన స్వేచ్ఛ కిందికి వస్తుందని వివరించింది. దేశంలో ఎందరో జర్నలిస్టులు నిత్యం ఇలాంటి అసత్య ప్రకటనలు చేస్తుంటారు. వారందరిపైనా అభియోగాలు మోపుతారా అని పోలీసులను ప్రశ్నించింది. ఈ కేసులో ఈజీఐకి చెందిన నలుగురు సభ్యులకు పోలీసు అరెస్ట్ నుంచి ఇచి్చన రక్షణను మరో రెండు వారాలు పొడిగిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈజీఐ సభ్యులపై నమోదైన కేసును ఎందుకు కొట్టివేయరాదని మణిపూర్ పోలీసులను ఆయన ప్రశ్నించారు. జర్నలిస్టులకు తమ అభిప్రాయాలను వెలిబుచ్చే హక్కు ఉంటుందన్నారు. మణిపూర్ హింసపై నిజ నిర్థారణలో భాగంగా నలుగురు సభ్యుల ఈజీఐ అక్కడికి వెళ్లి సెప్టెంబర్ 2న ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ఘర్షణలను ప్రేరేపించేదిగా ఉందంటూ పోలీసులు ఈజీఐకి చెందిన నలుగురు స భ్యులపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. -
నిజం చెబితే నేరమా?
విద్వేషాగ్నిని రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడి, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వారిపై కేసులు పెట్టి, ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి పాలకులకు వారాలు, నెలలు పడుతుంది. కానీ, నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా వాస్తవ స్థితిని బాహ్య ప్రపంచానికి వెల్లడించి, తప్పులను ఎత్తిచూపిన పత్రికా ప్రముఖులపై కేసులు పెట్టడమైతే మాత్రం తక్షణమే జరిగిపోతుంది. ఘనత వహించిన మన మణిపుర్ పాలకుల తీరు ఇది. కేసులు మీద పడ్డ జర్నలిస్టులు చివరకు దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే కానీ బుధవారం తాత్కాలిక రక్షణ, సాంత్వన లభించని పరిస్థితి. ఒక్కమాటలో తెచ్చిన సమాచారం వినకుండా, ఆ సమాచారం తెచ్చిన దూతను పాలకులు కొట్టడమంటే ఇదే! ఈశాన్య రాష్ట్రంలోని ఘర్షణలపై మీడియాలో వార్తల నివేదన ఎలా ఉందన్న అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణ సంఘం శనివారం వెలువరించిన నివేదిక ఇంత రచ్చకు దారి తీసింది. సదరు నివేదిక పక్షపాత వైఖరితో, తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ, ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు కేసు పెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు పెట్టడంతో నిజనిర్ధారణ సంఘంలోని ముగ్గురు సభ్యుల పైన, అలాగే ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిపైన ఒకటికి రెండు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలయ్యాయి. గత నాలుగు నెలల్లో మణిపూర్‌లో పరిస్థితిపైన నోరు విప్పి మాట్లాడడానికి తీరిక లేని ఆ రాష్ట్ర సీఎంకు ఈ విషయంపై మాత్రం విలేఖరులందరినీ కూర్చోబెట్టుకొని మనసులో మాట పంచుకొనే తీరిక, ఓపిక వచ్చాయి. ఎడిటర్స్ గిల్డ్‌ను తీవ్రస్వరంతో హెచ్చరించే సాహసమూ చేశారు. నిజానికి, మెజారిటీ వర్గమైన మైతేయ్‌లకూ, మైనారిటీలైన కుకీ–చిన్‌లకూ మధ్య ఘర్షణలో మణిపుర్ మీడియా ‘మెయితీల మీడియా’గా మారి పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తోందని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎడిటర్స్ గిల్డ్ అందించిన నిజనిర్ధారణ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు భారత ఆర్మీకి చెందిన 3వ కోర్ దళం కేంద్రకార్యాలయం సహా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదు లొచ్చాయనీ గిల్డ్ తెలిపింది. ఇంటర్నెట్పై నిషేధంతో మణిపుర్ నుంచి వార్తల నివేదన కష్టమైందని అభిప్రాయపడింది. మీడియా ఫేక్‌న్యూస్ అందిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నట్టు కనీసం 10 సందర్భాల్లో తమ ఫ్యాక్ట్–చెకింగ్ బృందం తేల్చినట్టు వెల్లడించింది. మణిపూర్ సర్కార్ మాత్రం ఈ నివేదిక అవాస్తవమనీ, ప్రాయోజితమనీ, వండి వడ్డించినదనీ ఆరోపిస్తోంది. తగల బడుతున్న ఓ భవనాన్ని కుకీల గృహంగా పేర్కొన్నారనీ, నిజానికది ఓ అటవీ అధికారి ఆఫీసనీ, నివేదిక మొత్తం ‘కుకీ తీవ్రవాదుల’ ప్రాయోజితమనేది గిల్డ్‌పై దాఖలైన ఫిర్యాదు. ఫోటో ఎడిటింగ్‌లో ఆ పొరపాటు జరిగిందని గిల్డ్ విచారం వ్యక్తం చేసి, వివరణ ఇచ్చినా కేసులు ఆగలేదు. మరి, మే 3 నుంచి నాలుగు నెలల పైగా రాష్ట్రం తగలబడుతూ, కనీసం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, వేలమంది నిరాశ్రయులైనా నిమ్మకు నీరెత్తిన నీరో చక్రవర్తిని తలపిస్తున్న పాల కులపై ఎన్ని కేసులు పెట్టాలి? విధి నిర్వహణలో, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనా సరే నైతిక బాధ్యత వహించక కుర్చీ పట్టుకు వేళ్ళాడుతున్న సీఎంను ఏమనాలి? అందరినీ సమభావంతో చూడాల్సిన సదరు వ్యక్తే తాను ఒక వర్గానికి ప్రతినిధి అన్నట్టు నిర్లజ్జగా వ్యవహరించడాన్ని ఎలా సమర్థించాలి? ఇళ్ళు, స్కూళ్ళు, చర్చీలు తగలబడుతూ ఘర్షణలు రేగుతున్నా అంతా ప్రశాంతంగా ఉందనీ, సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నాయనీ అసత్యాలు చెబుతుంటే సిసలైన జర్నలిస్టులు ఏం చేయాలి? ఎప్పుడైనా, ఎక్కడైనా ఏకపక్షంగా వార్తలు రాస్తూ, వాస్తవాలను వక్రీకరించడం ఘోరం, నేరం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికారంగంలో అలాంటి పగుళ్ళు పెరిగితే, ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలుతుంది. అస్సామ్ రైఫిల్స్‌పై నిరంతర దుష్ప్రచారం అందుకు చిరు ఉదాహరణ. ఘర్షణలకు సరిగ్గా రెండు నెలల ముందే కుకీ వేర్పాటువాద బృందాలతో కాల్పుల విరమణ ఒప్పందం లాంటి త్రైపాక్షిక ‘చర్యల సస్పెన్షన్’ ఒప్పందం నుంచి బీజేపీ రాష్ట్ర సర్కార్ ఎందుకు ఉపసంహరించుకుందన్నది దేవరహస్యం. ఇలాంటి వాస్తవాల్ని గిల్డ్ నివేదిక ఎత్తిచూపితే, కేసులు వేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? కానీ, ప్రజాస్వామ్యంలో ఆరు నెలలకు ఒకసారైనా అసెంబ్లీ సమావేశం కావాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘిస్తే తిప్పలొస్తాయని పాలకులు తంటాలు పడ్డారు. రాష్ట్రం తగలబడుతున్నా భేటీ కాని సభ గత నెలాఖరులో ఒక్కరోజే అదీ 11 నిమిషాలే సమావేశమైంది. ఎడిటర్స్ గిల్డ్ వెలువరించిన నివేదికలో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం ఆ మాటే స్పష్టం చేయవచ్చు. అసలు నిజాలేమిటో బహిరంగంగా వివరించి, ఎడిటర్ల బృందం తప్పని నిరూపించనూ వచ్చు. అంతేకానీ, క్షేత్రస్థాయి పర్యటనతో వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే ‘మరిన్ని ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్నార’నడం సమర్థనీయం కాదు. మీడియా పనితీరుకు పరిమితం కాక, ఘర్షణలకు కారణాల్నీ గిల్డ్ పరిశీలించడమేమిటని ప్రశ్నించడమూ అర్థరహితం. పైపెచ్చు, అదే నేరమన్నట్టు క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయడం ఏ రకంగానూ సరికాదు. ఈ వైఖరి అప్రజాస్వామికం, తర్కరహితమే కాదు, అక్షరాలా అధికార దుర్వినియోగం! మణిపుర్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై కేసును ఉపసంహరించుకోవాలి. ముదిరిన జాతి విద్వేషాల్ని తగ్గించడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాలి. ఆ అసలు సమస్యను వదిలేసి, కొసరు కథను పట్టుకొని వేళ్ళాడడం ప్రజలకూ, ప్రజాస్వామానికీ ఏ విధంగానూ మేలు చేయదు. కానీ, మన పాలకులు ఇవన్నీ చెవికెక్కించుకొనే స్థితిలో ఉన్నారా అన్నది బేతాళ ప్రశ్న. -
మీడియా తప్పుడు కథనాలు.. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ప్రభుత్వం
ఇంఫాల్: మణిపూర్‌లో అల్లర్లను తగ్గుముఖం పట్టించేందుకు ఒకపక్క తాము అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క ఎడిటర్స్ గిల్డ్ ఇండియా మీడియా సంస్థ అగ్గికి ఆజ్యం పోసిందని ఆరోపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అదనంగా ఎన్.శరత్ సింగ్ అనే సామాజిక కార్యకర్త కూడా ఈజీఐ పై ఎఫ్ఐఆర్ను నమోదు చేశారు. మణిపూర్‌లో కుకీ, మెయిటీ తెగల మధ్య జరిగిన అల్లర్లు చిలికి చిలికి గాలివానై తర్వాతి దశలో పెను ప్రళయంగా మారి దారుణ మారణకాండకు దారితీశాయి. అల్లర్ల సమయంలో జరిగిన వాస్తవాలను ప్రజలకు తెలియజేయాల్సింది పోయి తప్పుడు కథనాలను ప్రచురించి అల్లర్లకు మరింత చెలరేగడానికి కారణమయ్యారని ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియాపై కేసు నమోదు చేసింది మణిపూర్ ప్రభుత్వం. ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా శనివారం ప్రచురించిన కథనం ప్రకారం మణిపూర్ ప్రభుత్వం అల్లర్ల సమయంలో పక్షపాత ధోరణితో వ్యవహరించినట్లు స్పష్టమయ్యిందని.. ప్రజాస్వామ్య ప్రభుత్వంలా ప్రజలపట్ల సమానంగా వ్యవహరించకుండా ఒక పక్షంవైపే నిలిచిందని ఆరోపించింది. ఈ ఆరోపణలు అసత్యమైనవని చెబుతూ మొదట రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. #WATCH | The State government has filed an FIR against the members of the Editors Guild who are trying to create more clashes in the state of Manipur, says CM N Biren Singh. pic.twitter.com/gm2RssgoHL — ANI (@ANI) September 4, 2023 ఇది కాకుండా ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనానికి వ్యతిరేకంగా ఇంఫాల్‌కు చెందిన ఒక సామాజిక కార్యకర్త ఎం.శరత్ సింగ్ ఆగస్టు 7 నుంచి 10 లోపు మణిపూర్ వచ్చిన సీమా గుహ, సంజయ్ కపూర్, భారత్ భూషణ్‌లతో పాటు ఎడిటర్స్ గిల్డ్ ఆ ఇండియా ప్రెసిడెంట్ పైన కూడా మరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నివేదికలో ఉన్నఅనేక తప్పిదాలను సాక్ష్యాధారాలతో సహా ఎఫ్ఐఆర్లో ఏకరువు పెట్టారు. ఎఫ్ఐఆర్లో మే 3న నిప్పుల్లో కాలుతోన్న మణిపూర్ అటవీ శాఖాధికారి గృహం ఫోటోకు కింద 'తగలబడుతున్న కుకీ గృహం' అని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిందని పేర్కొన్నారు. దీనికి సాక్ష్యంగా అదే రోజున స్థానిక పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ను జతచేశారు. ఆ స్టేషన్ ఎస్ఐ జంగ్ఖొలాల్ కిప్జెన్ మాట్లాడుతూ ఇది కుకీలు నివాసం కాదని అల్లర్ల సమయంలో నిరసనకారులు తగలబెట్టిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇల్లని స్పష్టం చేశారు. దీంతో నాలుక్కరుచుకున్న ఎడిటర్స్ గిల్డ్ తమ తప్పును అంగీకరిస్తూ సెప్టెంబర్ 2న ఎక్స్(ట్విట్టర్)లో పేర్కొంటూ.. అసలు వివరాలు త్వరలోనే తెలియజేస్తామని ప్రకటించింది. There was an error in a photo caption in the report released on Sep 2. The same is being rectified and updated report will be uploaded on the link shortly. We regret the error that crept in at the photo editing stage — Editors Guild of India (@IndEditorsGuild) September 3, 2023 అంతకు ముందు ఎడిటర్స్ గిల్డ్ ఇచ్చిన నివేదిక ప్రకారం మయన్మార్ మిలటరీ తిరుగుబాటు కారణంగా అక్కడి నుండి వలస వచ్చిన వారితో కలిపి మణిపూర్ ప్రభుత్వం కుకీలను కూడా వలసదారులుగా చిత్రీకరించే ప్రయత్నం చేసిందని ఆరోపించింది. కుకీలకు వ్యతిరేకంగా వ్యవహరించి మణిపూర్ ప్రభుత్వం అత్యధికులు ఆగ్రహానికి కారణమైందని రాసింది. ఈ విషయాన్ని కూడా శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో ప్రస్తావిస్తూ అక్రమ వలసదారులకు సంబంధించి ఈజీఐ కీలక సమాచారాన్ని ప్రచురించలేదని 2001తో పోలిస్తే సెన్సస్ 169 శాతం పెరిగిందని.. దీనిపై వారు కథనాన్ని ప్రచురించి ఉంటే బాగుండేదని అన్నారు. ఇటీవల ఎలక్షన్ కమీషన్ ఓటర్ల జాబితాలో భారీ అవకతవకలు జరిగాయని సుమారు 1,33,553 డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లుగా వారు గుర్తించారని తెలిపారు. కొండ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం కేవలం 10 శాతం అభివృద్ధి ఐదులను మాత్రమే వినియోగిస్తోందని ఎడిటర్స్ గిల్డ్ ప్రచురించిన కథనం కూడా అవాస్తవమని రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి నిధులలో దాదాపు 40 శాతం గిరిజనులు నివసించే కొండప్రాంతాలకే వెచ్చింస్తోందని తెలిపారు.. ఇలా అడుగడుగునా ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా అనేక తప్పుడు కథనాలను ప్రచురించి పజాలను ఏమార్చి విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసిందని శరత్ సింగ్ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. ఈ ఎఫ్ఐఆర్పై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఇంకా స్పందించాల్సి ఉంది. State Government had stated on the floor of the Assembly in 2021 regarding the budget allocation for the Valley and Hills across all departmental works. A committee was formed to check the fund inflow over the last 10 years, the methodology was also explained. There has been a… pic.twitter.com/w8MuIumve9 — Rajkumar Imo Singh (@imosingh) August 24, 2023 ఇది కూడా చదవండి: ఉదయనిధి 'సనాతన ధర్మ' వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన ఏంటంటే..? -
‘రాజద్రోహం’పై విస్తృత ధర్మాసనం అనవసరం
సాక్షి, న్యూఢిల్లీ: బ్రిటిష్ కాలం నాటి రాజద్రోహం చట్టంపై విస్తృత ధర్మాసనం ఏర్పాటు చేయాల్సిన అవసరం లేదని అటార్నీ జనరల్ కె.కె.వేణుగోపాల్ సుప్రీంకోర్టుకు తెలియజేశారు. ఈ చట్టం దుర్విని యోగం కాకుండా నియంత్రించగలిగామని చెప్పా రు. దీనిపై మార్గదర్శకాలు జారీ చేయాలన్నారు. రాజద్రోహం చట్టాన్ని సవాలు చేస్తూ ఎస్జీ వొంబట్కెరే, ఎడిటర్స్ గిల్డ్ తదితరులు వేసిన పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిల ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఇటీవల మహారాష్ట్రలో ఎంపీ నవనీత్ కౌర్ రాణా దంపతుల అరెస్టు కేసును ధర్మాసనం ప్రస్తావించింది. ‘‘దేశంలో ఏం జరుగుతోందో కోర్టుకు తెలుసు. హనుమాన్ చాలీసా చదువుతామన్న వారిపై దేశద్రోహం కేసులు పెడుతున్నారు. చట్టం దుర్వినియోగం కాకుండా మార్గదర్శకాలు జారీ చేయాలే గానీ విస్తృత ధర్మాసనం అవసరం లేదు. సెక్షన్ 142ఏ చెల్లుబాటుపై కేదార్నా«థ్‌సింగ్ కేసులో ఇచ్చిన తీర్పును సమర్థించాల్సి ఉంది. కేంద్రం వైఖరి చెప్పాల్సి ఉంది’’ అని ఏజీ వేణుగోపాల్ తెలిపారు. సెక్షన్ 124ఏను రద్దు చేయొచ్చు రాజద్రోహం చట్టంపై దాఖలైన పిటిషన్లపై కౌంటరు దాఖలు చేయాలని గతంలో ఇచ్చిన ఆదేశాలను పాటించడం లేదంటూ కేంద్రంపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. న్యాయవాదులు సిద్ధం చేసిన ముసాయిదాకు ఆమోదం రాలేదని, ఈ నేపథ్యంలో మరింత గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. భారతదేశంలో తమ పాలనను కాపాడుకోవడానికి బ్రిటిషర్లు చేసిన రాజద్రోహం చట్టాన్ని రద్దు చేయాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోరారు. ఈ చట్టం కారణంగా స్వేచ్ఛాభారతంలో జర్నలిస్టులు, విద్యార్థులు అరెస్టవుతున్నారని వాపోయారు. ‘‘సొలిసిటర్ జనరల్ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలుకు సోమవారం వరకూ సమయం ఇస్తున్నాం. విస్తృత ధర్మాసనం ఏర్పాటుపై వాదప్రతివాదులు లిఖితపూర్వక అభ్యర్థనలను శనివారం ఉదయం అందజేయాలి. మే 10 మధ్యాహ్నం విచారిస్తాం. వాయిదాకు అంగీకరించబోం’’ అని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇక పూర్తి సామర్థ్యంతో సుప్రీంకోర్టు! సుప్రీంకోర్టులో మొత్తం 34 మంది న్యాయమూర్తులు ఉండాలి. ప్రస్తుతం రెండు ఖాళీలున్నాయి. వీటి భర్తీ ప్రక్రియ మొదలయ్యింది. కొత్తగా ఇద్దరు న్యాయమూర్తులు నియమితులైతే సుప్రీంకోర్టు ఇక పూర్తి సామర్థ్యంతో పనిచేయనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం ఇద్దరి పేర్లను ప్రతిపాదించింది. గౌహతి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుధాంశు ధూలియా, గుజరాత్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలాను సుప్రీం జడ్జీలుగా నియమించాలని కేంద్రానికి సూచించినట్లు సమాచారం. దీనిని ఆమోదిస్తే జస్టిస్ జంషెడ్ బి.పార్దివాలా జడ్జిగా, ఆ తర్వాత ప్రధాన న్యాయమూర్తి అయ్యే అవకాశాలున్నాయి. -
ఆ ఇద్దరు మహిళా జర్నలిస్టులను విడిచిపెట్టండి
న్యూఢిల్లీ/అగర్తలా: అసోం పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళా జర్నలిస్టుల్ని తక్షణమే విడుదల చేయాలని ఇండియన్ వుమెన్స్ ప్రెస్ కార్ప్(ఐడబ్ల్యూపీసీ) డిమాండ్ చేసింది. బాధిత జర్నలిస్టులు సమద్ధి సకునియా, స్వర్ణ ఝాకు సంఘీభావం ప్రకటించింది. హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్‌వర్క్‌లో పనిచేస్తున్న వీరిద్దరూ త్రిపురలో ఇటీవల చెలరేగిన మతపరమైన అల్లర్లను కవర్ చేశారు. త్రిపురలో కేసు.. అసోంలో అరెస్ట్ అయితే త్రిపుర ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలింగించారంటూ ఫాటిక్రోయ్ పోలీస్ స్టేషన్లో ఈ ఇద్దరు మహిళా జర్నలిస్టులపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మత విద్వేషాల్ని ప్రేరేపిస్తున్నారని ఆరోపిస్తూ స్థానిక విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) కాంచన్ దాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు చెప్పారు. త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో ప్రార్థనా మందిరం ధ్వంసమయినట్టు అసత్య ప్రచారం చేశారని మహిళా జర్నలిస్టులపై వీహెచ్‌పీ ఫిర్యాదు చేసింది. దీంతో వీరిని అసోంలోని కరీంగంజ్ ప్రాంతంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. గోమతిలోని కక్రాబన్ పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైనట్టు త్రిపుర డీజీపీ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. వాస్తవాలను వక్రీకరించారు త్రిపురలో జరిగిన మత పరమైన అల్లర్ల ప్రభావం మహారాష్ట్రపై పడి, నిరసనలకు దారి తీసిన విషయం తెలిసిందే. అయితే త్రిపురలో ప్రార్థనా మందిరం ధ్వంసం అయిందన్న ఆరోపణల్ని కేంద్ర హోంశాఖ తోసిపుచ్చింది. ‘త్రిపురలోని ఉనకోటి జిల్లా పాల్ బజార్ ప్రాంతంలో మసీదును ధ్వంసం చేసినట్లు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు నకిలీవి.. వాస్తవాలను పూర్తిగా వక్రీకరించాయి’ అని స్పష్టం చేసింది. చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారు కాగా, సిల్చార్కు వెళ్లాల్సిన తమ జర్నలిస్టులను అసోం పోలీసులు చట్ట విరుద్దంగా అరెస్ట్ చేశారని హెచ్‌డబ్ల్యూ న్యూస్ నెట్వర్క్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో ఆరోపించింది. అసోంలో తమ సిబ్బందిపై ఎటువంటి కేసు లేనప్పటికీ త్రిపుర పోలీసుల ఆదేశాల మేరకు వారెంట్ లేకుండా స్వర్ణ, సమృద్ధిలను అదుపులోకి తీసుకున్నారని వెల్లడించింది. మీడియా గొంతు నొక్కేందుకు త్రిపుర ప్రభుత్వం, పోలీసులు ప్రయత్నిరస్తున్నారని విమర్శించింది. కాగా, మహిళా జర్నలిస్టుల అరెస్ట్‌ను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది. కాగా, గోమతి జిల్లాలోని చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ (సీజేఎం) కోర్టు సోమవారం వీరికి బెయిల్ మంజూరు చేసింది. (చదవండి: ‘రజా అకాడమీ’ని నిషేధించాలి.. వీహెచ్‌పీ డిమాండ్) -
గోప్యత హక్కు చాలా ముఖ్యం
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కొంతమంది విపక్ష నేతలు, ప్రముఖులు, పాత్రికేయులపై నిఘా ఉంచడానికి కేంద్రప్రభుత్వం ఇజ్రాయెల్‌కు చెందిన స్పైవేర్ పెగాసస్ వినియోగించిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి సుప్రీంకోర్టు కమిటీ నియమించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసింది. దేశంలో 300మందికి పైగా మొబైల్ ఫోన్లపై నిఘా ఉంచారంటూ మనోహర్‌లాల్ శర్మ, ఎడిటర్స్ గిల్డ్ సహా పలువురు జర్నలిస్టులు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలో జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ హిమా కోహ్లిలతో కూడిన ధర్మాసనం బుధవారం 46 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ అంశంపై దర్యాప్తునకు నిపుణుల కమిటీని తామే ఏర్పాటు చేస్తామన్న కేంద్రం విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తిరస్కరించింది. ప్రజాస్వామ్య దేశంలో అక్రమంగా వ్యక్తులపై నిఘా పెట్టడాన్ని అనుమతించలేమని స్పష్టం చేసింది. జాతీయ భద్రతతో ముడిపడిన అంశమని చెప్పి కేంద్రం ప్రతిదాన్నీ దాటవేయలేదని స్పష్టం చేసింది. పౌరుల వ్యక్తిగత గోపత్య హక్కుకు సంబంధించి ఇటీవలికాలంలో అత్యంత కీలకమైన తీర్పును వెలువరిస్తూ... జాతీయ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పి... న్యాయవ్యవస్థను మౌనప్రేక్షక పాత్రకు పరిమితం చేయలేరని విస్పష్టంగా పేర్కొంది. నిపుణుల కమిటీని వారి సమాచారాన్ని వ్యక్తిగతంగా సేకరించి, పరిశీలించి నియమించామని తెలిపింది. సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్, నెట్వర్క్, హార్డ్‌వేర్ వంటి సాంకేతిక అంశాల్లో అత్యంత ప్రతిభావంతులైన నిపుణులను ఎంపిక చేసి పారదర్శక దర్యాప్తు నిమిత్తం కమిటీలో నియమించామని పేర్కొంది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ కమిటీకి నేతృత్వం వహిస్తారని, దర్యాప్తు పారదర్శకంగా, సమర్థంగా జరుగుతుందని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా కమిటీకి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓసీ)ను తీర్పులో పొందుపరిచింది. కమిటీ దర్యాప్తును స్వయంగా పర్యవేక్షిస్తామని జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. పెగాసస్‌పై సమగ్రంగా పరిశీలించి, దర్యాప్తు అనంతరం నివేదికను కోర్టుకు అందించాలని కమిటీని ఆదేశించింది. ఎనిమిది వారాల అనంతరం ఈ అంశంపై విచారణ చేస్తామని పేర్కొంది. కోర్టు నియమించిన కమిటీకి కావాల్సిన వసతి, ఇతరత్రా సౌకర్యాలు, సమాచారం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఏజెన్సీలు అందించాలని ఆదేశించింది. దేశప్రజలపై విదేశీ ఏజెన్సీలు, ప్రైవేటు సంస్థలు నిఘా ఉంచడాన్ని గమనించిన ధర్మాసనం ఈ అంశాన్ని కూడా దర్యాప్తు చేయాలని కమిటీని ఆదేశించింది. నిబంధనలకు లోబడే ఉండాలి... దేశంలో సైబర్ సెక్యూరిటీని బలోపేతం చేయాల్సి ఉందన్న సుప్రీంకోర్టు జాతీయ భద్రత విషయంలో న్యాయవ్యవస్థ అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది, అయితే, న్యాయసమీక్షకు వ్యతిరేకంగా దేన్నిపడితే దాన్ని నిషేధించే అవకాశం లేదని స్పష్టం చేసింది. జాతీయ భద్రత అనేది ఎప్పుడుపడితే అప్పుడు ఉపయోగించే అంశం కాదని తెలిపింది. ఆ ప్రస్తావన వచ్చినపుడల్లా న్యాయవ్యవస్థ జోక్యం అవసరమని అభిప్రాయపడడం లేదని తెలిపింది. జాతీయ భద్రతపై భయాందోళనలు తలెత్తినపుడల్లా కేంద్రానికి తప్పించుకొనే అవశాకం వస్తుందని కాదని, అలాగని తిరస్కరించే అవకాశం కూడా ఉందని తెలిపింది. ఇలాంటి అంశాలు ప్రస్తావనకు వచ్చినపుడు కేంద్రం తననితాను నిరూపించుకోవాల్సి ఉంటుందని తెలిపింది. సమాచారం బహిర్గతం కావడం అనేది జాతీయ భద్రతకు సంబంధించిన అంశాలను ప్రభావితం చేస్తుందని చెప్పి దీనిపై కోర్టు అన్నివేళలా మౌనంగా వ్యవహరించబోదని స్పష్టం చేసింది. దేశంలో ప్రజలందరికి గోప్యత హక్కు చాలా ముఖ్యమని పేర్కొంది. ప్రజల జీవితాలు మెరుగుకావడానికి సాంకేతిక సాధనమైనప్పటికీ దాని వల్లే గోప్యత ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపింది. ‘గోప్యత అనేది జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలకు మాత్రమే సంబంధించింది కాదు. గోప్యత ఉల్లంఘనల నుంచి ప్రతి పౌరుడికి రక్షణ, భద్రత ఉండాలి. ఇదే వ్యక్తిగత స్వేచ్ఛను ఉయోగించుకునేలా చేస్తుంది‘ అని ధర్మాసనం పేర్కొంది. ఇతర హక్కుల మాదిరిగానే గోప్యత హక్కు కూడా పరిమితులకు లోబడే ఉంటుందని, అవి రాజ్యాంగానికి కట్టుబడి ఉండాలని పేర్కొంది. ఉగ్రవాదంపై పోరాటానికి నిఘా ఎంతో అవసరమని, ఈ పరిస్థితుల్లో వ్యక్తుల గోప్యత హక్కులో జోక్యం చేసుకోవాల్సిన అవసరం వస్తుందని, ఇది జాతీయ భద్రత, ప్రయోజనాల కోసమే నిర్వహించాల్సి ఉంటుందని తెలిపింది. గోప్యత హక్కు ఉల్లంఘన ఆరోపణల విషయంలో సదరు సాంకేతిక పరిజ్ఞానం వినియోగించడం సరైనా సాక్ష్యాధారాల ద్వారానే జరగాలని తెలిపింది. ప్రజాస్వామ్య దేశాల్లో విచక్షణారహితంగా వ్యక్తులపై నిఘా, గూఢచర్యం అనుమతించడానికి వీల్లేదని పేర్కొంది. మీడియాపై నిఘా అనేది పబ్లిక్ వాచ్ డాగ్ పాత్రపై దాడి చేసినట్లుగా ఉంటుందని ధర్మాసనం అభిప్రాయపడింది. ఇలా చేయడం కచ్చితత్వంతో కూడిన నమ్మదగిన సమాచారాన్ని అందించే పత్రిక సామర్థ్యాన్ని అణగదొక్కడమేనని పేర్కొంది. పెగాసస్‌పై తొలి ఆరోపణల నుంచి కేంద్రం తగిన వైఖరి వెల్లడించలేదని, అయినప్పటికీ రెండేళ్లుగా కోర్టు తగిన సమయం ఇచ్చిందని తెలిపింది. జాతీయ భద్రతా సమస్యలను ప్రభావితం చేసే ఏ సమాచారాన్నైనా బహిర్గతం చేయాలని కేంద్రంపై తామెప్పుడు ఒత్తిడి చేయబోమని ధర్మాసనం స్పష్టం చేసింది. కమిటీ సభ్యులు జస్టిస్ ఆర్వీ రవీంద్రన్: ఆంధ్రప్రదేశ్‌లో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తులపై ఇటీవల కుట్ర ఆరోపణలు వచ్చినపుడు విచారణకు నియమితులైన జస్టిస్ ఆర్వీ రవీంద్రన్ ఈ కమిటీకి నేతృత్వం వహిస్తారు. జస్టిస్ రవీంద్రన్ న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ (ఎన్బీఎస్ఏ)కు 2013 నుంచి 2019 వరకూ ఛైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. ఆలోక్ జోషి: 1976 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన ఆలోక్ జోషి ఇంటెలిజెన్స్ బ్యూరో సంయుక్త డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. విశేషమైన దర్యాప్తు అనుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్న వ్యక్తి. రిసెర్చ్, ఎనాలసిస్ వింగ్ (రా)లో కార్యదర్శిగా, నేషనల్ టెక్నికల్ రిసెర్చీ ఆర్గనైజేషన్‌కు ఛైర్మన్‌గానూ బాధ్యతలు నిర్వర్తించారు. జస్టిస్ రవీంద్రన్‌కు సహాయకారిగా ఈ కమిటీలో సభ్యుడిగా సుప్రీంకోర్టు నియమించింది. డాక్టర్ సందీప్ ఒబెరాయ్ : ప్రపంచవ్యాప్తంగా సైబర్ సెక్యురిటీ నిపుణుడుగా గుర్తింపు పొందారు. టీసీఎస్ సైబర్ సెక్యూరిటీస్ సర్వీసెస్ గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. సాఫ్ట్వేర్ ఉత్పత్తుల రంగంలో సదుపాయాల అభివృద్ధికి సబ్ కమిటీ అయిన ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ స్టాండరైజేషన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రో టెక్నికల్ కమిషన్, జాయింట్ టెక్నికల్ కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించారు. సాంకేతిక కమిటీ సభ్యులు డాక్టర్ నవీన్‌కుమార్ చౌధరి: సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ ఫోరెన్సిక్ ప్రొఫెసర్ అయిన నవీన్ కుమార్ గుజరాత్‌లోని నేషనల్ ఫొరెన్సిక్ సైన్సెస్ యూనివర్సిటీ డీన్‌గా పనిచేశారు. రెండు దశాబ్దాలకు పైగా ఉపాధ్యాయుడిగా పనిచేయడంతోపాటు సైబర్ సెక్యూరిటీ ఎనేబులర్‌గా, సైబర్ సెక్యురిటీ నిపుణుడిగా పేరుగాంచారు. సైబర్ సెక్యూరిటీ పాలసీ, నెట్వర్క్, వల్నరబిలిటీ అసెస్మెంట్, పెనట్రేషన్ టెస్టింగ్‌లో అనుభవంగల వారు. డాక్టర్ పి.ప్రభాహరన్: కేరళలోని అమృత విశ్వ విద్యాపీఠంలో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ ప్రభాహరన్. కంప్యూటర్ సైన్స్, సెక్యూరిటీకి సంబంధించి రెండు దశాబ్దాల అనుభవం ఈయన సొంతం. మాల్వేర్ డిటెక్షన్, క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్సెక్యూరిటీ, కాంప్లెక్స్ బైనరీ ఎనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్‌లో నిపుణులు. పలు జర్నల్స్‌లో ప్రభాహరన్ వ్యాసాలు ప్రచురితమయ్యాయి. డాక్టర్ అశ్విన్ అనిల్ గుమస్తే: బాంబే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్‌టెక్నాలజీ (ఐఐటీ)లో కంప్యూటర్‌సైన్స్ ఇంజినీరింగ్‌లో ఇన్స్టిట్యూట్ ఛైర్ అసోసియేట్ ప్రొఫెసర్. ఈయన పేరు మీద 20 యూఎస్ పేటెంట్లు ఉన్నాయి. 150 పత్రాలు వివిధ «జర్నల్స్‌లో ప్రచురితం కాగా మూడు పుస్తకాలు రాశారు. విక్రమ్‌సారాభాయ్ అవార్డు (2012), శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు (2018)లో అందుకొన్నారు. అమెరికాలోని మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విజిటింగ్ ప్రొఫెసర్. పరిశీలించే అంశాలు... భారతీయుల ఫోన్లు, ఇతరత్రా పరికరాలను పెగాసస్ స్పైవేర్‌ను వినియోగించి వారి సంభాషణలను ఆలకించడం, ఫోన్లలో నిల్వ ఉన్న సమాచారాన్ని సేకరించడం, లేదా ఇతరత్రా ప్రయోజనాల కోసం వినియోగించడం కేంద్ర ప్రభుత్వం చేసిందా?. అలా చేస్తే బాధితుల వివరాలు ఏంటి? పెగాసస్ వినియోగించి 2019లో భారతీయుల వాట్సాప్ ఖాతాలు హ్యాకింగ్‌కు గురైనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది, ఏయే చర్యలు తీసుకుంది ?. కేంద్రం పెగాసస్ సహా ఏ తరహావైనా స్పైవేర్లను కలిగి ఉందా? భారతీయులపై కేంద్ర దర్యాప్తు సంస్థ దాన్ని వినియోగించిందా?. ఒకవేళ కేంద్ర దర్యాప్తు సంస్థ భారతీయులపై ఆ తరహా స్పైవేర్‌ను వినియోగించి ఉంటే ఏ చట్ట ప్రకారం, ఏ నిబంధనల ప్రకారం లేదా ప్రోటోకాల్, న్యాయ సంబంధిత అంశం ద్వారా చేపట్టింది? భారతదేశానికి సంబంధించిన సంస్థ/వ్యక్తులు స్పైవేర్ వినియోగించినట్లైతే వారికి ఉన్న అధికారం ఏంటి? ఇతరత్రా సంబంధిత అంశాలు, ఆధారాలు ఏమైనా ఉన్నాయా? అనేది కమిటీ పరిశీలించాలి. -
కన్నీటి రుచి తెలిసింది మాకే
మధ్యప్రదేశ్‌లో ఓ కుగ్రామం. పేరు కుంజన్ పూర్వ. అక్కడ దాదాపుగా అన్ని కుటుంబాలూ చదువుసంధ్యల పట్ల పెద్దగా పట్టింపులేనివే. పుట్టింది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తవారింట్లో వదిలి పెడదామా అనే ధ్యాస తప్ప ఆడపిల్లను కూడా చదివిద్దాం అనే ఆలోచన ఏ మాత్రం లేని అనేక కుటుంబాల్లో అదీ ఓ కుటుంబం. తన చుట్టూ చాలామంది ఆడపిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా పన్నెండేళ్లకే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో తన ఆలోచనలకు పరిసమాప్తి పలికి వంటగది కే పరిమితమై ఉంటే ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రత్యేకతా ఉండేది కాదు. అయితే ఆమె వేసిన అభ్యుదయపు అడుగులే కవితాదేవి అనే ఒక సామాన్య దళిత మహిళను ఈ రోజు ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ను చేశాయి. కన్నీటి రుచి తెలిసింది మాకే కవితాదేవి ‘ఖబర్ లహరియా’ అనే పత్రికకు ఎడిటర్. ఆమె స్థాపించిన డిజిటల్ రూరల్ నెట్‌వర్క్‌లో ముప్పై మంది రిపోర్టర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. రిపోర్టందరూ మహిళలే ఎందుకని ఆమెను అడిగిన వాళ్లకు ‘మా వెనుకబడిన ప్రాంతంలో జర్నలిజం మగవాళ్ల కే పరిమితం అనే అపోహ ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఆ అపోహను తుడిచేయడానికే’ అంటారామె. అలాగే ‘మా పత్రికలో ప్రధానం గా మహిళల సమస్యలను, ముఖ్యంగా దళిత మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలనే ప్రస్తావిస్తాం. అలాగే కష్టాలకు ఎదురు నిలిచి మేము సాధించిన విజయాలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. మగవాళ్లకు అది చిన్న విజయంగా తోచవచ్చు. కానీ మా కష్టాలు మాకే బాగా అర్థమవుతాయి. మా చిన్న గెలుపు కూడా మాకు గొప్పగానే ఉంటుంది. మాకు ఎదురయ్యే కష్టం మరో మగవాడి నుంచే. ఒక మగవాడి కారణంగా మాకు కలిగే బాధను మరో మగవాడు మనసు పెట్టి అర్థం చేసుకోగలడా అనేది కూడా సందేహమే. కన్నీళ్ల రుచి ఎరిగిన మగవాళ్లు ఎంతమంది ఉంటారు? అందుకే మా పత్రిక కు వార్తలను, వార్తాకథనాలను అందించే రిపోర్టర్లందరూ మహిళలే’ అంటూ సున్నితమైన మరో కారణాన్ని కూడా వివరించారు కవితాదేవి. ఇలా మొదలైంది కవితాదేవి పెళ్లయి అత్తగారింట్లో అయోమయంగా రోజులు గడుపుతున్న కాలమది. దళిత వాడల్లో మహిళలకు ఎదురయ్యే కష్టాలను అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి ఒక ఎన్జీవో వచ్చింది. ఆ ఎన్జీవో సభ్యులు ఉత్సాహవంతులైన మహిళలకు వార్తలు రాయడంలో శిక్షణనిచ్చారు. ఆ శిక్షణకు హాజరు కావడం కోసం ఇంట్లో వాళ్ల అనుమతి కావాలి. అనుమతి సంపాదించడం కవితాదేవికి ఒక పోరాటమే అయింది. శిక్షణ తర్వాత బుందేలీ భాషలో విడుదలయ్యే ‘మహిళాదకియా’ మంత్లీ న్యూస్‌లెటర్‌కు రిపోర్టర్‌గా సేవలందించింది కవితాదేవి. ఉత్తరప్రదేశ్‌లోని కుగ్రామాల మహిళలకు ఆ పత్రిక ఒక ఆశ్చర్యం, తమ గురించి కూడా పేపర్లో అచ్చు కావడం వాళ్లకు పెద్ద అబ్బురం. పత్రిక కోసం ఎదురు చూడడం అలవాటైంది వాళ్లకు. కొంతకాలానికి ఆ పత్రిక ఆగిపోవడంతో తీవ్రమైన నిరుత్సాహానికి లోనయ్యారంతా. అప్పుడు కవితాదేవి ఢిల్లీకి చెందిన మరో ఎన్జీవో సహకారంతో తనే స్వయంగా ‘ఖబర్ లహరియా’ అనే డిజిటల్ మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రధాన స్రవంతి మీడియా దృష్టి పెట్టని మహిళల కష్టాలను మహిళ కళ్లతో చూసి, మహిళ మనసుతో అర్థం చేసుకుని అక్షరీకరించడం వల్లనే తమ పత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొందిందని చెబుతారు కవితాదేవి. ప్రస్తుతం ఖబర్ లహరియాకు వివిధ డిజిటల్ మాధ్యమాల్లో కోటి మంది పాఠకులున్నారు. -
గుజరాతీ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు
అహ్మదాబాద్ : గుజరాత్‌లోని ఓ న్యూస్ పోర్టల్ ఎడిటర్‌పై దేశద్రోహం కేసు నమోదైంది. బీజేపీ అధిష్టానం గుజరాత్లో నాయకత్వ మార్పు చేసే అవకాశం ఉందనే వార్తకు సంబంధించి పోలీసులు ఈ కేసు నమోదుచేశారు. వివరాల్లోకి వెళితే.. గుజరాత్‌కు చెందిన ఫేస్ ఆఫ్ నేషన్ అనే న్యూస్ పోర్టల్‌కు ధావల్ పటేల్ అనే వ్యక్తి ఎడిటర్‌గా ఉన్నారు. మే 7వ తేదీన ఆ న్యూస్ పోర్టల్‌లో ప్రచురితమైన ఓ ఆర్టికల్‌లో గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీని తొలగించి ఆయన స్థానంలో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాను నియమించే ఆలోచనలో బీజేపీ అధినాయకత్వం ఉందని పేర్కొన్నారు. కరోనాను అదుపు చేయడంలో విజయ్ రూపానీ విఫలం కావడంతోనే ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్టు తెలిపారు. అయితే ఈ వార్తలను కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియా ఖండించారు. (చదవండి : సుప్రీంకోర్టు సెలవుల రద్దు!) ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఐపీసీ సెక్షన్ 124(ఏ) కింద ధావల్‌పై దేశద్రోహం కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం ధావల్‌ను అహ్మదాబాద్‌లోని ఆయన నివాసంలోనే అదుపులోకి తీసుకున్నారు. ‘ధావల్ తన వెబ్ పోర్టల్ ద్వారా రాష్ట్రంలో, సమాజంలో అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. దీనిపై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రాథమిక దర్యాప్తు పూర్తిచేశారు. ఆ తర్వాత ధావల్‌పై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు’ అని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ ఏసీపీ బీవీ గోహిల్ తెలిపారు. అయితే ధావల్‌పై పోలీసు చర్యను ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా ఖండించింది. దేశంలోని పలుచోట్ల జర్నలిస్టులను ఇబ్బంది పెట్టేలా క్రిమినల్ చట్టాలను దుర్వినియోగపరచడం పెరుగుతోందని ఎడిటర్స్ గిల్డ్ అభిప్రాయపడింది. (చదవండి : మొదటి రైలు: నిబంధనల ఉల్లంఘన) -
పీసీఐ, ఎడిటర్స్ గిల్డ్‌పై సుప్రీం అసంతృప్తి
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్‌లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్బీఎస్ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్బీఎస్ఏ లాయర్‌ను ప్రశ్నించింది. -
గౌరీలంకేశ్ హత్యపై దిగ్భ్రాంతి
తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు సర్వత్రా పెల్లుబుక్కుతున్న నిరసన న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ జర్నలిస్టు గౌరీలంకేశ్ హత్యపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. అత్యంత కిరాతకంగా జరిగిన ఆమె హత్యపై పాత్రికేయ లోకం భగ్గుమంటోంది. ఆమెను కాల్చిచంపిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ దేశవ్యాప్తంగా జర్నలిస్టులు నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. గౌరీలంకేశ్ హత్యను ఐండియన్ జర్నలిస్ట్ యూనియన్ (ఐజేయూ) ఖండించింది. గౌరీ హత్య ప్రజాస్వామ్యంపై దాడిగా చూడాలని పేర్కొంది. ఇలాంటి దాడులను జర్నలిస్టులంతా ముక్తకంఠంతో ఖండించాలని ఐజేయూ అధ్యక్షుడు ఎస్ఎన్ సిన్హా, ప్రధాన కార్యదర్శి దేవులపల్లి అమర్ పిలుపునిచ్చారు. గౌరీలంకేశ్ హత్యపై ఎడిటర్స్ గిల్డ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేసి.. అసమ్మతి వాదాన్ని వినిపించిన ఆమెను హత్య చేయడమంటే.. భావప్రకటనా స్వేచ్ఛపై కిరాతకంగా దాడిచేయడమేనని ఎడిటర్స్ గిల్డ్ పేర్కొంది. -
భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి
* మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలను ఖండించిన ఎడిటర్స్ గిల్డ్, ఎన్బీఏ న్యూఢిల్లీ: తెలంగాణను గౌరవించని మీడియాను భూమిలో పాతేస్తామంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జాతీయస్థాయి పాత్రికేయ సంఘాలు ఖండించాయి. రెండు చానళ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడేనని విమర్శించాయి. ఈ మేరకు ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా, న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్బీఏ) గురువారం వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. మీడియాకు వ్యతిరేకంగా ఇటీవల తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేపట్టిన పలు చర్యలను తాము పరిశీలించామని... అవన్నీ ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడు ఎన్.రవి తమ ప్రకటనలో పేర్కొన్నారు. మీడియాపై తీవ్ర చర్యలకు పాల్పడవద్దని టీ సర్కారుకు, సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలోని జర్నలిస్టులు స్వేచ్ఛగా పనిచేయాలని పిలుపిచ్చారు. మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర దిగ్భ్రాంతి కలిగించాయని ఎన్బీఏ పేర్కొంది. తెలంగాణ లో కొన్ని చానళ్లను కేబుల్ ఆపరేటర్లు నిలిపేయ డం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరింది. తీవ్ర అభ్యంతరకరం: కట్జూ మీడియాపై కేసీఆర్ వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరమని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ మార్కండేయ కట్జూ వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో అలాంటివి సరికాదంటూ గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. టీవీ చానెళ్లు తప్పుడు వ్యాఖ్యలు చేయడం సరికాదని, స్వీయ నియంత్రణ పాటించాలని సూచించారు.