విద్వేషాగ్నిని రెచ్చగొట్టి, విధ్వంసానికి పాల్పడి, మహిళల్ని నగ్నంగా ఊరేగించిన వారిపై కేసులు పెట్టి, ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడానికి పాలకులకు వారాలు, నెలలు పడుతుంది. కానీ, నిజ నిర్ధారణ కమిటీలో భాగంగా వాస్తవ స్థితిని బాహ్య ప్రపంచానికి వెల్లడించి, తప్పులను ఎత్తిచూపిన పత్రికా ప్రముఖులపై కేసులు పెట్టడమైతే మాత్రం తక్షణమే జరిగిపోతుంది.
ఘనత వహించిన మన మణిపుర్ పాలకుల తీరు ఇది. కేసులు మీద పడ్డ జర్నలిస్టులు చివరకు దేశ అత్యున్నత న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తే కానీ బుధవారం తాత్కాలిక రక్షణ, సాంత్వన లభించని పరిస్థితి. ఒక్కమాటలో తెచ్చిన సమాచారం వినకుండా, ఆ సమాచారం తెచ్చిన దూతను పాలకులు కొట్టడమంటే ఇదే!
ఈశాన్య రాష్ట్రంలోని ఘర్షణలపై మీడియాలో వార్తల నివేదన ఎలా ఉందన్న అంశంపై ఎడిటర్స్ గిల్డ్ ఆఫ్ ఇండియా నిజనిర్ధారణ సంఘం శనివారం వెలువరించిన నివేదిక ఇంత రచ్చకు దారి తీసింది. సదరు నివేదిక పక్షపాత వైఖరితో, తప్పుదోవ పట్టించేలా ఉందని ఆరోపిస్తూ, ఓ సోషల్ మీడియా ఉద్యమకారుడు కేసు పెట్టారు.
రాష్ట్ర ప్రభుత్వం కూడా కేసు పెట్టడంతో నిజనిర్ధారణ సంఘంలోని ముగ్గురు సభ్యుల పైన, అలాగే ఎడిటర్స్ గిల్డ్ అధ్యక్షుడిపైన ఒకటికి రెండు ఎఫ్.ఐ.ఆర్.లు దాఖలయ్యాయి. గత నాలుగు నెలల్లో మణిపూర్‌లో పరిస్థితిపైన నోరు విప్పి మాట్లాడడానికి తీరిక లేని ఆ రాష్ట్ర సీఎంకు ఈ విషయంపై మాత్రం విలేఖరులందరినీ కూర్చోబెట్టుకొని మనసులో మాట పంచుకొనే తీరిక, ఓపిక వచ్చాయి. ఎడిటర్స్ గిల్డ్‌ను తీవ్రస్వరంతో హెచ్చరించే సాహసమూ చేశారు.
నిజానికి, మెజారిటీ వర్గమైన మైతేయ్‌లకూ, మైనారిటీలైన కుకీ–చిన్‌లకూ మధ్య ఘర్షణలో మణిపుర్ మీడియా ‘మెయితీల మీడియా’గా మారి పక్షపాత వైఖరితో ప్రవర్తిస్తోందని క్షేత్రస్థాయిలో పర్యటించి ఎడిటర్స్ గిల్డ్ అందించిన నిజనిర్ధారణ సంఘం తన నివేదికలో పేర్కొంది. ఆ మేరకు భారత ఆర్మీకి చెందిన 3వ కోర్ దళం కేంద్రకార్యాలయం సహా వివిధ వర్గాల నుంచి ఫిర్యాదు లొచ్చాయనీ గిల్డ్ తెలిపింది. ఇంటర్నెట్‌పై నిషేధంతో మణిపుర్ నుంచి వార్తల నివేదన కష్టమైందని అభిప్రాయపడింది.
మీడియా ఫేక్‌న్యూస్ అందిస్తూ, తప్పుడు సమాచారాన్ని వ్యాపింపజేస్తున్నట్టు కనీసం 10 సందర్భాల్లో తమ ఫ్యాక్ట్–చెకింగ్ బృందం తేల్చినట్టు వెల్లడించింది. మణిపూర్ సర్కార్ మాత్రం ఈ నివేదిక అవాస్తవమనీ, ప్రాయోజితమనీ, వండి వడ్డించినదనీ ఆరోపిస్తోంది. తగల బడుతున్న ఓ భవనాన్ని కుకీల గృహంగా పేర్కొన్నారనీ, నిజానికది ఓ అటవీ అధికారి ఆఫీసనీ, నివేదిక మొత్తం ‘కుకీ తీవ్రవాదుల’ ప్రాయోజితమనేది గిల్డ్‌పై దాఖలైన ఫిర్యాదు. ఫోటో ఎడిటింగ్‌లో ఆ పొరపాటు జరిగిందని గిల్డ్ విచారం వ్యక్తం చేసి, వివరణ ఇచ్చినా కేసులు ఆగలేదు.
మరి, మే 3 నుంచి నాలుగు నెలల పైగా రాష్ట్రం తగలబడుతూ, కనీసం 160 మందికి పైగా ప్రాణాలు కోల్పోయి, వేలమంది నిరాశ్రయులైనా నిమ్మకు నీరెత్తిన నీరో చక్రవర్తిని తలపిస్తున్న పాల కులపై ఎన్ని కేసులు పెట్టాలి? విధి నిర్వహణలో, శాంతిభద్రతల పరిరక్షణలో పూర్తిగా విఫలమైనా సరే నైతిక బాధ్యత వహించక కుర్చీ పట్టుకు వేళ్ళాడుతున్న సీఎంను ఏమనాలి? అందరినీ సమభావంతో చూడాల్సిన సదరు వ్యక్తే తాను ఒక వర్గానికి ప్రతినిధి అన్నట్టు నిర్లజ్జగా వ్యవహరించడాన్ని ఎలా సమర్థించాలి? ఇళ్ళు, స్కూళ్ళు, చర్చీలు తగలబడుతూ ఘర్షణలు రేగుతున్నా అంతా ప్రశాంతంగా ఉందనీ, సాధారణ పరిస్థితులు తిరిగొస్తున్నాయనీ అసత్యాలు చెబుతుంటే సిసలైన జర్నలిస్టులు ఏం చేయాలి?
ఎప్పుడైనా, ఎక్కడైనా ఏకపక్షంగా వార్తలు రాస్తూ, వాస్తవాలను వక్రీకరించడం ఘోరం, నేరం. ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభమైన పత్రికారంగంలో అలాంటి పగుళ్ళు పెరిగితే, ప్రజాస్వామ్య సౌధం కుప్పకూలుతుంది. అస్సామ్ రైఫిల్స్‌పై నిరంతర దుష్ప్రచారం అందుకు చిరు ఉదాహరణ. ఘర్షణలకు సరిగ్గా రెండు నెలల ముందే కుకీ వేర్పాటువాద బృందాలతో కాల్పుల విరమణ ఒప్పందం లాంటి త్రైపాక్షిక ‘చర్యల సస్పెన్షన్’ ఒప్పందం నుంచి బీజేపీ రాష్ట్ర సర్కార్ ఎందుకు ఉపసంహరించుకుందన్నది దేవరహస్యం.
ఇలాంటి వాస్తవాల్ని గిల్డ్ నివేదిక ఎత్తిచూపితే, కేసులు వేయడం ఏ రకమైన ప్రజాస్వామ్యం? కానీ, ప్రజాస్వామ్యంలో ఆరు నెలలకు ఒకసారైనా అసెంబ్లీ సమావేశం కావాలన్న రాజ్యాంగ నిబంధనను ఉల్లంఘిస్తే తిప్పలొస్తాయని పాలకులు తంటాలు పడ్డారు. రాష్ట్రం తగలబడుతున్నా భేటీ కాని సభ గత నెలాఖరులో ఒక్కరోజే అదీ 11 నిమిషాలే సమావేశమైంది.
ఎడిటర్స్ గిల్డ్ వెలువరించిన నివేదికలో అవాస్తవాలు ఉంటే ప్రభుత్వం ఆ మాటే స్పష్టం చేయవచ్చు. అసలు నిజాలేమిటో బహిరంగంగా వివరించి, ఎడిటర్ల బృందం తప్పని నిరూపించనూ వచ్చు. అంతేకానీ, క్షేత్రస్థాయి పర్యటనతో వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రయత్నిస్తే ‘మరిన్ని ఘర్షణల్ని ప్రోత్సహిస్తున్నార’నడం సమర్థనీయం కాదు. మీడియా పనితీరుకు పరిమితం కాక, ఘర్షణలకు కారణాల్నీ గిల్డ్ పరిశీలించడమేమిటని ప్రశ్నించడమూ అర్థరహితం. పైపెచ్చు, అదే నేరమన్నట్టు క్రిమినల్ ఛార్జీలు నమోదు చేయడం ఏ రకంగానూ సరికాదు.
ఈ వైఖరి అప్రజాస్వామికం, తర్కరహితమే కాదు, అక్షరాలా అధికార దుర్వినియోగం! మణిపుర్ సర్కార్ ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. ఎడిటర్స్ గిల్డ్ ప్రతినిధులపై కేసును ఉపసంహరించుకోవాలి. ముదిరిన జాతి విద్వేషాల్ని తగ్గించడమెలాగన్న దానిపై దృష్టి పెట్టాలి. ఆ అసలు సమస్యను వదిలేసి, కొసరు కథను పట్టుకొని వేళ్ళాడడం ప్రజలకూ, ప్రజాస్వామానికీ ఏ విధంగానూ మేలు చేయదు. కానీ, మన పాలకులు ఇవన్నీ చెవికెక్కించుకొనే స్థితిలో ఉన్నారా అన్నది బేతాళ ప్రశ్న.
నిజం చెబితే నేరమా?
Published Thu, Sep 7 2023 12:20 AM | Last Updated on Thu, Sep 7 2023 6:50 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment