మధ్యప్రదేశ్‌లో ఓ కుగ్రామం. పేరు కుంజన్ పూర్వ. అక్కడ దాదాపుగా అన్ని కుటుంబాలూ చదువుసంధ్యల పట్ల పెద్దగా పట్టింపులేనివే. పుట్టింది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తవారింట్లో వదిలి పెడదామా అనే ధ్యాస తప్ప ఆడపిల్లను కూడా చదివిద్దాం అనే ఆలోచన ఏ మాత్రం లేని అనేక కుటుంబాల్లో అదీ ఓ కుటుంబం. తన చుట్టూ చాలామంది ఆడపిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా పన్నెండేళ్లకే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో తన ఆలోచనలకు పరిసమాప్తి పలికి వంటగది కే పరిమితమై ఉంటే ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రత్యేకతా ఉండేది కాదు. అయితే ఆమె వేసిన అభ్యుదయపు అడుగులే కవితాదేవి అనే ఒక సామాన్య దళిత మహిళను ఈ రోజు ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ను చేశాయి.
కన్నీటి రుచి తెలిసింది మాకే
కవితాదేవి ‘ఖబర్ లహరియా’ అనే పత్రికకు ఎడిటర్. ఆమె స్థాపించిన డిజిటల్ రూరల్ నెట్‌వర్క్‌లో ముప్పై మంది రిపోర్టర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. రిపోర్టందరూ మహిళలే ఎందుకని ఆమెను అడిగిన వాళ్లకు ‘మా వెనుకబడిన ప్రాంతంలో జర్నలిజం మగవాళ్ల కే పరిమితం అనే అపోహ ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఆ అపోహను తుడిచేయడానికే’ అంటారామె. అలాగే ‘మా పత్రికలో ప్రధానం గా మహిళల సమస్యలను, ముఖ్యంగా దళిత మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలనే ప్రస్తావిస్తాం. అలాగే కష్టాలకు ఎదురు నిలిచి మేము సాధించిన విజయాలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. మగవాళ్లకు అది చిన్న విజయంగా తోచవచ్చు. కానీ మా కష్టాలు మాకే బాగా అర్థమవుతాయి. మా చిన్న గెలుపు కూడా మాకు గొప్పగానే ఉంటుంది. మాకు ఎదురయ్యే కష్టం మరో మగవాడి నుంచే. ఒక మగవాడి కారణంగా మాకు కలిగే బాధను మరో మగవాడు మనసు పెట్టి అర్థం చేసుకోగలడా అనేది కూడా సందేహమే. కన్నీళ్ల రుచి ఎరిగిన మగవాళ్లు ఎంతమంది ఉంటారు? అందుకే మా పత్రిక కు వార్తలను, వార్తాకథనాలను అందించే రిపోర్టర్లందరూ మహిళలే’ అంటూ సున్నితమైన మరో కారణాన్ని కూడా వివరించారు కవితాదేవి.
ఇలా మొదలైంది
కవితాదేవి పెళ్లయి అత్తగారింట్లో అయోమయంగా రోజులు గడుపుతున్న కాలమది. దళిత వాడల్లో మహిళలకు ఎదురయ్యే కష్టాలను అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి ఒక ఎన్‌జీవో వచ్చింది. ఆ ఎన్‌జీవో సభ్యులు ఉత్సాహవంతులైన మహిళలకు వార్తలు రాయడంలో శిక్షణనిచ్చారు. ఆ శిక్షణకు హాజరు కావడం కోసం ఇంట్లో వాళ్ల అనుమతి కావాలి. అనుమతి సంపాదించడం కవితాదేవికి ఒక పోరాటమే అయింది. శిక్షణ తర్వాత బుందేలీ భాషలో విడుదలయ్యే ‘మహిళాదకియా’ మంత్లీ న్యూస్‌లెటర్‌కు రిపోర్టర్‌గా సేవలందించింది కవితాదేవి. ఉత్తరప్రదేశ్‌లోని కుగ్రామాల మహిళలకు ఆ పత్రిక ఒక ఆశ్చర్యం, తమ గురించి కూడా పేపర్‌లో అచ్చు కావడం వాళ్లకు పెద్ద అబ్బురం. పత్రిక కోసం ఎదురు చూడడం అలవాటైంది వాళ్లకు. కొంతకాలానికి ఆ పత్రిక ఆగిపోవడంతో తీవ్రమైన నిరుత్సాహానికి లోనయ్యారంతా. అప్పుడు కవితాదేవి ఢిల్లీకి చెందిన మరో ఎన్‌జీవో సహకారంతో తనే స్వయంగా ‘ఖబర్ లహరియా’ అనే డిజిటల్ మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రధాన స్రవంతి మీడియా దృష్టి పెట్టని మహిళల కష్టాలను మహిళ కళ్లతో చూసి, మహిళ మనసుతో అర్థం చేసుకుని అక్షరీకరించడం వల్లనే తమ పత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొందిందని చెబుతారు కవితాదేవి. ప్రస్తుతం ఖబర్ లహరియాకు వివిధ డిజిటల్ మాధ్యమాల్లో కోటి మంది పాఠకులున్నారు.
కన్నీటి రుచి తెలిసింది మాకే
Published Sat, Feb 13 2021 12:53 AM | Last Updated on Sat, Feb 13 2021 3:36 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment