women reporters
-
కన్నీటి రుచి తెలిసింది మాకే
మధ్యప్రదేశ్‌లో ఓ కుగ్రామం. పేరు కుంజన్ పూర్వ. అక్కడ దాదాపుగా అన్ని కుటుంబాలూ చదువుసంధ్యల పట్ల పెద్దగా పట్టింపులేనివే. పుట్టింది ఆడపిల్ల అని తెలిసినప్పటి నుంచి ఎంత త్వరగా పెళ్లి చేసి అత్తవారింట్లో వదిలి పెడదామా అనే ధ్యాస తప్ప ఆడపిల్లను కూడా చదివిద్దాం అనే ఆలోచన ఏ మాత్రం లేని అనేక కుటుంబాల్లో అదీ ఓ కుటుంబం. తన చుట్టూ చాలామంది ఆడపిల్లల్లాగానే ఈ అమ్మాయి కూడా పన్నెండేళ్లకే పెళ్లి పీటల మీద కూర్చోవాల్సి వచ్చింది. అక్కడితో తన ఆలోచనలకు పరిసమాప్తి పలికి వంటగది కే పరిమితమై ఉంటే ఈ రోజు ఆమె గురించి మాట్లాడుకోవడానికి ఏ ప్రత్యేకతా ఉండేది కాదు. అయితే ఆమె వేసిన అభ్యుదయపు అడుగులే కవితాదేవి అనే ఒక సామాన్య దళిత మహిళను ఈ రోజు ఎడిటర్స్ గిల్డ్ మెంబర్‌ను చేశాయి. కన్నీటి రుచి తెలిసింది మాకే కవితాదేవి ‘ఖబర్ లహరియా’ అనే పత్రికకు ఎడిటర్. ఆమె స్థాపించిన డిజిటల్ రూరల్ నెట్‌వర్క్‌లో ముప్పై మంది రిపోర్టర్లు సేవలందిస్తున్నారు. అందరూ మహిళలే. రిపోర్టందరూ మహిళలే ఎందుకని ఆమెను అడిగిన వాళ్లకు ‘మా వెనుకబడిన ప్రాంతంలో జర్నలిజం మగవాళ్ల కే పరిమితం అనే అపోహ ఇంకా రాజ్యమేలుతూనే ఉంది. ఆ అపోహను తుడిచేయడానికే’ అంటారామె. అలాగే ‘మా పత్రికలో ప్రధానం గా మహిళల సమస్యలను, ముఖ్యంగా దళిత మహిళలు సమాజంలో ఎదుర్కొనే సమస్యలనే ప్రస్తావిస్తాం. అలాగే కష్టాలకు ఎదురు నిలిచి మేము సాధించిన విజయాలను కూడా గొప్పగా చెప్పుకుంటాం. మగవాళ్లకు అది చిన్న విజయంగా తోచవచ్చు. కానీ మా కష్టాలు మాకే బాగా అర్థమవుతాయి. మా చిన్న గెలుపు కూడా మాకు గొప్పగానే ఉంటుంది. మాకు ఎదురయ్యే కష్టం మరో మగవాడి నుంచే. ఒక మగవాడి కారణంగా మాకు కలిగే బాధను మరో మగవాడు మనసు పెట్టి అర్థం చేసుకోగలడా అనేది కూడా సందేహమే. కన్నీళ్ల రుచి ఎరిగిన మగవాళ్లు ఎంతమంది ఉంటారు? అందుకే మా పత్రిక కు వార్తలను, వార్తాకథనాలను అందించే రిపోర్టర్లందరూ మహిళలే’ అంటూ సున్నితమైన మరో కారణాన్ని కూడా వివరించారు కవితాదేవి. ఇలా మొదలైంది కవితాదేవి పెళ్లయి అత్తగారింట్లో అయోమయంగా రోజులు గడుపుతున్న కాలమది. దళిత వాడల్లో మహిళలకు ఎదురయ్యే కష్టాలను అక్షరబద్ధం చేయాలనే ఉద్దేశంతో ఆ గ్రామానికి ఒక ఎన్జీవో వచ్చింది. ఆ ఎన్జీవో సభ్యులు ఉత్సాహవంతులైన మహిళలకు వార్తలు రాయడంలో శిక్షణనిచ్చారు. ఆ శిక్షణకు హాజరు కావడం కోసం ఇంట్లో వాళ్ల అనుమతి కావాలి. అనుమతి సంపాదించడం కవితాదేవికి ఒక పోరాటమే అయింది. శిక్షణ తర్వాత బుందేలీ భాషలో విడుదలయ్యే ‘మహిళాదకియా’ మంత్లీ న్యూస్‌లెటర్‌కు రిపోర్టర్‌గా సేవలందించింది కవితాదేవి. ఉత్తరప్రదేశ్‌లోని కుగ్రామాల మహిళలకు ఆ పత్రిక ఒక ఆశ్చర్యం, తమ గురించి కూడా పేపర్లో అచ్చు కావడం వాళ్లకు పెద్ద అబ్బురం. పత్రిక కోసం ఎదురు చూడడం అలవాటైంది వాళ్లకు. కొంతకాలానికి ఆ పత్రిక ఆగిపోవడంతో తీవ్రమైన నిరుత్సాహానికి లోనయ్యారంతా. అప్పుడు కవితాదేవి ఢిల్లీకి చెందిన మరో ఎన్జీవో సహకారంతో తనే స్వయంగా ‘ఖబర్ లహరియా’ అనే డిజిటల్ మ్యాగజైన్‌ను ప్రారంభించింది. ప్రధాన స్రవంతి మీడియా దృష్టి పెట్టని మహిళల కష్టాలను మహిళ కళ్లతో చూసి, మహిళ మనసుతో అర్థం చేసుకుని అక్షరీకరించడం వల్లనే తమ పత్రిక అనతికాలంలోనే పాఠకాదరణ పొందిందని చెబుతారు కవితాదేవి. ప్రస్తుతం ఖబర్ లహరియాకు వివిధ డిజిటల్ మాధ్యమాల్లో కోటి మంది పాఠకులున్నారు. -
మహిళా రిపోర్టర్లపై ట్రంప్ ఆగ్రహం
వాషింగ్టన్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి దుందుడుకు వైఖరి ప్రదర్శించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఇద్దరు మహిళ రిపోర్టర్లపై ఆయన ఆగ్రహం ప్రదర్శించారు. అందులో ఒక రిపోర్టర్ కరోనా వైరస్ టెస్ట్‌ల గురించి ప్రశ్నించగా.. మరో రిపోర్టర్ అసలు ట్రంప్‌ను ఎలాంటి ప్రశ్న కూడా అడగలేదు. వివరాల్లోకి వెళితే.. కరోనా పరిస్థితులకు సంబంధించి వైట్‌హౌస్ రోస్ గార్డెన్లో అధ్యక్షుడు ట్రంప్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు గంటకు పైగా సాగిన ఈ సమావేశంలో ఆయన పలువురు మీడియా ప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. (చదవండి : ఆగస్టు నాటికి లక్షా 35 వేల కరోనా మరణాలు!) ఈ సందర్భంగా సీబీసీ న్యూస్ కరస్పాండెంట్ వీజియా జియాంగ్.. కరోనా టెస్ట్‌ల గురించి ట్రంప్‌ను ప్రశ్నించారు. చైనీస్ అమెరికన్ అయిన వీజియా.. ‘కరోనా టెస్ట్‌ల విషయంలో అమెరికా అన్ని దేశాలకంటే మెరుగ్గా ఉందని పదేపదే ఎందుకు చెబుతారు?. ఇది చాలా ముఖ్యమైన అంశమా?. ప్రపంచదేశాలతో ఎందుకు పోటీ పడతారు? ప్రతి రోజు ఎంతో మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోతున్నారు. రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి’ అని అడిగారు. దీనికి ట్రంప్ స్పందిస్తూ ప్రపంచంలోని ప్రతి చోట ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారని బదులిచ్చారు. ఆ ప్రశ్న తనను కాదని.. చైనాను అడిగితే బాగుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు.(చదవండి : 5 లక్షల మంది హెచ్ఐవీ రోగులు చనిపోతారు!) అయితే వీజియా ట్రంప్ మాటలను తేలికగా తీసుకోలేదు.. ఇది తనకే ఎందుకు చెబుతున్నారని తిరిగి ప్రశ్నించారు. దీనిపై ట్రంప్ స్పందిస్తూ.. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్పలేదని.. తనను చెత్త ప్రశ్నలు అడిగే వాళ్లందరికీ ఇది వర్తిస్తుందని చెప్పుకొచ్చారు. అయితే ఇదేమీ చెత్త ప్రశ్న కాదని వీజియా వాదనకు దిగారు. ఈలోపే ట్రంప్ ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయ అంటూ.. మిగతా మీడియా ప్రతినిధులను ఉద్దేశించి మాట్లాడారు. ఆ సమయంలో వీజియా తర్వాత వరుసలో ఉన్న సీఎన్ఎన్ రిపోర్టర్.. కైట్లాన్ కాలిన్స్ ట్రంప్‌ను ప్రశ్నించేందుకు ముందుకువచ్చారు. తను రెండు ప్రశ్నలు అడగదలుచుకున్నట్టు ఆమె చెప్పారు. అయితే ట్రంప్ ఉద్దేశపూర్వకంగానే కాలిన్స్‌ను ప్రశ్నలు అడగనివ్వకుండా అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
లైవ్‌లో రిపోర్టర్‌తో వెకిలి చేష్టలు
వాషింగ్టన్: అమెరికాలోని జార్జియాలో ఎన్బీసీ అనుబంధ సంస్థలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా రిపోర్టర్‌కు చేదు అనుభవం ఎదురైంది. నగరంలోని సవన్నా వంతెనపై ఇటివల జరిగిన మారథాన్‌ను అలెక్సా అనే రిపోర్టర్ లైవ్ రిపోర్ట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో ఓ ఆకతాయి ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. మారథాన్‌లో భాగంగా పరిగెత్తుకుంటూ వచ్చిన ఓ వ్యక్తి రిపోర్టర్ వెనుక భాగంపై చెయ్యితో కొట్టాడు. అతని చేష్టలకు ఆ రిపోర్టర్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. అనూహ్య ఘటన నుంచి తేరుకుని కాసేపు అలాగే మౌనంగా ఉండిపోయారు. అనంతరం ఇదే విషయాన్ని ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఏ మహిళా ఉద్యోగి ఇలాంటి చేదు అనుభవాన్ని చవిచూడాలనుకోదు అంటూ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. జరిగిన ఘటనపై ఆమె సవన్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే అప్పటికే తన తప్పును గ్రహించిన థామస్ అనే ఆ ఆకతాయి ఆమె పనిచేస్తున్న కార్యాలయానికి వచ్చి క్షమాపణలు చెప్పాడు. తాను అలా చేసి ఉండకూడదని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. నిజానికి తాను ఆమె భుజంపై తట్టాలనుకున్నానని.. కానీ ఆ సమయంలో అనుకోకుండా ఆమె వెనుక భాగంపై కొట్టానని చెప్పాడు. అయినప్పటికీ రిపోర్టర్ ఫిర్యాదు మేరకు సవన్నా పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
మహిళా రిపోర్టర్‌తో అసభ్య ప్రవర్తన
-
‘దానికోసం ఓ రాత్రి గడిపేందుకైనా సిద్ధపడతారు’
వాషింగ్టన్ : మహిళా రిపోర్టర్లపై ఫాక్స్ న్యూస్ వ్యాఖ్యాత జెస్సీ వాటర్స్ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. కీలకమైన సమాచారం రాబట్టేందు వారు ఎంతకైనా తెగిస్తారని వ్యాఖ్యానించాడు. సోర్స్‌తో ఓ రాత్రి గడిపేందుకు సిద్ధపడతారని ఫాక్స్ న్యూస్ టాక్ షో ‘ది పైవ్’లో చెప్పుకొచ్చాడు. సినిమాలు, టీవీ షోల్లో చూపుతున్నట్టు నిజ జీవితంలో కూడా అలాంటి పాత్రలు ఉంటాయని పేర్కొన్నాడు. తమ సంస్థలో అలీ వాట్కిన్స్ అనే మహిళా రిపోర్టర్ ఇలాంటి పని చేసే నాలుగేళ్లపాటు పొలిటికల్ వార్తల్ని అందరి కన్నా ముందుగా.. గొప్పగా ఇచ్చేదని తెలిపాడు. ఇక అట్లాంటా-జర్నల్ కాన్స్టిట్యూషన్ రిపోర్టర్ కేథీ ష్రగ్స్ జీవితం ఆధారంగా రిచర్డ్ జువెల్ అనే సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. రహస్య సమాచారం కోసం కేథీ ష్రగ్స్ సెక్స్ వ్యాపారం చేసిందనేది కథాంశం. వివాదాస్పద కథాంశంతో వార్తల్లో నిలిచిన రిచర్డ్ జువెల్ సినిమా వాటర్స్ వ్యాఖ్యలతో మరోసారి చర్చనీయాంశమైంది. గతంలోనూ మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన వాటర్స్ తాజా ఘటన నేపథ్యంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నాడు. ఈ ఘటనపై అమెరికన్ టెలివిజన్ వ్యాఖ్యాత ఎస్సీ కప్ ట్విటర్ వేదికగా స్పందించాడు. నిరాధార, నిందారోపణలు చేస్తున్న వాటర్స్ వ్యాఖ్యలు చండాలంగా ఉన్నాయని మండిపడ్డాడు. సొంత సంస్థ మహిళా ఉద్యోగులను అవమాన పరిచిన వాటర్స్ తరపున ఫాక్స్ న్యూస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. -
రోజుకు 90 మిస్డ్ కాల్స్!
మహిళా రిపోర్టర్లకు వేధింపులు అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్లు ఉత్తరప్రదేశ్‌లో కొరవడిన భద్రత న్యూఢిల్లీ/ లక్నో: మహిళా రిపోర్టర్లకు భద్రత కల్పించాల్సిన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో పూర్తిగా మహిళలే నడిపించే పత్రిక 'ఖబర్ లహరియా' లో పనిచేస్తున్న ఐదుగురు రిపోర్టర్లను ఓ ఆగంతకుడు ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. అది కూడా అలా ఇలా కాదు.. రోజుకు దాదాపు 70 నుంచి 90 వరకు మిస్డ్ కాల్స్. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రాత్రి 2 గంటల సమయంలో కూడా ఫోన్లు చేసేవాడు. అది కూడా వేర్వేరు నెంబర్ల నుంచి! నిషు అనే ఆ వ్యక్తి వేధింపులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ వేధింపులపై తాము మొదట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా, వాళ్లు చాలా చిన్న విషయంగా తీసుకున్నారని, తర్వాత వాళ్లకు దీని తీవ్రత అర్థమైందని 'ఖబర్ లహరియా' ఎడిటర్ కవిత చెప్పారు. నిషు తమ టీంలోని ఐదుగురు మహిళలను టార్గెట్‌గా చేసుకుని వేధిస్తున్నాడని కవిత చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. గత మూడు నెలలుగా అతని వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయని, తమను భయపెట్టేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగంలో భాగంగా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని, పని ఒత్తిడితో రాత్రి పొద్దుపోయాక ఇంటికి వెళ్తే.. అలాంటి సమయాల్లో ఇలాంటి కాల్స్ తమకెంతో ఇబ్బంది కలిగించేవని ఆమె చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా అతడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించేవాడని కవిత వెల్లడించారు.