రోజుకు 90 మిస్డ్ కాల్స్!
మహిళా రిపోర్టర్లకు వేధింపులు
అర్ధరాత్రి 2 గంటలకు ఫోన్లు
ఉత్తరప్రదేశ్లో కొరవడిన భద్రత
న్యూఢిల్లీ/ లక్నో: మహిళా రిపోర్టర్లకు భద్రత కల్పించాల్సిన అంశం మరోసారి తెర మీదకు వచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని బందా జిల్లాలో పూర్తిగా మహిళలే నడిపించే పత్రిక 'ఖబర్ లహరియా' లో పనిచేస్తున్న ఐదుగురు రిపోర్టర్లను ఓ ఆగంతకుడు ఫోన్లో వేధించడం మొదలుపెట్టాడు. అది కూడా అలా ఇలా కాదు.. రోజుకు దాదాపు 70 నుంచి 90 వరకు మిస్డ్ కాల్స్. అర్ధరాత్రి, అపరాత్రి అని లేకుండా రాత్రి 2 గంటల సమయంలో కూడా ఫోన్లు చేసేవాడు. అది కూడా వేర్వేరు నెంబర్ల నుంచి! నిషు అనే ఆ వ్యక్తి వేధింపులు భరించలేని స్థాయికి చేరుకోవడంతో వారు పోలీసులను ఆశ్రయించారు. ఈ వేధింపులపై తాము మొదట్లోనే పోలీసులకు ఫిర్యాదు చేసినా, వాళ్లు చాలా చిన్న విషయంగా తీసుకున్నారని, తర్వాత వాళ్లకు దీని తీవ్రత అర్థమైందని 'ఖబర్ లహరియా' ఎడిటర్ కవిత చెప్పారు.
నిషు తమ టీంలోని ఐదుగురు మహిళలను టార్గెట్గా చేసుకుని వేధిస్తున్నాడని కవిత చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి వేధింపులు మొదలయ్యాయని వాపోయారు. గత మూడు నెలలుగా అతని వేధింపులు తారస్థాయికి చేరుకున్నాయని, తమను భయపెట్టేవాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమ ఉద్యోగంలో భాగంగా ఎంతోమందిని ఇంటర్వ్యూ చేయాల్సి వస్తుందని, పని ఒత్తిడితో రాత్రి పొద్దుపోయాక ఇంటికి వెళ్తే.. అలాంటి సమయాల్లో ఇలాంటి కాల్స్ తమకెంతో ఇబ్బంది కలిగించేవని ఆమె చెప్పారు. అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో కూడా అతడు ఫోన్ చేసి అసభ్య పదజాలంతో దూషించేవాడని కవిత వెల్లడించారు.