
క్రైమ్: ఆమె ఒక మహిళా పోలీస్ అధికారి. ‘అయితే ఏంటి..’ అనుకుని వెంటపడ్డాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్‌లో ఉండగానే ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఓ అడుగు ముందుకు వేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. చివరకు.. ఖాకీ పవర్ ధాటికి ఆ ఆకతాయి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది.
కేరళ కొచ్చికి చెందిన ఓ వ్యక్తి.. వనితా పోలీస్ స్టేషన్‌లో పని చేసే ఓ అధికారిణిని చాలా కాలం నుంచి వెంబడిస్తున్నాడట. ఈ క్రమంలో ఏకంగా 300 ఫోన్ కాల్స్ చేసి.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై సీరియస్‌గా దృష్టి సారించిన ఆమె.. రూట్ మార్చింది. తేనె పలుకులు పలికి ట్రాప్ చేసి మరీ అరెస్ట్ చేసింది.
నిందితుడ్ని మంగళవారం ఎర్నాకులం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై మోపబడిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించింది. పదే పదే ఫోన్లు చేసి ఆమెతో పాటు స్టేషన్ సిబ్బందిని కూడా వేధించాడతను. తద్వారా వాళ్ల విధులకు విఘాతం కలిగించాడు. ఓ అధికారిణి వెంటపడడం, లైంగికంగా వేధించడం లాంటి నేరాల కింద ఐపీసీ శిక్షా స్మృతులతో పాటు కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తున్నట్లు ఎర్నాకులం కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఆకతాయికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించింది న్యాయస్థానం.
ఇదీ చదవండి: బట్టలు చింపేస్తుంటే.. వీడియోలు తీశారు!
Comments
Please login to add a commentAdd a comment