woman police station
-
మహిళా పోలీసాఫీసర్‌కు 300 కాల్స్!
క్రైమ్: ఆమె ఒక మహిళా పోలీస్ అధికారి. ‘అయితే ఏంటి..’ అనుకుని వెంటపడ్డాడు. అంతేకాదు పోలీస్ స్టేషన్లో ఉండగానే ఫోన్ కాల్స్ చేసి అసభ్యంగా మాట్లాడాడు. ఓ అడుగు ముందుకు వేసి తన కోరిక తీర్చాలంటూ వేధించాడు. చివరకు.. ఖాకీ పవర్ ధాటికి ఆ ఆకతాయి భారీ మూల్యమే చెల్లించుకోవాల్సి వచ్చింది. కేరళ కొచ్చికి చెందిన ఓ వ్యక్తి.. వనితా పోలీస్ స్టేషన్లో పని చేసే ఓ అధికారిణిని చాలా కాలం నుంచి వెంబడిస్తున్నాడట. ఈ క్రమంలో ఏకంగా 300 ఫోన్ కాల్స్ చేసి.. ఆమెతో అసభ్యంగా మాట్లాడాడు. తన కోరిక తీర్చాలంటూ లైంగికంగా వేధించాడు. దీంతో అతనిపై సీరియస్‌గా దృష్టి సారించిన ఆమె.. రూట్ మార్చింది. తేనె పలుకులు పలికి ట్రాప్ చేసి మరీ అరెస్ట్ చేసింది. నిందితుడ్ని మంగళవారం ఎర్నాకులం కోర్టులో ప్రవేశపెట్టారు. అతనిపై మోపబడిన అభియోగాలను ప్రాసిక్యూషన్ నిరూపించింది. పదే పదే ఫోన్లు చేసి ఆమెతో పాటు స్టేషన్ సిబ్బందిని కూడా వేధించాడతను. తద్వారా వాళ్ల విధులకు విఘాతం కలిగించాడు. ఓ అధికారిణి వెంటపడడం, లైంగికంగా వేధించడం లాంటి నేరాల కింద ఐపీసీ శిక్షా స్మృతులతో పాటు కేరళ పోలీస్ యాక్ట్ ప్రకారం అతనికి శిక్ష విధిస్తున్నట్లు ఎర్నాకులం కోర్టు తీర్పు వెల్లడించింది. ఆ ఆకతాయికి మూడేళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.15వేల జరిమానా విధించింది న్యాయస్థానం. ఇదీ చదవండి: బట్టలు చింపేస్తుంటే.. వీడియోలు తీశారు! -
4 నిమిషాల్లో ‘దిశ’ రక్షణ
నెల్లూరు (క్రైమ్): ఆటోడ్రైవర్ ప్రవర్తనను అనుమానించి ఆటోలోంచి దూకేసిన యువతిని 4 నిమిషాల్లోనే పోలీసులు ఆదుకున్నారు. దిశ యాప్ ఆ యువతికి నిమిషాల్లోనే రక్షణ కల్పించింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలం నెల్లబల్లి వద్ద జాతీయ రహదారిపై శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది. డీఐజీ త్రివిక్రమవర్మ, జిల్లా ఎస్పీ సీహెచ్ విజయారావు ఆదివారం నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈ వివరాలు తెలిపారు. ప్రకాశం జిల్లా మార్కాపురానికి చెందిన యువతి శ్రీసిటీలో ఉద్యోగం చేస్తూ సూళ్లూరుపేటలో తన సహచరులతో కలిసి నివాసం ఉంటోంది. ఇటీవల మార్కాపురం వెళ్లిన ఆమె శనివారం సూళ్లూరుపేటకు బయలుదేరింది. రాత్రి 9.25 గంటలకు నాయుడుపేటలో బస్సు దిగింది. సూళ్లూరుపేట వెళ్లేందుకు 10.30 గంటల వరకు చూసినా బస్సు లేకపోవడంతో బస్టాండ్ బయటకు వచ్చి ఆటో మాట్లాడుకుంది. ఒంటరిగా వెళ్లలేక ప్రయాణికులను ఎక్కించుకోమని డ్రైవర్‌కు సూచించింది. బైపాస్ వద్ద ఎక్కించుకుంటానని చెప్పిన ఆటో డ్రైవర్ ఎవరినీ ఎక్కించుకోకుండా వేగంగా వెళ్లసాగాడు. అతడి ప్రవర్తనను అనుమానించిన ఆమె బస్‌స్టాప్ వద్ద ఆపమని కోరినా అతడు పట్టించుకోకుండా వెళ్లసాగాడు. దీంతో ఆ యువతి ఈ విషయాన్ని ఫోన్లో తన సోదరికి తెలిపి, నెల్లబల్లి వద్ద ఆటోలోంచి దూకేసింది. బాధిత యువతి సోదరి తన స్నేహితురాలి మొబైల్లోని దిశ యాప్‌ను ఓపెన్ చేసి ఎస్‌వోఎస్ బటన్ నొక్కి పోలీసులకు సమాచారం ఇచ్చింది. బాధిత యువతి ఫోన్ నంబరు తెలిపింది. నెల్లూరు పోలీసు కమాండ్ కంట్రోల్ నుంచి 10.38 గంటలకు సమాచారం అందుకున్న హైవే మొబైల్ పోలీసులు 10.40 గంటలకు బాధిత యువతితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. దొరవారిసత్రం పోలీసులు, హైవే మొబైల్ సిబ్బంది 10.42 గంటలకు యువతి వద్దకు చేరుకుని ఆమెను తమ వాహనంలో ఎక్కించుకుని సురక్షితంగా సూళ్లూరుపేటలోని ఆమె సోదరి వద్దకు తీసుకెళ్లారు. నిమిషాల్లోనే యువతిని రక్షించిన పోలీసు సిబ్బందిని, అధికారుల్ని డీఐజీ, ఎస్పీ అభినందించారు. బాధిత యువతి, ఆమె సోదరి పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. దిశ యాప్ తమను రక్షించిందని పేర్కొన్నారు. -
498ఏ కింద గర్ల్‌ఫ్రెండ్‌ను విచారించేందుకు వీల్లేదు..
సాక్షి, అమరావతి: గర్ల్‌ఫ్రెండ్‌ను ఐపీసీ సెక్షన్ 498ఏ (మహిళను వేధింపులకు గురిచేయడం) కింద విచారించేందుకు వీల్లేదని హైకోర్టు తేల్చి చెప్పింది. రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే ఈ సెక్షన్ కింద విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేసింది. భర్త సంబంధీకుల్లోకి గర్ల్‌ఫ్రెండ్ రాదని, అందువల్ల ఆమెను 498ఏ కింద విచారించడానికి వీల్లేదంది. ఓ వ్యక్తి గర్ల్‌ఫ్రెండ్‌పై పోలీసులు సెక్షన్ 498ఏ కింద నమోదు చేసిన కేసులో తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ హైకోర్టు ఉత్తర్వులిచ్చింది. అరెస్ట్‌తో సహా ఎలాంటి ఇతర కఠిన చర్యలేవీ తీసుకోవద్దని ఆదేశించింది. మిగిలిన నిందితులపై దర్యాప్తు కొనసాగించుకోవచ్చంది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్‌రాయ్ ఇటీవల ఉత్తర్వులిచ్చారు. తనను వేధిస్తున్నారంటూ కొమ్మి సునీత.. భర్త ధర్మయ్య, ఆయన కుటుంబ సభ్యులతో పాటు, భర్తకు గర్ల్‌ఫ్రెండ్‌గా ఉన్న ఓ యువతిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో దిశా మహిళా పోలీసులు ఆ యువతిపై కేసు నమోదు చేసి, రెండో నిందితురాలిగా చేర్చారు. దిశా పోలీసులు నమోదు చేసిన ఈ ఎఫ్ఐఆర్ను కొట్టేయాలని కోరుతూ ఆ యువతి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్ మానవేంద్రనాథ్‌రాయ్ విచారణ జరిపారు. వివాదంలోకి పిటిషనర్‌ను అనవసరంగా లాగారు.. పిటిషనర్(యువతి) తరఫు న్యాయవాది వంకాయలపాటి నాగప్రవీణ్ వాదనలు వినిపిస్తూ.. ఫిర్యాదుదారు సునీత, ఆమె భర్త ధర్మయ్యకు మధ్య ఉన్న గొడవల్లో పైచేయి సాధించేందుకు వారి మధ్య వివాదంలోకి పిటిషనర్‌ను లాగారని తెలిపారు. ఫిర్యాదుదారు చెబుతున్న వేధింపులతో పిటిషనర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. సెక్షన్ 498ఏ ప్రకారం భర్త, ఆయన బంధువులపై మాత్రమే వేధింపుల కేసు పెట్టేందుకు అవకాశం ఉంటుందని, అయితే పిటిషనర్ ఏ రకంగానూ ఫిర్యాదుదారు భర్తకు బంధువు కాదని తెలిపారు. అందువల్ల పిటిషనర్‌పై పోలీసులు పెట్టిన కేసు చెల్లదని చెప్పారు. ఈ వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం చేసుకునేంత బలంగా పిటిషనర్ వాదనలున్నాయన్నారు. 498ఏ కింద రక్త సంబంధం లేదా వివాహం ద్వారా భర్తకు బంధువులైన వారిని మాత్రమే విచారించేందుకు వీలుంటుందని స్పష్టం చేశారు. తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేశారు. -
నంద్యాల, ఆదోనిలో మహిళా పోలీస్స్టేషన్లు
– జిల్లాలో 4600 కేసులు పెండింగ్ – చోరీ కేసుల రికవరీకి ప్రత్యేక బృందాలు – సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేక దృష్టి – జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి వెల్లడి కోవెలకుంట్ల: జిల్లాలోని నంద్యాల, ఆదోని పట్టణాల్లో మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపనున్నట్లు జిల్లా ఎస్పీ గోపినాథ్ జట్టి చెప్పారు. సోమవారం సాయంత్రం స్థానిక సర్కిల్ కార్యాలయాన్ని ఆయన తనిఖీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ స్టేషన్లకు వచ్చే మహిళా కేసుల ఆధారంగా మహిళా పోలీస్స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 4600 కేసుల పెండింగ్‌లో ఉండగా వీటిలో 300 మిస్సింగ్ కేసులు ఉన్నాయన్నారు. మూడు నెలల వ్యవధిలో ఈ కేసులను పరిష్కరించేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించనున్నట్లు వెల్లడించారు. పెండింగ్‌లో ఉన్న చోరీ కేసుల్లో పురోగతి సాధించేందుకు సబ్ డివిజన్ స్థాయిలో ప్రత్యేక బృందాలుఏర్పాటు చేస్తామన్నారు. ఇటీవల కాలంలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, వీటిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారు ప్రమాదాలకు గురి అవుతున్నారన్నారు. అవగాహన కల్పించడంతో పాటు విస్తృత తనిఖీలు నిర్వహించి మద్యం సేవించి వాహనాలు నడిపే వ్యక్తులపట్ల కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మండల స్థాయిలో ఒక్కో ఎస్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలను దాతల సహకారంతో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఫ్యాక్షన్ గ్రామాలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామన్నారు. రాత్రి బసలాంటి కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో ఆళ్లగడ్డ డీఎస్పీ ఈశ్వరరెడ్డి, కోవెలకుంట్ల సీఐ శ్రీనివాసరెడ్డి, ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు. -
మరీ ఇంత కక్కుర్తా మీకు..?
* మహిళా పోలీసు స్టేషన్‌ని తనిఖీ చేసిన మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని * అధికారుల తీరుపై ఆగ్రహావేశాలు గుంటూరు (పట్నంబజారు): ‘మరీ ఇంత కక్కుర్తి ఏంటీ మీకు...కష్టాల్లో ఉండి వచ్చిన వారిని వదిలి పెట్టరా..? పురుషుల దగ్గర డబ్బులు తీసుకుని కేసులు తారుమారు చేస్తారా...? ఆపదలో ఉన్న వారికి ఇదేనా మీరిచ్చే ధైర్యం.. జనం అనటం కాదు...నేను చెప్పినా..పట్టించుకోవటంలేదు మీరు...క్యారక్టర్ల గురించి అసభ్యకరంగా మాట్లాడారా..’ అంటూ ఏపీ మహిళా కమిషనర్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి మహిళా పోలీసుస్టేషన్‌లోని అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ఆదివారం నన్నపనేని గుంటూరు నగరంలోని మహిళా పోలీసు స్టేషన్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ‘ఇక్కడ జరుగుతున్న భాగోతమంతా కథలుగా చెప్పుకుంటున్నారని, అసలు ఏ మాత్రం దయా, జాలి లేకుండా వ్యవహరిస్తున్నారా.. ఆఖరికి నేను చెప్పిన కేసుల్లో కూడా న్యాయం చేయకపోవగా..డబ్బులు అడిగారంటా’ అంటూ నిలదీశారు. రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదు... రాష్ట్రంలోని అన్ని మహిళా పోలీస్టేషన్లకు వెళ్లా..ఇంత ఘోరమైన పరిస్థితులు ఎక్కడా చూడలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. స్టేషన్లో సిబ్బంది లేకపోవటం, కేవలం ఎస్ఐ నాగకుమారి మాత్రమే ఉండటాన్ని గమనించారు. రికార్డులను అడిగి తీసుకొని పరిశీలించారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేకపోవటంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా పోలీసుస్టేషన్లో ఏ ఒక్కరూ సరిగా పనిచేయటంలేదని నిప్పులు చెరిగారు. ఆఖరికి బెయిల్‌కు కూడా డబ్బులు వసూలు చేస్తున్నారా అంటూ ప్రశ్నించారు. స్టేషన్‌కు వచ్చిన వారిని అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతున్నాని తెలిసిందన్నారు. అని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలిపెట్టను హోంమంత్రి, డీజీపీల దగ్గరకు తీసుకెళ్తానన్నారు. కచ్చితంగా అవినీతి అధికారులను వదలిపెట్టే ప్రస్తకి లేదని తేల్చిచెప్పారు. నన్నపనేని అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని ఎస్ఐ నాగకుమారి నీళ్ళు నిములారు. అక్కడే ఉన్న బాధితులను ఎందుకు వచ్చారని అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడటం తప్పా..: నన్నపనేని పెద్దనోట్లు రద్దుతో సమస్యలు పడుతున్నారని ప్రజలు సమస్యల గురించి మాట్లాడితే బీజేపి నేతలు తనపై వ్యాఖ్యలు చేయటం హాస్యాస్పదంగా ఉందని నన్నపనేని వ్యాఖ్యానించారు. క్యూలైన్లులో నిలబడి ప్రాణాలు సైతం ఫణంగా పెడుతున్న క్రమంలో కనీస ఏర్పాట్లు చేయకపోవటంపై కేంద్ర ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. మంచినీటి వసతి కూడా ఏర్పాటు లేదు. దీనిపై ప్రశ్నిస్తే కొంత మంది మిత్రపక్షం నేతలకు ఎందుకు అంత ఆగ్రహమో అర్థం కావటం లేదన్నారు. -
మోసం చేశాడు... పెళ్లి చేసుకున్నాడు
టీనగర్: ఊత్తుకోటలో యువతిని మోసగించిన యువకుడు పోలీసులకు చిక్కగానే వివాహం జరిపించారు. ఊత్తుకోట సమీపానగల కల్కాలవోడై గ్రామానికి చెందిన యువతి మణిమేగలై (21). శ్రీపెరంబుదూరులోగల ఒక ప్రైవేటు కంపెనీలో పనిచేస్తుంది. అదే గ్రామానికి చెందిన వెంకటేశన్ (28). టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నారు. మణిమేగలై, వెంకటేశ్ రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. మణిమేగలై సంపాదనతో తరచూ బయటి ప్రదేశాలకు వెళ్లి ఆమెతో చనువుగా గడిపేవాడు. తనను వివాహం చేసుకోవాలని మణిమేగలై ఒత్తిడి తెస్తూ వచ్చింది. ఏడాది తర్వాత చేసుకుందామని ఆమెతో చెప్పాడు. ఈ క్రమంలో వెంకటేశ్ అదృశ్యమయ్యాడు. తాను మోసపోయినట్లు తెలుసుకున్న మణిమేగలై ఊత్తుకోట మహిళా పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వెంకటేశన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మణిమేగలైను వివాహం చేసుకోకుంటే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు. దీంతో అతను వివాహానికి ఒప్పుకున్నాడు. ఊత్తుకోట రవాణా సంస్థ వర్కుషాప్ సమీపంలోగల అమ్మవారి ఆలయంలో మణిమేగలైను వెంకటేశన్ వివాహం చేసుకున్నాడు. దీంతో మణిమేగలై తన ఫిర్యాదును వాపసు తీసుకుంది. -
ఒక్క పోలీస్ స్టేషన్ తో కథలో మంచి ట్విస్ట్
ఒక్క పోలీస్ స్టేషన్.... ఒక్కటంటే ఒక్క పోలీస్ స్టేషన్ అరుణాచల్ క్రైమ్ చరిత్రను మార్చేసింది. రాజధాని ఈటానగర్ లో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్ మహిళలపై అత్యాచారాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది. ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్. ఇప్పటికి అరుణాచల్ లో ఇదొక్కటే మహిళా పోలీస్ స్టేషన్. ఈ పోలీస్ స్టేషన్ లో పెద్దగా వనరులు లేవు. వసతులు కూడా లేవు. కానీ మహిళలపై హింసను, అత్యాచారాలను అరికట్టడంలో మాత్రం ఈ పోలీస్ స్టేషన్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. మహిళా పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసుల విషయంలో సత్వరమే రంగంలోకి దిగడంతో దోషులను పట్టుకోవడం సులువవుతోంది. అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇటానగర్ లో ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది. ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై హింస, దౌర్జన్యం, అత్యాచారం వంటి ఘటనలు తగ్గాయి. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు పరిష్కరించడం జరిగింది. మొత్తం 123 కేసుల్లో 86 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 20 కేసుల్లో ఫైనల్ రిపోర్టులు తయారయ్యాయని ఆ స్టేషన్ ఆఫీసర్ చుఖు నాను బుయ్ చెబుతున్నారు. ఇప్పుడు ఇతర జిల్లాలనుంచి కూడా కేసులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి.