ఒక్క పోలీస్ స్టేషన్ తో కథలో మంచి ట్విస్ట్
ఒక్క పోలీస్ స్టేషన్ తో కథలో మంచి ట్విస్ట్
Published Mon, Jun 9 2014 10:46 AM | Last Updated on Sat, Sep 2 2017 8:33 AM
ఒక్క పోలీస్ స్టేషన్.... ఒక్కటంటే ఒక్క పోలీస్ స్టేషన్ అరుణాచల్ క్రైమ్ చరిత్రను మార్చేసింది. రాజధాని ఈటానగర్ లో ఏర్పాటు చేసిన ఈ పోలీస్ స్టేషన్ మహిళలపై అత్యాచారాలను తగ్గించడంలో కీలకపాత్ర పోషించింది.
ఇది అరుణాచల్ ప్రదేశ్ లోని మొట్టమొదటి మహిళా పోలీస్ స్టేషన్. ఇప్పటికి అరుణాచల్ లో ఇదొక్కటే మహిళా పోలీస్ స్టేషన్.
ఈ పోలీస్ స్టేషన్ లో పెద్దగా వనరులు లేవు. వసతులు కూడా లేవు. కానీ మహిళలపై హింసను, అత్యాచారాలను అరికట్టడంలో మాత్రం ఈ పోలీస్ స్టేషన్ చాలా కీలకపాత్ర పోషిస్తోంది. మహిళా పోలీస్ స్టేషన్ ఇలాంటి కేసుల విషయంలో సత్వరమే రంగంలోకి దిగడంతో దోషులను పట్టుకోవడం సులువవుతోంది.
అరుణాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రెండేళ్ల క్రితం అన్ని జిల్లా కేంద్రాల్లో ఒక మహిళా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఇటానగర్ లో ఈ పోలీస్ స్టేషన్ ఏర్పాటైంది.
ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళపై హింస, దౌర్జన్యం, అత్యాచారం వంటి ఘటనలు తగ్గాయి. పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసుల్లో 70 శాతం కేసులు పరిష్కరించడం జరిగింది. మొత్తం 123 కేసుల్లో 86 కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి. 20 కేసుల్లో ఫైనల్ రిపోర్టులు తయారయ్యాయని ఆ స్టేషన్ ఆఫీసర్ చుఖు నాను బుయ్ చెబుతున్నారు.
ఇప్పుడు ఇతర జిల్లాలనుంచి కూడా కేసులు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి.
Advertisement
Advertisement