భారత్ ఈ ఏడాదికి అధ్యక్షత వహిస్తూ.. ఆతిథ్యం ఇవ్వబోతున్న జీ20 సదస్సుకు చైనా డుమ్మా కొట్టడం దాదాపుగా ఖాయమైనట్లేనని సంకేతాలు అందుతున్నాయి. ఈ మేరకు ఆదివారం ఇటానగర్(అరుణాచల్ ప్రదేశ్)లో జరిగిన జీ20 సన్నాహాక సమావేశాలకు చైనా దూరంగా ఉండిపోయింది.
జీ 20 సదస్సులో భాగంగా.. దేశంలోని యాభై ప్రధాన నగరాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా.. రీసెర్చ్ ఇన్నోవేషన్ ఇన్షియేటివ్, గ్యాదరింగ్ థీమ్‌తో సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం ఆదివారం ఇటానగర్‌లో ఈ సమావేశాన్ని నిర్వహించింది. అత్యంత గోప్యంగా భావించే ఈ సమావేశానికి.. మీడియా కవరేజ్‌ను అనుమతించలేదు. కాకపోతే ప్రతినిధుల బృందం అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీని, ఇటానగర్‌లో ఉన్న బౌద్ధ క్షేత్రాన్ని సందర్శించింది. ఈ సందర్భంగా కొందరు ఫొటోలు తీశారు.
తద్వారా చైనా నుంచి ప్రతినిధులెవరూ హాజరు కాలేదన్న విషయం బయటకు వచ్చింది. దీంతో.. సెప్టెంబర్‌లో ఢిల్లీ వేదికగా జరగబోయే జీ-20 సదస్సుకు చైనా హాజరు కావడంపై అనుమానాలు కలుగుతున్నాయి. నిరసనల్లో భాగంగానే చైనా ఇలా సమావేశానికి దూరంగా ఉండిపోయిందా? లేదంటే మరేయితర కారణం ఉందా? అనేదానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ పరిణామంపై విదేశాంగ శాఖగానీ, చైనా గానీ స్పందించలేదు కూడా.
ఇదిలా ఉంటే.. అరుణాచల్ ప్రదేశ్‌ను టిబెట్‌లో అంతర్భాగమంటూ చైనా ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. భారత్ మాత్రం చైనా వాదనను తోసిపుచ్చి.. అది తమ దేశంలోని అంతర్భాగమేనని స్పష్టం చేస్తోంది. మరోవైపు వాస్తవ నియంత్రణ రేఖ వెంట ఇరు దేశాల మధ్య ఆమధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి కూడా.
ఇదీ చదవండి: అమెరికాలోని గురుద్వార్‌లో కాల్పులు
Comments
Please login to add a commentAdd a comment