నగర పోలీసు కంట్రోల్ రూం కు వస్తున్న వందలాది అనవసరమైన ఫోన్ కాల్స్ వల్ల పోలీసులకు తలనొప్పిగా మారింది.
సాక్షి, ముంబై: నగర పోలీసు కంట్రోల్ రూం కు వస్తున్న వందలాది అనవసరమైన ఫోన్ కాల్స్ వల్ల పోలీసులకు తలనొప్పిగా మారింది. పోలీసు శాఖతో సంబంధంలేని కాల్స్‌కు సమాధానం ఇవ్వలేక కంట్రోల్ రూంలో విధులు నిర్వహిస్తున్న పోలీసులు బేజారవుతున్నారు. అత్యవసర సమయంలో లేదా దొంగతనాలు, దాడులు, సీనియర్ సిటిజన్లకు ఇబ్బందులకు గురిచేయడం, బాలికలు, మహిళలపై అత్యాచారాలు, వేధింపులు తదితర విషయాలపై పోలీసుల సాయం కోసం నగర పౌరులు సంప్రదించేందుకు పోలీసు శాఖ 100, 103 నంబర్లు ప్రవేశపెట్టింది.
వీటిని 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేసింది. పోలీసు కంట్రోల్ రూంకు ప్రతీరోజు వస్తున్న దాదాపు 11వేల ఫోన్ కాల్స్‌లో కేవలం 10 శాతం మాత్రమే స్పందించే విధంగా, చర్యలు తీసుకునేలాగా ఉంటున్నాయి. మిగతావన్నీ అనవసరమైనవేనని పోలీసులు వెల్లడించారు. కంట్రోల్ రూం విధులు నిర్వహించే మహిళా పోలీసులతో అసభ్యకరంగా మాట్లాడడం, ట్యాక్సీ, ఆటోలు, రైళ్లు, బస్సుల రాకపోకల గురించి విచారించడం, ఏ సినిమా ఏ థియేటర్‌లో ఆడుతుంది...?
సేవా సంస్థలు, పోలీసు స్టేషన్ల ఫోన్ నెంబర్లు కావాలని డిమాండ్ చేయడం ఇలా అనేక అనవసరమైన ఫోన్లు వస్తున్నాయని వారు తెలిపారు. రెండు హెల్ప్ లైన్లు ముంబైకర్ల భద్రత కోసం, నేరాలను అరికట్టడం, ప్రజల్లో నెలకొన్న భయాన్ని తొలగించడానికి ఏర్పాటుచేసినవనీ, వాటిని మార్గంలో వినియోగించుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని పోలీసు కమిషనర్ (దర్యాప్తు శాఖ) ధనంజయ్ కులకర్ణి తెలిపారు.