ఏపీలో ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం.. సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర | Chandrababu Govt cases against YSRCP social media activists | Sakshi
Sakshi News home page

ఏపీలో ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం.. సోషల్‌ మీడియా కార్యకర్తలపై కేసుల పరంపర

Published Mon, Nov 4 2024 4:52 AM | Last Updated on Mon, Nov 4 2024 7:30 AM

Chandrababu Govt cases against YSRCP social media activists

ఎప్పుడెప్పుడి పోస్టులో బయటకు తీసి తప్పుడు కేసులు

అవినీతి, పాలనా వైఫల్యాలను ప్రశ్నిస్తే ఇంత దుర్మార్గమా?.. ప్రభుత్వ తప్పులను ప్రశ్నించే అధికారం పౌరులకు ఉంది 

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు చట్ట వ్యతిరేకం 

సుప్రీంకోర్టు ఉత్తర్వులకు పూర్తి విరుద్ధం 

అధికార కూటమి ఒత్తిళ్లకు తలొగ్గి తప్పు దారిలో పోలీసు యంత్రాంగం పయనం 

41ఎ నోటీసు ఇచ్చి వివరణ తీసుకోవాలి.. నేరుగా కేసు పెట్టి అరెస్ట్‌ చేయడం దుర్మార్గం

ఇలా ఒక్క రోజులోనే 40 మందిపై కేసులు, అరెస్టులు.. ఇంకా పలువురిపై ఫిర్యాదులు  

తద్వారా ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురిచేయడమే లక్ష్యం

రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటనా స్వేచ్ఛకు విఘాతం 

పౌరుల నోరు నొక్కాలనుకోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే  

రెడ్‌బుక్‌ రాజ్యాంగమే ప్రామాణికమైతే అదే ఈ ప్రభుత్వానికి డెత్‌ బుక్‌  

సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్‌: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం మచ్చుకైనా కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వ హామీలు, కూటమి పార్టీ నేతల తీరు, అధికార మదంతో దౌర్జన్యాలు, దుర్మార్గాలు, హత్యలు, హత్యాచారాలు, దాడులు, ఇతరత్రా ఆగడాల గురించి ప్రశ్నించడమే పాపమై పోతోంది. రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు అర్థం లేకుండా పోయింది. దోపిడీ రాజ్యం.. దొంగల రాజ్యంగా మారిపోయింది. చట్టాలన్నీ అధికార పార్టీ నేతల చుట్టాలుగా భావిస్తున్న దుస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వ పని తీరు గురించి విమర్శలు రావడం సహజం. 

తద్వారా లోటుపా­ట్లుంటే సరి చేసుకుని ప్రజలకు మంచి పాలన అందించాల్సిన బాధ్యత అధికార పార్టీదే. ఈ స్ఫూర్తిని ఇసుమంతైనా వంటబట్టించుకోకుండా చంద్ర­బాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోంది. సద్విమర్శ­లను సైతం స్వీకరించలేని అహంకార ధోరణి పెరిగిపోయింది. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక.. ఎప్పుటికప్పుడు డైవర్షన్‌ పాలిటిక్స్‌తో ప్రజల దృష్టిని మళ్లిస్తూ నెట్టుకొస్తున్న ముఖ్యమంత్రి చంద్ర­బాబు.. ఆ హామీలు తిరిగి ప్రజలకు గుర్తు చేస్తు­న్నారన్న దుగ్ధతో సోషల్‌ మీడియా కార్యకర్తలపై యుద్ధమే ప్రకటించారు. 

రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడి­కక్కడ వారి నోళ్లు బలవంతంగా మూయించాలని కంకణం కట్టుకు­న్నారు. ఇందుకు నిబంధనలను తోసిరాజని పోలీసు యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటున్నారు. ప్రభుత్వ పెద్దల కనుసైగతో పోలీసు యంత్రాంగం సైతం వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తలపై ఎక్కడికక్కడ తప్పుడు కేసులు పెడుతోంది. చిన్న­పాటి పోస్టులను కూడా బూతద్దంలో చూపిస్తూ దుర్మా­­­ర్గంగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వ తప్పిదా­లను ఎత్తిచూపే హక్కు పౌరులకు ఉందని తెలిసినా, అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గుతోంది. 

కనీసం 41ఎ నోటీసులు ఇచ్చి విచారించకుండానే, అరెస్ట్‌­లకు పూనుకోవడం సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధం అని తెలిసినా ముందుకే అడుగులు వేస్తోంది. ఇది రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛకు విఘా­తం కలిగించడమేనని, పౌరుల నోరు నొక్కాలను­కోవడం ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయడమే­నని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాం­గమే ప్రామాణికంగా ముందుకు సాగు­తున్న ప్రభుత్వం ఒకసారి వెనక్కి తిరిగి చూసుకో­కపోతే ఆ రెడ్‌ బుక్కే ఈ ప్రభుత్వానికి డెత్‌ బుక్‌ అవుతుందని వ్యాఖ్యానిస్తున్నారు. 

రాష్టవ్యాప్తంగా ఒక్కరోజులోనే 40 మందిపై కేసులు పెట్టారు. పలువురిని ఆరెస్ట్‌ చేశారు. ఇంకా మరికొందరిపై కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. తద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయభ్రాంతులకు గురి చేయడమే లక్ష్యంగా పాలకులు వ్యవహరి­స్తున్నారు.  ఆయా ఘటనలకు సంబంధించిన వివరాలు జిల్లాల వారీగా ఇలా ఉన్నాయి. 

ఉమ్మడి గుంటూరు జిల్లా: డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌పై వినుకొండ మండలం పానకాల­పాలెం గ్రామవాసి సన్నపనేని వెంకట్రావు ఎన్నికలకు ముందు పోస్టులు పెట్టినట్లు జనసేన పార్టీ ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాసరావు శుక్రవారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు వెంకట్రావును 48 గంటలుగా అక్రమంగా నిర్బంధించారు. కోర్టుకు హాజరు పరచకుండా, కుటుంబ సభ్యులు ఎవరినీ కలవనీయకుండా చేశారు. 

నోటీసులు ఇచ్చే కేసులకు కూడా నాన్‌ బెయిల్‌బుల్‌ కేసులు మాదిరిగా అక్రమంగా నిర్బంధించడంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. తెనాలి నియోజకవర్గం కొల్లిపర మండలం వల్లభపురానికి చెందిన ఆళ్ల జగదీశ్‌రెడ్డిని శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు అరెస్ట్‌ చేసి తీసుకెళ్లారు. చిలకలూరిపేట నియోజకవర్గం నాదెండ్ల మండలంలో సోషల్‌ మీడియా కార్యకర్త పిల్లి సాగర్‌ బాబును నాలుగు రోజులుగా రోజూ నాదెండ్ల పోలీస్‌ స్టేషన్‌కి పిలిపించి కూర్చోబెడుతున్నారు. 

­శ్రీకాకుళం: కాశీబుగ్గలో ఇటీవల ఇద్దరు బాలికలపై టీడీపీ నాయ­కుల కుటుంబీకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితుల ఫైల్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారని మందస మండలం పిడి మందస గ్రామానికి చెందిన గుంపు జగదీష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. అక్టోబర్‌ 26న వేకువజామున 4 గంటలకు ఇంటికి వెళ్లి వెరిఫికేషన్‌ అంటూ హడావుడి చేశారు. 

ఇతనిపైనే కేసు నమోదు చేస్తామని బెదిరించారు. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి డాక్టర్‌ సీదరి అప్పలరాజుతోపాటు 200 మందికిపైగా వైఎస్సార్సీపి నాయకులు, కార్యకర్తలు మందస పోలీస్‌ స్టేషన్‌కు చేరుకొని గట్టిగా నిలదీయడంతో జగదీష్‌ను వదిలేశారు. వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవులో మడ్డు జష్వంత్‌ అనే సోషల్‌ మీడియా కార్యకర్తపై పోలీసులు ఆదివారం దౌర్జన్యానికి పాల్పడ్డారు. 

ఇదే గ్రామానికి చెందిన బైనపల్లి దానమ్మ అనే వృద్ధురాలు ఒకటో తేదీన పింఛన్ల పంపిణీ సందర్భంలో సొమ్మసిల్లి పడిపోయారు. ఈ ఘటనను జష్వంత్‌ సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. దీనిపై టీడీపీ మండలాధ్యక్షుడు సూరాడ మోహనరావు ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెంటనే వారు జష్వంత్‌ను అదుపులోకి తీసుకున్నారు. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు జోక్యంతో పోలీసులు వదలక తప్పలేదు.

వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా పశ్చిమ గోదా­వరి జిల్లా ఇన్‌చార్జి బి.జయ­రామ్‌ను భీమవరం వన్‌టౌన్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌లను విమర్శిస్తూ ఆదివారం సోషల్‌ మీడియాలో పోస్టు పెట్టినట్టు జనసేన పార్టీ భీమవరం టౌన్‌ సెక్రటరీ పత్తి హరివర్ధన్‌రావు ఫిర్యాదు చేసినట్టు వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు. ఈ మేరకు జయరామ్‌పై 321, 153 (ఏ), 505 (2), 67 ఆఫ్‌ ఐటీ యాక్ట్‌ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.  

⇒ పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలంలో బాలాజీ రెడ్డి అనే వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా కార్యకర్తను పెనుకొండ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 2022–23లో చంద్రబాబుకు వ్యతిరేకంగా పోస్టులు పెట్టాడనే కారణంతో రొద్దం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.

⇒ ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో సోషల్‌ మీడియా కార్యకర్త పెసల శివారెడ్డిని స్పెషల్‌ పార్టీ పోలీసులు ఎత్తుకెళ్లారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారని కక్ష కట్టారు.  వరికుంటపాడు, సీతారామపురం తదితర పోలీస్‌ స్టేషన్లు తిప్పతూ కొట్టినట్టు సమాచారం.

ఉమ్మడి కృష్ణా జిల్లాలో అరాచకం
⇒ నందిగామలో సోషల్‌ మీడియా కార్యకర్త వేల్పుల జైహింద్‌ను అధికార పార్టీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అతడిని మోకాళ్లపై కూర్చోబెట్టారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. అలా చేయకపోతే పోరంబోకు స్థలంలో 45 ఏళ్లుగా ఉన్న ఇంటిని కూల్చేస్తామని బెదిరించారు.  చందర్లపాడు మండలం ముప్పాళ్లలో సోషల్‌ మీడియా కార్యకర్త సాయం మీరా హుస్సేన్‌ను కంచికచర్ల సీఐ చితకబాది ఎమ్మెల్యే దగ్గరకు తీసుకెళ్లారు. అక్కడ మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణ చెప్పించారు. అంతేకాక ఊరు విడిచిపెట్టి వెళ్లాలని ఎమ్మెల్యే ఆదేశించారు. 

నందిగామలో సోషల్‌ మీడియా కార్యకర్త వేల్పుల జైహింద్‌ను మోకాళ్లపై కూర్చోబెట్టి క్షమాపణలు చెప్పించిన టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య    

⇒ జగ్గయ్యపేట నియోజకవర్గం పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన సోషల్‌ మీడియా కార్యకర్త పిళ్లెం వినోద్‌ ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేశారు. ఇదే మండలం లింగగూడెం గ్రామానికి చెందిన భీమవరపు తంబి అనే సోషల్‌ మీడియా కార్యకర్తపై కూడా ఇదే రీతిలో కేసు నమోదు చేశారు. 

⇒ జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు గ్రామా­నికి చెందిన గౌస్‌ బాషా, తల కొండ సందీప్, ఆకుల ముక్కంటి (తిరుమలగిరి)పై కూడా కేసులు నమోదు చేశారు. వత్స­వాయి మండలంలో షేక్‌ జానీ (వేముల­నర్వ), తాళ్లూరి గోపాలకృష్ణ (దబ్బాకు­పల్లి)పై కేసు నమోదు చేశారు. జగ్గయ్య­పేట పట్టణంలో తమ్మవరపు మురళీకృష్ణ, ఎ.నరేంద్రలపై కేసు నమోదైంది. కంచికచర్ల పరిధిలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే కారణంతో పరిటాల గ్రామానికి చెందిన జమలయ్య, గనిఆత్కూర్‌ గ్రామానికి చెందిన షేక్‌ ఫరీద్, పెండ్యాల గ్రామానికి చెందిన అబ్దుల్‌ ఖాదర్లపై కేసులు పెట్టారు.

⇒ నందిగామ పోలీస్‌స్టేషన్‌లో సోషల్‌ మీడియా కార్యకర్తలు వెలగా సత్యనారా­యణ, అనుమోలు సారథి, నండ్రు శ్రీరా­మ్మూర్తి, సాజిత్, జమలయ్యలపై కేసులు నమోదు చేశారు. వివిధ హామీలపై ప్రభు­త్వాన్ని ప్రశ్నించడమే వీరి పాలిట శాపమైంది. అధికార పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు పెట్టారని గుడివాడలో అమిగో అలియాస్‌ ఖాజా బాబా, ఇంటూరు రవి, శ్యామ్‌లపై కేసులు నమోదు చేశారు. 

⇒ విజయవాడ భవానీపురంలో ధరావతు శ్రీని­వాస నాయక్‌పై,  విజయవాడ వన్‌ టౌన్‌లో యాష్, సంతోష్‌రెడ్డిలపై కేసు నమోదు చేశారు. ఒక్క విజయవాడ నగ­రం­లోనే పదుల సంఖ్యలో సోషల్‌ మీడి­యా ఖాతాలపై టీడీపీ, జనసేన నాయ­కులు ఫిర్యాదు చేశారు. దీంతో ఆ ఖాతా­లకు సంబంధించిన వారిపై పోలీసులు కేసులు నమోదు చేయనున్నారు.

వింజమూరులో సోషల్‌ మీడియా కార్యకర్త శివారెడ్డిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు 

పోలీసుల వేధింపులు చట్ట వ్యతిరేకం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా సోషల్‌ మీడియా కార్యకర్తలపై ప్రభుత్వం, పోలీసులు దాష్టీకానికి పాల్పడుతున్నారని.. రాష్ట్రంలో అరా­చక పాలనకు ఇది నిదర్శనమని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జనరల్‌ సెక్రటరీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి, పార్టీ లీగల్‌ సెల్‌ విభాగం అధ్యక్షుడు ఎం.మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ప్రభుత్వ పని తీరును తప్పు పట్టారనే కారణంతో ఇష్టారాజ్యంగా అరెస్టులు చేయడం దారుణం అని మండిప­డ్డారు. 

ఆదివారం సాయంత్రం వారు మీడియాతో మాట్లాడుతూ అరెస్టులు చేసిన వారి వివరాలను పోలీసులు బయటకు వెల్లడించడం లేదని, న్యాయ­పరంగా వారికి సహాయం అందకుండా వారి హక్కులను కాల­రా­స్తున్నారని నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో ప్రభుత్వ పెద్దల అవినీతి, ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై విమర్శలు సంధిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం దమనకాండకు దిగుతోందన్నారు. 

ఇది పౌరుల భావ ప్రకటనా స్వేచ్ఛపై దాడి అని అభివర్ణించారు. రాజ్యాంగ హక్కులను ఉల్లంఘిస్తూ చట్ట వ్యతిరేక పనులకు పాల్పడుతున్న వారిపై న్యాయ­పరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు చేస్తున్న అక్రమ అరెస్టులను కచ్చితంగా కోర్టుల దృష్టికి తీసు­కెళ్తామని స్పష్టం చేశారు. చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పోలీసు అధికారులపై కచ్చితంగా కేసులు నమోదు చేసి వారిని కోర్టుకు లాగుతామని హెచ్చరించారు. 

ఈ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు కూడా వెనుకాడబోమని స్పష్టంచేశారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ వ్యవహ­రిస్తున్న పోలీసులను గుర్తిస్తున్నామ­న్నారు. పోలీసుల అదుపులో ఉన్న వారిని వెంటనే విడిచి పెట్టాలని, చట్టాన్ని మీరితే సహించబోమన్నారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం నడిపితే.. ఈ ప్రభుత్వానికి అదే డెత్‌బుక్‌ అవుతుందని హెచ్చరించారు. సోషల్‌ మీడియా కార్యకర్తలకు వైఎస్సార్‌సీపీ అండగా ఉంటుందన్నారు. 

ఇప్పటికే పలుమార్లు పోలీసుల వేధింపులకు గురైన ఇంటూరి రవి కిరణ్‌ను మళ్లీ హాజరు కావాల్సిందిగా పోలీసులు సమాచారం ఇవ్వడం దారుణం అన్నారు. నందిగామ, భీమవరం, కొల్లిపర, వినుకొండ, వింజమూరుల్లో కేసులు నమోదు చేశారని చెప్పారు. లండన్‌లో ఉన్న వారిపై కూడా కేసులు నమోదు చేసిన అంశం తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒక్క రోజులోనే నమోదైన కేసుల వివరాలను ఈ సందర్భంగా వారు వెల్లడించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement