చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌పై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం | YS Jagan Fire On CM Chandrababu Govt For Planned Arrests | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే.. చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌పై వైఎస్‌ జగన్‌ ఆగ్రహం

Published Sat, Nov 9 2024 8:40 PM | Last Updated on Sat, Nov 9 2024 9:12 PM

YS Jagan Fire On CM Chandrababu Govt For Planned Arrests

వ్యవస్థలన్నీ చంద్రబాబు చేతుల్లోనే

40 ఏళ్లుగా.. అనుకూల మనుషులతో వ్యవస్థీకృతంగా నేరాలు

చంద్రబాబుకి కొరుకుడుపడని సోషల్‌ మీడియా

అందుకే యువతే లక్ష్యంగా అక్రమ అరెస్టులు

దత్తపుత్రుడి, ఇతరులతో అబద్ధాల ప్రచారం

ఫేక్‌ న్యూస్‌ వ్యాప్తికి లోకేష్‌తో సోషల్‌ మీడియాలో ప్రచారం

మరింత దిగజారి.. రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతర ప్రయత్నాలు

విజయమ్మ కారు టైర్‌ ఘటనపై తప్పుడు ప్రచారం.. సిగ్గుమాలిన చర్య

ప్రశ్నించేవారిని హింసిస్తూ.. మరింత బరితెగింపు

చంద్రబాబు ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌పై వైఎస్‌ జగన్‌ ఫైర్‌

గుంటూరు, సాక్షి: నలభై ఏళ్లుగా వ్యవస్థీకృతంగా నేరాలు చేస్తూ చంద్రబాబు.. ఇప్పుడు కూడా అదే పని చేస్తూ ఆ తప్పులను ఎదుటివారిపై నెట్టేస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు.  తనపై, పార్టీపై దుష్ప్రచారంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్టులను ఇబ్బందులు పెడుతుండడంపై ఎక్స్‌ ఖాతాలో ఓ సుదీర్ఘమైన సందేశం ఉంచారాయన.

‘‘నలభై ఏళ్లుగా వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న చంద్రబాబుగారు ఇప్పుడు కూడా అదే చేస్తూ ఎదుటివారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. దొంగే.. ఎదుటివారిని పట్టుకుని ‘దొంగా’ అన్నట్టుగా ఆయన తీరు ఉందని జగన్‌ ఎద్దేవా చేశారు. ‘‘తన స్కాంలు బయటపడుతున్నాయని, తాను చేసిన అవినీతి బయటకు వస్తోందని, తన పాలనా వైఫల్యాలను ప్రజల ముందు ఉంచుతున్నారనే దురహంకారంతో ఒక నియంతలా వ్యవహరిస్తున్నారు.  

సామాజిక మాధ్యమాల వేదికగా గొంతు విప్పుతున్నవారిని, ముఖ్యంగా చంద్రబాబుగారి తప్పులను నిలదీస్తున్న యువతను లక్ష్యంగా చేసుకుని చట్టవిరుద్ధంగా, అన్యాయంగా, అక్రమంగా అరెస్టులు చేస్తున్నారు. తన అడుగులకు మడుగులొత్తే పోలీసులను వాడుకుంటూ వారిపై భౌతికదాడులు చేయిస్తూ, హింసిస్తున్నారు. ఇది ఆర్గనైజ్డ్‌ క్రైం కాదా?’’ అని జగన్‌ ప్రశ్నించారు.

.. ‘‘ఎలాగూ చంద్రబాబుగారి చేతిలోనే దాదాపుగా అన్ని పేపర్లు ఉన్నాయి. కాస్తోకూస్తో ప్రజాసమస్యలపై గొంతు విప్పే టీవీలను కూడా వ్యవస్థీకృతంగా దెబ్బ తీశారు. కేబుల్‌ ఆపరేటర్లపై ఒత్తిడి తెచ్చి వాటి ప్రసారాలను ప్రజలకు చేరనీయకుండా పలుమార్లు కట్‌ చేశారు. ఇక చంద్రబాబుగారికి కొరుకుడుపడనిది ఒకే ఒక్కటి. అదే సోషల్‌ మీడియా.  
అందుకే చంద్రబాబుగారు ఇలా బరితెగిస్తున్నారు. ఇలా ఒక చేత్తో తన మీడియాను, మరో చేత్తో వ్యవస్థలను, ఆ వ్యవస్థల్లోని తన మనుషులను వాడుకుని నాలుగు దశాబ్దాలుగా చంద్రబాబు చేస్తున్న ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌ చూస్తూనే ఉన్నాం. మరి ఆర్గనైజ్డ్‌ క్రైమ్స్‌కు పాల్పడుతున్నది ఎవరు?.

.. ప్రజలకు మంచిచేసి కాకుండా, మభ్యపెట్టి, మోసం చేసి, అబద్ధాలు ఆడి అధికారంలోకి రావాలని, అధికారంలో ఉంటే దాన్ని ఇలాగే నిలబెట్టుకోవాలన్నది చంద్రబాబుగారి సిద్ధాంతం.  దీనికోసం చంద్రబాబుగారు ఒక అబద్ధాన్ని సృష్టిస్తారు. దానికి రెక్కలుతొడిగి తన ఎల్లోమీడియా ద్వారా శరవేగంగా వ్యాపింపచేస్తారు. దానిపైనే వారి పార్టీనాయకులచేత మాట్లాడిస్తారు. పనిలోపనిగా దత్తపుత్రుడిని, ఇతర పార్టీల్లో తనకు అనుకూలంగా ఉన్నవారినికూడా దీనికి  వాడుకుంటారు. ఆ తర్వాత డిబేట్లు చేయిస్తారు.

ఇదీ చదవండి: లోకేష్‌ను మా ఎదుట హాజరుపర్చండి- ఏపీ హైకోర్టు

.. మరిన్ని అవాస్తవాలు జోడించి తన కుమారుడు లోకేష్‌ ద్వారా సోషల్‌ మీడియాలో విష ప్రచారం చేయిస్తారు. వాళ్లే ఆరోపణలు చేసి, వాళ్లే మీడియా ట్రయల్‌ చేసి, వాళ్లే దోషులెవరో నిర్ధారించి, వాళ్లే శిక్షలు విధిస్తారు. ఒక పథకం ప్రకారం, మాఫియా ముఠా మాదిరిగా చంద్రబాబుగారు ఈ నేరాలు చేస్తూనే ఉన్నారు. ప్రత్యర్థి పార్టీలను దెబ్బతీయడానికి, రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వ హననానికి నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. మరి ఇది వ్యవస్థీకృత నేరం కాదా?. అని జగన్‌ అన్నారు.

 

‘‘అయ్యా చంద్రబాబూ.. మీ పార్టీ టీడీపీ అధికారిక సోషల్‌మీడియా అకౌంట్లో మీరే ఫేక్‌ న్యూస్‌పెట్టి, దాన్ని మీరే ప్రొపగండా చేసిన లేటెస్ట్‌ ట్వీట్‌ను రాష్ట్ర ప్రజలంతా గమనించారు.  ఎప్పుడో రెండేళ్ల కిందట మా అమ్మ కారు టైర్‌ బరస్ట్‌ అయితే, అప్పటి వీడియోను ఇప్పుడు బయటకు తీసి, లేటెస్ట్‌గా ఇప్పుడే జరిగినట్టుగా, మీరు ట్వీట్‌లో పెడుతూ, నా తల్లిని నేను చంపాలని అనుకున్నానని సిగ్గుమాలిన వ్యక్తిత్వ హననానికి నువ్వు దిగావు. దీన్ని ఖండిస్తూ మా అమ్మ లేఖ రాస్తే దాన్నికూడా ఫేక్‌ లెటర్‌గా పేర్కొంటూ నువ్వు పబ్లిసైజ్‌ చేయడం సిగ్గుమాలిన చర్య కాదా?. మళ్లీ మా అమ్మ సాక్షాత్తూ వీడియో మెసేజ్‌ కూడా ఇస్తూ మీ తీరును దుయ్యబట్టింది.

ఇదీ చదవండి: నడిపేది.. నడిపించేది నారా లోకేష్‌!

.. ఇంతలా ఉద్దేశ పూర్వకంగా వ్యక్తిత్వ హననం చేసిన నిన్ను, నీ కొడుకును ఇదే పోలీసులు ఎందుకు అరెస్టు చేయడం లేదు?. ఇలాంటివి శతకోటి మీ ఏబీఎన్‌, మీ ఈనాడు, మీ టీవీ-5, మీ అనుకూల మీడియా ఎన్ని చేసినా పోలీసులు ఏనాడైనా చర్యలు తీసుకున్నారా?. నువ్వు చేస్తే ఏదైనా మంచే! కాని నువ్వు చేసిన తప్పుడు పనులను, ప్రజా వ్యతిరేక చర్యలను ఎవరైనా ప్రశ్నిస్తే అది చెడు అవుతుందా?.  వారిపై కేసులుపెట్టి వారిని హింసించడం ధర్మమేనా?’’. అని జగన్‌ అన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌తోకూడిన పాలిటిక్స్‌లో చంద్రబాబుగారు మరింతగా బరితెగించారు. మొన్నటి తిరుమల లడ్డూ వ్యవహారంవరకూ జరిగిన అనేక పరిణామాలు దీనికి ఉదాహరణ. కూటమి 100 రోజుల పాలన, మోసాలు, వైఫల్యాలనుంచి ప్రజలను తప్పుదోవపట్టించడానికి చంద్రబాబుగారు సృష్టించిన అబద్ధాన్ని ఎల్లోమీడియా మోయడం, ఆ తర్వాత ఆ పార్టీల నాయకులు, వారిని మోస్తున్న అధికారులు ప్రజల్లో అశాంతిని రేపేలా చర్యలు, కార్యక్రమాలు చేయడం ఒక పన్నాగం ప్రకారం జరిగాయి.  మరి వ్యవస్థీకృత నేరాల కింద అరెస్టు చేయాల్సింది ఎవరిని?.   జీవిత ఖైదు వేయాల్సింది ఎవరికి? చంద్రబాబుగారికి కాదా? అని జగన్‌ తన సుదీర్ఘ సందేశం ద్వారా నిలదీశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement