తాను ఉన్నతాధికారినంటూ ఫోన్ చేస్తాడు.. ప్రమోషన్ ఇస్తానని నమ్మబలుకుతాడు.. ఫొటోలు కావాలని ముగ్గులో దింపడానికి ప్రయత్నిస్తాడు.. నమ్మితే బలైపోవాల్సిందే. సారవకోట, మెళియాపుట్టి మండలాల్లో వెలుగు చూసిన వ్యవహారమిది. ఆ నంబర్‌తో ఫోన్ వస్తే చాలు ఈ రెండు మండలాల్లోని కొందరు ఉద్యోగిణులు హడలిపోతున్నారు. ఉద్యోగాలంటూ, ప్రమోషన్లంటూ మాటలు కలుపుతూ లోబర్చుకునేందుకు ప్రయత్నిస్తుండడంతో ఏ కొత్త నంబర్ నుంచి కాల్ వచ్చినా భయపడుతున్నారు. ఫోన్ చేస్తున్న వాడి ఊరు, పేరు తెలియకపోవడంతో అమాయకులు వలలో పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: సారవకోట, మెళియాపుట్టి చుట్టుపక్కల గ్రామాల్లో ఓ అజ్ఞాత వ్యక్తి కలకలం రేపుతున్నాడు. తన వివరాలు బయటపడకుండా జాగ్రత్త పడుతున్న ఆ మాయగాడు మహిళలకు ఫోన్లు చేస్తూ లోబరుచుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. మహిళలనే టార్గెట్‌గా పెట్టుకున్న ఆ వ్యక్తి కింది స్థాయి ఉద్యోగినులకు ఫోన్లు చేస్తూ నోటికొచ్చినట్టు మాట్లాడటం, ఉద్యోగాలు, ప్రమోషన్ల ఎర చూపడం చేస్తున్నాడు. ప్రధానంగా అంగన్‌వాడీ కార్యకర్తలు, ఇతరత్రా చిన్న పాటి ఉద్యోగినులకు ఈ ఫోన్ కాల్స్ వస్తున్నాయి. మహిళా వలంటీర్లతోనైతే అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు. ఎవరీ వ్యక్తి అని ఆరా తీసేందుకు ప్రయత్నిస్తుంటే ఫోన్ చేసిన వాళ్లనూ నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడు.
ఉదాహరణలివే..
►సారవకోట మండలంలోని బొంతు గ్రామానికి చెందిన ఒక మహిళకు 8096762584 నంబర్ నుంచి ఈ నెల 3న ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్ చేసిన వ్యక్తి మహిళతో మాటామాటా కలిపి అసభ్యకరంగా మాట్లాడాడు.
►దీనిపై ఆమె ఈ నెల 4న సారవకోట పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
►ఈ నెల 8న మండలంలోని చీడిపూడి గ్రామానికి చెందిన నలుగురు మహిళా వలంటీర్లకు అదే నంబర్‌తో ఫోన్ వచ్చింది. తాను కలెక్టర్ కార్యాలయంలో ఉద్యోగం చేస్తున్నానని, అనంతపురం జిల్లాలో వ్యవసాయశాఖలో పలు పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని భర్తీ చేస్తున్నారని ఆ పోస్టులు మీకు వచ్చేలా చూస్తానని చెప్పి నమ్మబలికాడు. దరఖాస్తు చేయడానికి పూర్తి సైజ్ ఫొటో ఇవ్వాలని కోరడంతో ఆ వలంటీర్లకు అనుమానం వచ్చి ఫోన్ కట్ చేశారు.
►బుడితి సచివాలయ మహిళా పోలీసుకు సైతం ఇలాంటి కాల్ వచ్చింది. ఆమె స్థానిక ఎస్‌ఐ దృష్టిలో కూడా పెట్టారు.
►మెళియాపుట్టి మండలంలోనూ ఈ తరహా ఘటనలు జరిగాయి.
►మూడు నెలల కిందట మండలంలోని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలకు కూడా పీడీ ఆఫీసు నుంచి మాట్లాడుతున్నానని ఫోన్ చేసి మీకు ప్రమోషన్లు ఇప్పిస్తానని, వేరే
►చోటకు బదిలీ చేయిస్తానని నమ్మబలికి వారిని లోబర్చుకునేందుకు ప్రయత్నించారు.
►మరికొంత మందికి ఫోన్ చేసి ‘మీరు గుడ్డు, పాలు లబ్ధిదారులకు ఇవ్వకుండా అమ్ముకుంటున్నారు. మీ పై ఫిర్యాదులు వచ్చాయ’ని చెప్పి వారిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు ప్రయత్నించినట్లు పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు తెలిపారు. ప్రభుత్వం కేటాయించిన నంబర్లను సేకరించి వారికి ఫోన్లు చేస్తున్నారు.
►గ్రామాల్లో ఉన్న ఒంటరి మహిళల వివరాలను అంగన్‌వాడీ కార్యకర్తలు, వలంటీర్లు, ఏఎన్‌ఎంల నుంచి సేకరించేందుకు ప్రయత్నిస్తున్నాడు. తాను ఉన్నతాధికారినంటూ నమ్మబలికి బెదిరిస్తున్నాడు.
►అనుమానం వచ్చి ఇంటిలో మగవారితో తిరిగి ఫోన్ చేయిస్తే తిట్ల పురాణం అందుకుంటూ ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాడు.
►సారవకోట మండల వలంటీర్ల సంఘం అధ్యక్షుడు శివశంకర్ ఆ వ్యక్తికి ఫోన్ చేయగా.. అసభ్యకర రీతిలో మాట్లాడాడు.
ఎవరికీ చెప్పుకోలేక..
కింది స్థాయి మహిళా ఉద్యోగులకు ఎప్పటి నుంచో ఈ ఫోన్ కాల్ వేధింపులు ఉన్నట్లు సమాచారం. అయితే వారు ఎవరికీ చెప్పుకోలేక చాలా కాలంగా సతమతమవుతున్నారు. మండలంలో దాదాపు ప్రతి రోజూ కొంతమందికి 8096762584 అనే ఫోన్ నంబర్ నుంచి కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడిది సారవకోట మండలంలో చర్చనీయాంశంగా మారింది. తిరిగి ఫోన్ చేస్తుంటే తిట్ల పురాణం అందుకుంటున్నాడు. ఇప్పటికే ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ అతడి వివరాలు ఇప్పటివరకు తెలియలేదు. దీంతో ఆ వ్యక్తి ఆగడాలు ఆపడం లేదు.
దర్యాప్తు చేస్తున్నాం
బొంతు గ్రామానికి చెందిన ఒంటరి మహిళ ఇచ్చిన ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించాం. ఒంటరి మహిళలు, వివిధ ప్రభు త్వ శాఖల్లో పనిచేస్తున్న చిన్న ఉద్యోగులకు ఫోన్ చేసి అసభ్యకరంగా మాట్లాడుతున్న వ్యక్తి గురించి ఆరా తీస్తున్నాం. ప్రస్తుతం ఏ టవర్ లొకేషన్‌లో ఉండి కాల్ చేస్తున్నాడో తెలుసుకుంటున్నాం. త్వరలోనే అతడిని పట్టుకుంటాం.
– ఎం.ముకుందరావు, ఎస్‌ఐ, సారవకోట
Comments
Please login to add a commentAdd a comment