ఫోన్‌ పాలి‘ట్రిక్స్‌’! | TDP Leaders Phone Politics In Srikakulam | Sakshi
Sakshi News home page

ఫోన్‌ పాలి‘ట్రిక్స్‌’!

Published Mon, Nov 19 2018 7:25 AM | Last Updated on Mon, Nov 19 2018 7:25 AM

TDP Leaders Phone Politics In Srikakulam - Sakshi

మీ మాటే మీ ఓటును ఉరి తీయవచ్చు. మీ అభిప్రాయమే మీ హక్కులకు దిక్కు లేకుండా చేసేయొచ్చు. టీడీపీ ఆడుతున్న పొలిటికల్‌ గేమ్‌లో సామాన్యుడే సమిధగా మారుతున్నాడు. జనాభిప్రాయం తెలుసుకుంటామనే నెపంతో అధికారికంగా వారు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను గుర్తిస్తున్నారు. గుర్తించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి నిస్సిగ్గుగా తొలగిస్తున్నారు. సాంకేతిక సాయంతో జరుగుతున్న ఈ రాజ్యాంగ పరిహాస ప్రక్రియ ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తోంది. జిల్లాలో ఇదే తరహాలో వేలకొద్దీ ఓట్లను తొలగించారు. ఇంకా తొలగిస్తున్నారు..

శ్రీకాకుళం పాతబస్టాండ్‌: ‘మన గీత పెద్దగా ఉండాలంటే.. పక్క వాడి గీత చిన్నది చేసెయ్యాలి..’ అధికార టీడీపీ అనుసరిస్తున్న కొత్త మంత్రమిది. ఓటు బ్యాంకును పెంచుకునే మార్గాలు వెతక్కుండా.. విపక్షాల ఓటుబ్యాంకును నిర్వీర్యం చేయడానికి అధికార పార్టీ నేతలు క్షుద్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగమే అభిప్రాయాలు తెలుసుకునే ఫోన్‌కాల్‌. చంద్రబాబు పేరుతో వచ్చే ఫోన్‌ కాల్స్‌లో ఏ మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పినా ఇక ఆ వ్యక్తి ఓటుకు కాలం చెల్లినట్టే. నలభై ఏళ్ల రాజకీయ అనుభవం కలిగిన నాయకుడు అనుసరిస్తున్న ఈ పద్ధతులు చూసి ప్రజాస్వామ్యవాదులు ఆశ్చర్యపోతున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిహరిస్తూ నిస్సిగ్గుగా ఓటు హక్కును తొలగించేస్తున్న విధానాలు చూసి సామాన్యులు బిత్తరపోతున్నారు.

వ్యతిరేకత తెలుసుకుంటూ..
జనాల్లో అధికార పార్టీపై రోజురోజుకూవ్యతిరేకత పెరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఆ వ్యతిరేకతను తెలుసుకుంటూ ఓట్లను తొలగించేందుకు టీడీపీ నాయకులు కొత్త విధానాలు తీసుకువచ్చారు. గ్రామాల్లో వారికి అనుకూలంగా ఉన్న వారు, లేని వారిని గుర్తించి, వారికి అనుకూలంగా లేని వారి ఓట్లను తొలగించడానికి ఏకంగా ప్రత్యేక టీమ్‌లు గ్రామాల్లో తిరుగుతున్నాయి. కొత్త ఓట్లు చేర్పించడం, తమకు వ్యతిరేకమైన ఓట్లను తొలగించడం వంటి పనులు వీరు చేస్తున్నారు. అక్కడక్కడా ఒకరికే రెండుమూడు ఓట్లు ఉండడం కూడా వీరి చేతివాటమే.

ఫోన్‌కాల్‌తో..
ప్రభుత్వ ప్రతినిధులు మనతో మాట్లాడుతున్నట్లు ఒక ఫోన్‌కాల్‌ సెల్‌ఫోన్‌కు వస్తుంది. అక్కడ ప్రభుత్వం పనితీరుపై కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఒకటి, రెండు టైప్‌ చేయాలని సూచిస్తున్నారు. ఇలా ఎవరైనా పనితీరు బాగోలేదని సమాధానం చెబితే కారణాలు, వారి వివరాలు అడిగి వారి ఓటు, కుటుంబ సభ్యుల ఓటును నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారు. ఒకవేళ మాజీ ప్రజాప్రతినిధులకు ఫోన్‌ వెళితే వారు ఇక ఓటు గురించి మర్చిపోవాల్సిందే.  

గత మార్చిలో జరిగిన సమ్మరీలో జిల్లాలో సుమారుగా 33,957 ఓట్లను తొలగించారు. వారికి ఈ సమ్మరీలో ఓటు హక్కును కల్పించాల్సింది. కానీ వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటు వచ్చే దారి కనిపించడం లేదు. ఇదంతా ఈ ప్రత్యేక టీమ్‌లు చేసిన పనే. ఈ పూర్తి జాబితా 2019 జనవరి 4 వతేదీ వరకు విడుదల చేసే అవకాశం ఉండదు. ఆ తర్వాత కొత్త ఓట్లను అవకాశం ఉండదు. దీంతో ప్రతిపక్షం వారి ఓట్లను తొలగించడం ఈజీ అవుతుందని టీడీపీ వారు ఈ ప్లాన్‌ వేశారని రాజకీయ నిపుణులు చెబుతున్నారు.

బలమైన చోట మరీనూ..
సాధారణంగా ఓటు బ్యాంకు పెంచుకునేందుకు సంక్షేమ కార్యక్రమాలు, రాయితీలు, ప్రత్యేక పథకాలు ప్రవేశపెడతారు. కానీ అవేవీ చేయకుండా తమకు బలం ఉన్న చోట అధికార పార్టీ నేతలు డబుల్‌ ఓట్లు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అంతే కాకుండా చాలాచోట్ల మరణించిన వారి పేర్లను కూడా ఓటరు జాబితాలో కొనసాగిస్తున్నారు. తమకు అనుకూలమైన చోట్ల సహేతుకమైన కారణాలు చూపకుండానే ప్రతిపక్ష పార్టీ ఓట్లను తొలగిస్తున్నారు.  

బోగస్‌ ఓట్లపై దృష్టి
జిల్లాలో ఎక్కువగా బోగస్‌ ఓట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా ఈ సారి సమ్మరీలో కూడా పెద్ద ఎత్తున బోగస్‌ ఓట్ల నమోదుకు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది. సుమారుగా 77 వేల కొత్త దరఖాస్తుల్లో డబుల్‌ ఓట్లు, అధికార పార్టీ చొరవతో అడ్డంగా కుక్కిన ఓట్లు 20వేలకు పైగా ఉంటాయని అంచనా.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement