
న్యూఢిల్లీ: అత్యాచారాలు, లైంగిక దాడుల వార్తల రిపోర్టింగ్‌లో నిబంధనల ఉల్లంఘనపై విచారణకు ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(పీసీఐ), ఎడిటర్స్ గిల్డ్, ఇండియన్ బ్రాడ్‌కాస్టింగ్ ఫెడరేషన్ ప్రతినిధులు తమ ముందు హాజరుకాకపోవడం పట్ల సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ వ్యవహారంలో తమకు సహకరించాలని గతంలోనే కోర్టు పైన పేర్కొన్న మీడియా నియంత్రణ సంస్థలకు లేఖలు పంపింది. కాగా, గురువారం జరిగిన విచారణకు న్యూస్ బ్రాడ్‌కాస్టింగ్ స్టాండర్డ్స్ అథారిటీ(ఎన్‌బీఎస్‌ఏ) తరఫు లాయర్ మాత్రమే హాజరయ్యారు. లైంగిక దాడులు, రేప్ ఘటనలను రిపోర్ట్‌చేస్తున్న సమయంలో చట్టబద్ధ నిబంధనల్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారని జస్టిస్ మదన్ బి.లోకూర్ నేతృత్వంలోని బెంచ్..ఎన్‌బీఎస్‌ఏ లాయర్‌ను ప్రశ్నించింది.