న్యూఢిల్లీ: ప్రముఖ ముస్లిం మహిళల ఫొటోలను యాప్‌లోకి అప్‌లోడ్ చేసి వేలానికి పెట్టిన దారుణ వికృత చేష్ట ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ అంశంపై భిన్న వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. గత జులైలో ‘సలీ డీల్స్’ పేరిట జరిగిన అరాచకాన్ని గుర్తుచేస్తూ ‘బుల్లి బాయ్’ యాప్ ఒకటి తెరమీదకొచ్చింది. దాదాపు 100 మంది ప్రముఖ ముస్లిం మహిళలు, మహిళా పాత్రికేయుల ఫొటోలను వారి ట్విట్టర్ ఖాతాల నుంచి సేకరించి వాటిని బుల్లి బాయ్ యాప్‌లో అప్‌లోడ్ చేసి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు వేలానికి పెట్టారు.
దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలని శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌కు, ముంబై పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశారు. దీంతో ఈ అంశాన్ని కేంద్రం సీరియస్‌గా తీసుకుంది. యాప్ కార్యకలాపాలకు వేదికగా వాడుతున్న ‘గిట్‌హబ్’ ప్లాట్‌ఫామ్‌లోని యూజర్ ఐడీని బ్లాక్ చేశామని మంత్రి తెలిపారు. దేశంలోని ప్రభుత్వరంగ సంస్థల ఆన్‌లైన్ నెట్‌వర్క్‌లోకి హ్యాకింగ్ యత్నాలపై ఆయా సంస్థలను అప్రమత్తం చేసే ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్(సెర్ట్), ఢిల్లీ, ముంబై పోలీసు యంత్రాంగం సంయుక్తంగా ఈ కేసులో తదుపరి చర్యలు తీసుకుంటాయని మంత్రి పేర్కొన్నారు.
మరోవైపు, బుల్లి బాయ్ వెబ్‌సైట్‌లో తన ఫొటోను వాడారని, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా జర్నలిస్ట్ ఒకరు ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. యాప్ డెవలపర్లు, ట్విట్టర్ హ్యాండిల్ హోల్టర్లపై ముంబై సైబర్ విభాగం మరో కేసు నమోదు చేసింది. ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ఢిల్లీ పోలీసులకు మహిళా జాతీయ కమిషన్ చైర్‌పర్సన్ రేఖా శర్మ సూచించారు. మహిళలను అవమానించడం, మత విద్వేషంపై ప్రజలు గళమెత్తాల్సిన సమయం ఆసన్నమైందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
వారికి అధికార అండదండలు: మెహబూబా ముఫ్తీ ఆరోపణ
యాప్ ద్వారా ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న వారికి ‘అధికార అండదండలు’ అందుతున్నాయని జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ ఆరోపించారు. అధికారంలో ఉన్న వారు వెనకుండి నడిపించడం వల్లే ఈ దుశ్చర్యలకు పాల్పడుతున్న వ్యక్తులు స్వేచ్ఛగా తప్పించుకు తిరుగుతున్నారని వ్యాఖ్యానించారు.
Comments
Please login to add a commentAdd a comment