అమెరికాను తాకిన మోడీ గాలి
బైలైన్
ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరమ్మతు చేసుకోలేనంతగా దిగజారిపోలేదు. వాటిని ఉతికి ఆరేయాలి. రెండు దేశాలు ఒకే విధమైన మౌలిక విలువలు, ప్రయోజనాలు కలిగిన దేశాలు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాలలో ముఖ్య భాగస్వాములు కాగలిగినవి. అలాంటి దేశాల మధ్య ప్రస్తుతమున్న ఇబ్బందికరమైన పరిస్థితి అనావశ్యకమైనది.
ఎన్‌బీసీ చానల్ ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం వార్తా బులెటిన్ మధ్య ఓ అంశం చటుక్కున కనిపించింది. ఆ వార్తను బులెటిన్‌లో చేర్చింది తామేనని సంపాదకులే నమ్మలేరనిపించేంత నమ్మశక్యంకానిది అది. చనిపోయిన మనిషి బతికాడు. ఎన్‌బీసీలాంటి ప్రధాన చానల్ సరిచూసుకోకుండా ‘మృతిచెందారు’ అనీ అనదు, నిర్ధారించుకోకుండా ‘బతికున్నారు’ అనీ అనదు. శవ యాత్రికులు శవపేటికను గమ్యానికి తీసుకుపోతుండగా శవం పేటికను తన్నడం మొదలుపెట్టింది. శవయాత్రలో ఉన్నవారు ఎంతగా నిర్ఘాంతపోయి ఉంటారో అంతగా యాంకర్లు కూడా నిర్ఘాంతపోయే ఉంటారు. అయితే వారు దాన్నో అద్భుతంగా అభివర్ణించి, చకచకా సురక్షితమైన వాతావరణ క్షేత్రానికి వెళ్లిపోయారు. సూర్యకాంతితో నిండిన ఆకాశం కింద మైనస్ జీరో ఉష్ణోగ్రతలతో మంచు గాలులు కురుస్తాయని తెలిపారు. ఇంతటి కలవర పాటు ప్రశంసలు మరే అద్భుతానికి లభించి ఉండవు.
ఈ కథలో ఒక నీతి ఉంది. శవాన్ని పూడ్చి పెట్టేసేవరకు ఆశను కోల్పోకూడదు. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు కోమాలోకి వెళ్లిపోయాయి. కానీ అవి కాటికి చేరడానికి ఇంకా చాలా దూరం ఉంది.
అమెరికన్ అకాడమీ, మీడియాలలో చిన్నదే అయినా దృఢసంకల్పం కలిగిన లాబీ ఒకటుంది. భారత దేశం పట్ల అమెరికా విధానాన్ని కాకపోయినా వైఖరులను అది ప్రభావితం చేయగలిగింది. ఢిల్లీ గద్దెను చేరుకునే దిశగా నరేంద్రమోడీ సాగిస్తున్న పయనాన్ని ఆపడం తమ వల్ల కాదనే విషయాన్ని అది ఎట్టకేలకు గుర్తించడం ప్రారంభించింది. మోడీకి వీసాను నిరాకరించేలా చేయడం ఆ లాబీ సాధించిన ఘనకార్యాల్లో ఒకటి. 1984 అల్లర్లలో సోనియా గాంధీ పాత్ర ఉన్నదనే ఆరోపణతో ఒక అమెరికన్ కోర్టులో ఆమెపై కేసు ఉంది. అయినా ఈ లాబీ ఆమె వీసా విషయమై ఎన్నడూ ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తలేదు.
అమెరికాకు చెందిన ‘ప్యూ’ పరిశోధన సంస్థ విస్తృత స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఆ లాబీకి కీలకమైన పరిగణనాంశం అయింది. ప్యూ ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి. కానీ దాని సమాచారం మాత్రం గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారింది. కనీవినీ ఎరుగని రీతిలో అది మోడీకి 63 శాతం మద్దతును, కాంగ్రెస్‌కు 19 శాతం మద్దతును సూచించింది. ప్యూ విశ్వసనీయతపై అమెరికా ప్రభుత్వానికి నమ్మకముంది.
ఇక మన ఎన్నికల కలగూర గంపలోని అనేక చిన్న పార్టీలు ఎటు మొగ్గు చూపుతున్నాయనే ఆధారాలు ఉండనే ఉన్నాయి. అవి తమంత తాముగా ఏమంత సాధించలేకపోయినా గానీ ప్రధాన అయస్కాంతాలలో దేనితో చేరితే దాని గెలుపునకు కావాల్సిన ఓట్ల శాతాల్లో తేడాను తేగలుగుతాయి. 2004, 2009 ఎన్నికల్లో ప్రధానంగా అవి కాంగ్రెస్, యూపీఏలతో ఉన్నాయి. ఈ ఏడాది గురుత్వాకర్షణ శక్తి వాటిని మరో దిశకు లాగేస్తోంది. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్-రాంవిలాస్ పాశ్వాన్-కాంగ్రెస్ అనే త్రిమూర్తుల కూటమి పునరుద్ధరణ గురించి రెండు నెలలపాటు చర్చలు జరిగాయి. చావో రేవో తేల్చుకోవాల్సి వచ్చేసరికి బీజేపీ, పాశ్వాన్‌తో కలిసి రెండు పార్టీల నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని సాధించగలిగింది. పెద్ద వాళ్లు అనుకున్నవాళ్లు తప్పు చేయగలుగుతారు. అహంకారంతో తమ సొంత విలువను ఎక్కువగా లెక్కేసుకుంటారు. చిన్న పార్టీలు తప్పు చేయలేవు.
అమెరికా ప్రభుత్వం మేల్కొని కాషాయం వాసనను పసిగట్టడం ప్రారంభించింది.
అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మన దేశం పట్ల ఒకప్పుడు ఉండి ఉండే కాసింత ఆసక్తి సైతం ఇప్పుడు లేదనేది బహిరంగ రహస్యమే. ఆసియాలోని ఆయన ప్రాధాన్యాలు భారత్‌కు తూర్పు, పడమరల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చైనాతో సంబంధాలకు ఉన్న విలువ రీత్యా ఆయన వాటికే అత్యంత ప్రాధాన్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమెరికా ఆర్థిక విందు భోజనం బల్లపైకి భారత్ అందించగలిగిన వంటకాలేవీ లేవు.
అఫ్ఘానిస్థాన్ నుంచి సేనల ఉపసంహరణకు ఒబామా కట్టుబడి ఉన్నారు. అందుకు ఆయనకు పాకిస్థాన్ సహకారం అవసరం. అమెరికా ఉపసంహరణ తర్వాత భారత్‌కు మరింత ఎక్కువ పాత్రను నిర్వహించగలిగిన శక్తి ఉంది. కానీ ఆ పాత్రను నిర్వచించగలిగేది భవిష్యత్తు.
ఇరాన్‌తో సాధారణ సంబంధాలను నెలకొల్పుకోవడంలో ఒబామా అసాధారణమైన కృషి చేశారు. తక్షణమైన, నాటకీయమైన భౌగోళిక రాజకీయ పర్యవసానాలను మినహాయిస్తే ఈ కృషి చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యేదని ఆయనకు తెలుసు. అమెరికాకు భారత్ శత్రు అధీన ప్రాంతంలోని అనుబంధ స్థావరం కాగలిగేదే. కానీ అందుకు కావాల్సింది నమ్మకం. అది ఆవిరైపోయింది.
భారత్‌తో అణుశక్తి ఒప్పందానికి రూపకల్పన చేసిన అధికారులు, రాజకీయవేత్తలు తిరిగి ఆ నమ్మకాన్ని కలిగించడానికి బదులు నమ్మకద్రోహానికి గురైనామనే భావనను ప్రచారం చేస్తున్నారు. అణు ఒప్పందంలోని అలిఖిత భాగానికి సంబంధించి మన దేశం తన ప్రతిష్టకు తగ్గ విధంగా ప్రవర్తించలేదని వారి అంచనా. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ కంటే ఎక్కువగా భారత్-అమెరికా సంబంధాలకు చెరుపు చేసినవారు మరెవరూ లేరు. యుద్ధ విమానాలను అమ్మజూపుతూ అమెరికా వేసిన టెండర్‌ను ఆయన తొలి దశలోనే తోసిపుచ్చారు. ఇది కేరళకు చెందిన మరో వామపక్ష పక్షపాత రాజకీయవేత్త కృష్ణమీనన్‌ను గుర్తుకు తెస్తోంది. ఆంటోనీ నిర్ణయానికి సముచిత కారణమే ఉంటే ఆ విషయాన్ని ఆయన, ఆయన దూతలు వారికి వివరించడమనే మంచి పని చేసి ఉండాల్సింది.
ఆసక్తికరమైన దేవయాని ఖోబ్రగడే తక్కువ వేతనాల పనిమనిషి వ్యవహారం చిన్న విషయమే. కాకపోతే పేరుకుపోయిన ఇతర సమస్యల వల్ల భారత్, అమెరికా అధికార యంత్రాంగాల మధ్య నెలకొన్న పగలను తేల్చుకునే యుద్ధ రంగంగా ఆ సమస్యను మార్చాయి. ఐదేళ్ల క్రితమైతే అలాంటి సమస్య అతి కనిష్టమైన రచ్చతోనే పరిష్కారమై ఉండేది.
భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరమ్మతు చేసుకోలేని విధంగా దిగజారిపోలేదు. కానీ ప్రమాదకరమైనంతటి వికారంగా మారాయి. వాటిని ఉతికి గాలి, ఎండ తగిలేలా ఆరేయాలి. మంచి స్నేహితులకు మాత్రమే చేతనయ్యేటంతటి పారదర్శకతతో ఇస్త్రీ చేసి సరైన రూపుకు తేవాలి. భారత్, అమెరికాలు ఒకే విధమైన మౌలిక విలువలు, ప్రయోజనాలు కలిగిన దేశాలు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాలలో ముఖ్య భాగస్వాములు కాగలిగినవి. అలాంటి దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి తర్కవిరుద్ధమైనది, అనావశ్యకమైనది. ముఖం మాడ్చుకోవడం అపరిపక్వత మాత్రమే.
లేదంటే సరిదిద్దుకునే క్రమానికి అద్భుతం అవసరం. ప్యూ అంచనా వేసినట్టు మేలో మన దేశంలో ప్రభుత్వం మారే నాటికి ఒబామాకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలే ఉంటుంది. మార్పు ఒక అవకాశం. తక్షణ గతంతో చేయగలిగిన అత్యుత్తమమైన పని దాన్ని వెనక్కు నెట్టేయడమే. ఒకప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు మంచి ఊపు మీద ఉండి చాలా సాధించగలమని వాగ్దానం చేసింది. ఆ ఊపు పూర్తిగా సడలిపోవడానికి అవకాశమిచ్చారు. దాన్ని పునరుద్ధరించడానికి రెండు ప్రభుత్వాలు కొత్త చొరవను ప్రదర్శించాలి.