ఆశలు మోసులెత్తుతున్న వేళ.. | Sakshi Editorial On PM Narendra Modi USA Tour | Sakshi
Sakshi News home page

ఆశలు మోసులెత్తుతున్న వేళ..

Published Wed, Jun 21 2023 12:31 AM | Last Updated on Wed, Jun 21 2023 12:31 AM

Sakshi Editorial On PM Narendra Modi USA Tour

భారత ప్రధాని మోదీ మంగళవారం 3 రోజుల అధికారిక పర్యటనకు అమెరికా పయనమవడంతో ఒక చరిత్రాత్మక ఘటనకు తెర లేచింది. ఇది భారత, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమూలంగా మార్చివేసే ఘట్టమని విశ్లేషణ. అమెరికాలో వ్యక్తమవుతున్న ఆసక్తి, జరుగుతున్న హంగామా, అధికారిక విందు, చివరకు అమెరికన్‌ పార్లమెంట్‌లో మోదీ ప్రసంగం – ఇలా పర్యటన అంశాల్ని గమనిస్తే ఆతిథ్యదేశం దీన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ పర్యటనలో రక్షణ, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం సహా పలు రంగాల్లో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్‌ ఆతిథ్యమివ్వనున్నందున ఇది ప్రాముఖ్యం సంతరించుకుంది.

నిజానికి, 2014 మేలో తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గడచిన తొమ్మిదేళ్ళలో మోదీ అనేకసార్లు అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. అయితే, ఇప్పుడు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధానికి ఉన్నతస్థాయి వ్యక్తీకరణగా భావించే ‘స్టేట్‌ విజిట్‌’గా ఈ పర్యటన సాగుతోంది. ఇలా వెళ్ళడం మోదీకీ ఇదే మొదటిసారి. ఒక దేశ ప్రభుత్వాధినేత ఆహ్వానం మేరకు మరో దేశ ప్రభుత్వాధి నేత సాగించే ఈ సాదర ఆహ్వానయుత పర్యటనకు సహజంగానే సాధారణ అధికారిక పర్యటనకు మించిన హంగూ, ఆర్భాటం ఉంటాయి.

అమెరికా అధ్యక్ష దంపతులు స్వయంగా వైట్‌హౌస్‌లో కళ్ళు మిరుమిట్లుగొలిపే అధికారిక విందుకు ఆతిథ్యమిస్తారు. గతంలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ (1963 జూన్‌), ప్రధాని మన్మోహన్‌ (2009 నవంబర్‌)ల తర్వాత ఈ తరహా పర్యటనకు సాదర ఆహ్వానం అందుకున్న మూడో భారత నేత – మోదీయే. అత్యంత సన్నిహితులకూ, మిత్రపక్షాలకే అందించే ఈ ఆహ్వానం భారత, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి ప్రతీక. 

ప్రపంచ దృశ్యం సంక్లిష్టమవుతున్న వేళ అమెరికా – భారత సంబంధాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా అనుసరిస్తున్న ఇండో – పసిఫిక్‌ వ్యూహం, ఆధునిక రక్షణ పరిజ్ఞానం పంచు కోవడం, జీఈ–414 టర్బోఫ్యాన్‌ జెట్‌ ఇంజన్ల ఉత్పత్తి లాంటివి ఇరు దేశాల చర్చల అజెండాలో ఉన్నాయి. వ్యూహాత్మక సాంకేతిక విజ్ఞాన భాగస్వామ్యం అటుంచితే, రెండుచోట్లా రాజకీయం వేడెక్కివున్న పరిస్థితులివి. రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపట్టేందుకు ఇరువురు నేతలూ సిద్ధమవుతున్న వేళ ఈ పర్యటన ద్వారా వారు ఏ మేరకు ఇమేజ్‌ పెంచుకొని, సమర్థ నేతగా కనిపి స్తారన్నదీ కీలకమే.

స్టేట్‌ విజిట్లలో అసలే హడావిడి ఎక్కువనుకుంటే, ఎన్నికల సీజన్‌ ఈ హంగా మాను మరింత పెంచేస్తోంది. ప్రవాసీయులు అధికంగా ఉండడం మోదీ పర్యటనకు ఎక్కడ లేని ఈ ఆర్భాటానికొక కారణం కావచ్చు. జనంలో స్వచ్ఛంద స్పందన వస్తే తప్పు లేదు. ముందస్తు వ్యూహంతో, పద్ధతిగా ప్రతిచోటా జాతర సృష్టించడమే అతి అనిపిస్తోంది. రకరకాల సభలతో ‘ప్రవాసీ దౌత్యం’లో మోదీ సిద్ధహస్తుడు గనకనే అనుమానించాల్సి వస్తోందని విమర్శకుల మాట.

అమెరికా పర్యటనలో పలువురు వ్యాపారవేత్తలు, నోబెల్‌ బహుమతి గ్రహీతలు, ఆర్థికవేత్తలను మోదీ కలవనున్నారు. టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్, శాస్త్రీయ అంశాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన నీల్‌ డిగ్రాస్‌ టైసన్, రాజకీయ శాస్త్రజ్ఞుడు జెఫ్‌ స్మిత్‌ తదితరులు సైతం ఆ జాబితాలో ఉండడం విశేషం. గతంలో నెహ్రూ, రాజీవ్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్‌ల అడుగుజాడల్లో అమెరికన్‌ పార్లమెంట్‌ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు.

ఆ వరుసలో ఆరో భారత ప్రధానైన మోదీకి ఈ ప్రసంగ ఘనత దక్కడం ఇది రెండోసారి. 1949లో ప్రపంచ శాంతి, మానవ స్వాతంత్య్ర విస్తరణల పరిరక్షణే భారత విదేశాంగ విధాన దృష్టి అన్న నెహ్రూ నాటికీ, 2005లో కీలక సాంకేతిక విజ్ఞానాల అడ్డగోలు వ్యాప్తికి భారత్‌ కేంద్రస్థానం కాదన్న మన్మోహన్‌ నాటికీ... ఇప్పటికీ తేడా చూస్తే అగ్రరాజ్యంతో ఢిల్లీ బాంధవ్యం సుదూరం సాగింది. 

ఇండో–పసిఫిక్‌లో, అలాగే విశాల విశ్వవేదికపై భారత ప్రభావశీల పాత్రను అమెరికా గుర్తించింది.ఉక్రెయిన్‌ సంక్షోభం నేపథ్యంలో ఆయుధ సరఫరా వ్యవస్థలు సంక్షోభంలో పడడంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కీలకమని భారత్‌ గుర్తించింది. అందుకు పాశ్చాత్య ప్రపంచం నుంచి సాంకే తికత అవసరం. ఇప్పుడు అమెరికా ముందుకొచ్చింది గనక మిగతా దేశాలూ ఆ బాటలో నడవచ్చు.

మరోపక్క ఉక్రెయిన్‌ వ్యవహారంలో రష్యాపై దూకుడుగా వ్యవహరించడం లేదంటూ భారత్‌ పట్ల అసహనంగా ఉన్న పాశ్చాత్య ప్రపంచం చమురు తదితర అంశాల్లో మన అనివార్యతల్ని అర్థం చేసుకొన్నాయి. కొన్ని అంశాల్లో పరస్పర ఏకాభిప్రాయం లేకున్నా, పరిణతితో కూడిన ఆ అవగాహన సాక్షిగా భారత్, అమెరికాలు పరస్పర గౌరవం, ఉమ్మడి లక్ష్యాలతో నవశకంలోకి నడుస్తున్నాయి.

ప్రచ్ఛన్న యుద్ధం నాటి అలీన విధానం నుంచి భారత్‌ పక్కకు రాకున్నా, ప్రస్తుత ప్రపంచ అధికార క్రమంలో మార్పులను బట్టి పరస్పర విరుద్ధ వర్గాల్లోని దేశాలతో సైతం దోస్తీకి వెనుకాడదనే సంకేతాలిస్తోంది. అలాగే, ‘అబ్‌కీ బార్‌... ట్రంప్‌ సర్కార్‌’ అంటూ భారీ సభ సాక్షిగా ట్రంప్‌ను మోదీ సమర్థించారు. చివరకు ఆయన ఓడి బైడెన్‌ వచ్చినా బంధం బలపడిందే తప్ప మార్పు లేదు.

ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్యం, అతి పెద్ద ప్రజాస్వామ్యం – రెండూ సమైక్యంగా ప్రపంచం ముందున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇది సుసంపన్న, సురక్షిత భవితవ్యానికి బాటలు వేస్తుందని ఆశ. ప్రపంచ వేదికపై భారత్‌కు సమున్నత, కీలక పాత్ర ఉందని పాలకులు ప్రకటిస్తున్న వేళ ద్వైపాక్షిక బంధంలో ఇది కొత్త అధ్యాయం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement