india-america
-
ఆశలు మోసులెత్తుతున్న వేళ..
భారత ప్రధాని మోదీ మంగళవారం 3 రోజుల అధికారిక పర్యటనకు అమెరికా పయనమవడంతో ఒక చరిత్రాత్మక ఘటనకు తెర లేచింది. ఇది భారత, అమెరికాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సమూలంగా మార్చివేసే ఘట్టమని విశ్లేషణ. అమెరికాలో వ్యక్తమవుతున్న ఆసక్తి, జరుగుతున్న హంగామా, అధికారిక విందు, చివరకు అమెరికన్ పార్లమెంట్లో మోదీ ప్రసంగం – ఇలా పర్యటన అంశాల్ని గమనిస్తే ఆతిథ్యదేశం దీన్ని ఎంతో ప్రత్యేకంగా భావిస్తున్నట్టు అర్థమవుతోంది. ఈ పర్యటనలో రక్షణ, స్వచ్ఛ ఇంధనం, అంతరిక్షం సహా పలు రంగాల్లో భాగస్వామ్యాలపై చర్చలు జరగనున్నాయి. సెప్టెంబర్‌లో జీ20 సదస్సుకు భారత్ ఆతిథ్యమివ్వనున్నందున ఇది ప్రాముఖ్యం సంతరించుకుంది. నిజానికి, 2014 మేలో తొలిసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన నాటి నుంచి గడచిన తొమ్మిదేళ్ళలో మోదీ అనేకసార్లు అమెరికాలో విస్తృతంగా పర్యటించారు. అయితే, ఇప్పుడు స్నేహపూర్వక ద్వైపాక్షిక సంబంధానికి ఉన్నతస్థాయి వ్యక్తీకరణగా భావించే ‘స్టేట్ విజిట్’గా ఈ పర్యటన సాగుతోంది. ఇలా వెళ్ళడం మోదీకీ ఇదే మొదటిసారి. ఒక దేశ ప్రభుత్వాధినేత ఆహ్వానం మేరకు మరో దేశ ప్రభుత్వాధి నేత సాగించే ఈ సాదర ఆహ్వానయుత పర్యటనకు సహజంగానే సాధారణ అధికారిక పర్యటనకు మించిన హంగూ, ఆర్భాటం ఉంటాయి. అమెరికా అధ్యక్ష దంపతులు స్వయంగా వైట్‌హౌస్‌లో కళ్ళు మిరుమిట్లుగొలిపే అధికారిక విందుకు ఆతిథ్యమిస్తారు. గతంలో రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ (1963 జూన్), ప్రధాని మన్మోహన్ (2009 నవంబర్)ల తర్వాత ఈ తరహా పర్యటనకు సాదర ఆహ్వానం అందుకున్న మూడో భారత నేత – మోదీయే. అత్యంత సన్నిహితులకూ, మిత్రపక్షాలకే అందించే ఈ ఆహ్వానం భారత, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యానికి ప్రతీక. ప్రపంచ దృశ్యం సంక్లిష్టమవుతున్న వేళ అమెరికా – భారత సంబంధాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. చైనా అనుసరిస్తున్న ఇండో – పసిఫిక్ వ్యూహం, ఆధునిక రక్షణ పరిజ్ఞానం పంచు కోవడం, జీఈ–414 టర్బోఫ్యాన్ జెట్ ఇంజన్ల ఉత్పత్తి లాంటివి ఇరు దేశాల చర్చల అజెండాలో ఉన్నాయి. వ్యూహాత్మక సాంకేతిక విజ్ఞాన భాగస్వామ్యం అటుంచితే, రెండుచోట్లా రాజకీయం వేడెక్కివున్న పరిస్థితులివి. రానున్న ఎన్నికల్లో మళ్ళీ అధికారం చేపట్టేందుకు ఇరువురు నేతలూ సిద్ధమవుతున్న వేళ ఈ పర్యటన ద్వారా వారు ఏ మేరకు ఇమేజ్ పెంచుకొని, సమర్థ నేతగా కనిపి స్తారన్నదీ కీలకమే. స్టేట్ విజిట్లలో అసలే హడావిడి ఎక్కువనుకుంటే, ఎన్నికల సీజన్ ఈ హంగా మాను మరింత పెంచేస్తోంది. ప్రవాసీయులు అధికంగా ఉండడం మోదీ పర్యటనకు ఎక్కడ లేని ఈ ఆర్భాటానికొక కారణం కావచ్చు. జనంలో స్వచ్ఛంద స్పందన వస్తే తప్పు లేదు. ముందస్తు వ్యూహంతో, పద్ధతిగా ప్రతిచోటా జాతర సృష్టించడమే అతి అనిపిస్తోంది. రకరకాల సభలతో ‘ప్రవాసీ దౌత్యం’లో మోదీ సిద్ధహస్తుడు గనకనే అనుమానించాల్సి వస్తోందని విమర్శకుల మాట. అమెరికా పర్యటనలో పలువురు వ్యాపారవేత్తలు, నోబెల్ బహుమతి గ్రహీతలు, ఆర్థికవేత్తలను మోదీ కలవనున్నారు. టెస్లా అధినేత ఎలాన్ మస్క్, శాస్త్రీయ అంశాలను ప్రాచుర్యంలోకి తెచ్చిన నీల్ డిగ్రాస్ టైసన్, రాజకీయ శాస్త్రజ్ఞుడు జెఫ్ స్మిత్ తదితరులు సైతం ఆ జాబితాలో ఉండడం విశేషం. గతంలో నెహ్రూ, రాజీవ్, పీవీ నరసింహారావు, వాజ్‌పేయి, మన్మోహన్‌ల అడుగుజాడల్లో అమెరికన్ పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి మోదీ ప్రసంగించనున్నారు. ఆ వరుసలో ఆరో భారత ప్రధానైన మోదీకి ఈ ప్రసంగ ఘనత దక్కడం ఇది రెండోసారి. 1949లో ప్రపంచ శాంతి, మానవ స్వాతంత్య్ర విస్తరణల పరిరక్షణే భారత విదేశాంగ విధాన దృష్టి అన్న నెహ్రూ నాటికీ, 2005లో కీలక సాంకేతిక విజ్ఞానాల అడ్డగోలు వ్యాప్తికి భారత్ కేంద్రస్థానం కాదన్న మన్మోహన్ నాటికీ... ఇప్పటికీ తేడా చూస్తే అగ్రరాజ్యంతో ఢిల్లీ బాంధవ్యం సుదూరం సాగింది. ఇండో–పసిఫిక్‌లో, అలాగే విశాల విశ్వవేదికపై భారత ప్రభావశీల పాత్రను అమెరికా గుర్తించింది.ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో ఆయుధ సరఫరా వ్యవస్థలు సంక్షోభంలో పడడంతో రక్షణ రంగంలో ఆత్మనిర్భరత కీలకమని భారత్ గుర్తించింది. అందుకు పాశ్చాత్య ప్రపంచం నుంచి సాంకే తికత అవసరం. ఇప్పుడు అమెరికా ముందుకొచ్చింది గనక మిగతా దేశాలూ ఆ బాటలో నడవచ్చు. మరోపక్క ఉక్రెయిన్ వ్యవహారంలో రష్యాపై దూకుడుగా వ్యవహరించడం లేదంటూ భారత్ పట్ల అసహనంగా ఉన్న పాశ్చాత్య ప్రపంచం చమురు తదితర అంశాల్లో మన అనివార్యతల్ని అర్థం చేసుకొన్నాయి. కొన్ని అంశాల్లో పరస్పర ఏకాభిప్రాయం లేకున్నా, పరిణతితో కూడిన ఆ అవగాహన సాక్షిగా భారత్, అమెరికాలు పరస్పర గౌరవం, ఉమ్మడి లక్ష్యాలతో నవశకంలోకి నడుస్తున్నాయి. ప్రచ్ఛన్న యుద్ధం నాటి అలీన విధానం నుంచి భారత్ పక్కకు రాకున్నా, ప్రస్తుత ప్రపంచ అధికార క్రమంలో మార్పులను బట్టి పరస్పర విరుద్ధ వర్గాల్లోని దేశాలతో సైతం దోస్తీకి వెనుకాడదనే సంకేతాలిస్తోంది. అలాగే, ‘అబ్కీ బార్... ట్రంప్ సర్కార్’ అంటూ భారీ సభ సాక్షిగా ట్రంప్‌ను మోదీ సమర్థించారు. చివరకు ఆయన ఓడి బైడెన్ వచ్చినా బంధం బలపడిందే తప్ప మార్పు లేదు. ప్రపంచంలోని అతి ప్రాచీన ప్రజాస్వామ్యం, అతి పెద్ద ప్రజాస్వామ్యం – రెండూ సమైక్యంగా ప్రపంచం ముందున్న సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధమయ్యాయి. ఇది సుసంపన్న, సురక్షిత భవితవ్యానికి బాటలు వేస్తుందని ఆశ. ప్రపంచ వేదికపై భారత్‌కు సమున్నత, కీలక పాత్ర ఉందని పాలకులు ప్రకటిస్తున్న వేళ ద్వైపాక్షిక బంధంలో ఇది కొత్త అధ్యాయం. -
నన్ను సంతృప్తిపరచడానికే ఒప్పందం
వాషింగ్టన్: తనను సంతృప్తిపరచడానికే భారత్ అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవాలని కోరుకుంటోందని ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు విధించినందుకు భారత్‌పై మండిపడ్డారు. సుంకాల పెంపునకు సంబంధించి ట్రంప్ భారత్‌ను విమర్శించడం ఇటీవలి కాలంలో ఇది రెండోసారి కావడం గమనార్హం. ఈ సందర్భంగా శ్వేతసౌధంలో మీడియాతో మాట్లాడుతూ జపాన్, యూరోపియన్ యూనియన్, చైనా, భారత్‌లతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుగుతున్నాయని చెప్పారు. తమ ఉత్పత్తులపై అధిక సుంకాలు విధిస్తున్న భారత్‌ను ‘టారిఫ్ కింగ్’గా పేర్కొన్న ట్రంప్ హార్లే డేవిడ్సన్ బైక్‌లపై పెంచిన సుంకాలను ప్రస్తావించారు. సుంకాలు తగ్గిస్తామని ప్రధాని మోదీ హామీ ఇచ్చినా, అవి ఇంకా అధికంగానే ఉన్నాయని అన్నారు. -
భారత్–అమెరికా 2+2 చర్చలు వాయిదా
న్యూఢిల్లీ: భారత్–అమెరికా విదేశాంగ, రక్షణ మంత్రుల మధ్య జూలై 6న జరగాల్సిన 2+2 చర్చలు వాయిదా పడ్డాయి. కొన్ని అనివార్య కారణాలతో ఈ చర్చలు వాయిదా పడినట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ప్రకటించారు. ఈ విషయమై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు ఫోన్‌చేసిన ఆయన విచారం వ్యక్తం చేశారు. దీనికి సానుకూలంగా స్పందించిన సుష్మా ఇరుదేశాలకు ఆమోదయోగ్యమైన మరో తేదీన అమెరికా లేదా భారత్‌లో సమావేశమయ్యేందుకు అంగీకరించారు. 2017లో ప్రధాని మోదీ అమెరికా పర్యటన సందర్భంగా ఇరుదేశాల మధ్య వ్యూహాత్మక, భద్రత, రక్షణ రంగాల్లో సహకారం పెంపొందించుకోవడంలో భాగంగా 2+2 చర్చలు జరిపేందుకు భారత్, అమెరికాలు అంగీకరించాయి. -
‘ఉగ్ర ప్రకటన’పై భారత్, అమెరికా చర్చలు
న్యూఢిల్లీ: ఉగ్ర సంస్థలు, వ్యక్తులను అధికారికంగా ప్రకటించేందుకు భారత్, అమెరికాల మధ్య జరిగిన తొలి సమావేశం సోమవారం ముగిసింది. ఉగ్రముప్పు ఎదుర్కోవడానికి సహకారాన్ని బలోపేతం చేసుకోవాలని ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ఈ సమావేశానికి భారత్ తరఫున విదేశాంగ శాఖ, హోం మంత్రిత్వ శాఖల సీనియర్ అధికారులు హాజరయ్యారు. అమెరికా నుంచి హోంల్యాండ్ అధికారులు పాల్గొన్నారు. ఉగ్ర సంస్థలు, వ్యక్తులను జాతీయ, అంతర్జాతీయ వేదికలపై ఉగ్రవాదులుగా ముద్రవేసే విధానాలపై ఇరు వర్గాలు చర్చలు జరిపాయని విదేశాంగ శాఖ ప్రకటన జారీచేసింది. తదుపరి రౌండ్ సమావేశం 2018లో అమెరికాలో జరుగుతుంది. -
దొంగల కాల్పుల్లో భారతీయుడి మృతి
వాషింగ్టన్: అమెరికాలోని ఒహయో రాష్ట్రంలో దోపిడీ దొంగలు ఓ భారతీయ అమెరికన్‌ను కాల్చి చంపారు. కరుణాకర్ కరేంగ్లే (53) అనే వ్యక్తి ఫెయిర్‌ఫీల్డ్ ప్రాంతంలోని ‘జిఫ్ఫీ కన్వినియెన్స్ మార్ట్’ అనే సూపర్మార్కెట్లో పనిచేస్తుండేవారు. సోమవారం రాత్రి 10 గంటల సమయంలో ముసుగులు ధరించి స్టోర్‌లోకి ప్రవేశించిన ఇద్దరు దుండగులు కరుణాకర్‌పై కాల్పులు జరిపి నగదును దోచుకుని పారిపోయారు. పోలీసులు ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా, కరుణాకర్ శుక్రవారం ప్రాణాలు విడిచారు. అక్కడకు దగ్గర్లోని ప్రాంతాల్లో ఆయనకు బంధువులెవరూ లేరని తాము భావిస్తున్నామని పోలీసులు చెప్పారు. -
రక్షణ బంధం బలోపేతం
వాషింగ్టన్: భారత-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా.. ఇరు దేశాలు మంగళవారం కీలకమైన రక్షణ వ్యూహరచన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా ఇరు దేశాలు.. ఒకరి మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్‌లను మరొకరు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఇరు దేశాల మిలటరీ సంయుక్తంగా సమర్థవంతమైన ఆపరేషన్లు చేపట్టవచ్చు. వాషింగ్టన్లో భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణ సెక్రటరీ ఆష్టన్ కార్టర్ మధ్య ‘లాజిస్టిక్స్ ఎక్స్చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రీమెంట్’ (ఎల్ఈఎమ్ఓఏ)పై ఒప్పందం జరిగింది. ఇరుదేశాల మిలటరీ మధ్య రక్షణ రంగంలో సాయం, ఆయుధాల సరఫరా, సేవలు వంటివి తిరిగి చెల్లించే పద్ధతిలో వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా తన మిత్ర, సన్నిహిత దేశాలతో రక్షణ రంగంలో ఉన్న సాంకేతికత, వ్యాపార సహకార సంబంధాలను ఇకపై భారత్‌తోనూ కొనసాగించనుందని.. ఒప్పందం తర్వాత సంయుక్త ప్రకటనలో అమెరికా వెల్లడించింది. ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో అమెరికా ఎయిర్‌బేస్‌లను నిర్మించుకోదని.. కేవలం ఇక్కడి సేవలను అమెరికా మిలటరీ వినియోగించుకుంటుందని పరీకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో ఈ ఒప్పందం కీలకమన్నారు. మరో రెండు ఒప్పందాలకు (సీఐఎస్ఎమ్ఓఏ, బీఈఏసీఏ) అమెరికా పట్టుపడుతున్నా సంతకాలు చేసేందుకు భారత్ తొందర పడటం లేదని పరీకర్ తెలిపారు. -
అమెరికాను తాకిన మోడీ గాలి
బైలైన్ ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరమ్మతు చేసుకోలేనంతగా దిగజారిపోలేదు. వాటిని ఉతికి ఆరేయాలి. రెండు దేశాలు ఒకే విధమైన మౌలిక విలువలు, ప్రయోజనాలు కలిగిన దేశాలు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాలలో ముఖ్య భాగస్వాములు కాగలిగినవి. అలాంటి దేశాల మధ్య ప్రస్తుతమున్న ఇబ్బందికరమైన పరిస్థితి అనావశ్యకమైనది. ఎన్బీసీ చానల్ ఫిబ్రవరి 28 శుక్రవారం ఉదయం వార్తా బులెటిన్ మధ్య ఓ అంశం చటుక్కున కనిపించింది. ఆ వార్తను బులెటిన్‌లో చేర్చింది తామేనని సంపాదకులే నమ్మలేరనిపించేంత నమ్మశక్యంకానిది అది. చనిపోయిన మనిషి బతికాడు. ఎన్బీసీలాంటి ప్రధాన చానల్ సరిచూసుకోకుండా ‘మృతిచెందారు’ అనీ అనదు, నిర్ధారించుకోకుండా ‘బతికున్నారు’ అనీ అనదు. శవ యాత్రికులు శవపేటికను గమ్యానికి తీసుకుపోతుండగా శవం పేటికను తన్నడం మొదలుపెట్టింది. శవయాత్రలో ఉన్నవారు ఎంతగా నిర్ఘాంతపోయి ఉంటారో అంతగా యాంకర్లు కూడా నిర్ఘాంతపోయే ఉంటారు. అయితే వారు దాన్నో అద్భుతంగా అభివర్ణించి, చకచకా సురక్షితమైన వాతావరణ క్షేత్రానికి వెళ్లిపోయారు. సూర్యకాంతితో నిండిన ఆకాశం కింద మైనస్ జీరో ఉష్ణోగ్రతలతో మంచు గాలులు కురుస్తాయని తెలిపారు. ఇంతటి కలవర పాటు ప్రశంసలు మరే అద్భుతానికి లభించి ఉండవు. ఈ కథలో ఒక నీతి ఉంది. శవాన్ని పూడ్చి పెట్టేసేవరకు ఆశను కోల్పోకూడదు. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు కోమాలోకి వెళ్లిపోయాయి. కానీ అవి కాటికి చేరడానికి ఇంకా చాలా దూరం ఉంది. అమెరికన్ అకాడమీ, మీడియాలలో చిన్నదే అయినా దృఢసంకల్పం కలిగిన లాబీ ఒకటుంది. భారత దేశం పట్ల అమెరికా విధానాన్ని కాకపోయినా వైఖరులను అది ప్రభావితం చేయగలిగింది. ఢిల్లీ గద్దెను చేరుకునే దిశగా నరేంద్రమోడీ సాగిస్తున్న పయనాన్ని ఆపడం తమ వల్ల కాదనే విషయాన్ని అది ఎట్టకేలకు గుర్తించడం ప్రారంభించింది. మోడీకి వీసాను నిరాకరించేలా చేయడం ఆ లాబీ సాధించిన ఘనకార్యాల్లో ఒకటి. 1984 అల్లర్లలో సోనియా గాంధీ పాత్ర ఉన్నదనే ఆరోపణతో ఒక అమెరికన్ కోర్టులో ఆమెపై కేసు ఉంది. అయినా ఈ లాబీ ఆమె వీసా విషయమై ఎన్నడూ ఎలాంటి ప్రశ్నలను లేవనెత్తలేదు. అమెరికాకు చెందిన ‘ప్యూ’ పరిశోధన సంస్థ విస్తృత స్థాయిలో జరిపిన ప్రజాభిప్రాయ సేకరణ ఆ లాబీకి కీలకమైన పరిగణనాంశం అయింది. ప్యూ ఫలితాలు ఇప్పుడే వెలువడ్డాయి. కానీ దాని సమాచారం మాత్రం గత కొన్ని వారాలుగా చర్చనీయాంశంగా మారింది. కనీవినీ ఎరుగని రీతిలో అది మోడీకి 63 శాతం మద్దతును, కాంగ్రెస్‌కు 19 శాతం మద్దతును సూచించింది. ప్యూ విశ్వసనీయతపై అమెరికా ప్రభుత్వానికి నమ్మకముంది. ఇక మన ఎన్నికల కలగూర గంపలోని అనేక చిన్న పార్టీలు ఎటు మొగ్గు చూపుతున్నాయనే ఆధారాలు ఉండనే ఉన్నాయి. అవి తమంత తాముగా ఏమంత సాధించలేకపోయినా గానీ ప్రధాన అయస్కాంతాలలో దేనితో చేరితే దాని గెలుపునకు కావాల్సిన ఓట్ల శాతాల్లో తేడాను తేగలుగుతాయి. 2004, 2009 ఎన్నికల్లో ప్రధానంగా అవి కాంగ్రెస్, యూపీఏలతో ఉన్నాయి. ఈ ఏడాది గురుత్వాకర్షణ శక్తి వాటిని మరో దిశకు లాగేస్తోంది. బీహార్‌లో లాలూప్రసాద్ యాదవ్-రాంవిలాస్ పాశ్వాన్-కాంగ్రెస్ అనే త్రిమూర్తుల కూటమి పునరుద్ధరణ గురించి రెండు నెలలపాటు చర్చలు జరిగాయి. చావో రేవో తేల్చుకోవాల్సి వచ్చేసరికి బీజేపీ, పాశ్వాన్‌తో కలిసి రెండు పార్టీల నిర్ణయాత్మక భాగస్వామ్యాన్ని సాధించగలిగింది. పెద్ద వాళ్లు అనుకున్నవాళ్లు తప్పు చేయగలుగుతారు. అహంకారంతో తమ సొంత విలువను ఎక్కువగా లెక్కేసుకుంటారు. చిన్న పార్టీలు తప్పు చేయలేవు. అమెరికా ప్రభుత్వం మేల్కొని కాషాయం వాసనను పసిగట్టడం ప్రారంభించింది. అధ్యక్షుడు బరాక్ ఒబామాకు మన దేశం పట్ల ఒకప్పుడు ఉండి ఉండే కాసింత ఆసక్తి సైతం ఇప్పుడు లేదనేది బహిరంగ రహస్యమే. ఆసియాలోని ఆయన ప్రాధాన్యాలు భారత్‌కు తూర్పు, పడమరల్లో ఉన్నాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చైనాతో సంబంధాలకు ఉన్న విలువ రీత్యా ఆయన వాటికే అత్యంత ప్రాధాన్యాన్ని కొనసాగిస్తున్నారు. ఆమెరికా ఆర్థిక విందు భోజనం బల్లపైకి భారత్ అందించగలిగిన వంటకాలేవీ లేవు. అఫ్ఘానిస్థాన్ నుంచి సేనల ఉపసంహరణకు ఒబామా కట్టుబడి ఉన్నారు. అందుకు ఆయనకు పాకిస్థాన్ సహకారం అవసరం. అమెరికా ఉపసంహరణ తర్వాత భారత్‌కు మరింత ఎక్కువ పాత్రను నిర్వహించగలిగిన శక్తి ఉంది. కానీ ఆ పాత్రను నిర్వచించగలిగేది భవిష్యత్తు. ఇరాన్‌తో సాధారణ సంబంధాలను నెలకొల్పుకోవడంలో ఒబామా అసాధారణమైన కృషి చేశారు. తక్షణమైన, నాటకీయమైన భౌగోళిక రాజకీయ పర్యవసానాలను మినహాయిస్తే ఈ కృషి చరిత్ర పుస్తకాలకు మాత్రమే పరిమితమయ్యేదని ఆయనకు తెలుసు. అమెరికాకు భారత్ శత్రు అధీన ప్రాంతంలోని అనుబంధ స్థావరం కాగలిగేదే. కానీ అందుకు కావాల్సింది నమ్మకం. అది ఆవిరైపోయింది. భారత్‌తో అణుశక్తి ఒప్పందానికి రూపకల్పన చేసిన అధికారులు, రాజకీయవేత్తలు తిరిగి ఆ నమ్మకాన్ని కలిగించడానికి బదులు నమ్మకద్రోహానికి గురైనామనే భావనను ప్రచారం చేస్తున్నారు. అణు ఒప్పందంలోని అలిఖిత భాగానికి సంబంధించి మన దేశం తన ప్రతిష్టకు తగ్గ విధంగా ప్రవర్తించలేదని వారి అంచనా. రక్షణమంత్రి ఏకే ఆంటోనీ కంటే ఎక్కువగా భారత్-అమెరికా సంబంధాలకు చెరుపు చేసినవారు మరెవరూ లేరు. యుద్ధ విమానాలను అమ్మజూపుతూ అమెరికా వేసిన టెండర్‌ను ఆయన తొలి దశలోనే తోసిపుచ్చారు. ఇది కేరళకు చెందిన మరో వామపక్ష పక్షపాత రాజకీయవేత్త కృష్ణమీనన్‌ను గుర్తుకు తెస్తోంది. ఆంటోనీ నిర్ణయానికి సముచిత కారణమే ఉంటే ఆ విషయాన్ని ఆయన, ఆయన దూతలు వారికి వివరించడమనే మంచి పని చేసి ఉండాల్సింది. ఆసక్తికరమైన దేవయాని ఖోబ్రగడే తక్కువ వేతనాల పనిమనిషి వ్యవహారం చిన్న విషయమే. కాకపోతే పేరుకుపోయిన ఇతర సమస్యల వల్ల భారత్, అమెరికా అధికార యంత్రాంగాల మధ్య నెలకొన్న పగలను తేల్చుకునే యుద్ధ రంగంగా ఆ సమస్యను మార్చాయి. ఐదేళ్ల క్రితమైతే అలాంటి సమస్య అతి కనిష్టమైన రచ్చతోనే పరిష్కారమై ఉండేది. భారత్, అమెరికాల మధ్య సంబంధాలు మరమ్మతు చేసుకోలేని విధంగా దిగజారిపోలేదు. కానీ ప్రమాదకరమైనంతటి వికారంగా మారాయి. వాటిని ఉతికి గాలి, ఎండ తగిలేలా ఆరేయాలి. మంచి స్నేహితులకు మాత్రమే చేతనయ్యేటంతటి పారదర్శకతతో ఇస్త్రీ చేసి సరైన రూపుకు తేవాలి. భారత్, అమెరికాలు ఒకే విధమైన మౌలిక విలువలు, ప్రయోజనాలు కలిగిన దేశాలు. తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న ప్రాంతాలలో ముఖ్య భాగస్వాములు కాగలిగినవి. అలాంటి దేశాల మధ్య ప్రస్తుతం ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి తర్కవిరుద్ధమైనది, అనావశ్యకమైనది. ముఖం మాడ్చుకోవడం అపరిపక్వత మాత్రమే. లేదంటే సరిదిద్దుకునే క్రమానికి అద్భుతం అవసరం. ప్యూ అంచనా వేసినట్టు మేలో మన దేశంలో ప్రభుత్వం మారే నాటికి ఒబామాకు ఇంకా రెండేళ్ల పదవీ కాలం మిగిలే ఉంటుంది. మార్పు ఒక అవకాశం. తక్షణ గతంతో చేయగలిగిన అత్యుత్తమమైన పని దాన్ని వెనక్కు నెట్టేయడమే. ఒకప్పుడు ఇరు దేశాల మధ్య సంబంధాలు మంచి ఊపు మీద ఉండి చాలా సాధించగలమని వాగ్దానం చేసింది. ఆ ఊపు పూర్తిగా సడలిపోవడానికి అవకాశమిచ్చారు. దాన్ని పునరుద్ధరించడానికి రెండు ప్రభుత్వాలు కొత్త చొరవను ప్రదర్శించాలి.