రక్షణ బంధం బలోపేతం
వాషింగ్టన్: భారత-అమెరికా ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతమయ్యేలా.. ఇరు దేశాలు మంగళవారం కీలకమైన రక్షణ వ్యూహరచన ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. దీనిద్వారా ఇరు దేశాలు.. ఒకరి మిలటరీ, రక్షణ రంగ ఆస్తులు, ఎయిర్ బేస్‌లను మరొకరు వినియోగించుకోవచ్చు. దీంతోపాటు ఇరు దేశాల మిలటరీ సంయుక్తంగా సమర్థవంతమైన ఆపరేషన్లు చేపట్టవచ్చు. వాషింగ్టన్‌లో భారత రక్షణ మంత్రి మనోహర్ పరీకర్, అమెరికా రక్షణ సెక్రటరీ ఆష్టన్ కార్టర్ మధ్య ‘లాజిస్టిక్స్ ఎక్స్‌చేంజ్ మెమొరాండం ఆఫ్ అగ్రీమెంట్’ (ఎల్‌ఈఎమ్‌ఓఏ)పై ఒప్పందం జరిగింది.
ఇరుదేశాల మిలటరీ మధ్య రక్షణ రంగంలో సాయం, ఆయుధాల సరఫరా, సేవలు వంటివి తిరిగి చెల్లించే పద్ధతిలో వినియోగించుకోవచ్చు. ఈ ఒప్పందం ద్వారా అమెరికా తన మిత్ర, సన్నిహిత దేశాలతో రక్షణ రంగంలో ఉన్న సాంకేతికత, వ్యాపార సహకార సంబంధాలను ఇకపై భారత్‌తోనూ కొనసాగించనుందని.. ఒప్పందం తర్వాత సంయుక్త ప్రకటనలో అమెరికా వెల్లడించింది.
ఈ ఒప్పందం ద్వారా భారత్‌లో అమెరికా ఎయిర్‌బేస్‌లను నిర్మించుకోదని.. కేవలం ఇక్కడి సేవలను అమెరికా మిలటరీ వినియోగించుకుంటుందని పరీకర్ తెలిపారు. ఉగ్రవాదాన్ని అంతం చేయటంలో ఈ ఒప్పందం కీలకమన్నారు. మరో రెండు ఒప్పందాలకు (సీఐఎస్‌ఎమ్‌ఓఏ, బీఈఏసీఏ) అమెరికా పట్టుపడుతున్నా సంతకాలు చేసేందుకు భారత్ తొందర పడటం లేదని పరీకర్ తెలిపారు.