మోదీ సర్కార్‌ తీరే వేరు | Separate road of modi govt | Sakshi
Sakshi News home page

మోదీ సర్కార్‌ తీరే వేరు

Published Wed, Oct 17 2018 5:02 PM | Last Updated on Wed, Oct 17 2018 5:35 PM

Separate road of modi govt - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్‌కు వ్యతిరేకంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రోజు రోజుకు వెల్లువెత్తుతున్నప్పటికీ ఆయన్ని మంత్రివర్గం నుంచి తొలగించేందుకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం సుముఖంగా లేదు. ఎవరి నుంచి ఏ అవినీతి ఆరోపణలు వచ్చినా చర్య తీసుకోకుండా భీష్మించుకుని కూర్చోవాలన్నది మోదీ ప్రభుత్వం విధానంగా కనిపిస్తోంది. నాలుగేళ్ల క్రితం మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలోనే కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీపై ఎన్నికల అఫిడవిట్‌లో విద్యార్హతలు తప్పుగా పేర్కొన్నారన్న ఆరోపణలతో వివాదం చెలరేగింది. మోదీ ప్రభుత్వం ఆమెకే అండగా నిలిచింది. ఇతర కారణాల చేత ఆ తర్వాత ఆమె శాఖను మార్చారు. ఐపీఎల్‌ స్కామ్‌లో కూరుకుపోయిన లలిత్‌ మోదీ దేశం విడిచి పారిపోయేందుకు సహకరించిన కేంద్ర విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, రాజస్థాన్‌ ముఖ్యమంత్రి వసుంధర రాజెలకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పెద్ద పెట్టున ఆందోళన చేసినా వారిని మోదీ ప్రభుత్వం తొలగించలేదు. దేశంలోని బ్యాంకులకు 9,400 కోట్ల రూపాయలు ఎగవేసి లండన్‌ పారిపోయిన విజయ్‌ మాల్యా విషయంలో అత్యంత నిర్లక్ష్యం వహించిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీపైనా ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకోలేదు. పార్లమెంట్‌ ఆవరణలో జైట్లీని కలుసుకున్న విజయ్‌ మాల్యా ఆ రోజు సాయంత్రం లండన్‌ వెళుతున్నట్లు చెప్పినా, ఆయన్ని ఆపేందుకు జైట్లీ ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నది తెల్సిందే. ఏబీవీపీ తరఫున పోటీ చేసి ఢిల్లీ యూనివర్శిటీ విద్యార్థి సంఘం అధ్యక్షడిగా ఎన్నికైన అంకివ్‌ బైసో డిగ్రీ పట్టా నకిలీదని తేలినా ఆయనపై చర్య తీసుకోవడానికి బీజేపీ తిరస్కరించింది. 

అంతెందుకు ప్రధాని నరేంద్ర మోదీపైనే పలు ఆరోపణలు వచ్చాయి. భార్యను వదిలిపెట్టిన ఆయన తన ఎన్నికల అఫిడవిట్‌లో బ్రహ్మచారిగా పేర్కొన్నారు. మోదీ ఎంఏ పూర్తి చేయకుండానే చేసినట్లు ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్నారన్నది వివాదాస్పదం అయింది. తనకన్నా వయస్సులో ఎంతో చిన్నదైన యువతిపై అధికార దుర్వినియోగానికి పాల్పడి నిఘా ఏర్పాటు చేశారన్న ఆరోపణలు మోదీపై కొత్త కాదు. 
 

మంత్రులు రాజీనామా అవసరం లేదన్న రాజ్‌నాథ్‌
‘మా మంత్రులు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. ఇది వారి ప్రభుత్వం కాదు. ఇది ఎన్డీయే ప్రభుత్వం. విమర్శలకు తలొగ్గి రాజీనామాలకు, ఉద్వాసనలకు మేము పాల్పడం. అలా చేస్తే విమర్శలు వస్తూనే ఉంటాయి. రాజీనామాలు, ఉద్వాసనలు కొనసాగించాల్సి వస్తుంది. అప్పుడు ప్రభుత్వం బలహీన పడుతుంది. ఈ విషయాన్ని మేము రెండో యూపీఏ ప్రభుత్వం నుంచే నేర్చుకున్నాం....’ అప్పట్లో వసుంధర రాజె, సుష్మా స్వరాజ్‌ల రాజీనామా డిమాండ్లపై స్పందిస్తూ రాజ్‌నాథ్‌ చేసిన వ్యాఖ్యలివి. యూపీఏ హయాంలో మంత్రులు రాజీనామా చేయలేదనా, చేసినందు వల్ల ప్రభుత్వం బలహీన పడిందన్నది ఆయన ఉద్దేశమా ? స్పష్టత లేదు. యూపీఏ హయాంలో తమపై వచ్చిన ఆరోపణలను చట్టబద్ధంగా ఎదుర్కోవడానికి నైతిక బాధ్యత వహించి పలువురు మంత్రులు రాజీనామాలు చేశారు. 

రాజీనామాల పర్వం
లలిత మోదీ ఐపీఎల్‌ స్కామ్‌తోని అప్పటి విదేశాంగ సహాయ మంత్రి శశి థరూర్‌కు ప్రమేయం ఉందని ఆరోపణలు రావడంతో కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనతోని రాజీనామా చేయించింది. ఆ తర్వాత అవినీతి ఆరోపణల కారణంగా  కేంద్ర కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ మంత్రి ఏ రాజా, జౌళి శాఖ మంత్రి దయానిధి మారన్, రైల్వే మంత్రి పవన్‌ కుమార్‌ బన్సాల్, మైక్రో, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ వీరభద్ర సింగ్, పర్యాటక శాఖ మంత్రి సుబోద్‌ కాంత్‌ సహాయ్, న్యాయ శాఖ మంత్రి అశ్వణి కుమార్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ చవాన్‌లు రాజీనామాలు చేశారు. వారిలో కొంత మంది ఇప్పటికే కేసుల నుంచి నిర్దోషులుగా బయటకు రాగా, మరికొందరిపై  కేసుల విచారణ ఇప్పటికీ కొనసాగుతోంది. ఎవరికీ శిక్ష పడలేదు. ప్రస్తుతం లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంజె అక్బర్‌ను తొలగించాల్సిందిగా ఆరెస్సెస్‌ అధిష్టానం నుంచి మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది. ఎంజె అక్బర్‌ ముస్లిం అయినందువల్లనే ఆరెస్సెస్‌ ఒత్తిడి తెస్తోందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement