
‘జవాబుదారీ’యే వజ్రాయుధం
బైలైన్
ఎంజే అక్బర్
జవాబుదారీతనం ఓటర్ల ఆయుధాగారంలోని ఆయుధమైనప్పుడు పార్లమెంటు సభ్యుడు పిచ్చి పట్టిందా అనిపించేటంత బాధ్యతాయుతంగా ఉంటాడు. ఆయన్ను ఎన్నుకున్నది జాతీయ స్థాయి స్థూల సమస్యలపైనే కావచ్చు. అయినా ఎంపీ అనే బిరుదు ఓసారి లభించిందంటే సూక్ష్మ స్థాయి ప్రాంతీయ సమస్యలకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది.
ఆల్బర్డ్ ఐన్‌స్టీన్ తొలి ప్రయత్నంలో కళాశాల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణుడు కాలేక పోయాడు. అంటే మన బోటి వాళ్లం కూడా కచ్చితంగా ఆశలు పెట్టుకోవచ్చు.
సుప్రసిద్ధ హిందీ చలన చిత్ర నటుడు బిశ్వజిత్ దేబ్ ఛటర్జీ బెంగాల్ కు చెందినవారు. ‘హమ్ద్‌మ్ మేరే’, ‘మాన్ భీ జావో’, ‘కహ్నా మేరే ప్యార్ కా’ వంటి పాటలతో 1970లలో ప్రేక్షకులను అలరించారు. ఆకర్షణీయమైన 78 ఏళ్ల ప్రాయంలో ఆయన మమతాబెనర్జీ తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థిగా న్యూఢిల్లీ నియోజక వర్గం నుంచి బరిలోకి దిగారు. ఐన్‌స్టీన్‌లాగే ఆయన కూడా లోక్‌సభ ప్రవేశ పరీక్షలో తొలిసారి ఉత్తీర్ణులు కారనే చెప్పొచ్చు. అయితే ఆయన భవిష్యత్తు మాత్రం ఆకర్షణీయమైన సిద్ధాంతంపై నిలవగలుగుతుంది. బిశ్వజిత్ చదువుకున్నది అణు భౌతిక శాస్త్రం కాదు, రాజనీతి శాస్త్రం. అయితేనేం ఎక్కడున్నా మేధావి మేధావే.
బిశ్వజిత్ పోలింగ్‌కు రెండు వారాల ముందు ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రికతో మాట్లాడుతూ... ఇంతవరకు తాను తన నియోజక వర్గంలో అడుగు పెట్టలేదని, తన ప్రత్యర్థులెవరో కూడా తెలియదని, ఓటర్ల సమస్యలు, డిమాండ్ల గురించిన చింతే లేదని చెప్పారు. అయినా గెలుస్తానని ధీమాగా ఉన్నారు. ఎందుకని? తమ నేత మమతాబెనర్జీ ప్రతిష్ట బెంగాల్‌కు మాత్రమే పరిమితం కాలేదు... ఢిల్లీకి కూడా విస్తరించింది.
బిశ్వజిత్ ప్రాక్టికల్స్‌ను తప్పుగా చేసి ఉంటే ఉండొచ్చు. కానీ ఆయన ఆశావహమైన తరంగ సిద్ధాంతం మాత్రం ఆలోచించదగింది. కాంతి వేగంతో పయనించే ఎన్నికల ప్రచారంలో శక్తికి ఫలితంతో ఎలాంటి సంబంధం ఉండదు. మమతా ‘గాలి’ వీస్తే (తరంగంతో) ఆయన లోక్‌సభ లోపలికి, లేకపోతే బయటకు కొట్టుకు పోతారు.
ఇ (ఎలక్షన్) = ఎమ్‌సీ (కనీస పట్టింపు) స్క్వేర్ ((E = MC2). ఈ సిద్ధాంతాన్ని బహిరంగంగా ఒప్పుకునేవాళ్ల కంటే ఎక్కువ మంది రాజకీయవేత్తలు విశ్వసిస్తారు. ఆధారం వాళ్ల వద్ద ఉంది. ‘ఆమ్ ఆద్మీ’ ఎమ్మెల్యేల్లో ఎంత మంది గెలుస్తామని ముందే అనుకున్నారు? రాజకీయాలు మానవ వ్యాపారం. మానవులన్నాక అయస్కాంతాల్లా ఆకర్షించక మానరు. రోజు వారీ ఘటనల్లాగా వస్తూ పోతూ ఉండే చిన్న చిన్న తుపానులను అభ్యర్థులు జీర్ణించుకోగలుగుతారు. చివరకు అవి ఓటర్ల ముందున్న పెద్ద సమస్యల్లో భాగమై పోతాయని భావిస్తారు. ఒక తరంగాన్ని లేదా ‘గాలి’ని సవాలు చేసి నిలిచే ఏ అభ్యర్థికైనా ఎన్నికలు నిజంగానే కఠినమైనవిగా మారుతాయి. ఉదాహరణకు ప్రజాభిమానాన్ని చూరగొనడంలో బిశ్వజిత్‌కు ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ మాకెన్‌ను తీసుకుందాం.
ఆయన సాధ్యమైనంత గుట్టు చప్పుడు కాకుండా... తమ పార్టీని మింగేస్తున్న అవినీతి అనే ‘బ్లాక్ హోల్’కు వీలైనంత దూరంగా జరగాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన ఒక రేడియో ప్రకటనలో ఢిల్లీ నగర వృత్తి నిపుణులకు సహాయం చేశాననడంతో పాటూ ‘మచ్చలేని మనిషి’గా తనకు పేరుందని చెప్పుకున్నారు.
ఓటర్లకు కూత వేటు దూరంలో ఉన్న ప్రకటన ఇదొక్కటే కాదు. రేడియో స్టేషన్ల వంటి తటస్థ ప్రచార సాధనాలే కాంగ్రెస్‌కు ఎక్కువ ఆందోళనను కలుగజేస్తున్నాయనుకుంటా. అవినీతిని అంతం చేయాలంటే పోలింగ్ బుత్‌లకు వెళ్లండని అవి పౌరులను కోరుతుండటం ఇబ్బంది పెడుతుండొచ్చు. మొన్న మొన్నటి వరకు కామన్‌వెల్త్ క్రీడల కోసం టాయ్‌లెట్ పేపర్‌కు చెల్లించిన భారీ ధర మాత్రమే నవ్వుకోడానికి సరిపోయేది. ఎన్నికల సందర్భంగా వెలువడ్డ రెండు ప్రకటనలు అత్యంత ప్రభావ శీలమైనవి. మన దేశంలో ఏం జరుగుతోందని పిల్లల్ని అడిగితే... ధనవంతులు మరింత ధనవంతులవుతున్నారు అని సమాధానం వస్తుంది. మన నాయకులు ఏం చేస్తున్నారు? అంటే ‘కుచ్ నహీ!’ (ఏం లేదు) అని రాగయుక్తంగా వచ్చే సమాధానం మరొకటి.
అజయ్ మాకెన్ కళంకిత ప్రభుత్వాన్ని సమర్థించే పనిని చేస్తున్న మాట నిజమే అయినా... తాను ఏమీ ఎందుకు చేయడం లేదో ఓటర్లకు వివరించాల్సి ఉంది.
ఓటర్‌కు సంబంధించి ప్రతి సమస్యా సందర్భోచితమైనదే. ప్రతి ఎన్నిక... అసలు ఆ ఎన్నికలు ఎందుకు జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి గ్రేడుల కొలబద్ధపై సమస్యల ప్రాధాన్యాలను నిర్ణయించి వాటిని తిరిగి వరుస క్రమంలో పెడుతుంది. మీ ఇంటి బయటి మురుగు కాలువ మునిసిపల్ ఎన్నికల తర్కంలో అగ్రశ్రేణి ఎజెండా అంశంగా మారుతుంది. ఢిల్లీలాంటి నగర రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎన్నుకునే ఎన్నికల్లో నీరు, విద్యుత్తులకు చాలా ప్రాధాన్యం లభిస్తుంది. కానీ సార్వత్రిక ఎన్నికలు జాతీయ సమస్యలపై నిశితంగా దృష్టిని సారిస్తాయి, కేంద్రీకరిస్తాయి. అవినీతి, అధిక ధరలు దేశవ్యాప్తంగా కనిపిస్తున్న సమస్యలు. లడక్ నుంచి కన్యాకుమారి వరకు అందరూ ఢిల్లీలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడాలని కోరుకుంటున్నారు.
అలాంటి సమస్యల పట్ల ప్రతిస్పందన ఏక రూపంగా ఉండజాలదు లేదా ప్రతి నియోజక వర్గంలో ఒకే ఫలితం రాదు. స్థానిక సెంటిమెంటు లేదా సెక్షనల్ ఆకాంక్షలు, భయాలు కూడా ఫలితాలను ప్రభావితం చేస్తాయి. భారతదేశం అత్యంత ఆకర్షణీయమైన అంశాల మేలు కలయిక. అతి గొప్పదైన మన పార్లమెంటులో ప్రతి దృక్కోణానికి చోటుంటుంది. అదే మన ప్రజాస్వామ్య వ్యవస్థకున్న బలం. గత పార్లమెంట్లు విభేదాలతో విడిపోయి పనిచేయకుండా పోయే స్థితికి చేరాయి. అయితే ఆ క్రమాన్ని తలకిందులు చేసే సుస్థిరత్వమనే భావన మెట్టుమెట్టుగా ‘క్రిటికల్ మాస్’ను (కీలక ద్రవ్యరాశి) సంతరించుకుంటోంది.
కాబట్టి మన హీరో బిశ్వజిత్ అంటున్నది సరైనదేనా? మునిసిపల్ సమస్యలపట్ల ఏ అభ్యర్థయినా ఉదాసీనంగా ఉండగలరా? సుప్రసిద్ధమైన నానుడిలాగా సమాధానం... అవును, కాదు కూడా. జవాబుదారీతనం ఓటర్ల ఆయుధాగారంలోని ఆయుధమైనప్పుడు పార్లమెంటు సభ్యుడు పిచ్చి పట్టిందా అనిపించేటంత బాధ్యతాయుతంగా ఉంటాడు. ఆయన్ను ఎన్నుకున్నది జాతీయస్థాయి స్థూల కారణాలతోనే కావచ్చు. అయినా ఎంపీ అనే బిరుదు ఓసారి లభించిందంటే ఆయన సూక్ష్మ స్థాయి ప్రాంతీయ సమస్యలకు కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది. వెల్లువెత్తుతున్న తరంగానికి మీరు వ్యతిరేకంగా ఉన్నప్పుడు... అధికారంలో ఉండటం వల్ల కలిగే వ్యతిరేకత రెట్టింపు ప్రమాదకరంగా మారుతుంది. ఢిల్లీలో ఏం తప్పు జరిగిందనేదే కాదు ఇంటి ముందు ఏం జరిగిందనేది కూడా పట్టించుకుంటారు.
రెండో ప్రవేశ పరీక్ష రాజకీయాలు. అది మొదటి దాని కంటే చాలా కష్టంగా ఉంటుంది.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)