సమోసా తిరుగుబాటు | samosa Coup, by mj akbar | Sakshi
Sakshi News home page

సమోసా తిరుగుబాటు

Published Wed, Jan 20 2016 12:17 AM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

సమోసా తిరుగుబాటు - Sakshi

సమోసా తిరుగుబాటు

బైలైన్

 

సమోసా తిరుగుబాటు కంటే కఠోర దండన రాజకీయాల్లో మరొకటి లేదు. ప్రతి రాజకీయ వేత్తకూ ఆ మాత్రం తెలుసు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, ఆయనకు పెద్ద దిక్కు, సూపర్ ముఖ్యమంత్రి అయిన లాలూ ప్రసాద్ యాదవ్‌లు ఎన్నో ఎన్నికల సమరాలలోనూ, పరిపాలనలోనూ కూడా ఆరితే రిన అనుభవజ్ఞులే. అయినా వారు, పేద వాడి నోటి తిండి నుంచి డబ్బు పిండి ఖజానా కడుపు నింపే పని ఎన్నడూ చేయరాదనే ప్రాథమిక ప్రజాస్వామిక సూత్రాన్ని మరిచి పోవడం ఆశ్చర్యకరం. రోజంతా కష్టపడ్డ పేదవారికి తక్కువ ఖర్చుకే దొరికే కొన్ని క్షణాల సంతోషపు విలాసం... సమోసా, అలాంటి ఇతర సాయంకాలపు చిరు తిండ్లే. 

 

బడ్జెట్ పరిభాషలో ‘‘పాపం పన్ను’’గా పిలిచేది ప్రభు త్వానికి క్రమం తప్పక ఆదాయాన్ని సమకూర్చే వనరు. అది, లిక్కరు, సిగరెట్లు వంటి వస్తువులపై విధించే పన్ను. అవును, పరిశుద్ధాత్మకమైన స్థితిలో ఖరీదైన హోటళ్లవంటి విలాసాలకు కూడా వర్తించేలా మీరు ఆ పాపాల జాబి తాను సాగదీయవచ్చు. అంతేగానీ మతి స్తిమితంగా ఉన్న ఏ ఆర్థిక మంత్రీ ఎన్నడూ బీడీ నుంచి డబ్బు పిండడు.

 

బిహార్ ప్రజలు ఇటీవలే తాము అధి కారంలోకి తెచ్చిన ప్రభుత్వం మీద అప్పుడే ఆగ్రహం చెం దరు. కానీ, సమోసా, భుజియా(కారప్పూస వంటిది)ల మీద 13.5 శాతం వాల్యూ యాడెడ్ ట్యాక్స్ (వ్యాట్) విధించడం ఆగ్రహం కంటే మరింత ప్రమాద కరమైన అవహేళనకు తలుపులు తెరుస్తుంది. వ్యంగ్య పరిహాసానికి బిహారీల తర్వాతే ఎవరైనా. సమోసాకు ఉన్న ఆకర్షణే వేరు. వర్గ, జాతి, కుల భేదాలకు అతీతమైన నిజమైన జనబాహుళ్యపు వినియోగ వస్తువు అది. కాబట్టి దాని మీద విధించిన పన్నుపై బిహారీ పరిహాసం కూడా అంత సార్వత్రికంగా వ్యాపించేదే. బహుళజాతి సంస్థల కంటే చాలా ముందే మనవాళ్లు ఫాస్ట్‌ఫుడ్‌ను కనిపెట్టారు. అంతేకాదు దాన్ని గృహ పరిశ్రమగా ఉంచాలనే మంచి ఇంగితం కూడా మనకుంది. పేదవాడికి కూడా ఆ వ్యాపారం బతుకు తెరువు కల్పిస్తుంది. సాధారణంగా వాటి ఉత్పత్తిదారు, వినియోగదారు ఇద్దరూ ఒకే సామాజిక ఆర్థిక అంతస్తుకు చెందినవారై ఉంటారు.

 

ఈ నిర్ణయం ముఖ్యమంత్రి కార్యాలయం తీసుకున్న దేననేది నిర్వివాదం. అయినా నితీశ్ , లాలూ యాదవ్‌లు ఇద్దరూ వెక్కిరింతలను ఎదుర్కోక తప్పదు. పైగా బిహార్ ఆర్థికమంత్రి పదవి లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ చేతుల్లోనే ఉంది. నితీశ్  బహిరంగంగా చేసే పనులను గురించి లాలూ జనాంతికంగా బిగ్గరగా నవ్వలేని సంద ర్భాల్లో ఇది ఒకటి.

 

సమోసా ప్రతీకారం అతి త్వరగానే బయటపడింది. నితీశ్  ప్రస్తుతం దాన్ని చల్లార్చడం కోసం, ఖరీదైన ప్యాకే జ్డ్ సమోసా మీద పన్ను విధించాలనేదే తమ అభిమత మంటూ రాజకీయ ప్రతిదాడిని రేకెత్తించాలని యత్ని స్తున్నారు. అయితే ప్రజలకు గుర్తుండిపోయేది.... తొలుత పుట్టిన ఆలోచనే తప్ప, ఆ తర్వాత వచ్చినది కాదు. అయినా ఈ సవరణ వంచనేననేది స్పష్టంగానే కనిపి స్తోంది. భుజియా కూడా శిక్షపడ్డ వాటి జాబితాలో ఉంది.

 

తరచి చూస్తే ఈ వ్యవహారం ఇంకా ఇంకా ఆసక్తి కరంగా మారుతోంది. ఉదారణకు, దోమలను పారదోలే మస్కిటో రిపెల్లంట్స్‌పై పన్ను ఎందుకు విధించినట్టు? దోమలు ఓటు వేయవు, కాటేస్తాయి. ఒక్కోసారి అవి ప్రాణాంతకం అవుతాయి కూడా. బిహార్‌లో మస్కిటో రిపెల్లంట్స్‌కు  భారీ మార్కెట్ ఉంది, ప్రభుత్వం వాటి నుంచి భారీగా రాబడిని ఆశిస్తోంది. ఒక్క పాట్నా అమ్మ కాల నుంచి లభించే రాబడే ఒక భారీ ప్రభుత్వ శాఖ ఖర్చుకు సరిపోతుంది. రాష్ట్రం అంతటా దోమల స్వైర విహారం సాగుతోంది. బిహార్‌లో పన్నుల రాబడిని కల్పించే పరిశ్రమలంటూ పెద్దగా చెప్పుకోడానికి ఏమీ లేవు. కాబట్టి పన్ను వేయడానికి వేరే ఏవీ లేవు. అందువలన, ప్రభుత్వం తన గత వైఫల్యాల నుంచే లబ్ధి పొందాలని చూస్తోంది. మాట కూడా దోమలంత వేగంగానే వ్యాపిస్తుంది.  

 

రాజకీయాల్లోనైనా లేదా పరిపాలనలోనైనా అనుభ వజ్ఞులైనవారు కూడా ఇంత తెలివిమాలిన పొరపాట్లెలా చేస్తారా? అని ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకు చేస్తా రంటే, అధికారంలో ఉండగా సమోసాలకు, కారప్పూసకు డబ్బులు చెల్లించేది వారు కాదు కాబట్టి. వారి సాయం కాలపు టీ, దానితో పాటూ ఉండే  ఫలహారాల ఖర్చును పరిపాలన బడ్జెట్ నుంచి చెల్లిస్తారు.

 

బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ నాగరికంగా భోజ నం చేసే ఉన్నత సమాజానికి చెంది నవారు. మానసికో ల్లాసం కోసమని ఆయన ఒకసారి ప్రజలు ఆరుబయట నిలుచుని తినే ఒక బడ్డీ దగ్గరకు వెళ్లి... మన సమోసాకు సమానమైన ‘కార్నిష్ పై’ తినాలనుకున్నారు. ముందస్తు ఏర్పాట్లతో సాగిన ఆ కార్యక్రమలో కామెరూన్... దాన్ని తినడం ఎలాగో తెలి యక రసాభాస చేశారు. ఆ ప్రజా సంబంధాల  కార్య క్రమం అభాసుపాలైంది. బడ్జెట్‌ను సంతులనం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్న జార్జ్ ఆస్‌బోర్న్ తనకు ఆర్థిక మంత్రిగా ఉన్నా, కామెరూన్‌కు ‘పై’ మీద పన్ను వేయాలనే ఆలోచన ఎన్నడూ రాలేదు. ఆస్‌బోర్న్ తన లక్ష్య సాధనలో పూర్తిగా సఫలం కాకున్నా, ప్రయత్నమైతే చేశారు. కాబట్టి ఆయనను ఎవరూ తప్పు పట్టలేరు.

 

లాలూ-నితీశ్  ప్రభుత్వం ఇప్పుడిప్పుడే వెలుగును కోల్పోతున్న సమయంలో సమోసా-భుజియా విషాద ప్రహసనం ప్రదర్శితం కావడానికి కారణాలు హాస్యా స్పదమైనవి మాత్రం కావు. నేరస్తులకు రాజకీయ ఆశ్రయం లభిస్తుండటంతో నేరాలు ప్రతీకారం తీర్చు కోడానికన్నట్టు తిరిగి పేట్రేగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో భయం పెంపొందుతోంది. అధికారులకు లాలూ సమాంతర యంత్రాంగం నుంచి ఆదేశాలు అందుతున్నాయి. నిజమైన అధికార పీఠం ఎక్కడ ఉందో వారికంటే బాగా అర్థం చేసుకోగలవారు మరె వరూ ఉండరు. ఈ సమోసా తిరుగుబాటును అదుపు చేయవచ్చు. కానీ గత జ్ఞాపకాలకు సమోసా తోడు కావడం, నితీశ్  కుమార్ పేరుప్రతిష్టలకు గణనీయమైన నష్టాన్ని కలుగజేస్తుంది.

 

- ఎం.జె. అక్బర్

 సీనియర్ సంపాదకులు

 వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు, బీజేపీ అధికార ప్రతినిధి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement