
మాజీ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజే అక్బర్(ఫైల్‌ఫోటో)
జర్నలిస్ట్ ప్రియా రమణిపై ఎంజే అక్బర్ పరువునష్టం దావాను పరిగణనలోకి తీసుకున్న ఢిల్లీ కోర్టు
సాక్షి, న్యూఢిల్లీ : తనను మాజీ కేంద్ర మంత్రి ఎంజే అక్బర్ లైంగిక వేధింపులకు గురిచేశారని ఆరోపించిన జర్నలిస్ట్ ప్రియా రమణిపై దాఖలైన పరువు నష్టం దావాపై ఢిల్లీ కోర్టులో గురువారం విచారణ ప్రారంభమైంది. 20 ఏళ్ల కిందట ఎంజే అక్బర్ తన పట్ల అసభ్యంగా వ్యవహరించారని ప్రియా రమణి ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియా రమణి ట్వీట్లతో మాజీ విదేశీ వ్యవహారాల సహాయ మంత్రి అక్బర్ ప్రతిష్ట తీవ్రంగా దెబ్బతిన్నదని ఆయన తరపు న్యాయవాది గీతా లూథ్రా అడిషనల్ చీఫ్ మెట్రపాలిటన్ మేజిస్ర్టేట్ సమర్ విశాల్‌కు నివేదించారు.
ఈ ఆరోపణల ఫలితంగా అక్బర్ మంత్రి పదవి నుంచి వైదొలిగారని గుర్తుచేశారు. జర్నలిస్టుగా అక్బర్ ప్రతిష్టను ప్రస్తావిస్తూ ఆయన 40 ఏళ్లుగా సంపాదించుకున్న పేరుప్రఖ్యాతులను ఈ ఆరోపణలు దెబ్బతీశాయంటూ ఆయన ఫిర్యాదును కోర్టు పరిగణనలోకి తీసుకోవాలని కోరారు. తన క్లెయింట్ ప్రతిష్టను దిగజార్చేలా ప్రియా రమణి ట్వీట్ చేశారని, ఆమె రెండో ట్వీట్‌ను 1200 మంది లైక్ చేశారని, ఇది తన క్లెయింట్ ప్రతిష్టను దెబ్బతీయడమేనని లూథ్రా వాదించారు.
జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ఈ ట్వీట్లను ప్రస్తావించారని, తన ఆరోపణలను ఆమె నిరూపించలేకపోతే ఈ ట్వీట్లు అక్బర్ ప్రతిష్టను మసకబార్చేవేనని పేర్కొన్నారు. లూథ్రా వాదనలు విన్న అనంతరం అక్టోబర్ 31న అక్బర్ స్టేట్‌మెంట్‌ను నమోదు చేయాలని, దీనిపై తాము సంతృప్తికరంగా ఉంటే ప్రియా రమణికి నోటీసులు జారీ చేస్తామని కోర్టు పేర్కొంది. తనపై పలువురు మహిళా జర్నలిస్టులు లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడంతో ఎంజే అక్బర్ మంత్రి పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అక్బర్ తనపై ఆరోపణలను తోసిపుచ్చుతూ ఇది రాజకీయ కుట్రేనని అభివర్ణించారు. మరోవైపు సత్యమే తనకు బాసటగా నిలుస్తుందని ప్రియా రమణి పేర్కొన్నారు.