మోడీపై సంధించిన ‘హెరాత్’
బైలైన్
ఎంజే అక్బర్
తాలిబన్లు అఫ్ఘాన్‌లోని మన దౌత్య కార్యాలయంపై సాగించిన విధ్వంసం, విధ్వంసం కోసమే జరిగింది కాదు. అంతకు మించిన మానసిక ప్రభావాన్ని కలుగజేయాలని ఉద్దేశించినది. మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా... బందీలుగా పట్టుకున్న భారతీయులను ఒక్కొక్కరిని హతమార్చుతుండటం ఆయనకు ఎంతటి కఠిన పరీక్ష అయ్యేదో ఊహించవచ్చు.
ముసుగు యుద్ధం ముందస్తు హెచ్చరికతో మొదలయ్యేది కాదు. అది సైన్యం చేసే యుద్ధం కాదు, మిలిటెంట్లు చేసేది. దేశం పేరు మీద లేక అందరి ఆమోదాన్ని పొందిన జెనీవా ఒప్పందం నిబంధనలకు కట్టుబడి చేసే యుద్ధం కాదు. ఏదో ఒక అభూత కాల్పనిక లక్ష్యాన్ని అన్వేషిస్తూ వర్తమాన వ్యవస్థను ధ్వంసించడానికి పాశవికత, ఉగ్రవాదాలతో చేసే కార్యాచరణ అది. ఈ యుద్ధంలోని హింసాకాండ చుక్కల్లాగా పదుల సంఖ్యలోని భౌగోళిక స్థలాలపై పరుచుకుని ఉంటుంది. ఉగ్రవాది మనస్సులో ఆ చుక్కలన్నీ ఒక దానితో ఒకటి కలిసి మొత్తం చిత్తరువు రూపుదిద్దుకుంటుంది.
అఫ్ఘానిస్థాన్ నుంచి నాటో సేనల ఉపసంహరణ అనంతరపు శకంలోని తొలి దాడి మొదలైంది. అమెరికా మిలిటరీ అకాడమీలో పట్టభద్రులైన 2014 తరగతి క్యాడెట్లనుద్దేశించి అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రసంగిస్తుండగా ఆ దాడి జరగడం పూర్తిగా తార్కికమైనదే. న్యూయార్క్ వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్ర దాడి (9/11) తర్వాత అఫ్ఘాన్ లేదా ఇరాక్ యుద్ధాల్లో పాల్గొనాల్సిన అవసరం లేని మొదటి బ్యాచ్ క్యాడెట్లు వారేనని ఒబామా ఆ సందర్భంగా అన్నారు. 9/11కు చాలా ముందు నుంచి పోరాడుతూ, అమెరికా సేనలు (అమెరికా కూడా కాదనే ఆశ) రణ రంగాన్ని వీడిన చాలా కాలం తర్వాత సైతం పోరాడుతూనే ఉండే ‘వారికి’ ఆ సందేశం స్పష్టంగా, గట్టిగా వినిపించింది.
ఇంతకూ ‘వారు’ ఎవరు? భిన్న తాలిబన్ గ్రూపులూ, లష్కరే తోయిబా వంటి వారి భావజాల సహోదరులూ, అలాంటి లక్ష్యాలనే కలిగివున్నా ఆయా సంస్థల ముద్రలు వేయించుకోకుండా పని చేయడమే తమ ఆశయ సాధనకు మంచిదని భావించే వ్యక్తులు, అధికారులందరితో కూడిన కూటమికి చెందినవారంతా. ఆ కూటమిని ‘తాలిబన్ ప్లస్’గా అభివర్ణించడం ఉత్తమం.
వారి ప్రథమ శత్రువు భారతదేశమే. హెరాత్‌లోని మన దౌత్య కార్యాలయం వారి మొదటి లక్ష్యం. ఆ విధ్వంసం, విధ్వంసం కోసమే జరిగింది కాదు. అంతకు మించిన మానసిక ప్రభావాన్ని కలుగజేయాలని ఉద్దేశించినది. భారత్‌లో ప్రభుత్వం మారుతుండటమనే పెద్ద పరిణామం జరుగుతుండగా భారత దౌత్యవేత్తలను, ఇతర సిబ్బందిని బందీలను చేసి, వారి ప్రాణాలను పణంగా పెట్టి బేరసారాలు సాగించడమే వారి అసలు ఉద్దేశం. ఉగ్రవాదంపట్ల కఠోర వైఖరిని ప్రదర్శిస్తూ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేస్తుండగా... ఒక్కొక్కరుగా భారతీయులను హతమార్చుతుండటం ఆయనకు ఎంతటి కఠిన పరీక్ష అయ్యేదో ఊహించవచ్చు.
దక్షిణ ఆసియా ప్రాంత ప్రభుత్వాల మధ్య ఏర్పడే ప్రవర్తనా పరమైన వివిధ సమీకరణలు, సమ్మేళనాలను పరిగణనలోకి తీసుకుని చూడండి. ఎంతమంది సార్క్ నేతలు ప్రమాణ స్వీకారానికి రాగలిగేవారు లేదా వచ్చి ఉండేవారు? ఇంత జరుగుతున్నా మోడీ తమను ఆహ్వానించాలనే అనుకుంటున్నారా? అని వారు తప్పక అనుకునేవారు. ప్రజాగ్రహం ఎంతగా కట్టలు తెంచుకునేది? మన టెలివిజన్ చానళ్లలో క్రమం తప్పకుండా దర్శనమిచ్చే పాక్ వ్యతిరేక దుందుడుకు వైఖరి వత్తాసుదార్లు ఉప్పందించడంతో ఆ ఆగ్రహం మరింకెంతో ఉప్పొంగిపోయేది కాదా? ఉద్వేగభరితమైన ఉద్రిక్తత లు మన వీధుల్లో హింసకు దారి తీసేవి కావా? సమాధానాలు మనకు తెలియదు. కానీ అవి మన భద్ర తా వ్యవస్థ నేతల ఆలోచనల్లో సుళ్లు తిరిగే ఉండాలి.
అదృష్టవశాత్తూ ప్రధాని నరేంద్రమోడీ అజిత్ దోవల్‌ను జాతీయ భద్రతా సలహాదారుగా నియమించారు. దోవల్ మన ఇంటెలిజెన్స్ సంస్థల హీరో. ఆ శక్తులు విమానాన్ని హైజాక్ చేసి కాందహార్‌కు తరలించి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వాన్ని పరీక్షకు గురిచేయడాన్ని ఆయన చూశారు. మన పారా మిలిటరీ బలగాలు ప్రదర్శించిన ధైర్యసాహసాల ఫలితంగా హెరాత్ కుట్ర విఫలమైంది. ఏంతో కాలం గడవక ముందే మోడీ ప్రభుత్వం ఇలాంటి పరీక్షకు మళ్లీ గురికానున్నదనడం నిస్సందేహం.
మన దేశంలోని ఉగ్రవాద వ్యతిరేక యుద్ధానికి మూడు విస్పష్ట పార్శ్వాలున్నాయి. అఫ్ఘానిస్థాన్‌లోని భారతీయుల ఉనికి కచ్చితంగా దౌత్య కార్యకలాపాల పరిధికి, అంతకంటే విస్తృత స్థాయిలోని అభివృద్ధి ప్రాజెక్టుల పరిధికి మాత్రమే పరిమితం. అయినా తాలిబన్ ప్లస్ దాన్ని ‘ఇస్లామిక్ ప్రాంతంలోకి ప్రమాదకరమైన చొరబాటు’గానే చూస్తోంది. అది సోవియట్ లేదా అమెరికా జోక్యం కంటే ఏ మాత్రం తక్కువ తప్పు పట్టాల్సింది కాదని వారు భావిస్తున్నారు. సోవియట్, నాటో సేనలను తరిమేసినవాళ్లకు... భారత్ మనకెంత అనిపించకపోదు.
ఈ వైఖరికి పాకిస్థాన్‌లోని అధిక సంఖ్యాకుల మద్దతు లభిస్తోందనడానికి ప్రత్యేకించి ఆధారాలు కావాలనుకునేవారు ఆ టీవీ చానళ్ల చర్చలను గమనించడం సరిపోతుంది.
ఇక వారి రెండో లక్ష్యం, చెప్పాల్సిన పనే ముంది... కాశ్మీర్‌లోయే. అఫ్ఘాన్లో తాలిబన్లు అధికారం చేపట్టాక కాశ్మీర్‌లో హింసాకాండ వెల్లువెత్తింది. తాలిబన్లతో పాటూ పాక్ సైనిక నేతలు ఉంటడం, వారికి నాయక త్వం వహించడమే అందుకు ప్రధాన కారణం. అఫ్ఘాన్‌పై అమెరికా యుద్ధాన్ని ప్రారంభించినప్పుడు పాక్ ప్రభుత్వం తాలిబన్ శ్రేణులలోని తమ సైనికులను, ఆఫీసర్లను స్వదేశానికి రప్పించుకోవడానికి గడువును కోరింది.
మన లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థను అస్థిరీకరించడం వారి మూడవ లక్ష్యం. తాలిబన్లు ప్రతిపాదించే మతస్వామ్య నమూనాకు భిన్నంగా లౌకిక ప్రజాస్వామ్యం యువతను ఆకట్టుకునే ప్రత్యామ్నాయం. ఈ వాస్తవం చాలా మంది పాకిస్థానీలలోని ఉన్మాదాన్ని ఎందుకు నయం చేయలేకపోతోందనేది ఆశ్చర్యకరం. హఫీజ్ సయీద్, అతని అనుచరులది కేవలం ఒక్క భారత్‌కు మాత్రమే పరిమితమైన ఎజెండా అని భావిస్తే అది పెద్ద పొరబాటు. పాకిస్థానీల కోసం కూడా వారి వద్ద ఎజెండా ఉంది. భారత్‌ను మతస్వామ్య దేశంగా మార్చలేకపోతే, అప్పుడు వాళ్లు పాక్‌ను మతస్వామ్యంగా మార్చడానికి ప్రయత్నించే అవకాశం పూర్తిగా ఉంది.
ఈ నాటో అనంతర యుద్ధం ఒక్క దక్షిణ ఆసియాకే పరిమితమయ్యేది కాదు. అది చైనాను, మధ్య ఆసియాలోని పలు ముస్లిం మెజారిటీ దేశాలను కూడా అందులోకి ఈడుస్తుంది. చైనా ఈ ముప్పు విస్తృతిని గ్రహించడం ప్రారంభించింది. అయితే అది తన విధానాలను మార్చుకోడానికి సమయం తీసుకుంటుంది. యదార్థాలే ఆ మార్పును తీసుకొస్తాయి. భారత, చైనాలు తమ తమ జాతీయ ప్రయోజనాల కోసమే అయినాగానీ సంక్లిష్టమైన ఈ యుద్ధంలో ఒకే పక్షాన నిలిచే సమయం రానుంది.
(వ్యాసకర్త సీనియర్ సంపాదకులు)