'మోదీ, ఒవైసీ భేటీ అవాస్తవం'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీతో భేటీ అయినట్టు వచ్చిన వార్తలను బీజేపీ తోసిపుచ్చింది. ఈ వార్తలు నిరాధారమని, దీనిపై న్యాయపరమైన చర్య తీసుకుంటామని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు ఎంజే అక్బర్ తెలిపారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో మోదీ, ఒవైసీ భేటీ జరిగిందని ఒక దినపత్రిక ప్రచురించింది.
ఎల్లో జర్నలిజానికి ఈ వార్త మచ్చుతునక అని ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ ఎంజే అక్బర్ అన్నారు. ఈ వార్త ప్రచురించి పత్రికపై పరువు నష్టం దావా వేస్తామని ఆయన హెచ్చరించారు. విపక్షాలు తమపై కుట్ర చేస్తున్నాయని చెప్పడానికి ఈ వార్తే సాక్ష్యమన్నారు. కాగా, తమ భేటీలో చర్చించిన రహస్యాలను మోదీ, ఒవైసీ ప్రజలకు వెల్లడించాలని జేడీ(యూ) నేత కేసీ త్యాగి డిమాండ్ చేశారు. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ఒవైసీ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.