
కాంగ్రెస్ జీన్స్‌లోనే ‘అసహనం’: వెంకయ్య
న్యూఢిల్లీ: రాజకీయంగా దెబ్బతిన్న వాళ్లంతా.. ఏం చేయాలో అర్థంకాక అసహనం పేరుతో నాటకాలు చేస్తున్నారని బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ రాష్ట్రపతిని కలవటంలో అర్థం లేదని.. అసహనం అనేది కాంగ్రెస్ జీన్స్‌లోనే ఉందని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు మండిపడ్డారు. రాష్ట్రపతి దగ్గరకు కాంగ్రెస్ ర్యాలీ చేయటం రాజకీయ నాటకమని మరో కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ విమర్శించారు. ఎమర్జెన్సీ, 3వేల మంది సిక్కులను హత్య చేసినపుడు అసహనం ఏమైందని ప్రశ్నించారు. నైతికంగా, రాజకీయంగా దివాలా తీసిన కాంగ్రెస్ నాయకత్వం.. ఓటుబ్యాంకు రాజకీయాల కోసం మత ఘర్షణలను రెచ్చగొట్టి నిప్పుతో ఆడుకుంటోందని.. బీజేపీ నేత ఎంజే అక్బర్ విమర్శించారు.
రాజకీయంగా అస్తిత్వం కోల్పోతున్న కొందరు విద్వేషాలను రెచ్చగొట్టడం ద్వారా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని.. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ విమర్శించారు. అసలు దేశంలో అసహనమే లేదని, భవిష్యత్తులోనూ ఉండదని జైట్లీ అన్నారు. మోదీలో అసహనం లేదని.. అందరినీ కలుపుకుని ముందుకు వెళ్లటం ఆయన నైజమని జమ్మూ కశ్మీర్ సీఎం ముఫ్తీ మహమ్మద్ సయీద్ అన్నారు. కాగా, దేశవ్యాప్తంగా రచయితలు, కళాకారులు అసహనానికి వ్యతిరేకంగా అవార్డులు వెనక్కిచ్చి ఏం సాధిస్తారని సినీనటుడు కమల్ హసన్ ప్రశ్నించారు. అవార్డులు తిరిగివ్వటంలోనూ రాజకీయం ఉందని.. దేశానికి మంచి చేసిన పార్టీకి ఓటు రూపంలో సమాధానం ఇస్తానని తెలిపారు.