
ఎంజె అక్బర్ తమపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నలుగురు మహిళలు చేసిన ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వం స్పందించక పోవడం విచిత్రం, విచారకరం.
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ మాజీ జర్నలిస్ట్, కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి ఎంజె అక్బర్ తమపైన లైంగిక వేధింపులకు పాల్పడినట్లు నలుగురు మహిళలు చేసిన ఆరోపణలపై ఇప్పటికీ ఆయన మంత్రిత్వ శాఖగానీ, కేంద్ర ప్రభుత్వంగానీ, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీగానీ స్పందించక పోవడం విచిత్రం, విచారకరం. హాలివుడ్, బాలివుడ్ సినిమా రంగాలతోపాటు, మీడియా, కామెడీ, కళా, సాహిత్య రంగాలకు విస్తరించిన ‘మీ టూ’ ఉద్యమం ప్రకంపనలు సష్టిస్తున్న విషయం తెల్సిందే.
ఎంజె అక్బర్‌తోపాటు మీడియా వ్యక్తులపై వస్తున్న లైంగిక ఆరోపణలకు సంబంధించి మహిళలకు ఎడిటర్స్ గిల్డ్ మద్దతు ప్రకటించింది. ఈ ఆరోపణలన్నింటిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరపాలంటూ సంబంధిత విభాగాలను కోరుతూ ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. బాలివుడ్ ప్రముఖ దర్శకుడు వికాస్ బహల్‌కు వ్యతిరేకంగా వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి ‘ది ఇండియన్ ఫిల్మ్ అండ్ టెలివిజన్ డైరెక్టర్స్ ఆసోసియేషన్’ నోటీసు జారీ చేసింది. వికాస్ బహల్‌పై విచారణ జరిపేందుకు ఆయన సహ వ్యవస్థాపకుడిగా ఉన్న ‘ఫాంటమ్ ఫిల్మ్స్’లో విచారణ కమిటీ ఏర్పాటయింది. వికాస్ బహల్‌పై వచ్చిన లైంగిక ఆరోపణలు క్లియరయ్యేంత వరకు దూరంగా ఉంటానంటూ ‘ముంబై అకాడమీ ఆఫ్ మూవింగ్ ఇమేజ్ (ఎంఏఎంఐ)’కి ప్రముఖ దర్శకుడు అనురాగ్ కాశ్యప్ రాజీనామా చేశారు. ఆయన ఫాంటమ్ ఫిలిమ్స్ వ్యవస్థాపకుల్లో ఒకరు. లైంగిక ఆరోపణలకు సంబంధించి ‘ఆల్ ఇండియా బకడ్’ గ్రూపు నుంచి లాన్‌మే భట్ తప్పుకున్నారు. తమలో ఫ్రీలాన్సర్‌గా కొనసాగుతున్న ఉత్సవ్ చక్రవర్తితో ఇక తమ గ్రూపుతో సంబంధాలు ఉండవని ఆల్ ఇండియా బకడ్ గ్రూప్ ప్రకటించింది.
మలయాళి నటుడు, సిపీఎం శాసన సభ్యుడు ముకేశ్‌పై వచ్చిన లైంగిక వేధింపులపై ఇంతకాలం మౌనం పాటించిన సీపీఎం నాయకత్వం కూడా ఆయనపై విచారణకు సిద్ధమయింది. ఇలా అన్ని సంస్థల్లో వచ్చిన ఆరోపణలపై చర్యలు తీసుకునేందుకు దాదాపు అన్ని సంస్థలు సిద్ధమయ్యాయి. అన్ని సంస్థలకన్నా అతిపెద్ద వ్యవస్థ కలిగిన కేంద్ర ప్రభుత్వం అందరికి ఆదర్శంగా ముందుండాల్సింది ఇలా మౌనం పాటిస్తే ఎలా! ఎవరిపైనైనా సరే చర్యలు తీసుకోవాల్సిందేనంటూ కేంద్ర మంత్రి మేనకాగాంధీకి ఉన్న చొరవ కేంద్రానికి లేదా?