గత గాయాలకు మందు | 'medicine to the old injuries' opinion by mj akbar | Sakshi
Sakshi News home page

గత గాయాలకు మందు

Published Tue, May 31 2016 12:52 AM | Last Updated on Mon, Sep 4 2017 1:16 AM

1914 నాటి కామగాటమారు ఓడ మీద ప్రయాణించిన సిక్కులు.

1914 నాటి కామగాటమారు ఓడ మీద ప్రయాణించిన సిక్కులు.

బైలైన్
క్యూబా. వియత్నాం. హిరోషిమా. బరాక్ ఒబామా మనకు ఏమైనా చెప్పడానికి ప్రయత్నిస్తున్నారా? నాకైతే అలాగే అనిపిస్తున్నది. అమెరికా చరిత్రలో అనూహ్యమైన ఈ అధ్యక్ష పదవీకాలంలోనే ఈ తరం అమెరి కన్లను వెంటాడిన కొన్నికొన్ని జ్ఞాపకా లనూ, సందిగ్ధాలనూ తనకు సాధ్యమై నంత మేర భూస్థాపితం చేయాలని ఒబామా ప్రయత్నం చేస్తున్నారు. ఆ జ్ఞాపకాలు, సందిగ్ధాలు ఏవంటే: 1945లో నాగసాకి, హిరోషిమాలను సర్వ నాశనం చేసిన అణుబాంబులు, 1960లలో క్యూబా, వియత్నాంల మీద జరిగిన దాడి ఘటనలు.
 
దేశాధ్యక్షునిగా ఆయన ఈ సంఘటనల మీద క్షమాపణలు చెప్పలేరు. ఎందుకంటే రెండవ ప్రపంచ యుద్ధంలో జపాన్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడిన యోధులకు అది క్షేమకరం కాదు. అలాగే సోవియెట్ యూనియన్‌కు తీవ్రమైన సవాళ్లు విసరి, కమ్యూనిజం నుంచి ఈ స్వేచ్ఛా ప్రపం చాన్ని రక్షించామని విశ్వసించే వారికి కూడా అది ఆత్మహత్యా సదృశమవుతుంది. కానీ 19 60, 1970లలో పెరిగి పెద్దదైన తరానికి మాత్రం క్యూబా మీద జరిగినది ఓ మూర్ఖపు చర్య, వియత్నాం మీద దాడి ఘోర తప్పిదం.
 
ఇది పూర్తిగా యాదృచ్ఛికం కాకున్నా, బరాక్ ఒబామా పుట్టిన సంవత్సరం, బే ఆఫ్ పిగ్స్ (దక్షిణ క్యూబా) మీద విఫల దాడికి జాన్‌ఎఫ్ కెన్నెడి ఆమోదించిన సంవ త్సరం కూడా 1961. కొన్ని మాసాల తరువాత క్యూబాలో క్షిపణల గురించిన వివాదం మీద అమెరికా, సోవియెట్ రష్యా అణు సంఘర్షణతో ఈ ప్రపంచాన్ని పేల్చేసినంత పనిచేశాయి.
 
పశ్చాత్తాపం కూడా తగిలిన ఎదురు దెబ్బలకి కొంత సాంత్వన చేకూర్చగలదని ఒబామాకు తెలుసు. అయితే ఇందుకు తాను కూడా కొంత మూల్యం చెల్లించవలసి ఉంటుందని ఆయ నకూ తెలుసు. అందుకు సంబంధించిన ఆత్మలు ప్రార్థనలతో సరిపెట్టుకోవు. వాటిని పూర్తిగా భూస్థాపితం చేయవలసిందే. గతకాలపు విషాదాలను మనం తుడిచిపెట్టలేం. వాటి పర్యవ సానాలను నిరాకరించలేం కూడా. ఒక ఘోర తప్పిదం గురించి బాహాటంగా అంగీకరిస్తే ప్రజలలో గుర్తింపు ఉంటుంది.
 
గడచిన శతాబ్దంలో మనం చూసిన కనీవినీ ఎరుగని రక్తపాతాలు- యుద్ధాలు, వర్ణ వివక్ష, మారణహోమాలతో పోల్చి చూస్తే కామగాటమారు ఉదంతం వాటితో సమంగా మానవాళి మీద పెద్దగా ప్రభావం ఏమీ చూపలేదు. కానీ సిక్కుల మీద అది లోతైన ముద్రను వదిలి వెళ్లింది. 1914లో సిక్కులు ప్రయా ణిస్తున్న కామగాటమారు అనే ఓడను జనంతో అలాగే కెనడా వెనక్కి తిరగ్గొట్టింది. ఇప్పటికీ ఆ గాయం రేగుతూనే ఉంటుంది. ఈ గాయాన్ని మాన్పవలసిన అవసరాన్ని కెనడా యువ ప్రధాని జస్టిన్ ట్రూడో గుర్తించారు.

ఇందుకు సంబంధించి ఆచితూచి వేసిన పదాలతో ఆయన ఓ ప్రకటన ఇచ్చారు కూడా. కామగా టమారు నౌకకు, అందులో అప్పుడు ప్రయాణించిన వారు ఎదుర్కొన్న ప్రతి విషాద ఘటనకి కెనడా బాధ్యత వహించలేదు. అయితే ఈ ప్రయాణికులు నిరపాయంగా తిరిగి వలస పోవడానికి వీలు కల్పించని నాటి కెనడా చట్టాలకు మాత్రం మా ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది. పర్యవసానంగా ఎదురైన అన్ని విచారకర పరిణామాలకు మాత్రం మమ్మల్ని క్షమించాలి.’’ ఇందులో ముఖ్యాంశం బహిరంగంగా విచారం వ్యక్తం చేయడం. వాస్తవం ఏమిటంటే ఈ పనిచేయడానికి వందేళ్లు పట్టిందంటే, ఇలాంటి విషాదాన్ని గుర్తించడానికి వ్యవస్థలకు ఎంతకాలం పడుతుందో ఇది సూచిస్తుంది. అలాగే ఆ విషాదాలలోని అన్యాయం ఎంతటిదో గమనించడానికి కూడా ఎంత సమయం కావాలో ఇది సూచిస్తుంది.
 
హిరోషిమా, నాగసాకిలలో నిర్మించిన శాంతి స్మారక స్తూపాన్ని సందర్శించడానికి అమెరికా అధ్యక్షుడికి 71 ఏళ్లు పట్టింది. ఇలాంటి వాటి మీద ఆగ్రహం ప్రకటించడం కంటే, నైతిక ప్రమాణాల గురించి మాట్లాడటం కంటే ఇలాంటి ఆలస్యాల వెనుక ఉన్న సంక్లిష్టతలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 1945 నాటికి అమెరికా, జపాన్ అప్పటికి మూడేళ్ల నుంచి ఘోర యుద్ధంలో నిమగ్నమై ఉన్నాయి. ఎవరూ వెనక్కి తగ్గేటట్టు లేరు. కమికాజి అనుభవం దృష్ట్యా (పేలుడు పదార్థాలను నింపిన ఆ పేరు కలిగిన జపాన్ విమానం శత్రు స్థావరం మీద దాడి చేసింది) జరిగే ప్రాణనష్టం గురించి అమెరికా యోచించవలసి వచ్చింది. అయినప్పటికీ హిరోషిమా, నాగసాకిల మీద అణుబాంబుల బీభ త్సం తప్పలేదు. నా అభి ప్రాయం వరకు అమెరికా, జపాన్‌ల మధ్య సయోధ్య ఇప్పటికి పరిపూర్ణం కాలేదు కానీ, 1950లలోనే ఇందుకు శ్రీకారం చుట్టడం జరిగింది. ఒక ఉత్పాతం కంటే శాంతి గొప్పదన్న వాస్తవాన్ని ఇంత తొంద రగా గుర్తించినందుకు రెండు దేశాలకు చెందిన ప్రజలకు శిరసు వంచి నమ స్కరించాలి. పర్యవసానం గా ప్రపంచం కొంత మెరుగైన స్థితికి చేరింది.
 
చరిత్రలో సరికొత్త అధ్యాయం ఎప్పుడు మొదలవుతుంది? విజయం లేదా పరాజయం ప్రతి అంశాన్ని పరిపూర్ణంగా మార్చి వేసినప్పుడు తప్ప, సరికొత్త అధ్యాయం గురించి చెప్పడం ఎప్పుడూ కష్టమే. ఒక పరిణామం కొనసాగింపు ఎప్పుడూ అస్పష్టంగానే ఉంటుంది. ఒబామాకు క్యూబా సాదర స్వాగతం చెప్పినప్పుడు కూడా అమెరికా ఆ దేశంతో సంబంధాలకు సిద్ధంగా లేదు. నిజానికి కొన్ని ఏళ్ల నుంచి ఆ తలుపులను తట్టలేదు. అయితే ఆ తలుపులు ఇక ఎప్పటికీ తెరిచే ఉంటాయని ఒబామా పర్యటన గట్టిగా చెబుతోంది.
 
అమెరికా-వియత్నాం సంబంధాలలో ఒబామా తాపీగా చేసిన విన్యాసం ఒక కొత్త విధానాన్ని పరిచయం చేస్తున్నది. వియత్నాంకు అమెరికా ఆయుధాలు అమ్మబోతున్నది. వియ త్నాం యుద్ధం కొన్ని దశాబ్దాల క్రితమే ముగిసి ఉండవచ్చు కానీ, విభేదాలకు సంబంధించిన చివరి జాడలు, అంటే అనుమానాలు కూడా ఇప్పుడు సమసిపోయాయి. ఇది 1940లలో కమ్యూనిస్టు యోధుడు హోచిమన్ జపాన్‌కు వ్యతిరేకంగా అమెరికాతో కలసినప్పుడు ఆ రెండు దేశాల మధ్య కొనసాగిన బంధానికి పూర్తి విరుద్ధమైనది. రెండో ప్రపంచ యుద్ధం ముగియగానే ఐరోపా దేశాలను వలసల నుంచి ఖాళీ చేయవలసిందిగా అమెరికా ఒత్తిడి చేస్తుందని హోచిమన్ భావించారు (ఇలాంటి కారణాలతోనే గాంధీజీ మొదటి ప్రపంచ యుద్ధానికి మద్దతు ఇచ్చారు). కానీ రూజ్వెల్ట్ చనిపోయిన తరువాత ఆయన వారసుడు హ్యారీ ట్రూమన్ వియత్నాం మీదకు ఫ్రాన్స్‌ను ఉసిగొలిపారు. మిగిలిన కథ అందరికీ తెలుసు.
వ్యాసకర్త: ఎం.జె. అక్బర్
సీనియర్ సంపాదకులు
వ్యాసకర్త పార్లమెంటు సభ్యులు
బీజేపీ అధికార ప్రతినిధి

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement