
గతం చెల్లు.. 2014 వర్థిల్లు
ఇప్పుడిప్పుడే గతించిన ఏడాది ముగిసిపోతున్న భావన గతం నెమరువేతకు దారితీయడం అనివార్యం.
ఎం.జె.అక్బర్, సీనియర్ సంపాదకులు
ఇప్పుడిప్పుడే గతించిన ఏడాది ముగిసిపోతున్న భావన గతం నెమరువేతకు దారితీయడం అనివార్యం. ‘ముగిసిపోతున్న భావన’ అనే పదబంధం జూలియన్ బార్న్స్ రాసిన హృదయాన్ని చలింపజేసే పుస్తకం పేరు నుంచి (‘ది సెన్స్ ఆఫ్ ఎన్ ఎడింగ్’) తీసుకున్నది. దగా, వంచనలతోనూ... విజ్ఞతగా చెలామణి కాగలగడానికి తగు సమంజసత్వం కోసం తపిస్తూ విచారణ లేకుండానే కొరత వేసే సామూహిక ఉన్మాదంతోనూ... కలగలిసిన కలగూర వంటకంలాంటి పతాక శీర్షికలే నిత్యమూ మన దృష్టిని ఆకర్షిస్తుంటాయి. అదృష్టవశాత్తూ గతం జ్ఞాపకాల నెమరువేత కూడా అందులో భాగంగా దిగజారిపోలేదు. దీప్తివంతమైన అవగాహనను విస్ఫోటింపజేసే క్షణాలు ఒంటరిగా ఉన్న సందర్భాల్లోనే ఎక్కువగా తారసపడతాయి.
2013లో నాకు అత్యంత ఉల్లాసం కలిగించిన ఒక అంశం భారత్, దక్షిణాఫ్రికాల మధ్య తాజాగా జరిగిన మొదటి క్రికెట్ టెస్ట్ మ్యాచ్. కేరళలోని ఒక సెలవుల విశ్రాంతి కేంద్రంలో సాపేక్షికమైన ఒంటరితనంలో నేనా మ్యాచ్‌ను చూశాను. గెలవాలన్న సంకల్పంతో ఉన్న రెండు జట్ల నైపుణ్యం, వ్యక్తిత్వాలు ఆటకు కట్టిపడేశాయి. గెలవలేకపోయినప్పుడు వాళ్లు ప్రత్యర్థులకు విజయాన్ని నిరాకరించారు. చివరిరోజు ఆట అద్భుత కళాఖండం. నిలకడగా, సుదీర్ఘంగా సాగిన ఆరోజు ఆటలో అద్భుతమైన మెరుపులు మెరుస్తుండగా విజయం భారత్ చేజారిపోతుండటం బాధాకరమే అయినా, టీవీని కట్టేయడం అసాధ్యమైంది.
ఓటమిని అంగీకరించడం తేలికే. సాధారణ జీవితంలో నిత్యం అది మనం చేస్తున్నదే. అయితే విజయానికి అతి చేరువలో ఉండగా ఓడిపోవడం మాత్రం పూర్తిగా భిన్నమైన కథ. ఓటమికి అతిపెద్ద కారణం విజేత బలం కాదు, ఓడినవారి అలసత్వం. ఏదైనా గానీ అప్పుడే మన చేజిక్కిపోయిందని అనుకున్నా మూ అంటే మీ కళ్ల ముందు నుంచే బహుమతి చేజారిపోయిందన్నమాట. కళ ఇంకా జీవితాన్ని అనుకరిస్తున్నదో లేదో నాకు తెలియదు. లేదనే ఎవరైనాగానీ అనుమానించవచ్చు. అయితే క్రీడలు మాత్రం జీవితాన్ని అనుసరిస్తున్నాయి. అంై పెర్ లేదా ఎలక్షన్ కమిషనర్ చివరి గంటకొట్టి ఆట ముగిసిందని ప్రకటించే వరకు ఏమైనా జరగవచ్చు.
ఈ ఏడాది నేను చదివిన అత్యుత్తమమైన రెండు పుస్తకాలూ అమెరికా నుంచి వెలువడినవే. గ్యారీ బాస్ రాసిన ‘ది బ్లడ్ టెలిగ్రామ్: ఇండియాస్ సీక్రెట్ వార్ ఇన్ ఈస్ట్ పాకిస్థాన్’ అనే పుస్తకం భారత రహస్య యుద్ధం గురించి చెప్పిం ది తక్కువ. నూతన దేశం బంగ్లాదేశ్ ఆవిర్భావానికి దారితీసిన 1971లో పాకిస్థాన్ సైన్యం తూర్పు పాకిస్థాన్‌లో సాగించిన నరమేధం పట్ల అమెరికా చూపిన ఉదాసీనత గురించి చెప్పింది ఎక్కువ. ఇక నేను చదివిన రెండో గొప్ప పుస్తకం స్టీఫెన్ కింజెర్ రాసిన ‘ది బ్రదర్స్: జాన్ ఫోస్టర్ డల్లెస్, అలెన్ డల్లెస్ అండ్ దైర్ సీక్రెట్ వరల్డ్ వార్.’ ఒకరు విదేశాగ శాఖ మంత్రిగా, మరొకరు సీఐఏ అధిపతిగా పనిచేసిన ఆ ఇద్దరు సోదరుల జీవితాలను అది చిత్రించింది. ఐసెన్ హోవర్ పరిపాలనా కాలంలో, 1952-1969 మధ్య అమెరికా విదేశాంగ విధానాన్ని వారిద్దరే నియంత్రించారు.
పుస్తకం మీది అట్టలపైనే చాలా రహస్యాలున్నాయని మీకు అనిపించేట్టయితే... అది అతిశయోక్తి కాదని వాటి మధ్య ఉన్న మిగతా పుస్తకం హామీని కల్పిస్తుంది. మీరు అమెరికాను దుయ్యబట్టి సంతోషించే బాపతైతే చదవడం మొదలెట్టేయండి. జీవిత కాలమంతా తిట్టిపోయడానికి తగినంత ఇంధనం అందులో ఉంది. నేనయితే రాయకుండానే అంతర్గర్భితంగా చెప్పిన విషయానికి సైతం అబ్బురపడ్డాను. పలు నాయకత్వాల అమెరికా తన జాతీయ ప్రయోజనాల దగ్గరకు వచ్చేసరికి ఎంత పట్టువిడుపులులేని మొండితనంతో వ్యవహరించిందనే విషయాన్ని రచయిత సైతం నొక్కి చెప్పాలని భావించలేదు.
జాతీయ ప్రయోజనాలు కదిలే విందు భోజనం లాంటివి. ఈ దశాబ్దపు దృఢ సంకల్పాలు వచ్చే దశాబ్దికి అనర్థాలవుతాయి. సరైన ప్రతిదానిలోనూ తప్పయినది కూడా ఎంతో కొంత బహుశా ఉంటుంది. అలా అని ఇది వ్యతిరేక దిశలో కూడా పనిచేసేది కాదు. ప్రతి తప్పులోనూ కొంత సరైనది ఉండవచ్చని అర్థం కాదు. అయితే జాతీయ విధానం ఎప్పుడూ వర్తమానపు దృక్పథం నుంచే నిర్ణయమవుతుంది. అంతేగానీ గతం గురించిన అవగాహనతో కాదు. కమ్యూనిస్టుల ప్రపంచాధిపత్యానికి వ్యతిరేకంగా ప్రచ్ఛన్న యుద్ధం సాగిస్తున్నానని 1950లలో అమెరికా విశ్వసించింది. ఆ సంఘర్షణకు నైతికత బందీ అయితే కానివ్వండి, ఫర్వాలేదు. ఐసెన్ హోవర్, స్టాలిన్, చర్చిల్‌ల కాలంనాటి అమెరికన్, యూరోపియన్ తరం... పాశ్చాత్య, ప్రాచ్య ప్రపంచాలను రెంటినీ పూర్తిగా ధ్వంసం చేయగలిగిన యుద్ధం నుంచి బతికి బయటపడిన తరం. జర్మనీ కూడా 1945 నాటికి అణ్వాయుధాలను తయారు చేయగలిగి ఉంటే అలాంటి విధ్వంసం నిజంగానే జరిగేది. నాటి తరానికి నిరాశావాద పాఠాలను నేర్వాల్సిన అవసరం గానీ లేక యుద్ధ మరణాల పట్ల ఆందోళనగానీ అంతగా ఉండేవి కావు.
1971లో రిచర్డ్ నిక్సన్, హెన్రీ కిసింజర్‌లు మరో బృహత్ క్రీడపై (‘గ్రేట్ గేమ్’) దృష్టిని కేంద్రీకరించారు. ఆ క్రీడ అంతర్జాతీయ సంబంధాల చలన సూత్రాలను మార్చేస్తుందనీ (అలాగే మార్చేసింది కూడా), పలు తరాలపాటూ ప్రపంచ వ్యవహారాలను ప్రభావితం చేస్తుందనీ వారికి తెలుసు. అయితే వారి దృష్టి పథంలో బంగ్లాదేశ్ ఎక్కాడా లేదు. వాళ్లాసమయంలో మావోయిస్టు చైనానే నిజమైన చైనాగా గుర్తించి, కొట్టవచ్చినట్టు కనిపిస్తున్న అసంబద్ధతను సరిదిద్దడం కోసం చాంగ్ కై షేక్ తైవాన్‌ను ఎలా బలిపెట్టాలనే విషయమై తలమునకలై ఉన్నారు. రష్యా, చైనాల మధ్య ఎడం అప్పటికే పెరగడం మొదలైంది. గత్యంతరంలేని జాతీయ ప్రయోజనాల కారణంగా అవి రెండూ పరస్పర విరుద్ధ దిశలకు పయనించడం ప్రారంభమైంది. అమెరికా జోక్యం కమ్యూనిస్టు అంతర్జాతీయత ఆశలను తుంచేసింది. కమ్యూనిస్టు అంతర్జాతీయతగా గొప్పగా చెప్పుకున్న భావన చివరికి కమ్యూనిస్టు జాతీయవాదుల పునఃసమీకరణగా మారింది. మంచి సిద్ధాంతవేత్త ఎవరైనాగానీ... 1971 నుంచి 1991లో సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమై రష్యన్ కమ్యూనిజం అంతరించిపోయే వరకు సూటిగా ఉన్న రేఖను గుర్తిస్తారు.
సదుద్దేశాల ధార్మిక ప్రచారానికి పనికివచ్చే విధానాల స్థానే మన విదేశాంగ విధానంలోకి స్వీయ ప్రయోజనమనే మరి కాస్త ఉక్కును ఎప్పుడు ఎక్కిస్తారా? అని ఎవరైనాగానీ అశ్చర్యపడక తప్పదు. అమెరికాలోని భారత దౌత్యవేత్తలంతా తమలో ఒకరి కోసం ఒక్కటిగా నిలవడం శుభ పరిణామం, దేశం కోసం కూడా అంతే దృఢంగా వెన్నెముకతో నిలిచే స్వేచ్ఛను ప్రసాదించేట్టయితే విడివిడిగా, సమష్టిగా వాళ్లు ఏంచేయగలరనేదానికి అది నిదర్శనం మాత్రమే.
మరో పుస్తకం పేరును ఉపయోగించి చెప్పాలంటే గతం స్మరణ అనేది మిశ్రమ ఆనందం. ఇక మిగిలిన శేషం ఏమిటో చెప్పాలంటే... 2013 ముగిసిపోయింది, ఇక మరి ఎన్నటికీ అది తిరిగి రాదని నాకు హాయిగా ఉంది. 2014 వర్థిల్లాలి!