బెంగాల్ రాజకీయ గణితం
బైలైన్: ఎం.జె. అక్బర్, సీనియర్ సంపాదకులు
రాజ్యసభ ఎన్నికల్లో బెంగాల్‌లో ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు వామపక్ష ఎమ్మెల్యేలు తృణమూల్‌కు ఫిరాయించారు. వామపక్షాలు మరణిస్తుండగా, కాంగ్రెస్ అపస్మారకస్థితిలో ఉన్నదనేదే వారి సందేశం. వామపక్షాలు అధికారంలో ఉన్నప్పుడు మమత వారికి ముప్పుగా ఉండేది. వాళ్లిప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వారి భవిష్యత్తుకు ముప్పు ఇప్పుడు బీజేపీ నుంచే.
రాజకీయవేత ్తలు ఎప్పుడు ఎందుకు పార్టీ ఫిరాయిస్తారు? సమాధానం సర్వసాధారణంగా వినవచ్చేదే గానీ అంత సులభమైనదేమీ కానిది... డబ్బు. రాజకీయవేత్తల నైతికత గురించి మనకు బొత్తిగా సదభిప్రాయం లేకపోవడానికి సజావైన కారణమే ఉంది. అలా అని శాసనసభ సభ్యుల విధేయతను కొనుక్కోడానికి డబ్బు మాత్రమే సరిపోయేట్టయితే... పరంపరాగతమైన అస్థిరతే నెలకొం టుంది. ఆస్కార్ వైల్డ్ ఎన్నడో అన్నదాన్ని నా మాటల్లో చెప్పాలంటే... రాజకీయవేత్తల్లో చాలా మంది దేన్నయినా తిరస్కరించగలుగుతారు... ఒక్క ప్రలోభాన్ని తప్ప. ఎంతైనా డబ్బు ఒకేసారి జరిగే చెల్లింపు. కాబట్టి ఫిరాయింపులు అప్పుడప్పుడు జరిగేవిగానే ఉంటాయి. రాజకీయవేత్తలు కూడా ఇతర వృత్తి నిపుణులవలెనే పదవీ విరమణానంతర ప్రయోజనాలను కోరు కుంటారు.
గతవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో బెంగాల్‌కు చెందిన ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ముగ్గురు వామ పక్ష ఎమ్మెల్యేలు తృణమూల్‌లోకి ఫిరాయించారు. తద్వారా వాళ్లు ప్రజాజీవితంలో డబ్బు నిర్వహించే చలనశీలమైన పాత్రకు మించి పరిగణనలోకి తీసుకోగలిగిన అంశాన్ని సూచించారు. వామపక్షాలు మరణిస్తుండగా, కాం గ్రెస్ అపస్మారక స్థితిలో ఉన్నదనేదే వారి రాజకీయ సందేశం.
సీపీఐ(ఎం) పరిస్థితి బాగా లేదు గానీ ఇంకా బతికే ఉంది. వామపక్ష కూటమిలోని ప్రధాన, జూనియర్ భాగస్వాములంతా కలిసి ఆధునిక చరిత్రలోనే అత్యంత అసాధారణమైన రాజకీయ యంత్రాంగాన్ని నిర్మించారు. ఆ కూటమికి సంతాప సందేశం చిత్తుప్రతిని తయారు చేసుకోవాల్సిన సమయమిది.
సీపీఎంకు ఎర్రజెండాను ఊపడానికి తగిన బలం ఇం కా ఉంది. దాని ఓట్ల శాతానికి చేర్పులే అయినా కీలక శాతాలను చేర్చిన చిన్న పార్టీలు రాజకీయ సరిహద్దుల అంచులకు ఒత్తుకుపోయి ఉన్నాయి. దశరథ్ తిర్కే, అనంత అధికారి అనే ఇద్దరు ఎమ్మెల్యేలు వామపక్షాలను వదిలిపెట్టేశారు. వారిద్దరు ఒకప్పుడు విప్లవాన్ని, సోషలిజాన్ని తెస్తామని వాగ్దానం చేసిన రివల్యూషనరీ సోషలిస్టు పార్టీకి చెందినవారు. ఇక మూడో ఎమ్మెల్యే సునీల్ మండల్ ఇంకా ఎందుకు అస్థిత్వంలో ఉన్నదో అర్థంకాని ఫార్వర్డ్ బ్లాక్‌కు చెందినవారు. ముగ్గురూ షెడ్యూల్డ్ కులాలు, తెగల నేతలే. బడుగువర్గాలు మార్క్సిస్టు దుర్గాన్ని విడిచిపోయాయి. ఆ బురుజులు ఖాళీ అయిపోయాయనేది తెలిసిందే.
కాంగ్రెస్ కూడా అంత ప్రమాదకరమైన సమస్యనే ఎదుర్కొంటోంది. మాల్దాలో కూడా అది మద్దతును కోల్పోయింది. ఘనీ ఖాన్ చౌదరి కుటుంబానికి స్థానికంగా అక్కడ ఉన్న పలుకుబడి పుణ్యమాని వామపక్షాల బలం పెంపొందుతున్న దశాబ్దాల్లో సైతం అది కాంగ్రెస్‌కు విధేయంగా నిలిచింది. సీనియర్ నేత ఘనీఖాన్ మరణించారు. ఆయన సోదరుడు ఎమ్మెల్యే అబూ నాజర్ పార్టీ చెప్పిన వారికి ఓటు వేయలేదు. పొరుగు నియోజకవర్గమైన ముర్షిదాబాద్‌కు చెందిన ఆయన సహచరుడు ఇమానీ బిశ్వాస్ పార్టీ అర్ధమనస్క చర్యలపై రాజీకి తిరస్కరించి మమతా బెనర్జీకి ఓటు చేశారు. ఈ తిరుగుబాటు బెంగాల్ కాంగ్రెస్‌ను వచ్చే సార్వత్రిక ఎన్నికల తదుపరి ఒకే ఒక్క సీటుకు కుదించేయగలుగుతుంది.
ఆవిర్భవిస్తున్న రాజకీయ గణితం మర్మాలను విప్పడం ఎలాగో తెలిస్తే తప్ప బెంగాల్‌లో సాగుతున్న ఈ మహా మథనం అర్థం కాదు. మమతా బెనర్జీ నూతన వ్యవస్థ. రాబోయే మరి కొన్నేళ్లు కూడా ఆమె అలాగే ఉంటారు. అయితే మార్క్సిస్టులు ప్రతిపక్షం స్థానాన్ని సైతం శాసించగల స్థితిలో లేరు. ఆ పార్టీ అంతర్గత నిర్మాణం కుప్పకూలిపోవడం మాత్రమే అందుకు కారణం కాదు. క్యాడర్ వ్యవస్థపై నిర్మితమైన ఆ పార్టీ ఓటమి వల్ల కలిగిన దిగ్భ్రాంతి నుంచి శ్రేణులు బయటపడ్డంతోనే తిరిగి కేడర్లను భర్తీ చేసుకోగలుగుతుంది. కాకపోతే అది తన భావజాలపరమైన కథనానికి ప్రత్యామ్నాయాన్ని అందించడం కాదు గదా మరమ్మతులు సైతం చేసుకోలేని స్థితిలో ఉంది. అదే దాని అసలు సమస్య. బెంగాల్ ఓటర్ స్థానిక రకం సోషలిజాన్ని తగినంతగానే చూశాడు, ఏదైనా భిన్నమైనదాన్ని వినాలని అనుకుంటున్నాడు.
మమత జనాకర్షణకు మించి వాగ్దానం చేసిందేమీ లేదు. కాబట్టి దానితోనే నెట్టుకుపోగలుగుతారు. బోధించినదాన్ని ఆచరించి చూపడమే ఆమె ముందున్న సవాలు. కాకపోతే ఆమెకు సమయం అనే విలాసవంతమైన సౌలభ్యం ఉంది. అది ఆమె లేదా ఆమె పార్టీ అనుకుంటున్నంత ఎక్కువేమీ కాదు. అలా అని మార్క్సిస్టులు కోరుకునేటంత తక్కు వ కూడా కాదు. ప్రస్తుతానికయితే ఆమె సురక్షితంగానే ఉన్నారు. మార్క్సిస్టుల పరిస్థితి ఆశాజనకంగా లేదు. వాళ్లు అధికారంలో ఉండగా మమతా బెనర్జీ వారికి ముప్పుగా ఉండేది. వాళ్లిప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు, వారి భవిష్యత్తుకు ముప్పు ఇప్పుడు బీజేపీ నుంచే.
కోల్‌కతాలోని బ్రిగేడ్ పెరేడ్ గ్రౌండ్‌లో నరేంద్రమోడీ సభ విజయవంతం కావడంలోని అర్థం అదే. ఇండోర్ స్టేడియం నిండిపోతేనే బీజేపీ నేతలు ఒకరినొకరు అభినందించుకుని ఎంతో కాలంకాలేదు. ఒకప్పుడు ఎర్రజెండా ఆధిపత్యం వహించిన చోట ప్రస్తుతం మమత ఆకుపచ్చ జెం డాలు రెపరెపలాడుతున్నాయి. అక్కడే ఈ ఎన్నికల సీజన్లో కాషాయం కూ డా కనిపిస్తోంది. ఒక సభకు హాజరైన వారి సంఖ్యను లెక్కగట్టడానికి ఐన్‌స్టీన్‌లు కానవసరం లేదు. టెలివిజన్ కెమెరాలు ఆ పని చేసిపెడతాయి.
మమతకు బీజేపీ గురించి బెంగలేదు. బెంగపడాల్సింది బెంగాల్ వామపక్షాలే. త్వరితగతిని అవి తమను తాము పునరుజ్జీవింప చేసుకోలేకపోతే తమ రాజకీయ ‘సామ్రాజ్యాన్నంతటినీ’ పోగొట్టుకుంటాయి. అలా అని మనమేమీ నాటకీయంగా ముందుకు గంతేయడం గురించి మాట్లాడటం లేదు. బీజేపీ ఈ ఏడాది ఎన్నికల్లో ఎన్నో సీట్లు గెలవబోవడం లేదు. ఓట్లను లెక్కింపు సమయంలో దానికి నేడు పెరుగుతున్న మద్దతు స్పష్టమవుతుంది. రాజకీయ పార్టీ కొంతవరకు ఒక సైన్యం లాగా ముందుకు కదులుతుంది. కమాండర్లు ప్రతికూల పరిస్థితుల్లో సైన్యాన్ని కలిపి ఉంచలేకపోతే ఓటమి కుప్పుకూలిపోవడం తథ్యం. పురోగమనం ఎప్పుడూ దశల వారీగా మాత్రమే జరుగుతుంది. మార్క్సిస్టులు గతితర్కంపై ఆధారపడే వృద్ధి చెందుతారు. కాబట్టి వాళ్లకు ఈ విషయం సులువుగానే అర్థమవుతుంది.
బెంగాల్ కాంగ్రెస్‌కు బెంగాల్‌తో సంబంధం తెగిపోయింది. మహా అయితే కాంగ్రెస్ చేస్తున్నదేమైనా ఉందంటే రాయిని విసిరి ఆడే తొక్కుడు బిళ్ల ఆటలో లాగా ఒక గడి నుంచి మరొక గడికి గెంతడమే. కాంగ్రెస్ రాజ్యసభ ఎన్నికల్లో వామపక్షాలతో చేతులు కలపడంలో సఫలం కాలేదు. అదే సమయంలో ఎలాంటి షరతుల మీదైనా ఎన్నికల పొత్తుకు సిద్ధమేనంటూ తృణమూల్‌కు తెరచాటు సందేశాలను పంపింది. ఏదో సామెత చెప్పినట్టు బిచ్చగాళ్లకు ఎంచుకునే స్వేచ్ఛ ఉండదు.
ఈ ఏడాది ఎన్నికల్లో తమ పార్టీలు గెలిచే అవకాశం ఉన్నదని కాంగ్రెస్, వామపక్ష ఎమ్మెల్యేలు విశ్వసిస్తే అసలు ఫిరాయింపులు జరిగేవే కావు.