కాంగ్రెస్ కొంప ముంచిన అంశాలేంటి?
సార్వత్రిక ఎన్నికల్లో ముందుగా చెప్పుకోవాల్సిన ఏకైక పార్టీ.. కాంగ్రెస్. ఈసారి ఎన్నికలకు ఏమాత్రం సంసిద్ధం కాకుండా దారుణమైన ఫలితాలను చవిచూస్తోంది. ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడానికి ముందునుంచే ఒకరకంగా తన ఓటమిని కాంగ్రెస్ స్వయంగా అంగీకరించింది. ఎన్నికల క్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి అన్నీ ఎదురుదెబ్బలే తగులుతూ వచ్చాయి. వరుసపెట్టి స్కాముల్లో కూరుకుపోవడం, రాష్ట్రాల ఎన్నికల్లో పదే పదే ఓటమి, విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసరాల ధరలు, వృద్ధిరేటు మందగమనం, మరోవైపు ప్రచారపర్వంలో బీజేపీ దూసుకెళ్లడం.. ఇలా అన్నీ కాంగ్రెస్కు ప్రతికూలంగానే మారిపోయాయి. 'రాబోయేది మోడీ ప్రభుత్వం', 'కాంగ్రెస్ నుంచి భారతదేశానికి విముక్తి' లాంటి బీజేపీ నినాదాలకు కాంగ్రెస్ పార్టీ వద్ద సమాధానం అన్నదే లేకుండా పోయింది.
యూపీఏ ప్రభుత్వంలో తిరుగులేని ఆధిక్యం కనబరిచిన పలువురు మంత్రులు చిదంబరం, ఏకే ఆంటోనీ లాంటివాళ్లు ఈసారి అసలు ఎన్నికల బరిలోకి దిగకపోవడం కూడా నైతికంగా ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బగా మారింది. దిగ్విజయ్ సింగ్, ఎన్డీ తివారీ లాంటి సీనియర్ నాయకులు ఎన్నికల సమయంలోనే అనవసర వివాదాల్లో కూరుకుపోవడం ఆ పార్టీ ప్రతిష్ఠను మంటగలిపింది. పార్టీ ప్రచారాన్ని సోనియాగాంధీ ఏ దశలోనూ ముందుకు తీసుకెళ్లలేకపోయారు.
పార్టీ పగ్గాలను గానీ, ప్రభుత్వ పగ్గాలను గానీ అందిపుచ్చుకోడానికి ఏమాత్రం ఆసక్తి చూపించని యువరాజు రాహుల్ గాంధీ తన ప్రసంగాలతో జనానికి విసుగెత్తించారు. ఏ దశలో కూడా.. ఆయన ప్రసంగాలు ప్రజలకు కాకపోయినా.. సొంత పార్టీ వర్గాలకు కూడా స్ఫూర్తిని ఇవ్వలేకపోయాయి. మరోవైపు ఆయన ప్రత్యర్థి నరేంద్ర మోడీ రోజుకు ఐదు బహిరంగ సభల్లో ప్రసంగిస్తూ కూడా పూర్తిస్థాయి ఎనర్జీని ప్రదర్శించారు. దాంతోపాటు చాయ్ పే చర్చా పేరుతో సామాన్యులతో చర్చా కార్యక్రమాలు నిర్వహించారు. ఆయన వేగాన్ని రాహుల్ అందుకోలేకపోయారు. ప్రధాని అభ్యర్థిగా కూడా తనను ప్రకటించవద్దని కోరడం ఆయన దివాలాకోరుతనానికి నిదర్శనం. తల్లీకొడుకులు కలిసి దేశాన్ని సర్వనాశనం చేశారంటూ మోడీ తన ప్రసంగాల్లో చేసిన పదునైన విమర్శలకు అవతలి నుంచి సమాధానం రాలేదు.
ఇక కూటమిని కూడగట్టుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైంది. డీఎంకే, టీఎంసీ లాంటి పెద్ద పార్టీలు దూరం కావడం ఆ పార్టీకి గట్టిదెబ్బ అయ్యింది. ఇక తోడుగా ఉంటూనే ఎన్సీపీ మాత్రం శల్యసారథ్యం వహించింది. బీజేపీ మాత్రం చాపకింద నీరులా ఎక్కడికక్కడ మిత్రులను కలుపుకొని పోతూ ఘనవిజయాలు సొంతం చేసుకుంది.