
సామాజిక ఎజెండా రావాలి: కె. నాగేశ్వర్
తెలంగాణ వస్తే తమ బతుకులు పూర్తిగా మారిపోతాయని ప్రజలు నమ్మారు. ఉద్యమానికి జై కొట్టారు. ఇపుడు రాష్ట్రం స్వప్నం సాకారమైంది. రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, ఆర్థిక విధానాల్లో మార్పులు రాకపోతే ప్రజల్లో అసంతృప్తి మొదలవుతుందని, ప్రజల ఆకాంక్షలే తీరనప్పుడు అది తెలంగాణ సమాజానికి పెను సవాలుగా మారనుందని, ప్రముఖ రాజకీయ, సామాజిక ఆర్థిక విశ్లేషకుడు, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ అభిప్రాయ పడుతున్నారు. సమస్త రంగాల్లో తెలంగాణ పునరుజ్జీవనంతో పాటు అసమానతలు తొలగినపుడే రాష్ట్ర ఏర్పాటు లక్ష్యం నెరవేరుతుందని ఆయన తన అంతరంగాన్ని ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ప్రజల సమస్యలన్నింటికీ సర్వరోగ నివారిణి కాదు. రాజకీయ, ఆర్థిక విధానాలలో మార్పు రాకుండా ప్రజలు జీవితాలలో మార్పు రాదు. తెలంగాణ రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజల సమస్యలు ఎన్నికల్లో రాజకీయ ఎజెండా కావాలి.
- నాగేశ్వర్, ఎమ్మెల్సీ
విజ్ఞానం...అభివృద్ధికి మూలం
తెలంగాణ ప్రాంతంలో ప్రాథమిక స్థాయిలో బడిమానేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. డాక్టర్లు, ఆస్పత్రి, పడకలకు, జనాభాకు మధ్య నిష్పత్తి చూస్తే సీమాంధ్ర, తెలంగాణ మధ్య తేడా (హైదరాబాద్ పరిసర ప్రాంతాలు మినహా) పెరుగుతోందని ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు సీహెచ్ హనుమంతరావు విశ్లేషించారు కూడా! సమాచార సాంకేతిక రంగం, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో తెలంగాణవారు తక్కువగా ఉన్నారనే అంశం తెలంగాణ ఉద్యమ కాలంలో ముందు కొచ్చింది. విజ్ఞాన ఆర్థిక వ్యవస్థలో సర్వీసుల రంగంలో నాణ్యమైన ఉపాధికి అవకాశాలున్నాయి. అందుకే ఆధునిక ఆర్థిక వ్యవస్థలో విజ్ఞాన తెలంగాణ లక్ష్యం కావాలి.
‘పరిశ్రమ’తో ప్రగతి
హైదరాబాద్ నుంచి ఔషధ కర్మాగారాలు తరలిపోతు న్నాయి. విద్యుత్ సంక్షోభం వల్ల చిన్న తరహా పరిశ్రమలు మూత పడుతున్నాయి. వరంగల్‌లో అజాంజాహీ మిల్లు నుంచి సిర్పూర్‌లో సర్ సిల్క్ వర కూ రాజధానిలో డీబీఆర్ మిల్లు మొదలుకుని నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీల వరకూ పరిశ్రమలు మూత పడ్డాయి. కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో గ్రానైట్ పరిశ్రమ గందరగోళంగా ఉంది. వీటి పునరుద్ధరణ వల్ల చిన్న పట్టణాలు, నగరాలను అభివృద్ధి చేయవచ్చు. ఆలోచనా పరులు మెదళ్లకు పదును పెట్టాల్సిన సందర్భం ఇది.
సమ సమాజం...లక్ష్యం కావాలి
కొత్త తెలంగాణ రాష్ట్రంలో సామాజిక పొందికను అర్ధం చేసుకోవాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్‌గా మిగిలి ఉండే సీమాంధ్ర మొత్తం జనాభాలో 5.3 శాతం మాత్రమే గిరిజనులు ఉంటారు. కానీ తెలంగాణ రాష్ర్టంలో గిరిజన జనాభా 9.3 శాతం ఉంటుంది. ఆమేరకు రాష్ర్ట శాసన సభలో కూడా గిరిజన ప్రజా ప్రతినిధుల సంఖ్య పెరగనుంది. అలాగే 2001 జనాభా లెక్కల ప్రకారం అవశేష ఆంధ్రప్రదేశ్ జనాభాలో 6.9 శాతం మంది ముస్లింలు ఉంటే తెలంగాణ రాష్ట్ర జనాభాలో వారి వాటా 12.5 శాతం. ఇక ఎస్సీల విషయానికి వస్తే మిగిలిన ఆంధ్రప్రదేశ్‌లో వారు 17 శాతం ఉండగా తెలంగాణలో 15.4 శాతం ఉంటారు. అందుకే తెలంగాణలో మైనార్టీ, అణగారిన వర్గాల అభివృద్ధి అంశం మరింత రాజకీయ ప్రాధాన్యం సంతరించుకుంటుంది.
సుజలాం...సుఫలాం
రాష్ట్ర విభజనకు కారణమైన అంశాలలో నీటిపారుదల రంగంలో అసమానతలు ప్రధాన మైనవి. ఐదు దశాబ్దాల కాలంలో తెలంగాణ ప్రాంతంలో చెరువుల కింద సాగునీటి సదుపాయం గణ నీయంగా పడిపోయింది. మహబూబ్ నగర్ నుంచి రంగారెడ్డి జిల్లాల్లో కూడా ఎండిన చెరువులు దర్శనమిస్తాయి. మరోవైపు భారీ, మధ్యతరహా నీటి పారుదల ప్రాజెక్టుల ద్వారా సాగు సదుపాయం ఆశించిన స్థాయిలో పెరగలేదు. శ్రీరాం సాగర్‌లో పూడిక వల్ల సాగునీటి విస్తీర్ణం గణనీయంగా పడిపోయింది. ఇచ్చంపల్లి ముచ్చట మర్చి పోయారు. పాలమూరులో పేదరికం తాండవిస్తున్నా జూరాల ఆర్డీయస్ ప్రాజెక్టుల కింద కేటాయించిన నీరు ఆ జిల్లా ప్రజలు ఏనాడూ పొందలేదు. మంజీరా నది రాజధాని వాసుల దాహార్తి తీరుస్తున్నప్పటికీ మెదక్ జిల్లా ప్రజలకు ఆర్తినే మిగిల్చింది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర జలవిధానం ద్వారా ప్రతి గ్రామానికి తాగునీరు, ప్రతి ఎకరానికీ సాగునీరిచ్చే ఏర్పాటు జరగాలి. గొలుసు చెరువుల పునరుద్ధరణ జరగాలి.
పర్యాటకరంగానికి పెద్దపీట వేయాలి
ఖమ్మం జిల్లా అటవీ ప్రాంతంలో, నల్లమల అడవుల్లో పర్యావరణ అనుకూల పర్యాటక రంగాన్ని (ఇకో టూరిజం) అభివృద్ధి చేయవచ్చు. మహబూబ్ నగర్‌లో ఉన్న కోటలు, చెరువులూ, రంగారెడ్డి జిల్లాలోని అనంతగిరి కొండలూ హైదరాబాద్ నగర వాసులకు సేదదీర్చుకునే ప్రదేశాలు అవుతాయి. తెలంగాణ రాష్ట్రంలో ప్రాధాన్యం గల బౌద్ద, జైన క్షేత్రాలున్నాయి. దక్షిణ కాశీగా పేరుగాంచిన కాళేశ్వరం, దేశంలోని అరుదైన బాసర సరస్వతీదేవి ఆలయం, నైజాం నవాబులు, కాకతీయులూ, శాతవాహనుల నాటి చారిత్రక ప్రదేశాలు పర్యాటకులను ఆకర్షిస్తాయి. వ్యవసాయం మొదలుకుని అన్ని రంగాల్లోనూ స్థానికపరమైన ప్రత్యేకతలను గుర్తించి, వాటి పునరుద్ధరణ కోసం ప్రత్యేకమైన కార్యాచరణ ప్రణాళికను రచించే దార్శనికత నవ తెలంగాణలో అవసరం.
వ్యవ‘సాయం’...శ్రేయోదాయకం
వ్యవసాయమే కాదు అనుబంధ రంగాల అభివృద్ధి కూడా ఉపాధి కల్పనకు సుస్థిర ఆదాయానికి కీలకం అవుతుంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ముఖ్యం గా రంగారెడ్డి జిల్లాలో ప్రత్యేక వ్యవసాయ, ఉద్యాన వన పంటల ప్రాంతాన్ని స్థానిక రైతుల భాగస్వామ్యంతో ఏర్పాటు చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. హైదరాబాద్ నగర ప్రజలకు పండ్లు, పూలు, పాలు సమృద్ధిగా లభించేందుకు వీలు కలుగుతుంది. అంతరా ్జతీయ విమానాశ్రయం కూడా ఆ సమీపంలో ఉండడం వల్ల ఫ్లోరీకల్చర్ అభివృద్ధికి కూడా అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా గొర్రెల పెంపకంలో అగ్రభాగాన ఉంది. కృష్ణా నదిలో నీళ్ళ కన్నా ప్రాజెక్టులు ఎక్కువగా ఉన్నాయి. కానీ గోదావరి నదిలో నాలుగు వేల టీఎంసీల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోంది. ప్రాణహిత, ఇంద్రావతి కలిసాక గోదావరిలో పుష్కలంగా నీరుంటుంది.
అనాడే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కనుక కట్టి ఉంటే తెలంగాణలో గణనీయమైన ప్రాంతం సస్యశ్యామలం అయ్యేది. అయితే చాలా ప్రాంతాల్లో నీటి ప్రవాహం కన్నా దిగువ ప్రాంతంలో భూములుండడం వల్ల గోదావరి జ లాలను ఎత్తిపోతల ద్వారా మాత్రమే వినియోగించుకోవాల్సిన దుస్థితి ఉంది. ఇందుకు గణనీయమైన స్థాయిలో విద్యుత్ అవసరం ఉంటుంది. అందుకే తెలంగాణ రాష్ట్రంలో సమీకృత జల, విద్యుత్ విధానాలను అమలు చేయాల్సిఉంటుంది. తెలంగాణలో విస్తారంగా బొగ్గు నిక్షేపాలున్నప్పటికీ అవసరమైన పరిమాణంలో విద్యుదుత్పత్తి జరగడంలేదు. స్థానికంగా విద్యుత్ ప్లాంట్లను పెడితే ఆర్థికంగా కూడా కలిసి వస్తుంది.