అమరుల త్యాగాలు... సబ్బండ వర్ణాల పోరాటాలతో అరవై ఏళ్ల తండ్లాట తీరింది. నెత్తుటి జ్ఞాపకాలు, నిత్య నినాదాలతో చరిత్రలో నిలిచిన తెలంగాణ గడ్డ నేడు నవ తెలంగాణ కోరుకుంటున్నది. సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనాలంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందుకోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటన్నింటి మీద మీ ఆలోచనలను ‘సాక్షి’తో పంచుకోండి. మీ అభిప్రాయాలను క్లుప్తంగా మాకు రాసి పంపండి. ఫొటో కూడా పంపించండి.
ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్
లేదా lection@sakshi.comకు మెయిల్ చెయ్యండి.
అందరికీ కార్పోరేటు వైద్యం...
వనరులన్నీ ఉన్నా తెలంగాణ వెనుకబడి పోయింది. వెనుకబాటుకు దారి తీసిన కార ణాలపై దృష్టి సారిస్తేనే నవ తెలంగాణ నిర్మాణం సాధ్యమవుతుంది. ప్రాథమిక స్థాయినుంచి మాతృభాషలో విద్యా బోధన జరగాలి. అభివృద్ధి లో కీలక పాత్ర పోిషించే విద్యకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు ప్రైవేటు రంగంలో ఉద్యోగ భద్రత కల్పిం చాలి. దళారీ వ్యవస్థను రూపుమాపి ధరలను నియంత్రించాలి. ఆహారధాన్యాల ఉత్పత్తిని ప్రోత్సహించాలి. రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చర్యలు తీసుకోవాలి. నదుల అను సంధానం చేయాలి. పూడుకుపోయిన చెరువు లను పునరుద్ధరించాలి. వైఎస్ హయాంలో మాదిరిగా ప్రజలందరికీ కార్పోరేటు వైద్యాన్ని అందుబాటులోకి తేవాలి.
- సుధాకర్ శ్రీచూర్ణం, లెక్చరర్, జహీరాబాద్, మెదక్ జిల్లా.
ఉపాధి అవకాశాలు పెరగాలి...
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుతో విద్యాఉపాధి రంగాల్లో అవకాశాలు మెరుగవు తాయని ఈ ప్రాంత ప్రజలు ఆశలు పెట్టుకు న్నారు. ఉద్యోగావకాశాలు కల్పించడానికి రాబో యే ప్రభుత్వాలు కృషి చేయాలి. అప్పుల బాధ తో రైతులు ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థి తులను తొలగించాలి. వ్యవసాయాన్ని లాభదా యకంగా మార్చాలి. ప్రతి జిలా ్లకేంద్రాన్ని అన్ని సౌకర్యాలు గల నగరాలుగా అభివృద్ధి చేయాలి. ప్రతి జిల్లాలో ఒక వైద్యకళాశాల, ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్య కళాశాలలను ఏర్పాటు చేయాలి. అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాలి.
- తోట యోగేందర్, మిర్యాలగూడ, నల్గొండ జిల్లా
అసమానతలు లేని విద్య...
విద్యారంగంలో అసమానతలను రూపు మాపాలి. అందరికీ నాణ్యమైన విద్య అందిం చేలా చర్యలు తీసుకోవాలి. విద్యాహక్కు చట్టాన్ని ఇందుకు ఆయుధంగా వాడుకోవాలి. విద్యా రంగంలో కార్పోరేటు ధోరణులను పారదోలాలి. విద్య ఎవరికయినా ఒక్కటే. అలాంటిది చదువు కోసం కొందరు లక్షల్లో డొనేషన్లు కట్టాల్సి రావడం ఎంతవరకు సమంజసం. విద్యాహక్కు చట్టం ప్రకారం అందరూ నామమాత్రపు ఫీజు లతో అత్యుత్తమ విద్యను పొందేలా చూడాలి.
- తుమ్మలపల్లి ప్రసాద్, ఇల్లెందు, ఖమ్మం జిల్లా
(కార్యదర్శి, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల సంఘం)
ఆదర్శరాష్ట్రంగా నిలవాలి...
దశాబ్దాల పోరాటాల ఫలితంగా తెలంగాణ 29వ రాష్ట్రంగా అవతరిం చింది. విద్యార్థుల బలిదానాల వల్లనే ఇది సాధ్యమయ్యింది. ప్రతి జిల్లాలో కనీసం ఒక భారీ పరిశ్రమను నెలకొల్పి ఉపాధి కల్పించాలి. ప్రతి కుటుం బానికిఒక ఉద్యోగం కల్పించాలి. పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పనలో ఉద్యమంలో పాల్గొన్న వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కడికక్కడ వేళ్లూనుకున్న అవినీతిని సమూలంగా నిర్మూలించాలి. అప్పుడే సామాన్యుడికి న్యాయం జరుగుతుంది. నవ తెలంగాణ ఆదర్శ రాష్ట్రంగా నిలుస్తుంది.
- వెనిశెట్టి రవికుమార్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు
(రాష్ట్రపతి అవార్డు గ్రహీత) హుజూరాబాద్, కరీంనగర్ జిల్లా