మార్పు కోసం కృషి చేద్దాం.. | Let us work for a change in Telangana formation | Sakshi
Sakshi News home page

మార్పు కోసం కృషి చేద్దాం..

Published Sat, Apr 5 2014 1:50 AM | Last Updated on Tue, Aug 14 2018 4:46 PM

మార్పు కోసం కృషి చేద్దాం.. - Sakshi

మార్పు కోసం కృషి చేద్దాం..

నవ తెలంగాణ: సమాజం మారినప్పుడే మహిళల్లో సమూలమార్పులు సాధ్యం..ఉద్యోగినులుగా ఉద్యమంలో మమేకమై ప్రజ ల్లో గుర్తింపు తెచ్చుకున్న మనం నవ నిర్మాణంలోనూ భాగమవుదాం.. పని సంస్కృతిని పెంచి ప్రజలకు మెరుగయిన సేవ చేద్దాం. మనం మారుతూ... సమాజమార్పునకు కృషిచేద్దాం..అంటున్నారు.. టీఎన్‌జీవోల కేంద్రం సంఘం మహిళా చైర్‌పర్సన్ బండారు రేచల్...
 బండారు రేచల్
 (మహిళా చైర్‌పర్సన్,  టీఎన్జీవోల కేంద్ర సంఘం)
 
 తెలంగాణ ప్రాంతానికి దేశంలోనే ఉజ్వలమైన చరిత్ర ఉంది. ఆధిపత్యాన్ని ప్రశ్నించిన సమ్మక్క, సారలమ్మ, బందగీ త్యాగాలను, రాణీ రుద్రమ వారసత్వాన్ని,  చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని  పుణికిపుచ్చుకున్న తెలంగాణ ప్రాంత మహిళలు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో సత్తా చాటారు. పురుషులకు తామేమీ తక్కువ కాదని నిరూపించారు. 1969 తొలిదశ ఉద్యమం నుంచి ఇప్పటిదాకా  క్రియాశీలకంగా వ్యవహరించారు. నిర్బంధాలకు వెరవకుండా పోరాట పటిమను చాటారు.  తెలంగాణ కోసం బలిదానాలు చేశారు. మలిదశ ఉద్యమంలో ప్రాణత్యాగాలు చేసిన 1200 మందిలో వంద మందికి పైగా యువతులు, విద్యార్థినులున్నారు. డిసెంబర్ 2008లో 610 జీవో అమలు కోసం చేపట్టిన చేపట్టిన ఉద్యమ యాత్రలో, ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమంలో మహిళాఉద్యోగులు పాల్గొన్నారు.  రైల్‌రోకో, సడక్‌బంద్, వంటావార్పు, మిలియన్‌మార్చ్ విజయవంతం కావడంలో ప్రధానపాత్ర పోషించారు. ఉద్యోగుల డిమాండ్ల సాధనతో పాటు, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం జరిగిన చారిత్రాత్మకమైన సకలజనుల సమ్మెలో భాగమయ్యారు. తెలంగాణ ప్రాంత మహిళా ఉద్యోగులు అటు ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతూనే తెలంగాణ ప్రజల దశాబ్దాల కల అయిన ప్రత్యేక రాష్ట్ర సాధనకోసం ఉద్యమించారు.
 
 వివక్ష, అసమానతలు లేని సమాజం కోసం, ఆత్మగౌరవం కోసం ‘జీతం కోసం పీఆర్‌సీ - జీవితం కోసం తెలంగాణ’ అన్న నినాదంతో కదిలారు. 610 జీవో తెలంగాణ ఉద్యమానికి బీజంవేస్తే, 14ఎఫ్ తొలగించాలన్న డిమాండ్ మలిదశ పోరాటానికి నాంది పలికింది. కేసీఆర్ ఆమరణదీక్షకు సంఘీభావంగా ఉద్యోగినులు ర్యాలీలు నిర్వహించారు.  డిసెంబర్ 1నుంచి 8వరకు ఉద్యోగుల పెన్‌డౌన్ సందర్భంగా నిర్వహించిన వంటావార్పూ కార్యక్రమాల్లో ఉద్యోగినుల కుటుంబ సభ్యులు కూడా భాగస్వాములై  సంఘీభావం చెప్పడం అద్భుతదృశ్యం.  కిందిస్థాయి నుంచి గెజిటెడ్ అధికారుల వరకు కార్యాలయాల ముందు బతుకమ్మలాడుతూ ఐక్యతను ప్రదర్శించారు. సిద్దిపేటలో ఫ్రీజోన్‌కు వ్యతిరేకంగా రెండు లక్షల మందితో జరిగిన ఉద్యోగ గర్జనకు పది జిల్లాల నుంచి ఉద్యోగినులు తరలివచ్చారు. రచ్చబండ కార్యక్రమాల్లో మహిళలు అధికారులను, ప్రజాప్రతినిధులను నిలదీశారు. సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా పే అండ్ అకౌంట్స్ శాఖ ఉద్యోగులు ముఖ్యమంత్రికి కూడా జీతం రాకుండా చేశారు. దీంతో ప్రభుత్వం ఈ శాఖలో సమ్మెను నిషేధించింది. స్వామిగౌడ్, దేవీప్రసాద్‌రావుల నేతృత్వంలో 42 రోజుల పాటు సాగిన సకలజనుల సమ్మె విజయంలోనూ మహిళాఉద్యోగుల పాత్ర ఉంది. ఆర్టీసీ కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనడంతో జనజీవనం మీద ప్రభావం పడింది. ప్రభుత్వం నిర్భందాన్ని ప్రయోగించడం మొదలుపెట్టింది. కార్యాలయాల్లో పోలీసులను దింపింది. మహిళా ఉద్యోగులతో సహా అరెస్టుల పర్వం ప్రారంభించింది. గాంధీ ఆస్పత్రి ఆవరణలో స్వామిగౌడ్‌ను అరెస్టు చేయడాన్ని ప్రతిఘటించిన మహిళలను అరెస్టు చేశారు.ప్రభుత్వ కుట్రను భగ్నం చేసి వారిని  విడిపించుకోవడంలో ఉద్యోగినులు విజయం సాధించారు. రవాణాశాఖ కార్యాలయంలో స్వామిగౌడ్ మీద జరిగిన హత్యాప్రయత్నాన్ని ప్రతిఘటించారు.  అడుగడుగునా ఆటంకాలు ఎదురయినా వాటినన్నింటినీ దాటుకుని ఉద్యోగినులు సాగరహారం, మిలియన్‌మార్చ్‌లలో పాల్గొనడం సాహసోపేతం. 2013 జూన్14న జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు చలో అసెంబ్లీ కార్యక్రమంలోనూ ఉద్యోగినులు కీలక పాత్ర పోషించారు. మూడు రోజుల ముందు నుంచే పోలీసులు ఈ కార్యక్రమాన్ని విఫలం చేసేందుకు ప్రయత్నించారు.
 
 బస్సులను అడ్డుకోవడం, మహిళా ఉద్యోగులను కూడా ఎక్కడికక్కడే అరెస్టు చేసి కేసులు పెట్టడం ద్వారా భయానకవాతావరణాన్ని సృష్టించారు. అయినా మహిళలు, యువతులు వేల సంఖ్యలో జేఏసీ నాయకులతో పాటు అసెంబ్లీ వైపు బయలుదేరారు. బాష్పవాయు గోళాలు ప్రయోగించినా వెన్ను చూపలేదు. ఇళ్లు తప్ప మరో లోకం తెలియని గృహిణులు, ఉద్యమాల ఊసెరగని ఉద్యోగినులు, యువతులు తెలంగాణ ఉద్యమంతో మమేకమయ్యారు. 2013 నవంబర్25న భద్రాచలం ముంపు గ్రామాల సమస్య మీద కూడా జరిగిన ఉద్యమంలో కూడా క్రియాశీలంగా పాల్గొని భద్రాచలం మాదే... అని నినదించారు.   ఉద్యమంలో భాగంగా విద్యార్థినులుమీద, ఉద్యోగినుల మీద అక్రమ కేసులు బనాయించినా వెన్నుచూపక ధీర వనితల్లా తుదికంటా పోరాడారు. రాష్ట్రాన్ని సాధించినందున ఇప్పుడిక నవ నిర్మాణం మీద కేంద్రీకరించాల్సి ఉంది. సమైక్యపాలన వల్ల తలెత్తిన సమస్యలకు తెలంగాణ పాలనే పరిష్కారం.  
 
 జన  తెలంగాణ:  యువనేతలకే పట్టం...
 హామీలను నెరవేర్చే సత్తా ఉన్న యువ నాయకులనే ఈ ఎన్నికల్లో గెలిపించాలి. యువతను ఆకర్శించడానికి కొందరు నాయకులు ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తున్నారు. ఇంటికొక ఉద్యోగం ఇవ్వడం ఎలా సాధ్యం? వాటిని నమ్మి మోసపోవద్దు. యువత ప్రజల్లో చైతన్యం తేవాలి. సుపరిపాలన అందించే నాయకత్వానికే పట్టం కట్టాలి.                                                                                              - బొడ్డు మహేందర్
 గట్టుభూత్కూరు, కరీంనగర్ జిల్లా

 
 సస్యశ్యామలం కావాలి...
 ఎందరి కృషి వల్లనో తెలంగాణ వచ్చింది. నవ తెలంగాణలో అవినీతి లేని నాయకత్వం రావాలి. మనకున్న బొగ్గు నిల్వలతో విద్యుత్ ఉత్పత్తి పెంచాలి. కొత్త పరిశ్రమలను నెలకొల్పాలి.  హైదరాబాద్ సరిసరాల్లో భారీ పరిశ్రమల ఏర్పాటుకు అవకాశాలు కల్పించడంతో పాటు కేంద్రం నుంచి రాయితీలు లభించేలా చర్యలు తీసుకోవాలి. అందరూ కలిసి తెలంగాణను ప్రగతిమార్గంలో నడపాలి. హైదరాబాద్‌లో నీటి సమస్యను పరిష్కరించాలి. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులు చేపట్టి తెలంగాణను సస్యశ్యామలం చేయాలి.
 - పూనూరు గంగాధరరెడ్డి, హైదరాబాద్
 
 వృద్ధులకు జీవనభృతి కల్పించాలి...
 దేశంలోనే ఆదర్శంగా నిలిచేలా నవ తెలంగాణ నిర్మాణం జరగాలి. ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయవల్సిఉంది. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ వ్యవస్థలను మెరుగుపర్చాలి. విద్య, ఆరోగ్య రంగాలకు ప్రాధాన్యం కల్పించాలి. నిరుద్యోగ సమస్యను పూర్తిగా రూపుమాపాలి. వృద్ధులకు జీవనభృతి ఇవ్వాలి. తెలంగాణలో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకోవాలి. నీటి పారుదల ప్రాజెక్టులను సత్వరమే పూర్తి చేయడంతో పాటు కొత్త ప్రాజెక్టులు చేపట్టాలి.
 - డి.వి. శ్రీనివాస్, రాంనగర్, వరంగల్ జిల్లా
 
 నవ తెలంగాణ నిర్మాణంలో భాగం కండి
 నవ తెలంగాణ సామాజికంగా, ఆర్థికంగా, రాజ కీయంగా, సాంస్కృతికంగా మరింతగా వెలుగులీనా లంటే ఎలాంటి మేలిమి మార్పులు రావాలి? అందు కోసం ఏమేం చేయాలి? ఎవరెవరు ఎలా నడుం బిగించాలి? వీటిపై మీ అభిప్రా యాలు ‘సాక్షి’తో పంచు కోండి.
 ఎలక్షన్ సెల్, సాక్షి దినపత్రిక, రోడ్ నం.1 బంజారాహిల్స్, హైదరాబాద్  లేదా
 election@sakshi.com కు  మెయిల్ చెయ్యండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement