లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్ | Telangana government waive crop loans up to Rs 1 Lakh, says cm kcr | Sakshi
Sakshi News home page

లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్

Published Mon, Jul 7 2014 12:42 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్ - Sakshi

లక్ష వరకూ రుణమాఫీ చేస్తాం: కేసీఆర్

హైదరాబాద్ : నవ తెలంగాణ నిర్మాణం వైపుగా  ముఖ్యమంత్రి కేసీఆర్ తన కసరత్తును ముమ్మరం చేశారు. కొత్త రాష్ట్రంలో సరికొత్త పాలనకు ప్రణాళికలు, చట్టాల రూపకల్పన లక్ష్యంగా మంత్రులు, కార్యదర్శులు, అన్ని శాఖల అధిపతులు, కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లతో ఆయన సోమవారం భేటీ అయ్యారు.  మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో జరిగిన మేథోమథనంలో కేసీఆర్  నవ తెలంగాణ నిర్మాణానికి అనుసరించాల్సిన విధి విధానాలపై అధికారులకు నిర్దేశం చేశారు.

ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చుతామన్నారు. కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీపై నిర్ణయం తీసుకుంటామని, రూ.లక్ష వరకూ రుణమాఫీకి కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ విధానం హైదరాబాద్ నుంచి కాదని, గ్రామస్థాయి నుంచి రావాలన్నారు. వందల కోట్ల ప్రజాధనం ఎక్కడకి పోతుందో తేలాలన్నారు. ప్రబుత్వ పథకాల అమలులో రూపాయి కూడా దుర్వినియోగం కారాదని కేసీఆర్ సూచించారు.

త్వరలోనే సర్పంచ్ల నుంచి ఎమ్మెల్యే వరకూ శిక్షణా తరగతులు నిర్వహిస్తామని కేసీఆర్ తెలిపారు. ప్రజా ప్రతినిధుల శిక్షణా తరగతుల కోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సిద్ధమని ఆయన చెప్పారు. నెల రోజులుగా ప్రతిశాఖపై సమీక్ష జరిపామని, శాఖలవారీ సమీక్షలతో పూర్తి స్థాయి అవగాహన వచ్చినట్లు కేసీఆర్ పేర్కొన్నారు.  కొత్త రాష్ట్రంలో కొత్త పంథాతో ముందుకు వెళతామని తెలిపారు. తెలంగాణలో కుటుంబాలకు మించిన రేషన్ కార్డులు ఉన్నాయని, 22 లక్షల పైగా అదనపు కార్డులు జారీ చేసినట్లు చెప్పారు. ఇప్పుడున్న చట్టాలు ఉమ్మడి రాష్ట్రం కోసం చేసినవని అన్నారు.

పేదలకు డబుల్ బెడ్రూమ్లతో ఇళ్లు నిర్మించి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ పథకాల్లో అవకతవకలకు పాల్పడితే ఎంతటి వారిపైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. చిత్తశుద్ధితో నవ తెలంగాణ నిర్మించుకుందామని ఈ సందర్భంగా కేసీఆర్ పిలుపునిచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement