పక్కా ప్రణాళికతో... | Need Perfect plan for Nava Telangana: KCR | Sakshi
Sakshi News home page

పక్కా ప్రణాళికతో...

Published Tue, Jul 8 2014 1:13 AM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

పక్కా ప్రణాళికతో... - Sakshi

పక్కా ప్రణాళికతో...

 
 బంగారు తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీగా ముందుకెళదాం: కేసీఆర్
  అధికారులు, ప్రజాప్రతినిధులతో  ‘నవ తెలంగాణ సమాలోచన’
 గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి
  స్థానిక ప్రజాప్రతినిధులను 
  భాగస్వాములను చేయండి
  తెలంగాణ దృక్పథం, దృష్టితో 
  {పణాళికలు ఉండాలి..
  ఎక్కడా తప్పు జరగొద్దు.. బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధం కావాలి
  రైతు రుణ మాఫీ చేసి తీరుతాం.. వచ్చే కేబినెట్ భేటీలో నిర్ణయం
 
 ‘ప్లాన్ విలేజ్.. ప్లాన్ టౌన్.. ప్లాన్ సిటీ..’.. అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు  కొత్త నినాదమిది.
 
 ‘అంతా పక్కా ప్రణాళికతో, ఎక్కడా చిన్నతప్పు కూడా దొర్లకుండా పనులు జరగాలి..’.. అధికారులకు ఆయన సూచన ఇది.
 
 ‘ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకూ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి.. బంగారు తెలంగాణ కల సాకారం కావాలి..’.. తెలంగాణ సత్వర అభివృద్ధికి ఆదేశమిది..
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాలు, దృక్పథం, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు, మార్గదర్శకాలేవీ తెలంగాణ కోణంలో లేవని, ఇకపై తెలంగాణ రాష్ట్ర కోణంలోనే ప్రణాళికలు, అభివృద్ధి అంతా సాగాలని సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట సోమవారం జరిగిన మేధోమథనంలో కలెక్టర్లు, జేసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. శాఖల వారీగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు, ప్రభుత్వ శాఖలు తమ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రణాళికల రూపకల్పనలో వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని...  క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారంతోనే నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. హడావుడిలో చిన్న పొరపాటు జరిగినా తెలంగాణ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. నెలరోజుల్లో ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్న విమర్శలను పట్టించుకోనని, కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి రెండు మూడు నెలలు పడుతుందని పేర్కొన్నారు.
 
 ‘పంచాయతీ’ చెడిపోయింది..
 స్థానిక సంస్థలు, చట్టసభలకు యువకులు ఎక్కువగా ఎన్నికయ్యారని, వారు చెడుదారి పట్టకముందే.. వారిని రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని, దానిని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకప్పుడు ప్రజా భాగస్వామ్యం ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పుడు రాజకీయమయమైందన్నారు. కొత్త ప్రజా ప్రతినిధులందరికీ 15 రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే...
 
 ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం..
 తెలంగాణలోని 593 గ్రామాల్లో గృహ నిర్మాణంపై సర్వే చేస్తే.. ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే రూ. 235 కోట్ల దుర్వినియోగం జరిగింది. అంచనాలు, బిల్లులున్నాయి. ఇళ్లు మాత్రం లేవు. గృహ నిర్మాణ కుంభకోణంపై లోతుగా విచారణ  జరిపిస్తాం. దోషులు ఎవరైనా వదిలిపెట్టం. వారిని జైలుకు పంపించి తీరుతాం. రేషన్‌కార్డుల్లోనూ ఇవే అక్రమాలు. కుటుంబాల సంఖ్య కంటే.. 22 లక్షల కార్డులు అధికంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి. బియ్యం ఎక్కడకు పోతోంది. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. అంతా సరిచేస్తాం.
 
 బృందంగా ముందుకు సాగాలి..
 వ్యక్తులుగా మనం ఉన్నతస్థానాల్లోకి వెళుతున్నా, బృందంగా మనం విజయవంతం కాలేకపోతున్నాం. ఇకపై తెలంగాణలో బృందంగా ముందుకు సాగాల్సి ఉంది. ప్రతీ అంశాన్ని మైక్రో స్థాయి నుంచి మాక్రో స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎక్కడా ఒక్క అంశంలోనూ తప్పు జరగడానికి వీల్లేదు. రేపటి నుంచే ఈ విధానం అమలుకు క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కావాలి. సెప్టెంబర్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి.
 
 ‘ప్రణాళిక’లోనే ఎస్సీలకు బడ్జెట్..
 తెలంగాణ రాష్ట్రంలో 15.4 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులను 54 ప్రభుత్వ శాఖలకు ఇవ్వకుండా.. ఇకపై బడ్జెట్‌లో ‘ప్రణాళిక’ కింద  నేరుగా ఎస్సీ విభాగానికి కేటాయిస్తాం. ఉదాహరణకు 40 వేల కోట్ల ప్రణాళిక బడ్జెట్ అయితే.. అందులో 6,160 కోట్లను నేరుగా ఎస్సీ శాఖకు కేటాయిస్తాం. వారే కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడా నిధులు పక్కదారి పట్టడానికి వీలుండదు. అవసరమైతే సబ్‌ప్లాన్ చట్టంలో మార్పులు చేస్తాం.
 
 వృధా నిధుల లెక్కలు తీయండి..
 ఉమ్మడి రాష్ట్రంలో లేబర్‌సెస్ కింద దాదాపు వెయ్యి కోట్లు వసూలయింది. ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో తెలంగాణకు రూ. 600 కోట్ల వరకు రావచ్చు. ఈ విధంగా ఏయే శాఖల్లో నిధులు వినియోగించుకోకుండా ఉన్నాయో ఆ లెక్కలన్ని తీయండి. కేంద్రం నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి వినియోగ పత్రాల(యుసీలు)ను ఎప్పటికప్పుడు వెంటనే సమర్పించండి. తద్వారా కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు.
 
 6 వేల మెగావాట్ల ప్రాజెక్టులు చేపడతాం..
 రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించడానికి ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులను జెన్‌కో నిర్మిస్తుంది. అందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. ఈ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయింపు లేనందున విదేశీ బొగ్గు కొనుగోలు చేయక తప్పదు.
 
 మూడేళ్లలో 220 కోట్ల మొక్కలు నాటాలి..
 సాధారణంగా భూ విస్తీర్ణంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ప్రస్తుతం 25 శాతమే ఉంది. దానిని పెంచాలి. మూడే ళ్లలో 220 కోట్ల మొక్కలు పెంచాల్సి ఉంది. అభయారణ్యంలో వంద కోట్ల మొక్కల వేర్లు ఇంకా సజీవంగా ఉన్నందున, వాటిని పెంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 120 కోట్లు నాటి పెంచాలి. ఒక్క హెచ్‌ఎండీఏ పరిధిలోనే పదికోట్ల మొక్కలు పెంచాలి. రహదారుల పక్కన చెట్లతోపాటు పూలమొక్కలు పెంచాలి. ప్రతీ గ్రామంలో 33 వేల మొక్కలు ప్రతీ సంవత్సరం ఇంకా పెంచాలి. అడవుల పెంపకానికి కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం 1,100 కోట్లు జమ చేసింది. ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. 
 
 వచ్చే కేబినెట్ భేటీలో రుణమాఫీపై నిర్ణయం
 రైతులకు రుణ మాఫీని కచ్చితంగా అమలు చేస్తాం. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం. ప్రతీ రైతుకు చెందిన భూమి భూసార పరీక్షను ప్రభుత్వమే చేయాలి. మండల, జిల్లా స్థాయిలో భూసార పరీక్షల సమాచారం ఉండాలి. గ్రామం, మండలం, జిల్లా వారీగా పంట ప్రాంతాలుగా విభజించాలి. తెలంగాణ ప్రాంతంలో ఏది ఎక్కువ వినియోగం అవుతుందనే దాన్ని బట్టి ఆయా విత్తనాలను సిద్ధం చేయాలి. వ్యవసాయ శాఖలో విస్తరణాధికారులు రైతుల పొలాల్లోకి వెళ్లడం పూర్తిగా మరిచిపోయారు. వారు కేవలం విత్తనాలు, ఎరువుల పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. పాతతరం వ్యవసాయ విధానాల స్థానంలో కొత్త ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి,
 
 ఒక్కపైసా దుర్వినియోగం కావొద్దు..
 పేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పెన్షన్ ఇస్తాం. ఈ పథకాల్లో ఒక్క పైసా దుర్వినియోగం కావడానికి వీల్లేదు. గ్రామాలు, మండలాల వారీగా స్థానిక స్వపరిపాలన జరగాలి. స్వయం సమృద్ధి సాధించాలి. ఆర్థిక భారం లేని మంచి పథకాలు, విధానం గురించి ఆలోచించాలి. డబ్బు ఇస్తేనే పనులు చేస్తామనే భావన పోవాలి. బ్యూరోక్రటిక్ ధోరణి ఉండొద్దు. ప్రతీ గ్రామానికి ఒక డంప్ యార్డు, శ్మశాన వాటిక  ఉండాలి. పట్టణాలు, కార్పొరేషన్లలో మూడు నుంచి పది వరకు ఉండాలి.
 
 ప్రతి జిల్లాలో పరిశ్రమలు..
  తెలంగాణలో 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల ఏర్పాటు కోసం 2.20 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. జిల్లాలు, మండలాల వారీగా నివేదికలున్నాయి. ఒక్క వరంగల్‌లో మాత్రమే భూమి తక్కువగా ఉంది. ఇవి వ్యవసాయానికి ఉపయోగపడని భూములు. ప్రభుత్వ ఖజానా నిండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా... ఈ ప్రాంతాల్లో, ప్రతి జిల్లాలో పరిశ్రమలు పెట్టాలని కోరుదాం. వాటికి మౌలిక సదుపాయలు కల్పిద్దాం.
 
 చెరువులన్నీ ధ్వంసం చేశారు..
 ‘‘తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల కింద 1,200 టీఎంసీలు కేటాయించారు. అందులో చిన్న నీటిపారుదలకు కృష్ణా బేసిన్‌లో 90 టీఎంసీలు, గోదావరిలో 175 టీఎంసీలు కేటాయించారు. కానీ చెరువులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. ఇప్పుడు రెండు నదుల పరిధి నుంచి 65 టీఎంసీలు కూడా చెరువులు, కుంటల్లో నిండడం లేదు. యుద్ధ ప్రాతిపదికన చెరువులు, కుంటలను పునర్నిర్మించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఇకపై విధిగా తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ఎంత మొత్తం నీటి కేటాయింపులు చేసేదీ ముందుగానే నిర్ణయించాలి. దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. వెయ్యికోట్లతో చిన్న నీటిపారుదల రంగాన్ని యుద్ధ ప్రతిపాదికన సరిచేస్తాం. ఇందుకోసం ఉపాధి హామీ నిధులు వినియోగిస్తాం. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలు గోదావరి బేసిన్‌లో, దక్షిణ తెలంగాణలోని నాలుగు జిల్లాలు కృష్ణా బేసిన్‌లో ఉంటే.. ఖమ్మం, వరంగల్ జిల్లాలు మాత్రం ఇరు బేసిన్‌ల పరిధిలో ఉన్నాయి. జూరాల-పాకాల వరకు గురుత్వాకర్షణ ద్వారా నీటిని తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. గ్రావిటీ, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పాదకత పెంచుదాం. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిద్దాం. లెండి, కౌలాస్ నాలా పనులు చేపట్టాలి. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి.
 
 జిల్లాల పెంపునకు సూచనలు ఇవ్వండి
 తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచడంపై తగిన సూచనలు ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొత్తం ఒకే సారి జిల్లాల సంఖ్యను పెంచకుండా..దశల వారీగా జిల్లాల పెంపు ఉంటుందని చెప్పారు. జిల్లాల భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏయే ప్రాంతాలను కలిపి జిల్లాగా మార్చడానికి అవకాశం ఉందో పరిశీలించాలని సూచించారు. అలాగే పాలన మరింత పకడ్బందీగా కొనసాగడానికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement