MCRHRD
-
సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలకు అనుగుణంగా ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంపై ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. అందులో భాగంగా ఆదివారం మర్రి చెన్నారెడ్డి మానవవనరుల అభివృద్ధి కేంద్రాన్ని (ఎంసీఆర్హెచ్ఆర్డీ) సందర్శించారు. అక్కడి బోధన సిబ్బందితో సమావేశమయ్యారు. సంస్థ కార్యకలాపాల గురించి వాకబు చేశారు. ఉద్యోగులకు ఇస్తున్న శిక్షణ కార్యక్రమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డీజీ డాక్టర్ శశాంక్ గోయల్ సంస్థ కార్యకలాపాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా రేవంత్‌కు వివరించారు. అనంతరం సంస్థలోని వివిధ బ్లాకులను రేవంత్‌రెడ్డి సోలార్ పవర్ వాహనంలో కలియతిరుగుతూ పరిశీలించారు. సీఎం వెంట రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభి వృద్ధి, మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి సీతక్క, మాజీ మంత్రి షబ్బీర్ అలీ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్, వివిధ విభాగాల ఫ్యాకల్టీ సభ్యులు ఉన్నారు. ప్రగతిభవన్ రాచరికానికి చిహ్నంగా ఉందంటూ గతంలో విమర్శలు.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంగా ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని వినియోగించుకోవాలని భావిస్తున్నట్లు చర్చ జరుగుతోంది. అందులో భాగంగానే ఆయన ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనాన్ని సందర్శించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలవడంతో ముఖ్యమంత్రిగా అధికార బాధ్యతలు చేపట్టిన రేవంత్.. తన క్యాంపు కార్యాలయంగా మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌ను వినియోగించడానికి ఇష్టపడటం లేదని తెలిసింది. అందుకే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా జూబ్లీహిల్స్‌లోని సొంత ఇంట్లోనే రేవంత్ నివాసముంటున్నారు. రాచరికానికి చిహ్నంగా ప్రగతి భవన్ ఉందంటూ గతంలో విమర్శించిన రేవంత్.. అధికారంలోకి వచ్చాక దాని పేరును మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్‌గా మార్చారు. ఈ నేపథ్యంలో సీఎం క్యాంపు కార్యాలయం కోసం ప్రత్యామ్నాయ భవనాన్ని అన్వేషిస్తున్నట్లు తెలిసింది. సువిశాల స్థలంలో ఉన్న ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనంలో నివాసం ఉండేందుకు సకల సదుపాయాలు ఉండటం, భద్రతాపరంగా అనుకూలంగా ఉండటం, పెద్ద సంఖ్యలో వాహనాల పార్కింగ్ కోసం స్థలం ఉండటంతో అధికారులు దీని పేరునే ముఖ్యమంత్రికి సూచించినట్లు సమాచారం. ఒకవేళ ఎంసీఆర్హెచ్ఆర్డీని సీఎం క్యాంపు కార్యాలయంగా వినియోగిస్తే అక్కడ నిర్వహిస్తున్న శిక్షణ సంస్థను ప్రజాభవన్‌కు తరలించే అవకాశాలున్నట్లు తెలిసింది. ప్రభుత్వం దీనిపై త్వరలో ఓ నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. -
తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా ఎంసీఆర్హెచ్ఆర్డీ?
సాక్షి, హైదరాబాద్: ఎంసీఆర్హెచ్ఆర్డీ భవనం త్వరలో తెలంగాణ సీఎం క్యాంప్ ఆఫీస్‌గా మారనున్నట్లు సమాచారం. ఎంసీఆర్హెచ్ఆర్డీకి సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వెళ్లి పరిశీలించారు. సీఎం అధికారిక భవనంగా ఉన్న ప్రగతి భవన్‌ను ప్రజా భవన్‌గా మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి తన సొంత నివాసంలోనే ఉంటున్నారు. ప్రగతి భవన్నుప్రజాభవన్గా మారుస్తున్నట్లు, అక్కడే ప్రజాదర్బార్ నిర్వహించనున్నట్లు రేవంత్‌రెడ్డి ప్రకటించారు. ప్రజాభవన్‌గా మారిన ప్రగతి భవన్ ఎదుట సుదీర్ఘకాలంగా ఉన్న ఇనుప కంచెను జీహెచ్ఎంసీ అధికారులు తొలగించారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందే రేవంత్‌రెడ్డి ఇచ్చిన ఆదేశాలతో ఈ చర్యలు తీసుకున్నారు. -
ఫ్లిప్‌కార్ట్‌లో సెర్ప్ ఉత్పత్తులు
సాక్షి, హైదరాబాద్/బంజారాహిల్స్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఫుడ్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్(ఎఫ్‌పీవోలు), స్వయం సహాయక సంఘాల పంట ఉత్పత్తుల విక్రయానికి సంబంధించి ఆన్లైన్ సంస్థ ఫ్లిప్‌కార్ట్, రాష్ట్ర ప్రభుత్వ సంస్థ సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ(సెర్ప్) మధ్య ఒక ఒప్పందం కుదిరింది. శనివారం ఇక్కడి డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో జరిగిన ఈ కార్యక్రమానికి పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మంత్రి మాట్లాడుతూ తెలంగాణ పంట ఉత్పత్తు లను ఇన్నాళ్లూ ఇక్కడే అమ్ముకోవాల్సి వచ్చేదని, తాజా ఒప్పందం వల్ల అవి ఇప్పుడు దేశంలోని 40కోట్ల మంది ఫ్లిప్‌కార్ట్ వినియోగ దారులకు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఎఫ్‌పీవోలు రైతుల నుంచి నేరుగా ఉత్పత్తులు కొనుగోలు చేసి ఫ్లిప్‌కార్ట్‌కు అమ్ముతుండటం వల్ల దళారీ వ్యవస్థ అనేది లేకుండా పోతుందని, రైతులకు తగిన ధర లభించడంతోపాటు వినియోగదారుడికీ చౌకగా ఉత్పత్తులు అందుతాయని అన్నారు. 130 రకాల వస్తువు లను ఈ ఒప్పందంలో భాగంగా మహిళా సంఘాలు విక్రయిస్తా యని చెప్పారు. ఈ ఒప్పందం మహిళల సాధికారతకు ముందడుగు అని ఫ్లిప్‌కార్ట్ గ్రాసరీ విభాగపు వైస్ ప్రెసిడెంట్ స్మృతి రవిచంద్రన్ అన్నారు. ఫ్లిప్‌కార్ట్ అవసరాలకు తగ్గట్టు నాణ్యమైన సర కులు అందించగలమన్న ధీమాను స్వయం సహాయక సంఘాల మహిళలు వ్యక్తం చేశారని, రాష్ట్రమంతా తిరిగి చర్చలు జరిపిన తర్వాతే ఈ ఒప్పందం సిద్ధమైందని చెప్పారు. పంట ఉత్పత్తుల నాణ్యతను కాపాడుతూ వాటిని వినియోగదారులకు అందించేం దుకు ఫ్లిప్‌కార్ట్ ఇప్పటికే దాదాపు పదివేల మంది రైతులకు శిక్షణ ఇచ్చిందని తెలిపారు. కార్యక్రమంలో పీఆర్ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, సెర్ప్ సీఓఓ రజిత నార్దెల్ల పాల్గొన్నారు. -
కులవృత్తులను ప్రోత్సహించేలా కార్యక్రమాలు : మంత్రి హరీశ్
సాక్షి, హైదరాబాద్: కుల వృత్తులను ప్రోత్సహిం చేలా ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. పశుసంవర్థక, పాడి పరిశ్రమ, మత్స్యశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్యక్రమాలు, పథకాల అమలుపై అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌లు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌డీ)లో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఉచిత చేప పిల్లల పంపిణీ, సబ్సిడీపై గొర్రెల యూనిట్ల పంపిణీ, పాడి పశువుల పంపిణీ తదితర పథకాలపై పురోగతిని అధికారులను అడిగి తెలుసుకు న్నారు. పశు వైద్యశాలల ఆధునీకరణ, నూతన పశు వైద్యశాలల నిర్మాణం, రావిర్యాలలో నిర్మిస్తున్న మెగా డైరీ నిర్మాణ పనుల పురోగతిని సమీక్షించారు. సమావేశంలో ఆర్థిక శాఖ కార్యదర్శి రోనాల్డ్ రాస్, పశుసంవర్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అధర్ సిన్హా, మత్స్య శాఖ కమిషనర్ లచ్చిరాం భూక్యా, పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ రాంచందర్, డెయిరీ అధికారులు పాల్గొన్నారు. కొత్త మెడికల్ కాలేజీల పనులు త్వరగా పూర్తిచేయాలి గ్రామీణ ప్రాంత ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఇందులో భాగంగా కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఎనిమిది మెడికల్ కాలేజీల పనులు వేగంగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం ఎంసీహెచ్ఆర్డీలో వైద్య, ఆరోగ్య, ఆర్ అండ్ బీ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ వైద్య విద్యా సంవత్సరం నుంచే ఈ కాలేజీల్లో ఎంబీబీఎస్ అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ముఖ్య మంత్రి ఆదేశించిన నేపథ్యంలో అవసరమైన అన్ని చర్యలు యుద్ధప్రాతిపదికన చేపట్టాలని అన్నారు. సమీక్షలో ఆర్అండ్ బీ ఈఎన్సీ గణపతిరెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
PV Sindhu: భారత్ క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదగగలదు..
PV Sindhu Comments At MCRHRD: భారత బ్యాడ్మింటన్ స్టార్, డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్ పీవీ సింధుకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్ధ (ఎంసీఆర్హెచ్ఆర్డీ) డీజీ, ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి హర్‌ప్రీత్ సింగ్ జ్ఞాపిక అందజేశారు. గురువారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో జరిగిన కార్యక్రమంలో సివిల్ సర్వీసెస్, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ అధికారులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. ఆపై ముఖాముఖీ చర్చలో పాల్గొన్న సింధు...మన వద్ద అందుబాటులో ఉన్న ప్రతిభను చూస్తే భారత జట్టు క్రీడల్లో సూపర్ పవర్‌గా ఎదగగలదని, ఇందు కోసం తల్లిదండ్రులు, క్రీడా సంఘాలు సంయుక్తంగా చిన్నారులను ఆటల వైపు మళ్లించాలని సూచించారు. సెమీఫైనల్లో సాకేత్ జోడీ బెంగళూరు: రామ్‌కుమార్ రామనాథన్‌తో జతకట్టిన తెలుగు ఆటగాడు సాకేత్ మైనేని బెంగళూరు ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్లో సెమీ ఫైనల్లోకి అడుగుపెట్టాడు. ఈ జోడీ మినహా మిగతా భారత ఆటగాళ్లందరికీ సింగిల్స్, డబుల్స్‌లో చుక్కెదురైంది. డబుల్స్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన సాకేత్–రామ్‌కుమార్ జంటకు ప్రత్యర్థి జోడీ స్టీవెన్ డీజ్ (కెనడా)–మలెక్ జజిరి (ట్యునిషియా) నుంచి వాకోవర్ లభించింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో భారత ద్వయం... జే క్లార్క్ (బ్రిటన్)–మార్క్ పోల్మన్స్ (ఆ్రస్టేలియా)తో తలపడుతుంది. మరో క్వార్టర్స్‌లో బ్రిటన్–ఆ్రస్టేలియన్ జోడీ 6–2, 6–1తో భారత టాప్‌సీడ్ జీవన్ నెడుంజెళియన్–పూరవ్ రాజా జంటపై గెలిచింది. సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రజ్నేశ్ గుణేశ్వర్ 6–3, 2–6, 1–6తో టాప్‌సీడ్ జిరి వెసెలే (చెక్ రిపబ్లిక్) చేతిలో పరాజయం చవిచూశాడు. డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ ఎర్లెర్ (ఆస్ట్రియా)–విట్ కొప్రివా (చెక్ రిపబ్లిక్) 6–4, 6–3తో యూకీ బాంబ్రీ–దివిజ్ శరణ్ జంటపై నెగ్గింది. నాలుగో సీడ్ విష్ణువర్ధన్–శ్రీరామ్ బాలాజీ ద్వయం 4–6, 7–6 (7/2), 4–10తో హ్యూగో గ్రెనియర్–ముల్లెర్ (ఫ్రాన్స్) జోడీ చేతిలో ఓటమి పాలయ్యింది. చదవండి: Under 19 Vice Captain Shaik Rasheed: సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఆశీస్సులు తీసుకుంటా -
పంటల వైవిధ్యంతోనే ప్రగతి
సాక్షి, హైదరాబాద్: భారతీయ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా, సుస్థిరంగా, పర్యావరణ మార్పులను తట్టుకునేలా తీర్చిదిద్దేందుకు పంటల వైవిధ్యానికి పెద్దపీట వేయాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు సూచించారు. బుధవారం ఎంసీఆర్హెచ్ఆర్డీలో విశ్రాంత ఐసీఏఆర్ ఉద్యోగుల సంఘం, నూజివీడు సీడ్స్ లిమిటెడ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎమ్మెస్ స్వామినాథన్ అవార్డు ప్రదానోత్సవంలో ఉపరాష్ట్రపతి పాల్గొన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉప కులపతి డాక్టర్ వి.ప్రవీణ్ రావ్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఉప రాష్ట్రపతి మాట్లాడుతూ దేశీయ వ్యవసాయ రంగానికి అద్భుతమైన భవిష్యత్తు ఉందని.. కావాల్సిందల్లా ఈ రంగానికి సరైన సమయంలో అవసరమైన చేయూతను అందించాలని సూచించారు. రైతులకు సమయానుగుణ సూచనలు చేస్తూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. తృణధాన్యాల ఉత్పత్తిని మెల్లగా తగ్గిస్తూ పప్పు ధాన్యాలు, నూనె గింజలు, సిరి ధాన్యాల ఉత్పత్తి దిశగా రైతులను ప్రోత్సహించాలని కోరారు. బిందుసేద్యం, సూక్ష్మ సాగునీటి పద్ధతులను పాటిస్తూ సాగునీటి నిర్వహణ విషయంలో రైతులకు మార్గదర్శనం చేస్తూ.. వారు తమ పంట ఉత్పత్తులు పెంచుకునేలా చేయడంలో డాక్టర్ ప్రవీణ్ రావు కృషి చేశారని ఉపరాష్ట్రపతి అభినందించారు. భారత్‌లో వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంతోపాటు ప్రస్తుతం ప్రపంచ వ్యవసాయ రంగంలో దేశానికి గౌరవప్రదమైన స్థానాన్ని కల్పించే విషయంలో ప్రొఫెసర్ స్వామినాథన్ సేవలు చిరస్మరణీయమన్నారు. మన దేశంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఆయా వస్తువులను ఉత్పత్తి చేసే దిశగా రైతులను ప్రోత్సహించాలని సూచించారు. వ్యవసాయ కమతాల పరిమాణాలు తగ్గిపోతుండటం, వర్షంపై ఆధారపడటం, పరిమిత సాగునీటి సదుపాయాలు, సరైన సమయానికి వ్యవసాయ రుణాలు అందకపోవడాన్ని ప్రస్తావించారు. పంట ఉత్పత్తులకు ఊహించినంత మద్దతు ధర అందకపోవడం, అవసరమైనంత మేర శీతల గిడ్డంగుల వ్యవస్థ లేకపోవడం, సరైన మార్కెటింగ్ నెట్ వర్క్ లేమి తదితర అంశాల కారణంగా వ్యవసాయ ఉత్పత్తి ప్రభావితం అవుతోందన్నారు. ఈ సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవడం ద్వారా భారతీయ వ్యవసాయ రంగ శక్తి సామర్థ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి వీలవుతుందన్నారు. ఈ దిశగా మరింత పురోగతి సాధించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బృంద స్ఫూర్తితో పనిచేయాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి సూచించారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి, ఐసీఆర్ విశ్రాంత ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎంవీఆర్ ప్రసాద్, నూజివీడు సీడ్స్ చైర్మన్, ఎండీ ఎం.ప్రభాకర్ రావు పాల్గొన్నారు. రావత్ మృతికి సంతాపం ఈ కార్యక్రమం సాగుతుండగా బిపిన్ రావత్ మృతి గురించి తెలిసి సంతాప సూచకంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు. దేశ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్, సతీమణి మధులిక రావత్, ఇతర ఆర్మీ అధికారులు తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమని వెంకయ్య పేర్కొన్నారు. ప్రమాద ఘటన గురించి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకున్నామని చెప్పారు. బిపిన్ రావత్ సహా ఈ ఘటనలో మృతి చెందిన ఆర్మీ అధికారుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలిపారు. -
మార్పునకు ముందడుగు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి విడత పట్టణ ప్రగతి విజయవంతమైందని రాష్ట్ర పురపాలకశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రకటించారు. పట్టణాల్లో గుణాత్మక మార్పునకు తొలి అడుగుగా భావిస్తున్నామని, మార్పుదిశగా ఒక ముందడుగు పడిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు కలిసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారన్నారు. అది ముగిసిన అనంతరం పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. నగరంలోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో శుక్రవారం ఆయన జిల్లా అదనపు కలెక్టర్లతో సమావేశమై పట్టణ ప్రగతి కార్యక్రమం పురోగతిని సమీక్షించారు. -
అతిపెద్ద సోలార్ విద్యుత్ ప్లాంట్
బంజారాహిల్స్: రాష్ట్రంలోనే అతిపెద్ద రూఫ్‌టాప్ సోలార్ పవర్‌ప్లాంట్‌ను జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ (ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో నెలకొల్పారు. 2018లో 500 కిలో వాట్ల ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన ఈ సంస్థ తాజాగా 350 కిలోవాట్ల సామర్థ్యం గల మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేసింది. దీంతో రెండు కలిపి రాష్ట్రంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్‌గా నిలిచాయి. ఈ ప్లాంట్లు నెలకు రూ.9 లక్షల విద్యుత్ బిల్లులను ఆదా చేస్తున్నాయి. మొత్తంగా రూ.3.81 కోట్లు వెచ్చించి ప్లాంట్లు నెలకొల్పగా రూ.95 లక్షల (25 శాతం)ను జాతీయ పునరుత్పాదక ఇంధన వనరుల సంస్థ రీయింబర్స్ చేసింది. త్వరలో మరో 150 కిలోవాట్ల సామర్థ్యం గల రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడం ద్వారా 1,000 కిలోవాట్ల సామర్థ్యం గల ప్లాంట్‌గా మార్చనున్నట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. రూఫ్‌టాప్ సోలార్ నెట్ మీటరింగ్‌లో భాగంగా భవనాలపైగల సోలార్ ప్లాంట్ ను డిస్కం గ్రిడ్‌కు కనెక్షన్ ఇస్తారు. ఎవరి భవనాల పై ఉత్పత్తయిన విద్యుత్‌ను వారు వాడుకోవడానికి ఆస్కారం ఉండగా మిగిలిన విద్యుత్‌ను డిస్కంలకు విక్రయించాల్సి ఉంటుంది. సోలార్ ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను డిస్కంలు కొనుగోలు చేసి వినియోగదారులకు సరఫరా చేస్తాయి. ఇలా డిస్కంలు యూనిట్‌కు రూ.4.08 చొప్పున చెల్లిస్తాయి. -
పీవీఆర్కే ప్రసాద్ చిత్రపటం ఆవిష్కరణ
సాక్షి, హైదరాబాద్: మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ(ఎంసీఆర్హెచ్ఆర్డీ)లో మాజీ ఐఏఎస్ అధికారి పీవీఆర్కే ప్రసాద్ చిత్రపటాన్ని బుధవారం ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా పీవీఆర్కే ప్రసాద్ అనేక కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. ముఖ్యంగా మౌలిక వసతుల కల్పన, శిక్షణ వ్యవస్థను పటిష్టం చేశారని కొనియాడారు. ఈ ఏడాది ఆగస్టులో మరణించిన పీవీఆర్కే ప్రసాద్ 1998 నుంచి 2004 మధ్య ఎంసీఆర్హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్‌గా పనిచేశారు. -
ప్రజలు, ప్రభుత్వానికి వారథికండి
♦ సివిల్స్ ట్రైనీ అధికారులకు గవర్నర్ పిలుపు ♦ ఎంసీఆర్హెచ్ఆర్డీలో ఫౌండేషన్ శిక్షణను ప్రారంభించిన నరసింహన్ సాక్షి, హైదరాబాద్: సామాజిక, ఆర్థిక అసమానతలకు పరిష్కారం చూపగ లిగే సామర్థ్యం సివిల్ సర్వీసెస్ అధికారులకే ఉంటుం దని, కొత్తగా సర్వీసులోకి వచ్చిన అధికారులు ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారథిగా పనిచేయాలని గవర్నర్ నరసింహన్ పిలుపునిచ్చారు. ఆలిండియా సివిల్ సర్వీసెస్‌కు ఎంపికై 15 వారాల శిక్షణ నిమిత్తం ఇక్కడి ఎంసీఆర్హెచ్ఆర్డీకి వచ్చిన 120 మంది ట్రైనీ అధికారులకు సోమవారం ఫౌండేషన్ శిక్షణను గవర్నర్ ప్రారంభించా రు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘‘ప్రభుత్వం అందించే అభివృద్ధి ఫలాలను సమాజానికి దూరమైన వ్యక్తులకూ అందించాల్సిన బాధ్యత మీదే. సమాజం మీపై పెట్టుకున్న ఆశలను నెరవేర్చడమే మీ ముందున్న పెద్ద సవాల్’’ అని గవర్నర్ పేర్కొన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చే సాధారణ ప్రజలకు అధికారులు కొంత సమయాన్ని కేటాయించాలని...లేకుంటే అధికారులు, ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతుందన్నారు. అధికారులు తమ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వహించినంత కాలం ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఉద్యోగులకైనా, అధికారులకైనా ప్రభుత్వమిచ్చే జీత భత్యాలు సరిపోతాయని, జీవితాన్ని గడిపేందుకు అవి నీతికి పాల్పడాల్సిన అవసరం లేదన్నారు. పోలీసు అధికారులు మానవ హక్కుల ఉల్లంఘన జరగకుండా చూడాలన్నారు. అన్ని సర్వీసులూ ముఖ్యమైనవేనన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వీకే అగ్రవాల్ మాట్లాడుతూ ముఖ్యమైన అంశాలను ఇష్టపూర్వకంగా నేర్చుకొని సమాజం, దేశానికి మేలు జరిగేలా పనిచేయాలని ట్రైనీ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో కోర్సు సమన్వయకర్త అనితా బాలకృష్ణ, అదనపు కో ఆర్డినేటర్ ఆర్.మాధవి, అక డమిక్ అడ్వైజర్ విజయశ్రీ, జనరల్ మేనేజర్ రవీంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ కౌంటర్‌పై విచారణకు అంత నిర్లక్ష్యమా?
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సర్కార్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్ హెచ్ ఆర్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు ఎందుకు జ్యూడిషియల్ ఎంక్వైరీ వేయలేదని నిలదీసింది. ఎన్ కౌంటర్లో పాల్గొన్న పోలీసుల వివరాలను సమర్పించాలని ఆదేశించింది. దీంతో పోలీసులకు ఉచ్చు బిగిస్తున్నట్లవుతోంది. గురువారం ఎన్ హెచ్ ఆర్సీ డాక్టర్ మర్రి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ ఇన్స్టిట్యూట్ వద్ద పలు కేసులను విచారించింది. ముఖ్యంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌తోపాటు వికారుద్దీన్, గత ఏడాది కిషన్‌బాగ్ పోలీసులపై కాల్పుల విచారణ ప్రధానంగా చేసింది. ఈ సందర్భంగా శేషాచలం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి ఏపీ సర్కార్ తరుపున అడిషనల్ డీజీ లీగల్ ఎఫైర్స్ వినయ్ రంజన్ నివేదిక సమర్పించారు. కాగా, ఎన్ కౌంటర్ జరిగిన ప్రాంతానికి స్వయంగా వెళ్లి ఎన్ హెచ్ ఆర్సీ దర్యాప్తు చేయాలని నిర్ణయించుకొంది. ఈ సందర్భంగా పోలీసులు ఉపయోగించిన సెల్ నంబర్లనూ ఇవ్వాలని ఆదేశించింది. సమీపంలోని సెల్ టవర్ గుండా వెళ్లిన అన్ని కాంటాక్ట్ డిటెయిల్స్ ఇవ్వాలని ఆదేశించింది. -
పక్కా ప్రణాళికతో...
-
చంద్రబాబు ఇక్కడ అతిథి మాత్రమే
సాక్షి, హైదరాబాద్: శాంతిభద్రతల అంశం రాష్ట్రం పరిధిలోకి వస్తుందని, దానిని ఉల్లంఘించి గవర్నర్‌కు అధికారం కట్టబెట్టాలని చేసే ప్రయత్నాలను ఎట్టిపరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొందరు కావాలని ఇబ్బందులు సృష్టించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకుంటామని వెల్లడించారు సోమవారం ఆయన ఎంసీఆర్ హెచ్ఆర్డీ వద్ద మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలో కల్పించిన హక్కును మార్పు చేయడానికి వీల్లేదని, దీనిపై అవసరమైతే న్యాయపరంగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తే.. అభినందించాల్సింది పోయి ఏపీ సీఎం అభిప్రాయాలు చెప్పడం ఎందుకో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ భూములు, చెరువులు కాపాడటం తప్పా అని ఆయన ప్రశ్నించారు. గురుకుల్‌ట్రస్టు, అయ్యప్ప సొసైటీల్లో చంద్రబాబుకు బినామీ పేర్లతో భూములు ఏమైనా ఉన్నాయేమోనన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. హైటెక్ సిటీ పరిసరాల్లో ఆయనకు భూములున్న విషయాన్ని ఈ సందర్భంగా కేటీఆర్ ప్రస్తావించారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలపై పొరుగు రాష్ట్ర సీఎం స్పందించడం వింతగా ఉందన్నారు. చంద్రబాబు పదేళ్ల వరకు తెలంగాణ ప్రభుత్వ అతిథి మాత్రమేనని, ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదన్నారు. -
పక్కా ప్రణాళికతో...
బంగారు తెలంగాణ నిర్మాణానికి పకడ్బందీగా ముందుకెళదాం: కేసీఆర్ అధికారులు, ప్రజాప్రతినిధులతో ‘నవ తెలంగాణ సమాలోచన’ గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రాల వారీగా ప్రణాళికలు సిద్ధం చేయాలి స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయండి తెలంగాణ దృక్పథం, దృష్టితో {పణాళికలు ఉండాలి.. ఎక్కడా తప్పు జరగొద్దు.. బడ్జెట్ సమావేశాల నాటికి సిద్ధం కావాలి రైతు రుణ మాఫీ చేసి తీరుతాం.. వచ్చే కేబినెట్ భేటీలో నిర్ణయం ‘ప్లాన్ విలేజ్.. ప్లాన్ టౌన్.. ప్లాన్ సిటీ..’.. అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కొత్త నినాదమిది. ‘అంతా పక్కా ప్రణాళికతో, ఎక్కడా చిన్నతప్పు కూడా దొర్లకుండా పనులు జరగాలి..’.. అధికారులకు ఆయన సూచన ఇది. ‘ప్రభుత్వ యంత్రాంగంతో పాటు వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకూ అందరి భాగస్వామ్యంతో అభివృద్ధి జరగాలి.. బంగారు తెలంగాణ కల సాకారం కావాలి..’.. తెలంగాణ సత్వర అభివృద్ధికి ఆదేశమిది.. సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రాధాన్యాలు, దృక్పథం, అభివృద్ధి ప్రణాళికలు, సంక్షేమ పథకాలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు అధికార యంత్రాంగానికి స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టాలు, మార్గదర్శకాలేవీ తెలంగాణ కోణంలో లేవని, ఇకపై తెలంగాణ రాష్ట్ర కోణంలోనే ప్రణాళికలు, అభివృద్ధి అంతా సాగాలని సూచించారు. మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రం (ఎంసీహెచ్ఆర్డీ)లో ‘నవ తెలంగాణ సమాలోచన’ పేరిట సోమవారం జరిగిన మేధోమథనంలో కలెక్టర్లు, జేసీలు, ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి అధికారులతో కేసీఆర్ సుదీర్ఘంగా సమావేశమయ్యారు. శాఖల వారీగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం గ్రామ స్థాయి నుంచి రాష్ట్రం వరకు, ప్రభుత్వ శాఖలు తమ స్థాయిలో ప్రణాళికలు రూపొందించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్రణాళికల రూపకల్పనలో వార్డు సభ్యుడి నుంచి ఎంపీ వరకు ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలని సూచించారు. బంగారు తెలంగాణ నిర్మాణంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోబోమని... క్షేత్రస్థాయి నుంచి పూర్తి సమాచారంతోనే నిర్ణయాలు తీసుకుంటామని కేసీఆర్ చెప్పారు. హడావుడిలో చిన్న పొరపాటు జరిగినా తెలంగాణ తీవ్రంగా దెబ్బతింటుందని హెచ్చరించారు. నెలరోజుల్లో ప్రభుత్వం ఒక్క నిర్ణయం కూడా తీసుకోలేదన్న విమర్శలను పట్టించుకోనని, కొత్త ప్రభుత్వం నిలదొక్కుకోవడానికి రెండు మూడు నెలలు పడుతుందని పేర్కొన్నారు. ‘పంచాయతీ’ చెడిపోయింది.. స్థానిక సంస్థలు, చట్టసభలకు యువకులు ఎక్కువగా ఎన్నికయ్యారని, వారు చెడుదారి పట్టకముందే.. వారిని రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగస్వాములను చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. పంచాయతీ వ్యవస్థ పూర్తిగా చెడిపోయిందని, దానిని సంస్కరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఒకప్పుడు ప్రజా భాగస్వామ్యం ఉన్న పంచాయతీరాజ్ వ్యవస్థ ఇప్పుడు రాజకీయమయమైందన్నారు. కొత్త ప్రజా ప్రతినిధులందరికీ 15 రోజుల్లో శిక్షణా తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. సమావేశంలో కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే... ఇళ్ల నిర్మాణంలో భారీ కుంభకోణం.. తెలంగాణలోని 593 గ్రామాల్లో గృహ నిర్మాణంపై సర్వే చేస్తే.. ఒక్క ఇల్లు కూడా కట్టకుండానే రూ. 235 కోట్ల దుర్వినియోగం జరిగింది. అంచనాలు, బిల్లులున్నాయి. ఇళ్లు మాత్రం లేవు. గృహ నిర్మాణ కుంభకోణంపై లోతుగా విచారణ జరిపిస్తాం. దోషులు ఎవరైనా వదిలిపెట్టం. వారిని జైలుకు పంపించి తీరుతాం. రేషన్‌కార్డుల్లోనూ ఇవే అక్రమాలు. కుటుంబాల సంఖ్య కంటే.. 22 లక్షల కార్డులు అధికంగా ఉన్నాయి. ఇవి ఎక్కడ ఉన్నాయి. బియ్యం ఎక్కడకు పోతోంది. వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అవుతోంది. అంతా సరిచేస్తాం. బృందంగా ముందుకు సాగాలి.. వ్యక్తులుగా మనం ఉన్నతస్థానాల్లోకి వెళుతున్నా, బృందంగా మనం విజయవంతం కాలేకపోతున్నాం. ఇకపై తెలంగాణలో బృందంగా ముందుకు సాగాల్సి ఉంది. ప్రతీ అంశాన్ని మైక్రో స్థాయి నుంచి మాక్రో స్థాయి వరకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఎక్కడా ఒక్క అంశంలోనూ తప్పు జరగడానికి వీల్లేదు. రేపటి నుంచే ఈ విధానం అమలుకు క్షేత్రస్థాయిలో పని ప్రారంభం కావాలి. సెప్టెంబర్‌లో జరిగే బడ్జెట్ సమావేశాల నాటికి ఈ ప్రణాళిక సిద్ధం కావాలి. ‘ప్రణాళిక’లోనే ఎస్సీలకు బడ్జెట్.. తెలంగాణ రాష్ట్రంలో 15.4 శాతం మంది ఎస్సీలు ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద నిధులను 54 ప్రభుత్వ శాఖలకు ఇవ్వకుండా.. ఇకపై బడ్జెట్లో ‘ప్రణాళిక’ కింద నేరుగా ఎస్సీ విభాగానికి కేటాయిస్తాం. ఉదాహరణకు 40 వేల కోట్ల ప్రణాళిక బడ్జెట్ అయితే.. అందులో 6,160 కోట్లను నేరుగా ఎస్సీ శాఖకు కేటాయిస్తాం. వారే కార్యక్రమాలు చేపడతారు. ఎక్కడా నిధులు పక్కదారి పట్టడానికి వీలుండదు. అవసరమైతే సబ్‌ప్లాన్ చట్టంలో మార్పులు చేస్తాం. వృధా నిధుల లెక్కలు తీయండి.. ఉమ్మడి రాష్ట్రంలో లేబర్‌సెస్ కింద దాదాపు వెయ్యి కోట్లు వసూలయింది. ఆ నిధులు నిరుపయోగంగా ఉన్నాయి. ఇందులో తెలంగాణకు రూ. 600 కోట్ల వరకు రావచ్చు. ఈ విధంగా ఏయే శాఖల్లో నిధులు వినియోగించుకోకుండా ఉన్నాయో ఆ లెక్కలన్ని తీయండి. కేంద్రం నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించి వినియోగ పత్రాల(యుసీలు)ను ఎప్పటికప్పుడు వెంటనే సమర్పించండి. తద్వారా కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకోవచ్చు. 6 వేల మెగావాట్ల ప్రాజెక్టులు చేపడతాం.. రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది. దీనిని అధిగమించడానికి ఆరు వేల మెగావాట్ల సామర్థ్యం గల విద్యుత్ ప్రాజెక్టులను జెన్కో నిర్మిస్తుంది. అందుకు అవసరమైన కార్యాచరణ ఇప్పటికే మొదలైంది. ఈ ప్రాజెక్టులకు బొగ్గు కేటాయింపు లేనందున విదేశీ బొగ్గు కొనుగోలు చేయక తప్పదు. మూడేళ్లలో 220 కోట్ల మొక్కలు నాటాలి.. సాధారణంగా భూ విస్తీర్ణంలో 33 శాతం అటవీ ప్రాంతం ఉండాలి. ప్రస్తుతం 25 శాతమే ఉంది. దానిని పెంచాలి. మూడే ళ్లలో 220 కోట్ల మొక్కలు పెంచాల్సి ఉంది. అభయారణ్యంలో వంద కోట్ల మొక్కల వేర్లు ఇంకా సజీవంగా ఉన్నందున, వాటిని పెంచాలి. అలాగే రాష్ట్రవ్యాప్తంగా మరో 120 కోట్లు నాటి పెంచాలి. ఒక్క హెచ్ఎండీఏ పరిధిలోనే పదికోట్ల మొక్కలు పెంచాలి. రహదారుల పక్కన చెట్లతోపాటు పూలమొక్కలు పెంచాలి. ప్రతీ గ్రామంలో 33 వేల మొక్కలు ప్రతీ సంవత్సరం ఇంకా పెంచాలి. అడవుల పెంపకానికి కేంద్రం వద్ద తెలంగాణ ప్రభుత్వం 1,100 కోట్లు జమ చేసింది. ఆ నిధులు తిరిగి ఇవ్వాలని ప్రధానమంత్రిని కోరాం. వచ్చే కేబినెట్ భేటీలో రుణమాఫీపై నిర్ణయం రైతులకు రుణ మాఫీని కచ్చితంగా అమలు చేస్తాం. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనిపై నిర్ణయం ప్రకటిస్తాం. ప్రతీ రైతుకు చెందిన భూమి భూసార పరీక్షను ప్రభుత్వమే చేయాలి. మండల, జిల్లా స్థాయిలో భూసార పరీక్షల సమాచారం ఉండాలి. గ్రామం, మండలం, జిల్లా వారీగా పంట ప్రాంతాలుగా విభజించాలి. తెలంగాణ ప్రాంతంలో ఏది ఎక్కువ వినియోగం అవుతుందనే దాన్ని బట్టి ఆయా విత్తనాలను సిద్ధం చేయాలి. వ్యవసాయ శాఖలో విస్తరణాధికారులు రైతుల పొలాల్లోకి వెళ్లడం పూర్తిగా మరిచిపోయారు. వారు కేవలం విత్తనాలు, ఎరువుల పంపిణీకి మాత్రమే పరిమితమయ్యారు. పాతతరం వ్యవసాయ విధానాల స్థానంలో కొత్త ఆధునిక వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి, ఒక్కపైసా దుర్వినియోగం కావొద్దు.. పేదలకు ఇళ్లు, వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి, వికలాంగులకు రూ. 1,500 పెన్షన్ ఇస్తాం. ఈ పథకాల్లో ఒక్క పైసా దుర్వినియోగం కావడానికి వీల్లేదు. గ్రామాలు, మండలాల వారీగా స్థానిక స్వపరిపాలన జరగాలి. స్వయం సమృద్ధి సాధించాలి. ఆర్థిక భారం లేని మంచి పథకాలు, విధానం గురించి ఆలోచించాలి. డబ్బు ఇస్తేనే పనులు చేస్తామనే భావన పోవాలి. బ్యూరోక్రటిక్ ధోరణి ఉండొద్దు. ప్రతీ గ్రామానికి ఒక డంప్ యార్డు, శ్మశాన వాటిక ఉండాలి. పట్టణాలు, కార్పొరేషన్లలో మూడు నుంచి పది వరకు ఉండాలి. ప్రతి జిల్లాలో పరిశ్రమలు.. తెలంగాణలో 35 లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి అందుబాటులో ఉంది. పరిశ్రమల ఏర్పాటు కోసం 2.20 లక్షల ఎకరాల భూమి సిద్ధంగా ఉంది. జిల్లాలు, మండలాల వారీగా నివేదికలున్నాయి. ఒక్క వరంగల్‌లో మాత్రమే భూమి తక్కువగా ఉంది. ఇవి వ్యవసాయానికి ఉపయోగపడని భూములు. ప్రభుత్వ ఖజానా నిండాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా... ఈ ప్రాంతాల్లో, ప్రతి జిల్లాలో పరిశ్రమలు పెట్టాలని కోరుదాం. వాటికి మౌలిక సదుపాయలు కల్పిద్దాం. చెరువులన్నీ ధ్వంసం చేశారు.. ‘‘తెలంగాణకు కృష్ణా, గోదావరి నదుల కింద 1,200 టీఎంసీలు కేటాయించారు. అందులో చిన్న నీటిపారుదలకు కృష్ణా బేసిన్లో 90 టీఎంసీలు, గోదావరిలో 175 టీఎంసీలు కేటాయించారు. కానీ చెరువులను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేశారు. ఇప్పుడు రెండు నదుల పరిధి నుంచి 65 టీఎంసీలు కూడా చెరువులు, కుంటల్లో నిండడం లేదు. యుద్ధ ప్రాతిపదికన చెరువులు, కుంటలను పునర్నిర్మించాలి. నీటిపారుదల ప్రాజెక్టుల్లో ఇకపై విధిగా తాగునీరు, పరిశ్రమలు, వ్యవసాయ రంగాలకు ఎంత మొత్తం నీటి కేటాయింపులు చేసేదీ ముందుగానే నిర్ణయించాలి. దానికి అనుగుణంగా ప్రణాళిక ఉండాలి. వెయ్యికోట్లతో చిన్న నీటిపారుదల రంగాన్ని యుద్ధ ప్రతిపాదికన సరిచేస్తాం. ఇందుకోసం ఉపాధి హామీ నిధులు వినియోగిస్తాం. ఉత్తర తెలంగాణలోని నాలుగు జిల్లాలు గోదావరి బేసిన్లో, దక్షిణ తెలంగాణలోని నాలుగు జిల్లాలు కృష్ణా బేసిన్లో ఉంటే.. ఖమ్మం, వరంగల్ జిల్లాలు మాత్రం ఇరు బేసిన్ల పరిధిలో ఉన్నాయి. జూరాల-పాకాల వరకు గురుత్వాకర్షణ ద్వారా నీటిని తీసుకెళ్లడానికి అవకాశం ఉంది. గ్రావిటీ, ఎత్తిపోతల పథకాల ద్వారా సాగు విస్తీర్ణంతో పాటు ఉత్పాదకత పెంచుదాం. ఇచ్చంపల్లి ప్రాజెక్టు నిర్మిద్దాం. లెండి, కౌలాస్ నాలా పనులు చేపట్టాలి. చివరి దశలో ఉన్న ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి. జిల్లాల పెంపునకు సూచనలు ఇవ్వండి తెలంగాణలో జిల్లాల సంఖ్యను పెంచడంపై తగిన సూచనలు ఇవ్వాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. మొత్తం ఒకే సారి జిల్లాల సంఖ్యను పెంచకుండా..దశల వారీగా జిల్లాల పెంపు ఉంటుందని చెప్పారు. జిల్లాల భౌగోళిక స్వరూపం ఆధారంగా ఏయే ప్రాంతాలను కలిపి జిల్లాగా మార్చడానికి అవకాశం ఉందో పరిశీలించాలని సూచించారు. అలాగే పాలన మరింత పకడ్బందీగా కొనసాగడానికి, ప్రజలకు అవసరమైన సేవలు అందించడానికి వీలుగా జాయింట్ కలెక్టర్ల సంఖ్యను పెంచనున్నట్లు తెలిపారు. -
ముగిసిన కేసీఆర్ మేధోమధన సదస్సు!
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో నవ తెలంగాణ ఏర్పాటుపై నిర్వహించిన మేధోమథన సదస్సు ముగిసింది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల విభాగ క్యాంపస్ లో ఈ సదస్సు జరిగింది. ఈ సదస్సు ముగిసిన తర్వాత కేసీఆర్ మాట్లాడుతూ.. జూలై 12 నుంచి 17వరకు గ్రామస్థాయి సమావేశాలను నిర్వహిస్తామన్నారు. అలాగే ఆగస్టులో జిల్లా, రాష్ట్ర స్థాయి ప్రణాళికా సమావేశాలు జరుపాలని అధికారులకు సీఎం కేసిఆర్ సూచించారు. తెలంగాణ సమగ్ర అభివృద్ధిలో సర్పంచ్ నుంచి ఎంపీ వరకూ అందర్నీ భాగస్వామ్యం చేయాలన్నారు.ఇప్పటికే నెలరోజుల పాటు అన్ని శాఖలపై సమీక్ష జరిపానని కేసీఆర్ తెలిపారు. -
మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు: కేసీఆర్
హైదరాబాద్: సర్పంచ్ల నుంచి ఐఏఎస్ హోదా ఉండే ఉద్యోగులందరికి మర్రి చెన్నారెడ్డి మావనవనరుల విభాగంలోనే శిక్షణ ఇస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. బుధవారం మర్రిచెన్నారెడ్డి మానవ వనరులు విభాగం కార్యాలయాన్ని కేసీఆర్ సందర్శించడమే కాకుండా పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భూసేకరణ కోసం ఐదుగురితో మంత్రివర్గ ఉపసంఘ ఏర్పాటు చేస్తామని కేసీఆర్ అన్నారు. మెదక్, సిద్దిపేటలో పరిశ్రమలు స్థాపించేందుకు నిర్ణయం తీసుకున్నామని కేసీఆర్ మీడియాకు వెల్లడించారు. కేసీఆర్‌తో ఆస్ట్రేలియా ప్రతినిధులు భేటీ అయిన సంగతి తెలిసిందే. పరిశ్రమలను స్థాపించేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధులు ఉత్సాహం చూపినట్టు కేసీఆర్ వెల్డడించారు.