యువత చేతుల్లోనే.. | Formation of New Telangana in hands of Young people | Sakshi
Sakshi News home page

యువత చేతుల్లోనే..

Published Fri, Mar 21 2014 4:30 AM | Last Updated on Sat, Sep 2 2017 4:57 AM

యువత చేతుల్లోనే..

యువత చేతుల్లోనే..

నవ తెలంగాణ నిర్మాణంలో వారిదే కీలక పాత్ర
 కొత్త రాష్ట్రంలో సామాజిక అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరతలను నెలకొల్పే నిర్మాణాత్మక ప్రక్రియలో తెలంగాణ ప్రజలందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉంది. తమ ఆశయాలు ప్రభుత్వ అజెండాలో, విధాన ప్రక్రియలో భాగమ య్యేలా.. వేగంగా మార్పు చెందుతున్న రాజకీయ వ్యవస్థలో తమ వాణి కూడా వినిపించేలా.. సమ్మిళిత, ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ యువత కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. మరో విధంగా చెప్పాలంటే, తమపై ప్రభావం చూపే వ్యవస్థాపరమైన నిర్మాణాల సమగ్ర సంస్కరణల కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ‘ప్రెజర్ గ్రూప్’ బాధ్యతను కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడే ఆర్థికాభివృద్ధి కోసం.. తమ వాణిని వినిపించే విషయంలో, భాగస్వామ్యాన్ని కోరే విషయంలో తమ డిమాండ్లను పట్టించుకునే వ్యవస్థ కోసం పని చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగావకాశాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఆ ఉద్యోగాల వల్ల లభించే ఉద్యోగ భద్రత, అధిక వేతనాల వల్ల యువత ఆ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది.
 
 అదీకాక, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక తామేం చదవాలన్న విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతగా ఉండే డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి ఉపయోగ పడే డిగ్రీలు, లేదా వృత్తి నైపుణ్యాలు నేర్చుకునేందుకు వారు ప్రయత్నించడం లేదు. దాంతో మార్కెట్ అవసరాలకు.. విద్యార్థులు నేర్చుకుంటున్న నైపుణ్యాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. అందువల్ల ప్రైవేటు రంగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలనిచ్చే కోర్సులను రూపొందించే విధంగా ప్రభుత్వ విధానాలను యువత ప్రభావితం చేయాల్సి ఉంది. సంప్రదాయ విద్యా విధానంలో మార్పులు చేయడం ద్వారా కానీ, కొత్త కోర్సుల రూపకల్పన ద్వారా కానీ విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను పెంచే దిశగా ప్రభుత్వంపై యువత ఒత్తిడి తేవాల్సి ఉంది. ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా  నైపుణ్యాలను పెంచుకునే విషయంపై తెలంగాణ యువత దృష్టి పెట్టాలి.
 
 తెలంగాణ యువతలోని కొన్ని వర్గాల్లో స్వయం ఉపాధిపై, సొంతంగా పరిశ్రమలు స్థాపించడంపై ఆసక్తి ఉంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయంలో కూడా వాస్తవం ఉంది. అయితే, సరైన రుణ సదుపాయాలు కల్పించడంలో కానీ, వ్యాపార నిర్వహణలో సహకారం విషయంలో కానీ ఉన్న అనేక అడ్డంకులు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. వ్యాపారావకాశాల్లో, ఉద్యోగ కల్పనలో అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ రంగంపై యువత దృష్టి పెట్టాలి. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి. దీనివల్ల నిరుద్యోగ సంక్షోభానికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రభుత్వ సహాయంపై ఆధారపడటం కాకుండా, తమ జీవితాల్లో నిజమైన మార్పు రావడానికి యువత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినూత్న ఆవిష్కరణల అభివృద్ధిని నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారంగా భావించవచ్చు. నూతన అభివృద్ధిదాయక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం యువత సానుకూల చైతన్యంతో, అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది. ఆకలి, అభిలాష, స్ఫూర్తి, పట్టుదల, అద్భుత శక్తి కలిగిన యువత.. తెలంగాణ నవ నిర్మాణంలో తన వంతు పాత్ర కచ్చితంగా పోషించగలదు.
 
 ఆరు దశాబ్దాల పోరాటం ఫలించింది. 2014 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడ మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తమ ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపమైన బంగారు తెలంగాణను రూపొందించుకునేందుకు యువత పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది.
 - ప్రొఫెసర్ కె.స్టీవెన్‌సన్
 జర్నలిజం విభాగం
 ఉస్మానియా విశ్వవిద్యాలయం

 
 మార్పు కోసం పరితపిస్తారు
 ‘‘వచ్చే ఎన్నికల్లో యువతీ యువకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల లోపు యువకుల్లో సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంటుతో కూడిన భావోద్వేగాల ఆధారంగా వారు ఓట్లు వేసే అవకాశముంది. తమలా ఉండే నాయకుని వైపే వారు మొగ్గుతారు. వారికి కులం, మతం పట్టవు. సమాజం కోసం పాటుపడే వారికి మాత్రమే ఓటు వేస్తారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు.  
 - ఎ.వి.రంగనాథ్, ఎస్పీ, ఖమ్మం జిల్లా
 
 స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు
 ‘‘యువ ఓటర్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మిన పార్టీకే నిర్భయంగా ఓటేస్తారు. సుపరిపాలను, జవాబుదారీతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు.  పార్టీ కంటే ముఖ్యంగా నేతను చూసి ఓటేసే అవకాశముంది. అభ్యర్థి నచ్చకపోతే ‘నోటా’ మీట నొక్కేవారిలో యువకులే అధికంగా ఉంటారు’’
                                                                                                                                                                                                                                                                                                                                  - సిద్ధార్థ జైన్, కలెక్టర్,  పశ్చిమగోదావరి జిల్లా
 
 ఆలోచించి ఓటేస్తారు
 ‘‘సాధారణ ఓటర్లు ప్రలోభాలకు గురవుతుంటారు. కానీ యువతీ యువకులు మాత్రం అలాగాక మంచీ చెడు ఆలోచిస్తారు. ఎవరు సరైన నాయకుడో పరిశీలించి ఓటేస్తారు. దీనివల్ల మనం సరైన నాయకత్వాన్ని చూసే అవకాశముంటుంది’’
 -  డాక్టర్ నిఖిత, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాద్
 
 ‘రెడీమేడ్’తో బతుకు ఛిద్రం
 వృత్తిపథం: స్వర్ణకారులు
 మేం చేసే ఆభరణాలు మగువల ఒంటిపై మెరుస్తాయి గానీ మా బతుకులు మాత్రం మెరవడం లేదు. మార్కెట్లోకి వస్తున్న రెడీమేడ్ వస్తువులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీలు సైతం నగల దుకాణాలు ప్రారంభించడంతో మా బతుకులు దుర్భరం గా మారుతున్నాయి. ఎవరూ మా సమస్యలను పట్టించు కున్న పాపాన పోవడం లేదు. మా సామాజిక వర్గం నుంచి ఏ పార్టీలోనూ గట్టి ప్రతినిధి లేకపోవడం వల్ల మా సమ స్యలు బయటకు రాకుండా పోతున్నాయి. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత మా సమస్యలు చెప్పేందుకు వెళ్తే కనీసం కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న రెడీమేడ్ ఆభరణాలతో మేం పోటీ పడలేక పోతున్నాం.
 
 దాంతో పూట గడవక పస్తులుండాల్సి వస్తోంది. ప్రస్తుతం బంగారం పనులు లేక వెండి పనులు చేస్తూ పొట్టపోసు కుంటున్నాం. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్‌లో మా దుకాణాలు కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదు. సంప్రదాయ ఆభరణాలపై మోజు తగ్గిన మహిళలు తేలికపాటి మిషన్ తయారీ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. దాంతో ఉపాధి లేక, వేరే పని చేయలేక రోడ్డన పడాల్సిన దుస్థితి దాపురించింది. ఇంత నరకం అనుభవిస్తున్నా కనీసం మా గురించి మాట్లాడేవారే కరువవడం మాకు బాధగా ఉంది.
 - టి.వెంకటాచారి, వనపర్తి, మహబూబ్‌నగర్  
 
 యూత్ పార్టీ
 తిరుగుబాటు స్వభావం గల కొందరు యువకులు అమెరికాలో ఈ పార్టీని 1967లో ప్రారంభించారు. ఈ పార్టీ కార్యకర్తలను ‘యిప్పీ’లనే వారు. అమెరికా అధ్యక్ష పదవికి 1968లో జరిగిన ఎన్నికల్లో అడవి పందిని అభ్యర్థిగా బరిలోకి దించి ఈ పార్టీ అందరి దృష్టినీ ఆకర్షించింది. పేరుకు ఇది రాజకీయ పార్టీయే అయినా, చిత్ర విచిత్ర విన్యాసాలతో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నాలు, విచిత్రమైన నిరసనల ద్వారానే ప్రచారంలోకి వచ్చింది.
 
 పాతికేళ్లకే ఎమ్మెల్యే
 అప్పుడు ఆమె వయసు  కేవలం 25 ఏళ్లు. డాక్టరు కోర్సు చదివి ప్రజా సేవ చేద్దామనుకున్నారు. అనుకోని విధంగా నేతగా మారి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. దేశంలోనే పిన్నవయసు ఎమ్మె ల్యేగా గుర్తింపు పొందారు. ఆమే డాక్టర్ బాణోతు చంద్రావతి.  ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా ఆమె స్వగ్రామం. లంబాడా (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబం మొదటి నుంచి సీపీఐలో ఉంది. ఆమె తండ్రి రామ్మూర్తి ఆర్టీసీలో డిపో మేనేజర్. తాతయ్య బీక్యా నాయక్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. జిల్లా కమ్యూనిస్టు యోధుడు రజబ్ అలీకి శిష్యుడుగా గుర్తింపు పొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో వైరా ఎస్టీ వర్గానికి రిజర్వ్ కావడంతో బీక్యా నాయక్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దాంతో విద్యాధికురాలు అయిన చంద్రావతికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిం చారు. అప్పుడే ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. వెంటనే ఆమెను పార్టీ సంప్రదించడం... ఆమె అంగీకరించడం... పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడం... విజయం సాధించడం.. అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సురేశ్‌ను ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు.
 - సాక్షి ప్రతినిధి, ఖమ్మం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement