Telugu youth leaders
-
పేకాట ఆడుతూ పట్టుబడ్డ తెలుగు యువత నాయకుడు
నరసరావుపేట రూరల్: పేకాట శిబిరం నిర్వహిస్తూ తెలుగుయువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ నరసరావుపేట రూరల్ పోలీసులకు పట్టుబడ్డాడు. అతనితోపాటు మరో నలుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రూ.76,500ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను మంగళవారం న్యాయస్థానం ఎదుట హాజరుపర్చినట్టు రూరల్ ఎస్ఐ బాలనాగిరెడ్డి తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలుగు యువత రాష్ట్ర ఉపాధ్యక్షుడు శాఖమూరి మారుతీ కొంతకాలంగా పట్టణ శివారు సత్తెనపల్లిరోడ్డు సాయినగర్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని పేకాట శిబిరం నిర్వహిస్తున్నాడు. సమాచారం అందుకున్న రూరల్ పోలీసులు సోమవారం అర్ధరాత్రి పేకాట శిబిరంపై దాడులు నిర్వహించారు. అక్కడ జూద స్థావరం నిర్వహిస్తున్న మారుతీతోపాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నగదు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. కొన్నేళ్లుగా మారుతీ జూదాన్ని వృత్తిగా ఎంచుకొని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ మారుతీ పట్టుబడడంతో అతనిపై నరసరావుపేట రూరల్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వినుకొండ, నరసరావుపేట, సత్తెనపల్లి, చిలకలూరిపేటల నుంచి టీడీపీ నాయకులు మారుతీ ఆధ్వర్యంలో నిర్వహించే జూద శిబిరంలో పాల్గొనే వారని సమాచారం. -
చదువుల కల చెదురుతోంది..
‘ఉన్నత చదువులు ‘ఉన్న’వారికే పరిమితం కాకూడదు.. చదువుకునే పేద విద్యార్థికి ఫీజులు భారం కావద్దు.. డాక్టర్, ఇంజినీర్ వంటి చదువులు అన్ని వర్గాలకు దక్కాలి!’ - డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ హయాంలో.. 2008-09లో మారిన దశ * ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన వెంటనే వైఎస్ రాజశేఖరరెడ్డి విద్యార్థుల సమస్యలపై దృష్టిపెట్టారు. * పోస్టు మెట్రిక్ స్కాలర్షిప్పులు, మెస్ చార్జీల కోసం భారీ మొత్తంలో బడ్జెట్ కేటాయిస్తూ విడుదల చేయించారు. * బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు సంబంధించి 2004-05 ఆర్థిక సంవత్సరంలోనే రూ.386.37 కోట్ల బడ్జెట్ కేటాయించి, రూ.409.34 కోట్ల మేర విడుదల చేశారు. * 2005-06లో రూ.409.07 కోట్లు, 2006-07లో రూ.609.91 కోట్లు, 2007-08లో రూ.883.74 కోట్లు విద్యార్థుల కోసం విడుదల చేశారు. * విద్యార్థులకు స్కాలర్షిప్పులు, మెస్ చార్జీలు ఏయేటికాయేడు పెంచుతూ విడుదల చేస్తున్నప్పటికీ సంతృప్త (శాచ్యురేషన్) పద్ధతిలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలతోపాటు వికలాంగులైన విద్యార్థులందరికీ లబ్ధి చేకూర్చాలన్న లక్ష్యంతో ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని ప్రారంభించారు. * ఉన్నత విద్యకు దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్క విద్యార్థీ ఎలాంటి ఫీజుల భారమూ లేకుండా విద్యను అభ్యసించడమే ఈ పథకం లక్ష్యం. ఇది విజయవంతం కావడంతో ఈబీసీ విద్యార్థులకు సైతం 2009-10 నుంచి అమలు చేశారు. * 2008-09 బడ్జెట్లో ఫీజు రీయింబర్స్‌మెంటుకు రూ.1373 కోట్లు కేటాయించిన ఆయన, ఏకంగా రూ.1565.37 కోట్లు విడుద ల చేశారు. * 2009-10 బడ్జెట్లో రూ.2,333.04కోట్లు కేటాయించారు. అయితే 2009 సెప్టెంబరు 2న ఆయన హఠాన్మరణం అనంతరం పథకంపై నీలినీడలు అలుముకున్నాయి. (పోలంపెల్లి ఆంజనేయులు) వైఎస్ సీఎం కాకముందు: ఉన్నతవిద్య మార్కెట్ వస్తువు. కొనుక్కుంటేనే దొరికేది. పేద విద్యార్థులకు అందని ద్రాక్ష. ఆశ, ఆసక్తి, అర్హత ఉన్నా.. ఆర్థిక భారంతో ఆ దిశగా ఆలోచించలేని అశక్తత వారిది. వైఎస్ సీఎం అయ్యాక: పేద విద్యార్థులందరికీ, వారిపై ఎలాంటి ఆర్థిక భారం మోపకుండానే, వారు కోరుకున్న ఉన్నత విద్యను అందించే లక్ష్యంతో ఫీజు రీయింబర్సమెంట్ పథకాన్ని ప్రారంభం. లక్షలాది విద్యార్థుల భవితకు బంగారు బాటలు. వైఎస్ మరణానంతరం: పాలకులు ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని యథాశక్తి నీరుగార్చారు. అడ్డగోలు నిబంధనలతో ఫీజు రీయింబర్స్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునేందుకే విద్యార్థులు భయపడేలా చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లోనూ చిన్నచూపే. వైఎస్‌ను మర్చిపోలేను.. మాది నిరుపేద నేత కుటుంబం. నాన్న లక్ష్మీనారాయణ చిన్న కిరాణకొట్టు నడుపుతూ నన్ను చదివించారు. అమ్మ బీడీలు చుడుతుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువు ఆపేద్దామనుకుంటున్న సమయంలో వైఎస్సార్ ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ నాలో చదువుకోవాలన్న ఆశను బతికించింది. దాంతో కరీంనగర్లో ఇంజనీరింగ్ పూర్తి చేశా. సిరి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉద్యోగం సంపాదించి ప్రస్తుతం ట్రెనింగ్‌లో ఉన్నా. ఎంటెక్ చేసి లెక్చరర్‌గా స్థిరపడాలనేది నా కోరిక. రీయింబర్సమెంట్ పథకం లేకుంటే నా భవిష్యత్ ఏమై పోయేదో తలచుకుంటేనే భయమేస్తుంది. వైఎస్‌ను ఎన్నటికీ మర్చిపోలేను. - గోనె లావణ్య, పద్మనగర్, సిరిసిల్ల వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆలోచనలు అధికారంలోకి రాగానే ఫీజు రీయింబర్స్మెంట్ పథకానికి సంబంధించి ప్రస్తుతమున్న ఆంక్షలను, పరిమితులను తొలగించడం చదువుకునే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, మైనారిటీ, వికలాంగ వర్గాలకు చెందిన ప్రతి పేద విద్యార్థికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే లక్ష్యం. * వైఎస్ఆర్ ప్రారంభించిన శాచ్యురేషన్(ప్రతి విద్యార్థికీ అందించే) పద్ధతి అమలు * బడ్జెట్ పరిమితులు ఉండబోవు. భారమెంతైనా పథకాన్ని అమలు చేసి తీరడం. * ఈ విషయాన్ని ఇటీవల జరిగిన వైఎస్ఆర్సీపీ ప్లీనరీలో పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. రోశయ్య, కిరణ్‌ల పాలనలో.. భారం తగ్గించుకునే లక్ష్యంతో ఆధార్ కార్డు, బయోమెట్రిక్ విధానం.. తదితర కొత్త నిబంధనలతో పథకానికి తూట్లు పొడిచారు. * 2009-10 బడ్జెట్లో వైఎస్ ప్రభుత్వం రూ.2,333.04 కోట్లు ఫీజు రీయింబర్స్‌మెంటుకు కేటాయిస్తే, వైఎస్ మరణం తరువాత ముఖ్యమంత్రి పదవి చేబట్టిన రోశయ్య కేవలం రూ.1686.19 కోట్లు మాత్రమే విడుదల చేసి, లక్షలాది మంది విద్యార్థులకు మొండిచేయి చూపారు. అప్పటినుంచి కొత్త బడ్జెట్లో కేటాయించిన నిధులను పాత సంవత్సరం తాలూకు బకాయిల చెల్లింపులకు ఖర్చు చేస్తూ వస్తున్నారు. * 2010-11లో రూ.2726 .04 కోట్లు బడ్జెట్లో కేయించినా, విడుదలైన మొత్తం రూ.997 కోట్లు మాత్రమే. ఇవి కూడా పాత బకాయిలకే సరిపోయాయి. * 2011 వచ్చే సరికి విద్యార్థుల సంఖ్య మరింత పెరిగింది. ఫీజు రీయింబర్స్మెంట్ మొత్తాన్ని పెంచాల్సి వచ్చింది. అయితే 2011లో అధికారంలోకి వచ్చిన కిరణ్‌కుమార్ రెడ్డి 2011-12 బడ్జెట్లో రూ.2,913 కోట్లు కేటాయించి రూ. 2,600 కోట్లు విడుదల చేశారు. ఈ మొత్తం పాత బకాయిలకే పోగా, 2012-13 విద్యా సంవత్సరంలో కేటాయించిన రూ.3,621 కోట్ల బడ్జెట్ నుంచి దాదాపు రూ.3,000 కోట్లు అంతకు ముందు విద్యా సంవత్సరం విద్యార్థులకు చెల్లించాల్సి వచ్చింది. * 2013-14 (ప్రస్తుత) సంవత్సరానికి కేటాయించిన రూ.4,282 కోట్ల నుంచి పాత బకాయిలు సర్దారు. గత ఏడాదితో పోలిస్తే దరఖాస్తుల నమోదు సంఖ్య తగ్గింది. * ఈ సంవత్సరం ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న 26.58 లక్షల మందికి రూ. 4,500 కోట్లు అవసరమవుతాయి. మార్చి 31లోగా బడ్జెట్ విడుదల చేయాల్సి ఉండగా ఇప్పటి వరకు దరఖాస్తుల పరిశీలనే పూర్తి కాలేదు. * మొత్తం 26.58 లక్షల దరఖాస్తుల్లో ఇప్పటి వరకు కేవలం 15.81 లక్షల దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. అదీ లోపభూయిష్టంగా ఉంది. ప్రస్తుతం ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం వద్ద ఉన్న నిధులు రూ.1,800 కోట్లు మాత్రమే. వాటిలో రూ.1,350 కోట్లకు బిల్లులు తయారైనట్టు అధికారులు చెపుతున్నారు. -
యువత చేతుల్లోనే..
నవ తెలంగాణ నిర్మాణంలో వారిదే కీలక పాత్ర కొత్త రాష్ట్రంలో సామాజిక అనుబంధాలను బలోపేతం చేయడంతో పాటు ఆర్థికాభివృద్ధి, రాజకీయ సుస్థిరతలను నెలకొల్పే నిర్మాణాత్మక ప్రక్రియలో తెలంగాణ ప్రజలందరినీ కలుపుకొని పోవాల్సిన బాధ్యత తెలంగాణ యువతపై ఉంది. తమ ఆశయాలు ప్రభుత్వ అజెండాలో, విధాన ప్రక్రియలో భాగమ య్యేలా.. వేగంగా మార్పు చెందుతున్న రాజకీయ వ్యవస్థలో తమ వాణి కూడా వినిపించేలా.. సమ్మిళిత, ప్రజాస్వామిక పద్ధతిలో తెలంగాణ యువత కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉంది. మరో విధంగా చెప్పాలంటే, తమపై ప్రభావం చూపే వ్యవస్థాపరమైన నిర్మాణాల సమగ్ర సంస్కరణల కోసం వారు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేలా ‘ప్రెజర్ గ్రూప్’ బాధ్యతను కొనసాగించాల్సి ఉంది. ముఖ్యంగా నూతన ఉద్యోగాల కల్పనకు ఉపయోగపడే ఆర్థికాభివృద్ధి కోసం.. తమ వాణిని వినిపించే విషయంలో, భాగస్వామ్యాన్ని కోరే విషయంలో తమ డిమాండ్లను పట్టించుకునే వ్యవస్థ కోసం పని చేయాల్సి ఉంది. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఉద్యోగావకాశాల్లో తగ్గుదల ఉన్నప్పటికీ.. ఆ ఉద్యోగాల వల్ల లభించే ఉద్యోగ భద్రత, అధిక వేతనాల వల్ల యువత ఆ ఉద్యోగాలు సంపాదించేందుకు ఎక్కువగా ఇష్టపడుతుంది. అదీకాక, ప్రభుత్వ ఉద్యోగం చేయాలన్న కోరిక తామేం చదవాలన్న విషయాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హతగా ఉండే డిగ్రీ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి చూపుతున్నారే కానీ ప్రైవేటు రంగ ఉద్యోగాలకు, స్వయం ఉపాధికి ఉపయోగ పడే డిగ్రీలు, లేదా వృత్తి నైపుణ్యాలు నేర్చుకునేందుకు వారు ప్రయత్నించడం లేదు. దాంతో మార్కెట్ అవసరాలకు.. విద్యార్థులు నేర్చుకుంటున్న నైపుణ్యాలకు మధ్య చాలా అంతరం ఉంటోంది. అందువల్ల ప్రైవేటు రంగ మార్కెట్‌కు అవసరమైన నైపుణ్యాలనిచ్చే కోర్సులను రూపొందించే విధంగా ప్రభుత్వ విధానాలను యువత ప్రభావితం చేయాల్సి ఉంది. సంప్రదాయ విద్యా విధానంలో మార్పులు చేయడం ద్వారా కానీ, కొత్త కోర్సుల రూపకల్పన ద్వారా కానీ విద్యార్థుల వృత్తి నైపుణ్యాలను పెంచే దిశగా ప్రభుత్వంపై యువత ఒత్తిడి తేవాల్సి ఉంది. ప్రపంచీకరణ ప్రయోజనాలను అందిపుచ్చుకునే విధంగా నైపుణ్యాలను పెంచుకునే విషయంపై తెలంగాణ యువత దృష్టి పెట్టాలి. తెలంగాణ యువతలోని కొన్ని వర్గాల్లో స్వయం ఉపాధిపై, సొంతంగా పరిశ్రమలు స్థాపించడంపై ఆసక్తి ఉంది. దానివల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయనే విషయంలో కూడా వాస్తవం ఉంది. అయితే, సరైన రుణ సదుపాయాలు కల్పించడంలో కానీ, వ్యాపార నిర్వహణలో సహకారం విషయంలో కానీ ఉన్న అనేక అడ్డంకులు వారిని వెనకడుగు వేసేలా చేస్తున్నాయి. వ్యాపారావకాశాల్లో, ఉద్యోగ కల్పనలో అభివృద్ధికి అవకాశం ఉన్న ఈ రంగంపై యువత దృష్టి పెట్టాలి. చిన్న, మధ్య తరహ పరిశ్రమల స్థాపనకు నడుం కట్టాలి. దీనివల్ల నిరుద్యోగ సంక్షోభానికి కూడా సమాధానం లభిస్తుంది. ప్రభుత్వ సహాయంపై ఆధారపడటం కాకుండా, తమ జీవితాల్లో నిజమైన మార్పు రావడానికి యువత వినూత్నంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వినూత్న ఆవిష్కరణల అభివృద్ధిని నిరుద్యోగ సంక్షోభానికి పరిష్కారంగా భావించవచ్చు. నూతన అభివృద్ధిదాయక తెలంగాణ రాష్ట్ర నిర్మాణం కోసం యువత సానుకూల చైతన్యంతో, అప్రమత్తతతో వ్యవహరించాల్సి ఉంది. ఆకలి, అభిలాష, స్ఫూర్తి, పట్టుదల, అద్భుత శక్తి కలిగిన యువత.. తెలంగాణ నవ నిర్మాణంలో తన వంతు పాత్ర కచ్చితంగా పోషించగలదు. ఆరు దశాబ్దాల పోరాటం ఫలించింది. 2014 నుంచి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మనుగడ మొదలు పెట్టనుంది. ఈ నేపథ్యంలో తమ ఆశలకు, ఆశయాలకు ప్రతిరూపమైన బంగారు తెలంగాణను రూపొందించుకునేందుకు యువత పోషించాల్సిన పాత్ర, అనుసరించాల్సిన వ్యూహం ఏమిటనే ప్రశ్న తలెత్తుతోంది. - ప్రొఫెసర్ కె.స్టీవెన్సన్ జర్నలిజం విభాగం ఉస్మానియా విశ్వవిద్యాలయం మార్పు కోసం పరితపిస్తారు ‘‘వచ్చే ఎన్నికల్లో యువతీ యువకుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. 30 ఏళ్ల లోపు యువకుల్లో సహజంగా భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. సెంటిమెంటుతో కూడిన భావోద్వేగాల ఆధారంగా వారు ఓట్లు వేసే అవకాశముంది. తమలా ఉండే నాయకుని వైపే వారు మొగ్గుతారు. వారికి కులం, మతం పట్టవు. సమాజం కోసం పాటుపడే వారికి మాత్రమే ఓటు వేస్తారు. యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు. - ఎ.వి.రంగనాథ్, ఎస్పీ, ఖమ్మం జిల్లా స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు ‘‘యువ ఓటర్లు స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటారు. నమ్మిన పార్టీకే నిర్భయంగా ఓటేస్తారు. సుపరిపాలను, జవాబుదారీతనాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. పార్టీ కంటే ముఖ్యంగా నేతను చూసి ఓటేసే అవకాశముంది. అభ్యర్థి నచ్చకపోతే ‘నోటా’ మీట నొక్కేవారిలో యువకులే అధికంగా ఉంటారు’’ - సిద్ధార్థ జైన్, కలెక్టర్, పశ్చిమగోదావరి జిల్లా ఆలోచించి ఓటేస్తారు ‘‘సాధారణ ఓటర్లు ప్రలోభాలకు గురవుతుంటారు. కానీ యువతీ యువకులు మాత్రం అలాగాక మంచీ చెడు ఆలోచిస్తారు. ఎవరు సరైన నాయకుడో పరిశీలించి ఓటేస్తారు. దీనివల్ల మనం సరైన నాయకత్వాన్ని చూసే అవకాశముంటుంది’’ - డాక్టర్ నిఖిత, ఉస్మానియా ఆసుపత్రి, హైదరాబాద్ ‘రెడీమేడ్’తో బతుకు ఛిద్రం వృత్తిపథం: స్వర్ణకారులు మేం చేసే ఆభరణాలు మగువల ఒంటిపై మెరుస్తాయి గానీ మా బతుకులు మాత్రం మెరవడం లేదు. మార్కెట్లోకి వస్తున్న రెడీమేడ్ వస్తువులు మా బతుకులను ఛిద్రం చేస్తున్నాయి. దీనికి తోడు పెద్దపెద్ద కంపెనీలు సైతం నగల దుకాణాలు ప్రారంభించడంతో మా బతుకులు దుర్భరం గా మారుతున్నాయి. ఎవరూ మా సమస్యలను పట్టించు కున్న పాపాన పోవడం లేదు. మా సామాజిక వర్గం నుంచి ఏ పార్టీలోనూ గట్టి ప్రతినిధి లేకపోవడం వల్ల మా సమ స్యలు బయటకు రాకుండా పోతున్నాయి. ఎలక్షన్లప్పుడు ఓట్ల కోసం వచ్చే నాయకులు ఆ తర్వాత మా సమస్యలు చెప్పేందుకు వెళ్తే కనీసం కలవడానికి కూడా ఇష్టపడడం లేదు. మార్కెట్లోకి కుప్పలు తెప్పలుగా వస్తున్న రెడీమేడ్ ఆభరణాలతో మేం పోటీ పడలేక పోతున్నాం. దాంతో పూట గడవక పస్తులుండాల్సి వస్తోంది. ప్రస్తుతం బంగారం పనులు లేక వెండి పనులు చేస్తూ పొట్టపోసు కుంటున్నాం. ఒకప్పుడు పెళ్లిళ్ల సీజన్లో మా దుకాణాలు కిటకిటలాడేవి. కానీ ఇప్పుడు ఒక్కరు కూడా రావడం లేదు. సంప్రదాయ ఆభరణాలపై మోజు తగ్గిన మహిళలు తేలికపాటి మిషన్ తయారీ ఆభరణాలపై మక్కువ చూపుతున్నారు. దాంతో ఉపాధి లేక, వేరే పని చేయలేక రోడ్డన పడాల్సిన దుస్థితి దాపురించింది. ఇంత నరకం అనుభవిస్తున్నా కనీసం మా గురించి మాట్లాడేవారే కరువవడం మాకు బాధగా ఉంది. - టి.వెంకటాచారి, వనపర్తి, మహబూబ్‌నగర్ యూత్ పార్టీ తిరుగుబాటు స్వభావం గల కొందరు యువకులు అమెరికాలో ఈ పార్టీని 1967లో ప్రారంభించారు. ఈ పార్టీ కార్యకర్తలను ‘యిప్పీ’లనే వారు. అమెరికా అధ్యక్ష పదవికి 1968లో జరిగిన ఎన్నికల్లో అడవి పందిని అభ్యర్థిగా బరిలోకి దించి ఈ పార్టీ అందరి దృష్టినీ ఆకర్షించింది. పేరుకు ఇది రాజకీయ పార్టీయే అయినా, చిత్ర విచిత్ర విన్యాసాలతో మీడియాను ఆకట్టుకునే ప్రయత్నాలు, విచిత్రమైన నిరసనల ద్వారానే ప్రచారంలోకి వచ్చింది. పాతికేళ్లకే ఎమ్మెల్యే అప్పుడు ఆమె వయసు కేవలం 25 ఏళ్లు. డాక్టరు కోర్సు చదివి ప్రజా సేవ చేద్దామనుకున్నారు. అనుకోని విధంగా నేతగా మారి ప్రజా జీవితంలో అడుగుపెట్టారు. దేశంలోనే పిన్నవయసు ఎమ్మె ల్యేగా గుర్తింపు పొందారు. ఆమే డాక్టర్ బాణోతు చంద్రావతి. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గం నుంచి 2009 ఎన్నికలలో భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) తరఫున తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఖమ్మం రూరల్ మండలం పెదతండా ఆమె స్వగ్రామం. లంబాడా (ఎస్టీ) సామాజిక వర్గానికి చెందిన ఆమె కుటుంబం మొదటి నుంచి సీపీఐలో ఉంది. ఆమె తండ్రి రామ్మూర్తి ఆర్టీసీలో డిపో మేనేజర్. తాతయ్య బీక్యా నాయక్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు. జిల్లా కమ్యూనిస్టు యోధుడు రజబ్ అలీకి శిష్యుడుగా గుర్తింపు పొందారు. నియోజకవర్గాల పునర్విభజనతో వైరా ఎస్టీ వర్గానికి రిజర్వ్ కావడంతో బీక్యా నాయక్ చేసిన సేవలకు గుర్తింపుగా ఆ కుటుంబం నుంచి ఎవరికైనా టికెట్ ఇవ్వాలని పార్టీ భావించింది. దాంతో విద్యాధికురాలు అయిన చంద్రావతికి టికెట్ ఇవ్వాలని ప్రతిపాదిం చారు. అప్పుడే ఆమె విశాఖలో మెడిసిన్ ఫైనలియర్ పూర్తి చేశారు. వెంటనే ఆమెను పార్టీ సంప్రదించడం... ఆమె అంగీకరించడం... పార్టీ అభ్యర్థిగా ఖరారు కావడం... విజయం సాధించడం.. అన్నీ చకాచకా జరిగిపోయాయి. ఎమ్మెల్యే అయిన తర్వాత తన చిన్ననాటి స్నేహితుడు, సాఫ్ట్వేర్ ఇంజినీర్ సురేశ్‌ను ఆమె కులాంతర వివాహం చేసుకున్నారు. - సాక్షి ప్రతినిధి, ఖమ్మం -
టీడీపీ జిల్లా కార్యాలయంలో తెలుగు యువత ఆందోళన
కొరిటెపాడు, న్యూస్‌లైన్: ర్యాలీలు, ధర్నాలు, రాస్తారోకోలకు మాత్రమే తాము పనికి వస్తామా అంటూ నగర తెలుగు యువత నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీ జిల్లా కార్యాలంయంలో శనివారం గుంటూరు తూర్పు నియోజకవర్గం సర్వసభ్య సమావేశం తెలుగు యువత అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. తూర్పు నియోజకవర్గ సమావేశం జరుగుతుంటే నగర తెలుగు యువత అధ్యక్షుడు సౌపాటి రత్నానికి కనీసం సమాచారం కూడా ఇవ్వకపోవటం ఏమిటని రత్నం అనుచరులు వాగ్వాదానికి దిగడంతో పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు వారిని బయటకు నెట్టివేశారు. సమావేశంలోనూ అసమ్మతి నాయకులకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తపడ్డారు. నియోజకవర్గానికి చెందిన ఒకరిద్దరు నాయకులకు మాత్రమే మాట్లాడే అవకాశం కల్పించి, వర్గపోరు బయట పడకుండా నాయకులు జాగ్రత్తపడ్డారు.