ఓటేయని బద్ధకస్తులు 4,88,693
పెరిగిన పోలింగ్ శాతం
- జిల్లాలో 80శాతానికి పైగా పోలింగ్
-అన్ని నియోజకవర్గాల్లో యువ ఓటర్ల జోరు
జిల్లాలో సాధారణ ఎన్నికల పోలింగ్ శాతం పెరిగింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో జిల్లావ్యాప్తంగా 80.66శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. జిల్లావ్యాప్తంగా 25,41,607మంది ఓటర్లు ఉండగా.. 20,37,613 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. 4,88,693 మంది ఓటుకు దూరంగా ఉన్నారు. తక్కువ ఓటుహక్కు వినియోగించిన వారిలో నల్లగొండ నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో 2,21,836మంది ఓటర్లుండగా.. 1,63,913మందే ఓటేశారు. ఇంకా 57,923మంది ఓటును వినియోగించుకోలేదు. అదేవిధంగా ఎక్కువ మంది ఓటుహక్కు వినియోగించుకున్న వారిలో భువనగిరి నియోజకవర్గం ముందుంది. ఈ నియోజకవర్గంలో 1,86,607మంది ఓటర్లుండగా.. 1,58,595మంది ఓటేశారు.కేవలం 28,012మంది మాత్రమే ఓటుహక్కు వినియోగించుకోలేదు
సాక్షి, నల్లగొండ, జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో నల్లగొండ, మిర్యాలగూడ, కోదాడ, భువనగిరి, సూర్యాపేట మున్సిపాలిటీలు.. దేవరకొండ, హుజూర్‌నగర్ నగర పంచాయతీ లున్నాయి. ఈ ప్రాంతాల్లోనే ఓటర్లు ఎక్కువగా ఉంటారు. విద్యావంతులు, మేధావుల సంఖ్య కూడా ఎక్కువే. అయినా సాధారణ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోనే తక్కువగా పోలింగ్ నమోదు కావడం గమనార్హం.
అన్ని నియోజకవర్గాల్లో 80శాతానికి పైగా పోలైతే.. నల్లగొండలో 73.89శాతం, సూర్యాపేటలో 78.89, మిర్యాలగూడలో 79.15శాతం పోలింగ్ జరగడం ఉదాహరణగా చెప్పవచ్చు. గ్రామీణ ప్రాంత ఓటర్లలో మాత్రం చైతన్యం వెల్లివిరి సింది. ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రం ముందు బారులు దీరారు. ఓటుపై జిల్లా యంత్రాంగం, స్వచ్ఛందసంస్థలు ఎంత ప్రచారం చేసినా నగరాలు, పట్టణాల్లో ఫలితమివ్వలేదు.