ఎన్నికల ఖర్చు రూ.250 కోట్లు!
- జిల్లాలో కరెన్సీ వర్షం.. మద్యం వరద
- ఈ విషయంలోనే ముందున్న టీడీపీ
- ఓట్ల కొనుగోలుతోనే గెలుపు అనే రీతిలో బరితెగింపు
- డబ్బు మూటలు గుమ్మరించిన కార్పొరేట్ నేతలు, సంస్థలు
- ఫలితంగా కరెన్సీని కరపత్రాల్లా పంచిన దేశం అభ్యర్థులు
శ్రీకాకుళం సిటీ, న్యూస్‌లైన్: ఎన్నడూ లేని రీతిలో ఈ సార్వత్రిక ఎన్నికల్లో ధన ప్రవాహం వెల్లువెత్తింది. మద్యం కూడా దానితో పోటీ పడింది. వెరసి నోటిఫికేషన్ నుంచి పోలింగ్ వరకు అభ్యర్థులు చేసిన ఖర్చు రూ.250 కోట్ల మార్కు చేరిందంటే.. సామాన్యుల గుండె జారిపోతుందేమో.. కానీ ఇది వాస్తవం. గత రెండు ఎన్నికల్లో ఓటమిపాలై ప్రతిపక్ష పాత్రతో సరిపెట్టుకున్న టీడీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించి అందలం ఎక్కాలని అన్ని రకాల మాయోపాయాలు ప్రయోగించింది.
ముఖ్యంగా మందు.. మనీతో ఓట్ల కొనుగోలుపైనే ప్రధానంగా ఆధారపడింది. దీనికి బడా కార్పొరేట్ సంస్థలు, నేతలు దన్నుగా నిలిచారు. టీడీపీలో హవా చెలాయిస్తున్న కార్పొరేట్ నేతలతోపాటు ఈస్ట్‌కోస్ట్ థర్మల్ ప్లాంట్ యాజమాన్యం టీడీపీ తరఫున నోట్ల మూటలు కుమ్మరించారని తెలుస్తోంది. ముఖ్యంగా పోలింగ్‌కు ముందు వారం రోజుల్లో టీడీపీ పక్కా ప్రణాళికతో కరెన్సీ నోట్లను కరపత్రాల్లా పంచిపెట్టింది.
నిబంధనలకు మించి..
అన్ని రకాల ధరలు పెరిగిన నేపథ్యంలో అభ్యర్థుల ఎన్నికల వ్యయ పరిమితిని ఎన్నికల సంఘం పెంచింది. సవరించిన నిబంధన ప్రకారం అసెంబ్లీ అభ్యర్థి రూ.28 లక్షలు, ఎంపీ అభ్యర్థి రూ.70 లక్షల వరకు ఎన్నికల ప్రచారానికి ఖర్చు చేయాలి. అభ్యర్థుల ఖర్చులను పర్యవేక్షించేందుకు వ్యయ పరిశీలకులను కూడా నియమించింది. అయినా సరే.. అభ్యర్థులు, పార్టీలు ఎక్క డా తగ్గలేదు. అధికారుల కళ్లుగప్పి.. ఓటర్లను మద్యం, నగదుతో ముంచెత్తారు. జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాలుండగా మొత్తం 84 మంది అభ్యర్థులు పోటీ చేశారు.
ఒక్కో అభ్యర్థి రూ.28 లక్షలు చొప్పున లెక్కవేస్తే రూ.23.52 కోట్లు ఖర్చు కావాలి. అందరూ నిర్ణీత మొత్తం ఖర్చు చేస్తేనే ఇంతవుతుంది. అలాగే ఎంపీ బరిలో నలుగురు అభ్యర్థులు ఉన్నారు. నిబంధనల ప్రకారం వీరి ఖర్చు 2.80 కోట్ల రూపాయలు దాటకూడదు. విజయనగరం, అరకు లోక్‌సభ నియోజకవర్గాల్లో జిల్లాలోని మూడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నందున వాటిని లెక్కలోకి తీసుకున్నా రూ.5 కోట్లు దాటే పరిస్థితి లేదు. అంటే అసెంబ్లీ, లోక్‌సభ నియోజకవర్గాలకు కలిపి జిల్లాలో ఎన్నికల ఖర్చు 30 కోట్ల రూపాయలకు మించకూడదు. కానీ వాస్తవంగా అయిన ఖర్చు దీనికి ఎనిమిది రెట్లు మించిపోవడం విశేషం.
చివరి నాలుగు రోజుల్లో వరదే
ఎన్నికల వ్యయంలో అత్యధిక శాతం చివరి నాలుగు రోజుల్లోనే ఖర్చయ్యింది. అన్ని నియోజకవర్గాల్లోనూ మద్యం ఏరులై పారింది. ప్రచారంలో పూర్తిగా వెనుకబడిన టీడీపీ ఈ విషయంలో మాత్రం అందనంత ఎత్తులో ఉంది. జిల్లాలోని మద్యం షాపులన్నింటి నుంచీ అడ్వాన్సులు చెల్లించి కోట్ల రూపాయల మద్యాన్ని ముందుగానే గ్రామాలకు తరలించి రహస్యంగా నిల్వ చేసింది. ఇది చాలదన్నట్లు ఆ పార్టీ నాయకులు ఒడిశా మద్యాన్ని కూడా పెద్ద ఎత్తున తెప్పించి విచ్చలవిడిగా పంపిణీ చేశారు.
దీనికితోడు ఓటుకు 300 నుంచి 1000 రూపాయల వరకు ఆ పార్టీ నాయకులు చెల్లించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఒక రేటును, పట్టణ ప్రాంతాల్లో ఒక రేటును అమలు చేశారు. తమకు ఓట్లు తక్కువగా వస్తాయనుకున్న ప్రాంతాలను పచ్చనోట్లతో ముంచెత్తారు.
శ్రీకాకుళం, ఆమదాలవలస, టెక్కలి, పాతపట్నం, నరసన్నపేట, ఇచ్ఛాపురం, పలాస, పాలకొండ తదితర నియోజకవర్గాల్లో సొమ్ము భారీగా ఖర్చు చేశారు. ఇంత చేసినా.. వందల కోట్ల రూపాయలు వదిలించుకున్నా.. ఓటరు మాత్రం కరుణించిన దాఖలాలు లేకపోవడంతో ఆ పార్టీలో నిరాశానిస్పృహలు అలుముకున్నాయి.